జల శక్తి మంత్రిత్వ శాఖ

స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కింద రెండు లక్షలకు పైగా గ్రామాలకు ఎస్‌.ఎల్‌.డబ్ల్యు.ఎం. మద్దతు కోసం, 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 40,700 కోట్ల రూపాయలు కేటాయించారు.

Posted On: 08 JUN 2021 6:04PM by PIB Hyderabad

స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ (ఎస్.బి.ఎం-జి)  రెండవ దశ కింద జల్ శక్తి మంత్రిత్వ శాఖ, ప్రస్తుత 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 40,700 కోట్ల రూపాయల పెట్టుబడితో, రెండు లక్షల గ్రామాలకు మద్దతుగా నిలిచి ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ (ఎస్‌.ఎల్‌.డబ్ల్యు.ఎం) ఏర్పాట్లను సాధించడానికి సిద్ధంగా ఉంది.  జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన సమావేశమైన, ఎస్.బి.ఎం-జి. కి చెందిన జాతీయ పథకం మంజూరు కమిటీ (ఎన్.ఎస్.ఎస్.సి) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వార్షిక అమలు ప్రణాళిక (ఎ.ఐ.పి) ని ఆమోదించింది.

ఈ మొత్తంలో, కేంద్ర వాటా 14,000 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాలు 8,300 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.  ఇంకా, పదిహేనవ ఆర్థిక కమిషన్ ద్వారా సుమారు 12,730 కోట్ల రూపాయలు, ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఈ.జి.ఎస్‌. ద్వారా 4,100 కోట్ల రూపాయలకు పైగా నిధులు లభిస్తాయి.  వీటికి తోడు, 1500 కోట్ల రూపాయలకు పైగా ఇతర వనరులు, ఉదాహరణకు. బిజినెస్ మోడల్, సి.ఎస్.ఆర్. వంటి ఇతర పథకాల ద్వారా రాష్ట్రాలు పెట్టుబడి పెడతాయి.    ఎస్.బి.ఎం.(జి) రెండవ దశ సుస్థిరత పై దృష్టి పెట్టడం ద్వారా మరియు గ్రామాల్లో ఎస్.ఎల్.డబ్ల్యూ.ఎం. ఏర్పాట్లను నిర్ధారించడం ద్వారా ఓ.డి.ఎఫ్. ప్లస్ హోదా అని పిలువబడే గ్రామాల్లో సమగ్ర పరిశుభ్రతను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

2021-2022 ఆర్ధిక సంవత్సరంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ రెండవ దశ అమలులో భాగంగా- 2 లక్షలకు పైగా గ్రామాలలో, ఎస్‌.ఎల్‌.డబ్ల్యు.ఎం. కార్యక్రమాల అమలు లక్ష్యంతో పాటు,  50 లక్షలకు పైగా వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు (ఐ. హెచ్‌.హెచ్‌.ఎల్.); ఒక లక్ష కమ్యూనిటీ మరుగుదొడ్లు; భారతదేశంలోని 2,400 బ్లాకుల్లో  ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ యూనిట్లు; 386 జిల్లాల్లో గోబర్ధన్ ప్రాజెక్టులు; 250 కి పైగా జిల్లాల్లో మల బురద నిర్వహణ ఏర్పాట్ల నిర్మాణాలు చేపట్టనున్నారు.

రాష్ట్ర ప్రణాళికలను ఆమోదించిన అనంతరం, జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ, ఎవరూ వెనుకబడి ఉండకుండా చూసుకోవలసిన అవసరాన్ని ఎత్తిచూపారు. ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి అందుబాటులో ఉండాలని ఆయన చెప్పారు.  ఐ.హెచ్‌.హెచ్‌.ఎల్‌. ల నిర్మాణానికి రెండు గోతుల మరుగు దొడ్ల సాంకేతికతను అవలంబించడం గురించి ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.  ఎందుకంటే ఇది చాలా సురక్షితమైనదనీ, తక్కువ ఖర్చుతో కూడుకున్నదనీ, వినియోగించడం, నిర్వహించడం సులభమని ఆయన వివరించారు. ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణకు తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతిక పరిజ్ఞానం యొక్క అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు.  ఎందుకంటే ఇది వికేంద్రీకృత వినియోగం మరియు నిర్వహణకు సహాయపడుతుందని, ఆయన వివరించారు. 

అంతకుముందు, జిల్లాలు మరియు గ్రామీణ స్థానిక సంస్థలతో కలిసి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భాగస్వామ్య ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టడానికీ, ఓ.డి.ఎఫ్. ప్లస్ అంశాల అమలును వేగవంతం చేయడానికీ, ఫలితాలను సాధించడానికీ, తాగునీరు మరియు పారిశుద్ధ్య విభాగం (డి.డి.డబ్ల్యు.ఎస్) మద్దతు ఇచ్చింది.  ప్రతి రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం, తమ తమ వార్షిక అమలు ప్రణాళికలను అభివృద్ధి చేసి, తదనుగుణంగా, తమ తమ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో వాటి అమలు లక్ష్యాలను, వ్యూహాన్ని అమలు చేస్తాయి.  గ్రామీణ స్థానిక సంస్థల నేతృత్వంలో స్వచ్ఛ భారత్ మిషన్ అమలవుతోంది.  దేశంలోని స్వచ్ఛతపై ఈ పధకం ఒక ప్రత్యేకమైన ప్రజా ఉద్యమంగా పేరు తెచ్చుకుంది.

జాతీయ పథకం మంజూరు కమిటీలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన ప్రతినిధులు, ఆయా రంగాల నిపుణులతో పాటు,  వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కూడా ఉన్నారు.  అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రణాళికలను ఎన్.ఎస్.ఎస్.సి. సమీక్షించింది. మహమ్మారి కాలంలో పారిశుధ్యం మరియు పరిశుభ్రత చాలా ముఖ్యమైన అంశాలు కాబట్టి, వాటి అమలును తీవ్రతరం చేయడానికి వారికి మార్గదర్శకత్వం అందించింది. పారిశుద్ధ్యం కోసం పదిహేనవ ఆర్ధిక సంఘం కేటాయించిన నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం పై కూడా ఎన్.ఎస్.ఎస్.సి. నొక్కి చెప్పింది.

*****



(Release ID: 1725468) Visitor Counter : 218