ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వాడిన పి.పి.ఇ. కిట్లు, మాస్కులను మళ్లీ వినియోగించే అవకాశం!
వినూత్న క్రిమిసంహాకర వ్యవస్థ “వజ్రకవచ్”తో ఇది సాధ్యం!

“పి.పి.ఇ., ఎన్95 మాస్కుల వైరస్.లను, బాక్టీరియాను
నిమిషాల్లోనే మటుమాయం చేసే ప్రక్రియ”
“99.999శాతం వైరస్.ల తొలగింపు”

“పర్యావరణ హితం, బయోమెడికల్ వ్యర్థాల తగ్గింపు”

Posted On: 31 MAY 2021 1:46PM by PIB Hyderabad

 కరోనా వ్యాధిని కట్టడిచేసే వ్యవస్థలో పనిచేసే కరోనా యుద్ధవీరులు వినియోగించిన పరికరాలనుంచి వైరల్ అవశేషాలను తొలగించగలిగే వజ్రకవచ్ అనే ఉత్పాదన ఇపుడు అందుబాటులోకి వచ్చింది. వినూత్నమైన ఈ క్రిమిసంహారక ఉపకరణానికి ముంబైకి చెందిన ఇంద్రా వాటర్ అనే  స్టార్టప్ కంపెనీ రూపకల్పన చేసింది. కరోనా యుద్ధవీరులు వినియోగించిన వ్యక్తిగత రక్షణ పరికరాలు (పి.పి.ఇ. సూట్లు), ఎన్95 మాస్కులు, లేబరేటరీ కోట్లు, గ్లవుజులు, గౌన్లు వంటి వాటిపై  సార్స్- కోవిడ్-2 వైరస్ అవశేషాలు ఎలాంటివి మిగిలి ఉన్నా, వాటిని వజ్ర కవచ్ అనే ఈ ఉత్పాదన దాదాపు వందశాతం తొలగించివేస్తుంది. వాడేసిన పి.పి.ఇ. సూట్లను, ఆరోగ్య రక్షణ కార్యకర్తలు వినియోగించిన ఇతర పరికర సామగ్రిని క్రిమిసంహారకంగా తయారు చేసి మళ్లీ వాడేందుకు ఇది వీలు కలిగిస్తుంది. దీనివల్ల ఆరోగ్య రక్షణ కార్యకర్తలకు రక్షణ లభించడమేకాక, బయోమెడికల్ వ్యర్థాలను తగ్గించడం ద్వారా పర్యావరణానికి కూడా ప్రయోజనం కలుగుతుంది.  దీనితో పి.పి.ఇ. సూట్ల లభ్యత మరింత మెరుగుపడుతుంది. అవి బాగా అందుబాటులో ఉండేందుకు వీలు కలుగుతుంది.

 

 “ఎలాంటి వైరస్ అవశేషమైనా కొన్ని నిమిషాల్లోనే మాయం”

  ఆరోగ్య కార్యకర్తలు, కరోనా యుద్ధవీరులు వాడే పరికర సామగ్రిపై క్రిమి సంహాకర ప్రక్రియను కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేయడం ఈ ఉత్పాదన ప్రత్యేకత. ముంబై నగరంలోని భివాండీ ప్రాంతంలో ఉన్న ఇంద్రా వాటర్ అనే ఫ్యాక్టరీలో ఇది తయారవుతోంది. వజ్రకవచ్ అనే ఈ ఉత్పాదన అక్కడినుంచే  మిగతా ఆసుపత్రులకు బట్వాడా అవుతోంది.  


భివాండీలోని ఫ్యాక్టరీ

 

లక్షరెట్ల మేర వైరస్ క్షీణించిపోతుంది

“మేం రూపకప్లన చేసిన వ్యవస్థ, లక్షరెట్ల మేర సూక్ష్మజీవుల సంఖ్యను క్షీణింపజేయ గలుగుతుంది.; విజ్ఞాన శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే, ఈ ఉత్పాదన ద్వారా మేం 99.999శాతం (5లాగ్) మేర వైరస్.లను, బాక్టీరియాను క్షీణింపగలమని మేం నిర్వహించిన పరీక్షల్లో తేలింది.”, అంటూ,.. ఇంద్రావాటర్ సంస్థ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన అభిజిత్ వి.వి.ఆర్. చెప్పారు. క్రిమిసంహారక ప్రక్రియ పూర్తయిన తర్వాత మనం తొలగించగలిగిన సూక్ష్మజీవుల సంఖ్యను తెలియజెప్పేందుకు  ‘లాగ్ రిడక్షన్’ అనే పదాన్ని శాస్త్ర విజ్ఞాన పరిభాషలో వినియోగిస్తారు.

  ఈ ఉత్పాదన ఎంత సామర్థ్యంతో పనిచేస్తుదన్న విషయాన్ని పరీక్షించి నిగ్గుదేల్చే ప్రక్రియను బొంబాయి ఐ.ఐ.టి.కి చెందిన జీవ విజ్ఞానశాస్త్ర, బయో ఇంజినీరింగ్ విభాగం నిర్వహించింది.  “వజ్ర కవచ్ అనే ఈ ప్రత్యేక ఉత్పాదనపై సుదీర్ఘమైన స్థాయిలో పలు పరీక్షలు నిర్వహించారు. ఎశ్చరికియా వైరస్ ఎం.ఎస్.2 (మానవ శ్వాస క్రియను దెబ్బతీసే ఇన్.ఫ్లుయెంజా వైరస్, కరోనా వైరస్)లను, సి-300 రకానికి చెందిన ఈ కోలీ వైరస్ తదితర సూక్ష్మాణువులను ఏ మేరకు క్షీణింపజేస్తుందన్న విషయాన్ని తేల్చుకునేందుకు ఈ వజ్ర కవచ్ పై పలురకాల పరీక్షలు జరిపారు. ఇందులో భాగంగా ఒక పి.పి.ఇ. సూటుపై పూర్తి స్థాయిలో వైరస్, బాక్టీరియా నమూనాలను ఉంచారు. అనంతరం సదరు పి.పి.ఇ. సూటును వజ్రకవచ్ వ్యవస్థ అంతర్భాగంలో ఉంచారు. క్రిమిసంహారక ప్రక్రియ వ్యవధి ముగుసిన తర్వాత అదే పి.పి.ఇ.ని బయటకు తీసి పరీక్షించారు. దానిపై వైరస్ క్షీణత రేటును, ఎంతమేర వైరస్ ను తొలిగిపోయిందన్న అంశాన్ని అంచనా వేశారు.” అని అభిజిత్ తెలిపారు. బహుముఖ స్థాయిలో క్రిమిసంహారక ప్రక్రియను నిర్వహించే అధునాతన వ్యవస్థను వజ్రకవచ్ లో అమర్చినట్టు అభిజిత్ చెప్పారు. పి.పి.ఇ. సూట్లపై ఉన్న వైరస్ ను, బ్యాక్టీరియాను, ఇతర సూక్మాణువులను క్రియా రహిత స్థాయికి క్షీణింప జేసేందుకు అధునాతనమైన ఆక్సీకరణ, కరోనా తొలగింపు ప్రక్రియను, అతి నీలలోహిత కిరణ ప్రయోగ ప్రక్రియను ఈ ఉత్పాదన వినియోగించగలుగుతుందని అభిజిత్ పేర్కొన్నారు. దీనితో ఈ వ్యవస్థ ద్వారా 99.999శాతం సామర్థ్యంతో ఈ ఉత్పాదన పనిచేయగలుగుతుందని అన్నారు.

 

 వజ్రకవచ్ రూపకల్పనకు ప్రేరణ!

  కరోనా కట్టడిలో వినియోగించే పరికర సామగ్రిని వాడేసి, ఎప్పటికప్పుడు వృధాగా పారవేయడం కంటే తిరిగి వాడేందుకు వీలుగా ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతోనే వజ్రకవచ్ రూపకల్పనపై తమకు ప్రేరణ కలిగిందని అభిజిత్ పి.ఐ.బి.కి తెలిపారు. “గత ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉన్నపుడే ఈ ఆలోచన వచ్చింది. వైరస్ మహమ్మారిపై పోరాటం సాగిస్తున్న దేశానికి ఎలా సహాయపడాలన్న అంశంపై మేం ఆలోచన చేశాం. పి.పి.ఇ. కిట్లకు, ఎన్95 రకం మాస్కులకు తీవ్రమైన గిరాకీ ఉందని, వైద్యపరమైన ఇతర అవసరాలతోపాటుగా, పి.పి.ఇ. కిట్లు, మాస్కులు అందజేసేందుకు దేశం చాలా ఇబ్బందులు పడుతోందని కూడా మాకు అర్థమైంది. సరిగ్గా...అప్పుడే మాకు ఈ ఆలోచన తలెత్తింది. –మాస్కులు, పి.పి.ఇ. కిట్లను తిరిగి వినియోగించేందుకు వీలు కలిగిస్తూ, వాటిని క్రిమిసంహారక ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తే ఎలా ఉంటుందన్న భావన కూడా మాకు అప్పుడే కలిగింది.” అని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం, వరంగల్ మహా నగరపాలక సంస్థ (జి.డబ్ల్యు.ఎం.సి.) కార్యాలయంలో

వజ్రకవచ్ ను ఆవిష్కరిస్తున్న జి.డబ్ల్యు.ఎం.సి. కమిషనర్ పమేలా శత్పతి. అడ్మినిస్ట్రేటివ్

 స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఎ.ఎస్.సి.ఐ.) సహకారంతో  వజ్రకవచ్ వ్యవస్థను

 తెలంగాణ  ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  

.

ఆలోచన స్థాయినుంచి అమలు ప్రక్రియ వరకూ...

  వజ్రకవచ్ ఉత్పాదనను తయారు చేయాలన్న ఆలోచనను అమలు చేసేందుకు ఇంద్రా వాటర్ స్టార్టప్ సంస్థ ఉపక్రమించింది. క్రిమిసంహాకర వ్యవస్థకు సంబంధించి పూర్తిగా స్వదేశీ విధానాన్నే అనుసరించింది. తాను నీటిశుద్ధికి వినియోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని కొన్ని మార్పులు చేసి ఇందుకు వినియోగించింది. దీనిపై అభిజిత్ మాట్లాడుతూ, “ప్రత్యేకమైన ఈ క్రిమిసంహాకర వ్యవస్థ తయారీలో వినియోగించిన ప్రతి విడిభాగం భారతదేశంలో తయారైనదే. బయటినుంచి ఏదీ సేకరించలేదు.” అన్నారు.

  కేంద్ర విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ ప్రవేశపెట్టిన నిధి-ప్రయాస్ పథకం కింద ఇంద్రా వాటర్ అనే స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఐ.ఐ.టి. బొంబాయికి చెందిన సొసైటీ ఫర్ ఇన్నొవేషన్ అండ్ ఎంటర్.ప్రెన్యూర్ షిప్ ద్వారా ఈ కంపెనీ రూపుదాల్చింది. కోవిడ్-19 ఆరోగ్య సంక్షోభంపై యుద్ధాన్ని బలోపేతం చేసే కేంద్రం (కవాచ్-సి.ఎ.డబ్ల్యు.ఎ.సి.హెచ్.) ద్వారా ఆర్థిక సహాయం పొందిన 51 స్టార్టప్ కంపెనీల్లో ఇంద్రా వాటర్ సంస్థ కూడా ఉంది. కేంద్ర విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ (డి.ఎస్.టి.) ద్వారా భారత ప్రభుత్వం కవాచ్ ను ఏర్పాటు చేసింది.

  వజ్రకవచ్ చాలా ఉపయోగకరం అంటున్న ఆరోగ్యరక్షణ కార్యకర్తలు...

  “పి.పి.ఇ. కిట్లపై వజ్ర కవచ్ ఉత్పాదన నిర్వహించే క్రిమిసంహారక ప్రక్రియ చాలా బాగుంది. ఇది వాడటానికి అనువుగా ఎంతో సౌకర్యవంతంగా ఉంది. 25 పడకలున్న కోవిడ్ కేర్ కేంద్రానికి ఇది సరిపోతుంది. మరిన్ని పి.పి.ఇ. సూట్లనైనా తిరిగి వినియోగించేందుకైనా ఇది అనువుగా ఉంది.” అంటున్నారు,..ఐ.ఐ.టి. బొంబాయి ఆసుపత్రి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ నిశా షా.  ఇంకా, ముంబైలోని కామా ఆసుపత్రి, ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆసుపత్రి, సెయింట్ జార్జి ఆసుపత్రి తదితర ఆసుపత్రుల్లో కూడా వజ్రకవచ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వరంగల్ నగరంలోని ఒక ఆసుపత్రిలో కూడా ఈ వ్యవస్థను ఏర్పాటైందని అభిజిత్ చెప్పారు. “ముంబైలోని పలు ఆసుపత్రుల్లో దాదాపు పది వజ్రకవచ్ వ్యవస్థలు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. చాలా మంది ఆరోగ్యరక్షణ సిబ్బందితో మాట్లాడిన తర్వాత మాకో విషయం తెలిసింది. ఎన్.95 మాస్కులు, పి.పి.ఇ. కిట్లనే కాకుండా, లేబరేటరీ కోట్లు, ఇతర మాస్కులు, ఏప్రాన్లు, ఫేస్ షీల్డులు, ఐ.సి.యు.లోని స్టేషనరీ సామగ్రి, మౌలికమైన వైద్య పరికకరాలు, ఇతర వైద్య సామగ్రిని క్రిమిసంహార రహితంగా చేసేందుకు కూడా వజ్రకవచ్ ను వినియోగిస్తున్నారని వారి మాటలద్వారా తెలిసింది.” అని అభిజిత్ అన్నారు.

 

 

  వజ్రకవచ్ క్రిమిసంహారక వ్యవస్థకు సంబంధించి రెండవ వెర్షన్.ను తాము త్వరలో ప్రవేశపెట్టబోతున్నట్టు అభిజిత్ తెలియజేశారు. “పి.పి.ఇ. కిట్ పరిమాణంలో పెద్దగా ఉంటుంది కాబట్టి, దాన్ని ఇమిడ్చేందుకు వీలుగా వజ్రకవచ్ వ్యవస్థలో తగిన చోటును ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తూ కొత్త వెర్షన్.ను తయారు చేయాలని భావిస్తున్నాం.” అని అభిజిత్ అన్నారు. వజ్రకవచ్ క్రిమిసంహారక వ్యవస్థను తయారు చేసిన ఇంద్రావాటర్ అనే స్టార్టప్ కంపెనీ, 20మంది ఔత్సాహికులతో ఏర్పాటైంది. అపార్టుమెంట్లు, పరిశ్రమలు, ఫ్యాక్టరీలు తదితర ప్రాంతాల్లో వృధాగా పోయే నీటిని క్రిమిసంహారక ప్రక్రియ ద్వారా శుద్ధిచేయాలన్నది తమ ప్రధాన ఆలోచనగా  ఇంద్ర వాటర్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇంద్రా వాటర్ కోసం ఎవరైనా contact@indrawater.com  అనే వెబ్ చిరునామాను సంప్రదించవచ్చు.

 

***(Release ID: 1723251) Visitor Counter : 53