రైల్వే మంత్రిత్వ శాఖ

రాష్ట్రాలకు ఆక్సిజన్ బట్వాడాలో రైల్వేల పాత్ర కీలకం!


ఆక్సిజన్ ఎక్ప్.ప్రెస్ రైళ్ల ద్వారా దేశవ్యాప్తంగా
26,281 టన్నుల ద్రవీకృత మెడికల్ ఆక్సిజన్ సరఫరా

3,000 టన్నుల చొప్పున అందుకున్న
తమిళనాడు, కర్ణాటక.
బట్వాడాను ముగించిన 376 ఆక్సిజన్ ఎక్స్.ప్రెస్ రైళ్లు
ఇప్పటి దాకా 1,534 ట్యాంకర్లతో ఆక్సిజన్ సరఫరా

దీనితో 15 రాష్ట్రాలకు ఉపశమనం!
మహారాష్ట్రకు 614 మెట్రిక్ టన్నులు, ఉత్తరప్రదేశ్ కు 3,797 టన్నులు, మధ్యప్రదేశ్ కు 656 టన్నులు, ఢిల్లీకి 5,790 టన్నులు, హర్యానాకు 2,212 టన్నులు, రాజస్థాన్ కు 98 టన్నులు, కర్ణాటకకు 3,097 టన్నులు, ఉత్తరాఖండ్ కు 320 టన్నులు, తమిళనాడుకు 3,237 టన్నులు, ఆంధ్రప్రదేశ్ కు 2,804 టన్నులు, పంజాబ్ కు 225 టన్నులు, కేరళకు 513 టన్నులు, తెలంగాణకు 2,474 టన్నులు, జార్ఖండ్.కు 38 టన్నులు, అస్సాం రాష్ట్రానికి, 400 టన్నుల ఆక్సిజన్ బట్వాడా అయింది.

Posted On: 06 JUN 2021 2:40PM by PIB Hyderabad

  దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు, కొత్త పరిష్కారాలు కనుగొనేందుకు భారతీయ రైల్వేలు ఎంతో కృషి చేస్తున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలకు ద్రవీకృత మెడికల్ ఆక్సిజన్ ను అందించడంలో రైల్వేలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి.

ఇప్పటికే ఆక్సిజన్ ఎక్స్.ప్రెస్.లు 26,000 మెట్రిక్ టన్నులకు పైగా ద్రవీకృత మెడికల్ ఆక్సిజన్ ను అందించి దేశానికి సేవలందించాయి.

 ఇప్పటివరకూ భారతీయ రైల్వేలు 1,534 ట్యాంకర్ల ద్వారా 26281 మెట్రిక్ టన్నుల ద్రవీకృత మెడికల్ ఆక్సిజన్.ను వివిధ రాష్ట్రాలకు బట్వాడా చేశాయి. ఇప్పటికే 376 ఆక్సిజన్ ఎక్స్.ప్రెస్ రైళ్లు తమ ప్రయాణాన్ని పూర్తిచేశాయి. ఆక్సిజన్ కొరతను ఎదుర్కొనే రాష్ట్రాలకు ఎంతో ఉపశమనం కలిగించాయి. ఈ సమాచారం తెలిసే సమయానికి మొత్తం 26 ట్యాంకర్లతో కూడిన 6 ఆక్సిజన్ ఎక్స్.ప్రెస్ రైళ్లు 483 మెట్రిక్ టన్నుల ద్రవీకృత మెడికల్ ఆక్సిజన్ ను రవాణా చేస్తూ ఉన్నాయి.

దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు 3,000 మెట్రిక్ టన్నుల చొప్పు ద్రవీకృత ప్రాణ వాయువును ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ద్వారా అందుకున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కు ఈ రైళ్లు 2,800 మెట్రిక్ టన్నులకు పైగా ప్రాణవాయువును అందించాయి.

ఆక్సిజన్ ను బట్వాడా చేసే ప్రక్రియను ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు 43రోజుల కింద ప్రారంభించాయి. గత ఏప్రిల్ నెల 24వ తేదీన మహారాష్ట్రకు 126 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను అందించాయి.

  అవసరమైన రాష్ట్రాలకు సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో సాధ్యమైనంత ఎక్కువ పరిమాణంలో ద్రవీకృత మెడికల్ ఆక్సిజన్ ను అందించేందుకు భారత రైల్వే నడుం బిగించాయి.

  ఆక్రిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ద్వారా తమకు ఆక్సిజన్ అందడంతో 15 రాష్ట్రాలు ఉపశమనం పొందాయి. ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అస్సాం రాష్టాలకు ఈ మేరకు ఉపశమనం లభించింది.  

  ఈ సమాచారం వెలువడే సమయానికి, 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మహారాష్ట్రకు అందింది. ఉత్తరప్రదేశ్ కు దాదాపు 3,797 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్ కు 656 మెట్రిక్ టన్నులు, ఢిల్లీకి 5,790 మెట్రిక్ టన్నులు, హర్యానాకు 2,212 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్ కు 98 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 3,097 మెట్రిక్ టన్నులు, ఉత్తరాఖండ్ కు 320 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 3,237 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్ కు 2,804 మెట్రిక్ టన్నులు, పంజాబ్ కు 225 మెట్రిక్ టన్నులు, కేరళకు 513 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు 2,474 మెట్రిక్ టన్నులు, 38మెట్రిక్ టన్నులు జార్ఖండ్ రాష్ట్రానికి, 400 మెట్రిక్ టన్నులు అస్సాం రాష్ట్రానికి బట్వాడా అయింది.

   ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని దాదాపు 39 నగరాలకు/పట్టణాలకు ఆక్సిజన్ ఎక్స్.ప్రెస్ రైళ్లు ద్రవీకృత మెడికల్ ఆక్సిజన్ ను అందించాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో, వారణాసి, కాన్పూర్, బరేలీ, గోరఖ్.పూర్, ఆగ్రా ప్రాంతాలకు, మహారాష్ట్రలోని ముంబై, షోలాపూర్ నగరాలకు, తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి, హర్యానాలోని ఫరీదాబాద్, గురుగ్రామ్ ప్రాంతాలకు, ఢిల్లీ పరిధిలోని తుగ్లఖాబాద్, ఢిల్లీ కంటోన్మెంట్, ఒఖ్లా ప్రాంతాలకు, రాజస్థాన్ లోని కోటా, కనక్ పారా ప్రాంతాలకు, కర్ణాటకలోని బెంగళూరు నగరానికి, ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, గుంటూరు, తాడిపత్రి, విశాఖపట్నం ప్రాంతాలకు, కేరళలోని ఎర్నాకులానికి, తమిళనాడులోని తిరువళ్లూరు, చెన్నై, ట్యుటికోరిన్, కోయంబత్తూరు, మదురై నగరాలకు, పంజాబ్ లోని భటిండా, ఫిల్లౌర్ ప్రాంతాలకు, అస్సాంలోని కామరూప్ ప్రాంతానికి, జార్ఖండ్ లోని రాంచీకి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ద్రవీకృత మెడికల్ ఆక్సిజన్ ను అందించాయి. 

  ఆక్సిజన్ సరఫరాకోసం భారతీయ రైల్వేలు విభిన్న మార్గాలను రూపొందించుకున్నాయి. రాష్ట్రాల్లో ఎక్కడ ఆక్సిజన్.కు అవసరం ఏర్పడినా అందించేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసుకున్నాయి. ఆక్సిజన్ ను తీసుకురావడానికి అవసరమైన ట్యాంకర్లను ఆయా రాష్ట్రాలు రైల్వేలకు అందించాయి.

దేశం పశ్చిమ ప్రాంతంలోని హపా, బరోడా, ముండ్రానుంచి.. తూర్పు ప్రాంతంలోని రూర్కెలా, దుర్గాపూర్, టాటానగర్, అంగుల్ నుంచి,.., ఆక్సిజన్ ను సేకరించి, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాలకు కూడా సంక్లిష్ట మార్గాల ద్వారా సైతం రైల్వేలు ఆక్సిజన్ ను అందించాయి. 

 ఆక్సిజన్ ను సాధ్యమైనంత త్వరగా అందించేందుకు వీలుగా, ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్ల నిర్వహణకు సంబంధించి భారతీయ రైల్వే శాఖ కొత్త ప్రమాణాలను, కొన్ని నిర్దిష్టాంశాలను ఏర్పాటు చేస్తూ వస్తోంది. సుదూర ప్రాంతాలకు ఆక్సిజన్ ను మోసుకువచ్చే ఈ రైళ్ల  సగటు వేగాన్ని చాలా సందర్భాల్లో 55కిలోమీటర్లుగా నిర్దేశించింది. ఆక్సిజన్ నిర్దేశించిన గడువులోగానే గమ్య స్థానం చేరేలా చూసేందుకు వివిధ రైల్వే జోన్లలోని నిర్వహణా సిబ్బంది నిర్విరామంగా పనిచేసేలా చర్యలు తీసుకుంది. రైలు మార్గాల్లోని వివిధ సెక్షన్ల వద్ద సిబ్బంది విధుల మార్పిడికోసం సాంకేతికపరంగా అవసరమైన వ్యవధిని ఒక నిమిషానికి తగ్గించారు.

  ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగేలా చూసేందుకు రైలు మార్గాలను సంసిద్ధం చేశారు. ఇంకోసం తగిన అప్రమత్తతను పాటించారు. పైగా ఇతర సరకుల రవాణా వేగం తగ్గకుండా ఈ చర్యలన్నీ తీసుకున్నారు. ఆక్సిజన్ ను సరఫరా చేయడం చాలా క్రియాశీలకమైన ప్రక్రియ. ఆక్సిజన్ సరఫరాలో భాగంగా మరిన్ని ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఈ రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా తమ ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

 

***



(Release ID: 1724974) Visitor Counter : 171