సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

పరారైన ఆర్థిక నేరస్తులు, ఆస్తుల సమస్యలను ఎదుర్కోవడానికి భారతదేశం బలమైన సమైక్య అంతర్జాతీయ సహకారం కోసం పిలుపునిచ్చింది


అవినీతిని నివారించడానికి, పోరాడటానికి, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉన్న సవాళ్లపై, చర్యలపై ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు.

Posted On: 05 JUN 2021 7:00PM by PIB Hyderabad

 ఆర్థిక నేరస్తులు పరారవడం, ఆస్తులను నష్టపోవడం వంటి సమస్యలను అన్ని దేశాలూ ఎదుర్కొంటున్నాయని భారతదేశం స్పష్టం చేసింది. ‘‘పరారైన ఆర్థిక నేరగాళ్ల చట్టం 2018”ప్రకారం వారి  ఆస్తులను జప్తు చేయడానికి అధికారులకు అధికారం ఇస్తుంది. భారతదేశంలోని ఏదైనా కోర్టు  క్రిమినల్ ప్రాసిక్యూషన్ తప్పించుకొని దేశం విడిచిపెట్టిన వారి అరెస్టుకు వారెంట్ జారీ చేయబడితే ఆస్తుల జప్తు సాధ్యమవుతుంది.  అవినీతిపై పోరాడటానికి ఎదురవుతున్న సవాళ్లు అనే అంశంపై శనివారం రాత్రి జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యుఎన్‌జిఎ) లో సింగ్ ప్రసంగిస్తూ  నేరాలు చేసి పరారైన వ్యక్తులను అప్పగించడం, వారి  ఆస్తులను తిరిగి ఇవ్వడంపై బలమైన  సమైక్య అంతర్జాతీయ సహకారం కోసం పిలుపునిచ్చారు. ఇలాంటి నిందితులు విదేశీ దేశాలలో ఆశ్రయం పొందుతారని పేర్కొన్నారు. నేరాలు చేయడం ద్వారా సంపాదించిన ఆస్తులు చట్టాలకు దొరక్కుండా  వివిధ దేశాల  అధికార పరిధిలోని  సంక్లిష్ట న్యాయ నిర్మాణాలలో దాచిపెడుతున్నారని అన్నారు. ఇటువంటి నేరాల పరిష్కారంలో అంతర్జాతీయ సహకారానికి సంబంధించిన  బలహీనతలను నేరగాళ్లు దుర్వినియోగం చేసి తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని వివరించారు.

 

 

 

ఐక్యరాజ్యసమితి రాజకీయ ప్రకటనను ఆమోదించి అవినీతిని నివారించడానికి,  ఎదుర్కోవటానికి అన్ని స్థాయిలలో  ప్రయత్నాలను తీవ్రతరం చేయడం, రాజకీయ నిబద్ధతతో  నిర్ణయాత్మక చర్యలను కొనసాగించడం ద్వారా ఈ పోరాటాన్ని సరైన దిశలో ముందుకు తీసుకువెళుతున్న అన్ని దేశాలను మంత్రి  ప్రశంసించారు. ఇలాంటి నేరాల విషయంలో భారతదేశం పరస్పర చట్టపరమైన సహాయాన్ని సాధ్యమైనంతవరకు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇందుకోసం తమ దేశ చట్టాలను బలోపేతం చేసినట్టు సింగ్ ప్రకటించారు. ఒప్పందాలు ఉన్న దేశాల నుంచి,  అంతర్జాతీయ సంస్థల నుంచి అంతర్జాతీయ సహకారానికి అవకాశాలు పెరిగాయని చెప్పారు. కరోనా మన సహనాన్ని పరీక్షిస్తున్న సమయంలో ప్రస్తుత యుఎన్‌జిఎ సమావేశం జరుగుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి, గడిచిన రోజుల్లో, భారతదేశం అనేక రంగాలకు చెందిన నిపుణులతో సమన్వయం చేసుకుందని అన్నారు. కొవిడ్ ను కట్టడి చేయడానికి శాస్త్రీయ సలహాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ‘‘టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, కోవిడ్ నియామాలను పాటించడం, టీకా”  వ్యూహాన్ని దేశం అమలు చేస్తోందని విశదీకరించారు. ‘‘అన్ని స్థాయుల్లో అవినీతిపై పోరాడడంలో స్వల్పకాలిక,  దీర్ఘకాలిక సవాళ్లను మహమ్మారి సృష్టించింది. ఇది వనరుల పంపిణీని గణనీయంగా బలహీనపరుస్తుంది. మన పునర్నిర్మాణ ప్రక్రియలను దెబ్బతీస్తుంది. ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది.  వృద్ధి పుంజుకోవడాన్ని ఆలస్యం చేస్తుంది. అవినీతిని నిరోధించడానికి  ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇది నిజంగా సరైన సమయం”అని  అని మంత్రి అన్నారు. భారతదేశంలో అవినీతి పట్ల ‘శూన్య సహనం’ (జీరో టాలరెన్స్) విధానం ఉందని, తమ ప్రధాని  'కనీస ప్రభుత్వం, పారదర్శకత  పౌర కేంద్రీకరణకు ప్రాధాన్యతనిచ్చే గరిష్ట పాలన' అనే ఆదర్శసూత్రాన్ని ప్రకటించారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. వికేంద్రీకరణ లక్ష్యంతో నగరాలు  పట్టణాలలో స్థానిక ప్రభుత్వాలతో నిర్ణయాలు తీసుకోవడం  ద్వారా అంతరాలను పూడ్చుతున్నామని చెప్పారు. పౌరుల జీవనోపాధిని ప్రభావితం చేసే అన్ని రంగాలలో డిజిటల్ సాధనాలను ఉపయోగించి వినూత్న పరిష్కారాలు అమలు చేస్తున్నామని జితేంద్ర సింగ్ వివరించారు.

 

ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశాల్లో భారత్ ఒకటని, ఇప్పటికే డిజిటల్ పథంలో పయనిస్తున్నామని మంత్రి చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం,  ప్రోగ్రామాటిక్ యూజ్ ద్వారా భారత పౌరులకు ప్రయోజనాలను అందించడంలో  దుర్వినియోగానికి తావు లేకుండా చేశామని చెప్పారు. బయోమెట్రిక్ ఐడి కార్డులను, బ్యాంక్ ఖాతాలు  మొబైల్ ఫోన్‌ నంబర్లతో అనుసంధానించడం వల్ల ఎంతో మేలు జరిగిందని చెప్పారు. లక్షలాది మంది పౌరులకు తక్షణ ద్రవ్య సహాయం చేసేందుకు సురక్షితంగా ప్రత్యక్షంగా నగదును బదిలీ చేశామని అన్నారు.  మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడం మొదలుకొని ఆరోగ్యంపై డేటా ఆధారిత ప్రజా విధానాన్ని రూపొందించడం వంటి ఎన్నో కీలక అంశాలకు సాంకేతిక పరిజ్ఞానం కీలకమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా దేశంలోని కొన్ని మారుమూల ప్రాంతాలవాసులకు డిజిటల్ టెక్నాలజీల వల్ల ఎన్నో లాభాలు మంత్రి చెప్పారు. సంక్షోభ సమయాల్లో అవినీతిని ఎదుర్కోవటానికి దృఢ మైన,  బలమైన, నిబద్ధత అవసరమని ప్రసంగం ముగింపు సమయంలో మంత్రి వ్యాఖ్యానించారు. అవినీతి  వ్యతిరేక సూత్రాల అమలును వేగవంతం చేయడానికి ఇతర దేశాలు, పౌర సమాజం  అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు

***


(Release ID: 1724929) Visitor Counter : 213