రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

'నౌకాదళం & రక్షణ సిబ్బంది' సంయుక్త కార్యదర్శిగా రియర్‌ అడ్మిరల్‌ కపిల్‌ మోహన్‌ ధిర్‌ నియామకం

Posted On: 04 JUN 2021 11:32AM by PIB Hyderabad

సైనిక వ్యవహారాల విభాగంలో 'నౌకాదళం & రక్షణ సిబ్బంది' సంయుక్త కార్యదర్శిగా రియర్‌ అడ్మిరల్‌ కపిల్‌ మోహన్‌ ధిర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి సాయుధ బలగాల అధికారి ఈయన. పుణె, ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. 1985 జనవరి 1న నౌకాదళంలో నియమితులయ్యారు.

    రియర్‌ అడ్మిరల్‌ కపిల్‌ మోహన్‌ ధిర్‌ అత్యంత అనుభవజ్ఞుడైన మెరైన్‌ కమాండో (మార్కోస్‌). ఐఎన్‌ఎస్‌ అభిమన్యు, ఐఎన్‌ఎస్‌ ఖంజర్‌, ఐఎన్‌ఎస్‌ రాణా ద్వారా సముద్రంపై, ఒడ్డున చేపట్టిన అనేక అసైన్‌మెంట్లలో పాల్గొన్నారు. ఆపరేషన్‌ పవన్‌, ఆపరేషన్‌ జూపిటర్‌ సహా భారత్‌లో, వెలుపల నిర్వహించిన శాంతి పరిరక్షణ ఆపరేషన్లలోనూ సేవలు అందించారు. తూర్పు నౌకాదళం ఫ్లీట్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌గా, కోచిలో 'ఇండియన్‌ నేపల్‌ వర్కప్‌ టీమ్‌' ఇంఛార్జ్‌ కమాండర్‌గా ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు.

    నౌకాదళ ప్రధాన కార్యాలయాలు, సమీకృత భద్రత బలగాల ప్రధాన కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేయడం ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించి రియర్‌ అడ్మిరల్‌ కపిల్‌ మోహన్‌ ధిర్‌కు విశేష అనుభవం ఉంది. సమీకృత భద్రత బలగాల ప్రధాన కార్యాలయంలో ఏసీఐడీఎస్‌గా; ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన 'సులభతర వాణిజ్యం', 'భారత్‌లో తయారీ'ని ప్రోత్సహించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇందుకోసం, స్వదేశీకరణపై ఎక్కువ దృష్టి పెట్టి, వస్తు సేకరణ ప్రక్రియలను క్రమబద్ధీకరించారు. విధాన రూపకర్తగా, 'వ్యూహాత్మక భాగస్వామ్య విధానం', 'సవరించిన మేక్‌-2, మేక్‌-3 విధానాలు' 'సానుకూల స్వదేశీకరణ జాబితా' రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నారు. రక్షణ ప్రణాళికలో క్రమబద్ధ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు, సామర్థ్య అభివృద్ధిలో త్రివిధ దళాల సమైక్యతను కూడా పెంచారు.

    వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీ, దిల్లీలోని నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీల నుంచి రియర్‌ అడ్మిరల్‌ కపిల్‌ మోహన్‌ ధిర్‌ పట్టభద్రుడు.

    దేశ సేవలో చూపిన నిబద్ధతకు బహుమానంగా 'విశిష్ఠ సేవ పతకం', 'అతి విశిష్ఠ సేవ పతకం'ను అడ్మిరల్‌ కపిల్‌ మోహన్‌ ధిర్‌ అందుకున్నారు.

***
 



(Release ID: 1724384) Visitor Counter : 170