వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

నిత్యావసరాల నిల్వకు అధునాతన, సాంకేతిక సదుపాయాలు అవసరం

సమీక్షా సమావేశంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్
దేశవ్యాప్త నిల్వ ప్రణాళికను బలోపేతం చేయాలని పిలుపు

నిల్వ సదుపాయాలను గరిష్టంగా వినియోగించుకోవాలని సూచన

ప్రతి ప్రాంతానికీ మాస్టర్ ప్లాన్ అవసరమని సలహా
ఇందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం
వినియోగించుకోవాలని స్పష్టీకరణ

అట్టడుగు స్థాయిలో, బ్లాక్ స్థాయిలో రైతుల ఆదాయం
పెంచేందుకు ఇదో మార్గమని వెల్లడి

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం, పెట్టుబడులు పెంపొందేలా
తగిన వాతావరణం కల్పించాలన్న కేంద్రమంత్రి

Posted On: 08 JUN 2021 5:35PM by PIB Hyderabad

   దేశంలో నిత్యావసర సరకుల నిల్వకు సంబంధించిన ప్రణాళికను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు సమీక్షించారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల సహాయ మంత్రి రావు సాహెబ్ పాటిల్ దాన్వే, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఆహార ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి, భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ.) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్) మేనేజింగ్ డైరెక్టర్, జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) సీనియర్ అధికారులు, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కూడా ఈ సమీక్షా సమావేశానికి  హాజరయ్యారు.  

   సమీక్ష సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, నిత్యావసర సరకుల నిల్వకోసం దేశంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిర్వహణా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు అవసరమని అభిప్రాయపడ్డారు. సరకుల నిల్వకు సంబంధించి దేశంలో ఉన్న అన్ని మౌలిక సదుపాయాలను తగినవిధంగా మార్చుకునే అంశంపై తప్పనిసరిగా ఆలోచించవలసిన అవసరం ఉందన్నారు. కేవలం శాఖాపరమైన ప్రణాళికలు మాత్రమే కాకుండా “ప్రభుత్వం సంపూర్ణ స్థాయిలో" ఈ అంశంపై చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. నిల్వ సదుపాయాలకోసం భూమిని సమీకరించే ప్రక్రియలో రాష్ట్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రమేయం కల్పించే అంశంపై అన్వేషణ జరపవచ్చని అన్నారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పటిష్ట వినియోగానికి, అధునాతన నిల్వ సదపాయాల ఏర్పాటుకు మధ్య మరింత సమన్వయం కోసం కృషి చేయాలన్నారు.

   ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, పెట్టుబడి, తదితర కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని, స్థలం ప్రాతిపదికన ప్రణాళికలు, పథకాలు రూపొందించుకోవాలని, అందుకు తగిన సానుకూల వాతావరణాన్ని కల్పించాలని మంత్రి సూచించారు. స్థలాన్ని గరిష్టస్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా నిల్వ సదుపాయాలకు, భూమికి సంబంధించిన మాస్టర్ ప్రణాళికను, తయారు చేసుకోవాలన్నారు.  అట్టడుగు స్థాయిలోను, బ్లాక్ స్థాయిలోనూ అధునాతనంగా సరసమైన ఖర్చులో నిల్వ సదుపాయాలను ఏర్పాటు చేయడం రైతుల ఆదాయాన్ని పెంచడానికి బాగా దోహదపడుతుందని కేంద్రమంత్రి గోయల్ అన్నారు.

  భారతదేశంలో 20,433 ప్రాంతాల్లో సరకు నిల్వల గిడ్డంగులు ఉన్నాయి. వాటిలో రైల్వే గూడ్స్ షెడ్లు 7,400, పి.ఎం.సి. ప్రిన్సిపల్, సబ్ మార్కెట్ యార్డు గిడ్డంగులు 7,320, ఎఫ్.సి.ఐ. ఆధ్వర్యంలో 545, కేంద్ర గిడ్డంగుల సంస్థ (సి.డబ్ల్యు.సి.) కింద 545, ఎస్.డబ్ల్యు.సి. కింద 2,245, ఎన్.ఎస్.సి., నాఫెడ్, ఎన్.సి.సి.ఎఫ్. కింద 73, కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) కింద 60కి పైగా గిడ్డంగులు, సహకార సంఘాల కింద 2,000కు పైగా గిడ్డంగులు, రాష్ట్ర ప్రభుత్వాల గిడ్డంగులు, హాఫెడ్ కింద వందకుపైగా గిడ్డంగులు, నిర్మాణదశలో ఉన్న హైవే లాజిస్టిక్ పార్క్ కింద 35, ఇన్ లాండ్ వాటర్ వేస్ కాంప్లెక్స్ కింద 8, ఓడరేవుల కింద 200కు పైగా గిడ్డంగులు, విమానాశ్రయాల (కార్గో) పరిధిలో 25 గిడ్డంగులు ఉన్నాయి. ఈ సదుపాయాలన్నింటితో ఎక్కడ, ఏ పరిమాణంలో గిడ్డంగులు సదుపాయాలు అవసరమైతే అలాంటివి అభివృద్ధి చేసుకోవచ్చు. వాటి స్థాయిని నవీకరించుకోవచ్చు, లేదా అవసరాలకు తగినట్టుగా మార్పులు చేసుకోవచ్చు. నిత్యావసర సరకులను మరింత భద్రంగా నిల్వ చేసుకునేందుకు తగినట్టుగా ఇలా మార్పులు చేసుకోవచ్చు.

  ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ, సులభంగా దెబ్బతినేందుకు, పాడైపోయేందుకు ఆస్కారం ఉన్న ఉల్లిపాయలు వంటి సరకుల నిల్వకోసం శీతలీకరణ గిడ్డంగుల సదుపాయాల అభివృద్ధిని ప్రైవేటు సంస్థల ద్వారా చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణ (ఇ.ఒ.ఐ.)రూపంలో బిడ్లకు పిలుపునిచ్చినట్టు చెప్పారు.

  కేంద్ర గిడ్డంగుల సంస్థలు, రాష్ట్రాల గిడ్డంగుల సంస్థలకు దాదాపు 2,668 చోట్ల వసతి సదుపాయం ఉన్న అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవలసి ఉంది. టైర్ వన్ నుంచి టైర్ ఐదు వరకూ స్థాయిల నగరాల్లో ఈ సదుపాయాలు ఉన్నాయి. అధునాతన గిడ్డంగులను అభివృద్ధి చేసేందుకు ఇవి అనువుగా ఉంటాయి. ముఖ్యమైన ప్రాంతాల్లో నగరాలకు శివార్లలో ఉన్నందున వీటి అభివృద్ధికి ఎక్కవగా అవకాశాలు ఉంటాయి.

 

***



(Release ID: 1725471) Visitor Counter : 170