ప్రధాన మంత్రి కార్యాలయం
2021 మే 30న జరిగిన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 77 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
Posted On:
30 MAY 2021 11:45AM by PIB Hyderabad
ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం. కోవిడ్-19 కి వ్యతిరేకం గా దేశం పూర్తి శక్తి తో ఎలా పోరాడుతుందో మనం చూస్తున్నాం. గత వంద సంవత్సరాల లో తలెత్తిన అతి పెద్ద మహమ్మారి ఇది. ఈ మహమ్మారి కాలంలోనే భారతదేశం అనేక ప్రకృతి వైపరీత్యాలతో పోరాడింది. ఈ సమయం లో అమ్ఫాన్ చక్రవాతం వచ్చింది, నిసర్గ్ చక్రవాతం కూడా వచ్చింది. అనేక రాష్ట్రాలలో వరదలు వచ్చాయి. చిన్నవీ, పెద్దవీ అనేక భూకంపాలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. గత 10 రోజులలో దేశం మళ్లీ రెండు పెద్ద తుఫానుల ను ఎదుర్కొంది. పశ్చిమ తీరం లో ‘తావూ-తె’ చక్రవాతం, తూర్పు తీరం లో ‘యాస్’ చక్రవాతం.. ఈ రెండు తుఫాను లు అనేక రాష్ట్రాల ను ప్రభావితం చేశాయి. వాటితో దేశం, దేశ ప్రజలు పూర్తి శక్తి తో పోరాడారు. ప్రాణ నష్టం అతి తక్కువగా ఉండేటట్టు జాగ్రతలను తీసుకోవడం జరిగింది. కిందటి సంవత్సరాలతో పోలిస్తే, గరిష్ఠం గా జన ప్రాణాల ను కాపాడుకోగలుగుతున్నామన్న సంగతి మన అనుభవంలోకి వచ్చింది. విపత్తు తాలూకు ఈ కఠినమైన, అసాధారణమైన పరిస్థితి లో తుఫాను బారిన పడ్డ రాష్ట్రాల ప్రజలు ఏ విధం గా సాహసాన్ని కనబరచి ఈ సంకట ఘడియ లో గొప్ప ధైర్యం తో క్రమశిక్షణ తో పోరాడారో, ఆ పౌరులు అందరినీ నేను ఆదరపూర్వకంగాను, హృదయపూర్వకంగాను ప్రశంసించదలుస్తున్నాను. ఎవరైతే ముందంజ వేసి రక్షణ, సహాయ కార్యకలాపాలలో పాలుపంచుకొన్నారో , అటువంటి వారంందరినీ ఎంత గా ప్రశంసించినప్పటికీ అది తక్కువే అవుతుంది. వారందరికీ నేను నమస్కరిస్తున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పరిపాలన యంత్రాంగాలు అన్నీ ఒక్క తాటిపైన నిలచి ఈ విపత్తు ను ఎదుర్కోవడంలో నిమగ్నం అయ్యాయి. సన్నిహితుల ను కోల్పోయిన వారందరికీ నేను నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ కష్ట సమయం లో ఈ ఆపద కలిగించిన నష్టాన్ని భరించిన వారి ని మనమంతా వెన్నంటి నిలుద్దాం.
ప్రియమైన నా దేశవాసులారా, సవాలు ఎంత పెద్దది అయినా సరే, గెలవాలనే భారతదేశ సంకల్పం కూడాను అంతే పెద్దది గా ఉంటూ వచ్చింది. దేశ సామూహిక శక్తి, మన సేవాభావం ప్రతి తుఫాను నుంచి దేశాన్ని కాపాడింది. ఇటీవలి కాలం లో మన వైద్యులు, నర్సులు, ఫ్రంట్ లైన్ యోధులు వారిని గురించి చింత అనేదే లేకుండా రాత్రనక పగలనక పనిచేశారు, ఈ రోజు కు కూడా పనిచేస్తున్నారు. దీనంతటికీ మధ్య, రెండో దశ లో కరోనా తో పోరాడటం లో ప్రధానమైనటువంటి పాత్ర ను పోషించిన వారు చాలా మందే ఉన్నారు. ఈ యోధులను గురించి చర్చించవలసిందంటూ ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం శ్రోత లు పలువురు NamoApp ద్వారా, లేఖ ల ద్వారా నాకు విజ్ఞప్తులు చేశారు.
మిత్రులారా, సెకండ్ వేవ్ రావడంతోనే, అకస్మాత్తు గా ఆక్సీజన్ కు డిమాండ్ ఎన్నో రెట్లు పెరిగిపోయింది; ఇది చాలా పెద్ద సవాలు. మెడికల్ ఆక్సీజన్ ను దేశంలోని సుదూర ప్రాంతాలకు చేరవేయడమనేది దానికదే ఒక పెద్ద సవాలుగా ఉండింది. ఆక్సీజన్ టాంకర్ వేగం గా వెళ్ళవలసి వస్తుంది. ఒక చిన్న పొరపాటు చేసినా, చాలా పెద్ద పేలుడు సంభవించే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇండస్ట్రియల్ ఆక్సీజన్ ను ఉత్పత్తి చేసే అనేక ప్లాంటు లు దేశం లోని తూర్పు భాగాలలో ఉన్నాయి. అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఆక్సీజన్ ను రవాణా చేయడానికి చాలా రోజులు పడుతుంది. దేశం ఎదుర్కొంటున్న ఈ సవాలు లో దేశానికి సహాయపడింది ఎవరయ్యా అంటే - క్రయోజెనిక్ టాంకర్ లను నడిపే డ్రైవర్ లు, ఆక్సీజన్ ఎక్స్‌ప్రెస్, వైమానిక దళ పైలట్ లు. ఇలాంటి వారు చాలా మంది యుద్ధ స్థాయి లో శ్రమించి వేలు, లక్షల కొద్దీ మంది ప్రజల ప్రాణాల ను రక్షించారు. ఈ రోజు న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో మనతో అలాంటి ఒక మిత్రుడు జతకలిశారు. ఆయనే ఉత్తర్ ప్రదేశ్ లోని జౌన్ పుర్ కు చెందిన శ్రీమాన్ దినేశ్ ఉపాధ్యాయ గారు..
మోదీ గారు: దినేశ్ గారూ, నమస్కారం.
దినేశ్ ఉపాధ్యాయ గారు: సర్.. నమస్కారం..
మోదీ గారు: మొదట మీ గురించి మాకు చెప్పాలని నేను కోరుతున్నాను.
దినేశ్ : సర్.. నా పేరు దినేశ్ బాబూల్ నాథ్ ఉపాధ్యాయ. నేను జౌన్ పుర్ జిల్లా లోని జమువా పోస్ట్ పరిధి హసన్ పుర్ గ్రామం లో ఉంటాను సర్.
మోదీ గారు: ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారా ?
దినేశ్ : అవును! అవును సర్.
మోదీ గారు: అలాగా.
దినేశ్: సర్. మాకు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. నా భార్య తో పాటు మా తల్లితండ్రులు ఉన్నారు.
మోదీ గారు: మీరు ఏం చేస్తారు ?
దినేశ్: సర్, నేను ఆక్సీజన్ టాంకర్ నడుపుతాను, సర్ .. అది లిక్విడ్ ఆక్సీజన్ టాంకర్.
మోదీ గారు: పిల్లల చదువు సరిగా సాగుతోందా ?
దినేశ్: అవును సర్. పిల్లలు చదువుకుంటున్నారు. ఆడపిల్లలు ఇద్దరూ కూడా చదువుతున్నారు. మా అబ్బాయి కూడా చదువుకుంటున్నాడు సర్.
మోదీ గారు: వారి ఆన్‌లైన్ చదువు సైతం సరిగ్గానే నడుస్తోందా ?
దినేశ్: అవును సర్. వారు చక్కగా చదువుకుంటున్నారు, ప్రస్తుతం మా అమ్మాయిలు చదువుతున్నారు సర్. సర్, నేను ఆక్సీజన్ టాంకర్ ను నడపడం మొదలుపెట్టి 15- 17 సంవత్సరాలు అయ్యాయి సర్.
మోదీ గారు: బాగుంది. ఈ 15-17 సంవత్సరాలు మీరు ఆక్సీజన్ ను తీసుకు వెళ్తున్నారంటే మీరు ఒక్క ట్రక్ డ్రైవరే కాదు ! మీరు ఒక విధం గా లక్షల మంది ప్రాణాల ను కాపాడడం లో తలమునకలు గా ఉన్నారు.
దినేశ్: సర్. మా పనే అలాంటిది సర్, మాది ఆక్సీజన్ టాంకర్ ల కంపెనీ, కంపెనీ పేరు ఐనాక్స్ కంపెనీ. ఆ కంపెనీ కూడా మేమంటే చాలా శ్రద్ధ వహిస్తుంటుంది. మేం ఎక్కడికైనా వెళ్లి ఆక్సీజన్ ను అందించామా అంటే మాకు చాలా సంతోషం గా ఉంటుంది సర్.
మోదీ గారు: అయితే ఇప్పుడు కరోనా కాలం లో మీ బాధ్యత చాలా పెరిగిపోయింది కదా ?
దినేశ్: అవును సర్, చాలా పెరిగింది.
మోదీ గారు: మీరు మీ ట్రక్కు లో డ్రైవింగ్ సీటు లో కూర్చొన్నప్పుడు మీ మనసు లో ఉండే ఆలోచన ఏమిటి? ఇంతకుముందు తో పోలిస్తే ఏమైనా వేరుగా ఉండే అనుభవం కలిగిందా ? చాలా ఒత్తిడి కూడా ఉంటుందనుకుంటా ? మానసిక ఒత్తిడి ఎదురవుతుంటుందేమో ? కుటుంబం గురించిన ఆందోళన, కరోనా వాతావరణం, ప్రజల వైపు నుంచి ఒత్తిడి, డిమాండు లు.. ఇలాంటివన్నీ ఉండి ఉంటాయంటారా ?
దినేశ్: సర్, మాకు ఏ ఆందోళన లేదు. మాకు ఉండేదల్లా మేము ఏదయితే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నామో, అది మేము సమయానికి తీసుకుపోయి మా ఆక్సీజన్ తో ఎవరికయినా ప్రాణం నిలబడిందీ అంటే అది మాకు చాలా గర్వం కలిగించే విషయం గా ఉంటుంది.
మోదీ గారు: మీరు మీ భావాలను చాలా ఉత్తమమైన పద్ధతి లో వ్యక్తం చేస్తున్నారు. మంచిది, ఇది చెప్పండి.. ఈ రోజు న ఈ మహమ్మారి కాలం లో ప్రజలు మీ పని ప్రాముఖ్యాన్ని గుర్తిస్తున్నారో, అది ఇదివరకు బహుశా ఇంతగా అర్థం చేసుకొని ఉండకపోవచ్చును. వారు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అలాంటప్పుడు, మీపట్ల, మీ పని పట్ల వారి వైఖరి లో ఏమైనా మార్పు వచ్చిందా ?
దినేశ్: అవును సర్! ఇంతకు ముందు మేము ఇక్కడ, అక్కడ ఒక దగ్గర ఇరుక్కుపోయే వాళ్ళం. కానీ ఈ రోజుల్లో అధికార యంత్రాంగం మాకు చాలా తోడ్పడింది. మేము ఎక్కడకు వెళ్తున్నా, మా లోపల సైతం ఒక కుతూహలం చెలరేగుతోంది. మేము ఎంత త్వరగా వెళ్తే ప్రజల ప్రాణాల ను కాపాడగలుగుతామో అని, సర్. తినేందుకు ఏదైనా దొరికినా, దొరకకపోయినా, ఏదైనా సమస్య ఎదురైనా గానీ మేము టాంకర్ ను తీసుకొని ఆసుపత్రి కి చేరుకొంటున్నాం. ఆసుపత్రి వాళ్లు మాకు V అనే సైగ చేస్తుంటారు, అక్కడ అడ్మిట్ అయిన వారి కుటుంబ సభ్యులు కూడా V అనే సైగ చేస్తారు.
మోదీ గారు: ఓహో, విజయానికి గుర్తు గా V అనే సైగ చేస్తారా ?
దినేశ్: అవును సర్. V అని సైగ చేస్తుంటారు. ఒక్కొక్కసారి బొటనవేలు ను చూపిస్తారు. మేము చాలా ఊరడిల్లుతాం.. మా జీవనం లో మేము ఏదో మంచి పని ని తప్పక చేశాం, దాని వల్లే నాకు ఇలాంటి సేవ ను అందించే అవకాశం దొరికింది అని.
మోదీ గారు: అలసట అంతా పోతుందనుకుంటా?
దినేశ్: అవును సర్, అవును.
మోదీ గారు: మరి ఇంటికి వెళ్ళి పిల్లలతో ఈ విషయాలన్నీ మాట్లాడతారా ?
దినేశ్: లేదు సర్. పిల్లలు మా ఊళ్లో ఉంటున్నారు. మేమయితే ఇక్కడ ఐనాక్స్ ఎయర్ ప్రాడక్ట్ లో, నేను డ్రైవర్ గా పని చేస్తున్నాను. 8-9 నెలల తరువాత ఇంటికి వెళ్తాను.
మోదీ గారు: అలాంటప్పుడు ఎప్పుడైనా ఫోన్ ద్వారా పిల్లలతో మాట్లాడుతుంటారా ?
దినేశ్: అవును సర్. తప్పక మాట్లాడుతుంటాను.
మోదీ గారు: అలాగైతే వారి మనసు లో అనిపిస్తుంటుందనుకుంటాను, నాన్నగారు ఇలాంటి కాలం లో కాస్త జాగ్రత్త గా ఉండండి అని ?
దినేశ్: అవును సర్. మా పిల్లలు అంటారు “నాన్నా.. పని చేయండి కానీ మీ వంతు జాగ్రత తో ఉండండి” అని; సర్, మేము సురక్షత తో పని చేస్తాం. మాన్ గాఁవ్ ప్లాంటు ఉండనే ఉంది. ఐనాక్స్ మాకు ఎంతో సాయపడుతూ ఉంటుంది.
మోదీ గారు: సరే, దినేశ్ గారూ, నాకు చాలా నచ్చింది. మీ మాటలు విన్న తరువాత, ఎవరెవరు ఏ విధం గా ఈ కరోనా పోరాటం లో పాటుపడుతున్నారు అనేది దేశానికి కూడా తెలుస్తుంది. మీరు తొమ్మిదేసి నెలలు పాటు మీ పిల్లలను కూడా కలుసుకోకుండా ఉంటున్నారు. కుటుంబాన్నయినా కలసుకోవడం లేదు, ప్రజల ప్రాణాలను రక్షించాలని. దినేశ్ ఉపాధ్యాయ వంటి లక్షల కొద్దీ మంది అదే పని గా శ్రమిస్తున్నారు కాబట్టి పోరాటం లో మనం గెలుస్తాం అనే భావన తో దేశం గర్వం గా తల ఎత్తుకోగలుగుతుంది.
దినేశ్: సర్ జీ! మనం ఏదో ఒక రోజు న కరోనా ను ఓడించి తీరుతాం.
మోదీ గారు: అలాగే దినేశ్ గారూ.. మీలో ఉన్న ఈ భావనే దేశానికి ఉన్నటువంటి బలం. చాలా చాలా ధన్యవాదాలు దినేశ్ గారూ. మరి మీ పిల్లల కు నా ఆశీర్వాదాలు తెలియజేయండి.
దినేశ్: మంచిది సర్. నమస్కారం.
మోదీ గారు: ధన్యవాదాలు.
దినేశ్: ప్రణామాలు.
మోదీ గారు: ధన్యవాదాలు.
మిత్రులారా, దినేశ్ గారు చెబుతున్నట్లుగా, ఒక టాంకర్ డ్రైవర్ ఆక్సీజన్ తో ఆసుపత్రి కి చేరుకొన్నప్పుడు, దేవుడు పంపిన దూత వలెనే కనిపిస్తారు. ఈ పని ఎంతటి బాధ్యత తో కూడుకొని ఉందనేది, ఈ పని లో ఎంతటి మానసిక ఒత్తిడి ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు.
మిత్రులారా, సవాలు తో కూడినటువంటి ఈ కాలం లో, ఆక్సీజన్ రవాణా ను సులభతరం చేయడానికి భారతీయ రైల్ కూడా ముందుకు వచ్చింది. ఆక్సీజన్ ఎక్స్‌ప్రెస్, ఆక్సీజన్ రైలు.. ఇవి రహదారుల పై వెళ్ళే ఆక్సీజన్ టాంకర్ కంటే చాలా వేగం గా, ఎంతో ఎక్కువ పరిమాణం లో ఆక్సీజన్ ను దేశం లోని మూల మూలకు చేరవేశాయి. ఒక ఆక్సీజన్ ఎక్స్ ప్రెస్ నను అయితే అచ్చం గా మహిళలే నడుతున్నారన్న విషయం తెలిస్తే దేశం లోని ప్రతి తల్లి, ప్రతి సోదరి గర్వపడతారనుకుంటాను. దేశం లో ప్రతి ఒక్క మహిళ కు ఈ విషయం గర్వపడేటటువంటిదే అవుతుంది. ఇది మాత్రమే కాదు.. భారతదేశం లో ప్రతి ఒక్కరికి కూడాను ఇది గర్వించే అంశమే కాగలదు. నేను ఆక్సీజన్ ఎక్స్‌ప్రెస్ లోకో-పైలట్ శిరిషా గజని గారి ని ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమాని)కి ఆహ్వానించాను.
మోదీ గారు: శిరీశ గారూ.. నమస్తే.
శిరీష: నమస్తే సర్. ఎలా ఉన్నారు సర్ ?
మోదీ గారు: నేను చాలా బాగున్నాను. శిరీష గారూ.. మీరు రైల్వే పైలట్ గా పని చేస్తున్నారని విన్నాను. మీ మొత్తం మహిళా బృందం ఈ ఆక్సీజన్ ఎక్స్‌ప్రెస్ ను నడుపుతోందని నాకు తెలిసింది. శిరీష గారూ.. మీరు గొప్ప పని ని చేస్తున్నారు. కరోనా కాలం లో మీలాగే చాలా మంది మహిళ లు ముందుకు వచ్చి కరోనా కు వ్యతిరేకం గా పోరాడటానికి దేశాని కి శక్తి ని ఇచ్చారు. మీరు కూడా మహిళా శక్తి కి గొప్ప ఉదాహరణ గా ఉన్నారు. అయితే, దేశం తెలుసుకోవాలని అనుకుంటోంది, నేనూ తెలుసుకోదలుస్తున్నాను, అది ఏ విషయం అని అంటే మీకు ఈ ప్రేరణ ఎక్కడ నుంచి అందుతోంది ? అనేదే.
శిరీష: సర్.. నాకు ప్రేరణ మా అమ్మ, నాన్న లే సర్. మా నాన్న గారు ప్రభుత్వ ఉద్యోగి గా ఉన్నారు సర్. నాకు ఇద్దరు అక్కయ్య లు ఉన్నారు సర్. మేం ముగ్గురమూ మహిళలమే. అయినప్పటికీ మేము పని చేయాలని మా నాన్న గారు చాలా ప్రోత్సహిస్తున్నారు. మా పెద్ద అక్క బ్యాంకు లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. నేను రైల్వే లో స్థిరపడ్డాను. మా తల్లితండ్రులయితే నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటారు.
మోదీ గారు: బాగుంది శిరీష గారూ.. మీరు సాధారణ రోజుల్లో కూడా మీ సేవల ను రైల్వేల కు అందించారు. ఒక వైపు ఆక్సీజన్ కు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు, మీరు ఆక్సీజన్ ను తీసుకు పోతున్నప్పుడు- అది కొంచెం ఎక్కువ బాధ్యత తో కూడింది కదా. సాధారణ వస్తువులను తీసుకుపోవడం వేరు, ఆక్సీజన్ చాలా సున్నితమైంది. కాబట్టి ఇలాంటి వాటిని తీసుకు వెళ్లడం లో మీకు ఎలాంటి అనుభవం ఎదురయింది ?
శిరీష: ఈ పని ని చేయడం నాకు సంతోషం గా అనిపించింది. ఆక్సీజన్ స్పెశల్ ఇచ్చే సమయం లో, అన్నిటిని సరిచూశారు, భద్రత పరం గా, ఏర్పాటుల పరంగా, ఏదైనా లీకేజీ ఉందేమో అని. మరొక విషయం, భారతీయ రైల్వే కూడా బలపరుస్తోంది సర్. ఈ ఆక్సీజన్ రైలు ను నడపడానికి నాకు హరిత పథాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రైలు 125 కిలోమీటర్ల దూరాన్ని గంటన్నర లో సమీపించింది. రైల్వే శాఖ కూడా ఇంతటి బాధ్యత ను తీసుకొంది, నేను సైతం బాధ్యత గా నడుచుకొన్నాను సర్.
మోదీ గారు: భలే! ఇదుగోండి.. నేను మీకు అనేక అభినందనలను అందజేస్తున్నాను. మీ తల్లితండ్రుల కు ఇవే నా ప్రత్యేక ప్రణామాలు. వారు ముగ్గురు ఆడపిల్లల కు కూడా ఇంతటి ప్రేరణ ను ఇచ్చినందుకు, ఈవిధంగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపినందుకు. ఇలాంటి తల్లి తండ్రుల కు, మీ వంటి సోదరీమణులు అందరికీ ఎవరైతే ఈ విధంగా దేశాని కి సేవ చేసినందుకు, ఆ తపన ను కనబరచినందుకు. చాలా చాలా ధన్యవాదాలు శిరీష గారూ.
శిరీష: ధన్యవాదాలు సర్. మీ ఆశీస్సులు నాకు కావాలి సర్.
మోదీ గారు: పరమాత్మ ఆశీర్వాదాలు మీకు లభించు గాక. మీ తల్లితండ్రుల దీవెన లు మీకు దక్కు గాక. ధన్యవాదాలండీ !
శిరీష: ధన్యవాదాలు సర్. థాంక్ యు సర్. నాకు మీ దీవెన లు కావాలి.
మిత్రులారా, మనం ఇప్పుడిప్పుడే శిరీష గారి మాటలను విన్నాం. వారి అనుభవాలు కూడా స్ఫూర్తి ని ఇస్తాయి; అవి భావుకులను గా చేసివేస్తాయి కూడా. వాస్తవం లో, ఈ యుద్ధం ఎంత పెద్దది అంటే రైల్వేల మాదిరి గా మన దేశం కూడాను జలమార్గం, భూమార్గం, ఆకాశమార్గం.. ఈ మూడు మార్గాల ద్వారా పనిచేస్తోంది. ఒక వైపు ఖాళీ అయిన టాంకర్ లను వాయు సేన విమానాల ద్వారా ఆక్సీజన్ ప్లాంటుల కు రవాణా చేసే పనులు జరుగుతున్నాయి. మరోవైపు కొత్త ఆక్సీజన్ ప్లాంటు ల నిర్మాణ పనులు కూడా పూర్తి అవుతున్నాయి. అలాగే విదేశాల నుంచి ఆక్సీజన్ ను, ఆక్సీజన్ కాన్సన్ ట్రేటర్ లను, క్రయోజెనిక్ టాంకర్ లను కూడా దేశం లోకి తీసుకురావడం జరుగుతోంది. అందువల్ల ఈ పనుల్లో నౌకాదళం, వాయుసేన, సైన్యం, డిఆర్‌డిఒ లాంటి మన సంస్థ లు కూడా పాలుపంచుకొంటున్నాయి. మన శాస్త్రవేత్త లు, పరిశ్రమ నిపుణులు, సాంకేతికులు కూడా యుద్ధ ప్రాతిపదిక న పని చేస్తున్నారు. వీరు చేసే పని ని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి దేశ ప్రజలందరి మనసు లో ఉంది. అందువల్ల, మనతో మన వాయు సేన గ్రూపు కెప్టెన్ పట్ నాయక్ గారు జత పడుతున్నారు.
మోదీ గారు: పట్ నాయక్ గారూ.. జయ్ హింద్.
గ్రూపు కెప్టెన్: సర్. జయ్ హింద్ సర్. నేను గ్రూప్ కెప్టెన్ ఎ.కె. పట్ నాయక్ ని సర్. నేను ఎయర్ ఫోర్స్ స్టేశన్ హిండన్ నుంచి మాట్లాడుతున్నాను.
మోదీ గారు: పట్ నాయక్ గారూ.. కరోనా తో యుద్ధం కాలం లో మీరు అనేక బాధ్యతల ను నిర్వహిస్తున్నారు. ప్రపంచం నలు మూలలకూ వెళ్లి టాంకర్ లను తీసుకొని ఇక్కడకు రావడం. మీరు ఒక సిపాయి అయి ఉండి మీరు వేరే రకమైన పని ని చేశారు. చనిపోవడం కోసం, చంపడం కోసం సైనికులు పరుగెత్తడం అనేది ఉంటుంది. ఇవాళ మీరు ప్రాణాల ను కాపాడటం కోసం పరుగెత్తుతున్నారు. ఏమని అనిపిస్తోంది ?
గ్రూపు కెప్టెన్: సర్.. ఈ సంక్షోభ కాలం లో మన దేశస్థుల కు సహాయం చేయగలగడం మాకు గొప్ప సౌభాగ్యం తో కూడుకొన్న పని సర్. మాకు ఏ బాధ్యతల ను అప్పజెప్పినా వాటిని మేము సమర్థవంతం గా నిర్వహిస్తున్నాం సర్. మా శిక్షణ, సహాయక సేవ లు మాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నాయి. అన్నింటి కంటే మిన్న ఏమిటంటే సర్, దీనిలో మాకు లభిస్తున్న ఉద్యోగ సంతృప్తి అనేది, అది చాలా అధిక స్థాయి లో ఉంది. మరి ఈ కారణం గానే మేం ఒకదాని వెంట మరొకటి గా ఇలాంటి కార్యాల ను పూర్తి చేయగలుగుతున్నాం.
మోదీ గారు: కెప్టెన్.. మీరు ఈ రోజుల్లో ఏ ప్రయత్నాలు చేసినా, అది కూడా అతి తక్కువ సమయంలోనే చేయాల్సి వచ్చింది. ఈ రోజుల్లో మీ పనులు ఎలా జరిగాయి ?
గ్రూపు కెప్టెన్: సర్. గత నెల రోజుల తరబడి మేము ఆక్సీజన్ టాంకర్ లను, లిక్విడ్ ఆక్సీజన్ కన్ టేనర్ లను దేశీయ గమ్య స్థానాల నుంచే కాకుండా అంతర్జాతీయ గమ్యస్థానాల నుంచి కూడా తీసుకు వస్తున్నాం సర్. వాయు సేన దాదాపు గా 1600 కి పైగా సార్టీస్ పూర్తి చేసింది; మేము 3000 గంటల కు పైగా ప్రయాణించాం. సుమారు గా 160 ఇంటర్ నేశనల్ మిశన్ లను ముగించాం. అంతకుముందు దేశీయంగా సరఫరా కు 2 నుండి 3 రోజులు తీసుకుంటే మేం 2 నుండి 3 గంటల్లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంపించగలం సర్. ఇంటర్ నేశనల్ మిశన్ లలో సైతం 24 గంటల లోపల నిరంతరాయం గా పని చేస్తూ, యావత్తు వాయు సేన ఈ పని లో పడింసర్. వీలైనంత త్వరగా మేము ఎన్ని ఎక్కువ టాంకర్ లను తీసుకు వస్తే అంతగా దేశాని కి సహాయపడగలమన్న అభిప్రాయం లో ఉన్నాం సర్.
మోదీ గారు: కెప్టెన్.. మీరు అంతర్జాతీయం గా ఎక్కడెక్కడికి ఉరుకులు పరుగులు పెట్టవలసి వచ్చింది?
గ్రూపు కెప్టెన్: సర్. స్వల్ప వ్యవధి లో సింగపూర్, దుబయి, బెల్జియమ్, జర్మనీ, యుకె .. ఈ అన్ని చోటుల కు భారత వాయు సేన తాలూకు వేరు వేరు ఫ్లీట్ లు ఐఎల్-76, సి-17 వంటి మిగతా అన్ని విమానాలు వెళ్లాయి. సి-130 అయితే అత్యంత స్వల్ప వ్యవధి ప్రణాళిక తోనే వెళ్లిపోయింది. మా శిక్షణ కారణం గా, మా ఉత్సాహం కారణం గా మేము సకాలం లో ఈ మిశన్స్ ను పూర్తి చేయగలిగాం.
మోదీ గారు: చూడండి, జలమార్గం కానివ్వండి, భూమార్గం కానివ్వండి, ఆకాశ మాార్గం కానివ్వండి, మన జవాను లు అందరూ కరోనా కు వ్యతిరేకం గా పోరాటం లో నిమగ్నం అయి ఉన్నారు. దీనిని చూసుకొని దేశం గర్వపడుతోంది. మరి కెప్టెన్.. మీరు కూడా చాలా పెద్ద బాధ్యత ను నిర్వర్తించారు. దీనికి గాను నేను మిమ్మల్ని కూడా చాలా అభినందిస్తున్నాను.
గ్రూపు కెప్టెన్: సర్.. మీకు చాలా ధన్యవాదాలు సర్. మేం మనసు పెట్టి మా పూర్తి ప్రయత్నాల ద్వారా పాటు పడుతున్నాం. మరొక్క మాట, నా కుమార్తె అదితి కూడా నాతో ఉంది సర్.
మోదీ గారు: అరె వాహ్ !
అదితి: నమస్తే మోదీ గారూ.
మోదీ గారు: నమస్తే పుత్రికా. నమస్తే అదితి, నీ వయసు ఎన్ని ఏళ్లు తల్లీ ?
అదితి : నాకు 12 ఏళ్లు సర్. నేను 8 వ తరగతి చదువుతున్నాను.
మోదీ గారు: మీ నాన్న గారు బయటకు వెళ్లినప్పుడు యూనిఫార్మ్ లో ఉంటారు కదూ.
అదితి : అవును. మా నాన్న ని చూస్తే నాకు చాలా గర్వం గా అనిపిస్తూ ఉంటుంది ఆయన ఇంత ముఖ్యమైన పని చేస్తున్నారో అని. కరోనా తో బాధపడుతున్న వారికి ఇలాగ ఎంతో సాయం చేస్తున్నారు; ఇన్నన్ని దేశాల నుంచి ఆక్సీజన్ టాంకర్ లు తీసుకు వస్తున్నారు, కంటేనర్ లు తెస్తున్నారు.
మోదీ గారు: కానీ అమ్మా, మీ నాన్న నీ దగ్గర ఉండడం లేదని అనిపిస్తుంటుంది అవునా ?
అదితి : అవును.. ఆయన తో నేను కలిసి ఉండలేకపోతున్నాను. పాపా కొన్ని రోజులు గా ఇంట్లో ఎక్కువ గా ఉండడమే లేదు. ఎందుకు అంటే ఎన్నెన్నో అంతర్జాతీయ విమానాలలో వెళ్తున్నారు. కంటేనర్ లను, టాంకర్ లను వాటి ఉత్పత్తి ప్రాంతాల దగ్గరకు చేరవేస్తున్నారు. దీనితో కరోనా బాధితుల కు సకాలం లో ఆక్సీజన్ లభించి, మరి వారి ప్రాణాలు కాపాడబడుతాయి.
మోదీ గారు: అమ్మా మరి ఈ ఆక్సీజన్ వల్లనే గదా ప్రజల ప్రాణాల ను కాపాడే పని ఇక ఇంటింటి వారికి కూడా తెలిసివచ్చింది.
అదితి: అవును.
మోదీ గారు: మీ నాన్న గారు ఆక్సీజన్ అందించే సేవ చేస్తున్నారని మీ తోటి విద్యార్థులకు తెలిసే ఉంటుంది, అప్పుడు నిన్ను కూడా వారు చాలా గౌరవం గా చూస్తూ ఉండి ఉంటారు కదా!
అదితి: అవును.. నా ఫ్రెండ్స్ అంతా అంటారు ఏమని అంటే మీ పాపా ఇంత ముఖ్యమైన పని ని చేస్తున్నారో, మరి అది నీకు కూడా చాలా గర్వంగా ఉంటుంది కదూ అని. అప్పుడు నాకు చాలా గర్వం గా అనిపిస్తుంది. నా కుటుంబ సభ్యులు.. మా నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ అందరికీ మా నాన్న అంటే చాలా గర్వం గా ఉంటుంది. మా అమ్మ తో పాటు వాళ్ళంతా డాక్టర్లు. వారు కూడా పగలు, రాత్రి పనిచేస్తున్నారు. అన్ని సాయుధ దళాలు, మా నాన్న తో పాటు పూర్తి స్క్వాడ్రన్ లోని అంకల్స్, ఇంకా మొత్తం సైన్యం బోలెడంత పని చేస్తోంది. మరి నాకు నమ్మకం ఉంది- అందరి ప్రయత్నాల తో మనం కరోనా తో చేస్తున్న ఈ యుద్ధం లో తప్పక గెలుస్తాము- అని.
మోదీ గారు: అమ్మాయి మాట్లాడేటప్పుడు ఆమె మాటల లో సరస్వతి విరాజిల్లుతూ ఉంటుందని మన వాళ్లు అంటూ ఉంటారు. మనం ఖచ్చితం గా గెలుస్తాం అని అదితి పలుకుతున్నది అంటే అది ఈశ్వరుని వాణి యే అయిపోతుంది. సరే అదితి, ఇప్పుడు ఆన్ లైన్ లో చదువుతున్నావనుకుంటాను ?
అదితి: అవును సర్. ఇప్పుడు మా క్లాసులు అన్నీ ఆన్‌లైన్ లో జరుగుతున్నాయి. ప్రస్తుతం మేము ఇంట్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బయటకు వెళ్లాలనుకుంటే రెండు మాస్క్ లు ధరిస్తున్నాం. అన్ని ముందు జాగ్రత్తల ను తీసుకుంటున్నాం. వ్యక్తిగత పరిశుభ్రత ను పాటిస్తున్నాం. అన్ని అంశాల మీద ధ్యాస పెడుతున్నాం.
మోదీ గారు: నీ సరదాలు ఏమేమిటి? ఏవంటే మీకు ఇష్టం?
అదితి: ఈత కొట్టడం, బాస్కెట్‌బాల్ ఆడడం సర్. అయితే ఇప్పుడు అవి కాస్తా ఆగిపోయాయి. బేకింగ్, వంట చేయడం నాకు చాలా ఇష్టం. ఈ లాక్‌డౌన్, కరోనా వైరస్ కాలం లో నాన్న బయటికి వెళ్ళి చాలా కష్టపడి వచ్చినప్పుడు నేను నాన్న కు కుకీస్, కేక్ తయారు చేసి పెడుతున్నాను.
మోదీ గారు: వాహ్, వాహ్, వాహ్! చాలా కాలం తరువాత మీకు మీ నాన్న తో సమయం గడపడానికి అవకాశం వచ్చింది. నాకు చాలా సంతోషం గా ఉంది. కెప్టెన్.. నేను మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను. నేను కెప్టెన్ ను అభినందిస్తున్నాంటే అది మీ ఒక్కరినే అని కాదు, మన దళాలు- నీరు, భూమి, ఆకాశాలతో జతపడ్డ అందరికీ, వారందరికీ నేను నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు సోదరా!
గ్రూపు కెప్టెన్: మీకు ధన్యవాదాలు సర్.
మిత్రులారా, మన ఈ జవాను లు, ఈ యోధులు ఏదయితే పని ని చేశారో, దీనికి గాను వీరికి దేశం నమస్కరిస్తుంది. అదే విధంగా లక్షల కొద్దీ మంది ప్రజలు పగలనక, రాత్రనక శ్రమిస్తున్నారు. వారు చేస్తున్న పని ఏదయితే ఉందో, అది వారి దినచర్య లో భాగం కాదు. ఇంతటి ఆపద వంద సంవత్సరాల తరువాత ప్రపంచం మీద కు విరుచుకుపడింది. ఒక శతాబ్దం అనంతరం ఇంత పెద్ద సంకటం ! అందువల్ల, ఈ రకమైన పని విషయం లో ఎవరికీ ఏ అనుభవమూ లేదు. దీని వెనుక దేశసేవ చేయాలి అన్న అభిరుచి, సంకల్ప శక్తి ఉన్నాయి. వీటితోనే దేశం ఇంతకు ముందు ఎన్నడూ చేయని పని ని చేసింది. మీరు ఊహించవచ్చు- సాధారణ రోజుల్లో మన దగ్గర ఒక రోజు లో 900 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సీజన్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఇది 10 రెట్ల కన్నా ఎక్కువ గా పెరిగి, సుమారు 9500 మెట్రిక్ టన్నుల మేరకు ప్రతి రోజు ఉత్పత్తి అవుతోంది. ఈ ఆక్సీజన్ ను మన యోధులు దేశం లో సుదూరాన ఉన్న మూల ప్రాంతాల వరకు చేరవేస్తున్నారు.
ప్రియమైన నా దేశవాసులారా, దేశం లో ఆక్సీజన్ ను అందించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. చాలా మంది ప్రజలు కలిసికట్టు గా కృషి చేస్తున్నారు. పౌరుని గా ఈ పనులన్నీ స్ఫూర్తి ని కలిగిస్తాయి. అందరూ ఒక జట్టు గా ఏర్పడి వారి కర్తవ్యాన్ని నిర్వర్తించారు. బెంగళూరు కు చెందిన ఊర్మిళ గారు తన భర్త లేబ్ టెక్ నిశన్ అని నాకు చెప్పారు. మరి ఏ విధంగా అనేక సవాళ్ళ మధ్య ఆయన అదే పని గా పరీక్షలు పూర్తి చేసే పని ని నిర్వహిస్తోందీ కూడా ఆవిడ తెలియజేశారు.
మిత్రులారా, కరోనా ఆరంభం లో దేశం లో ఒకే ఒక పరీక్షా ప్రయోగశాల ఉండేది. కానీ ఇప్పుడు రెండున్నర వేల కు పైగా ప్రయోగశాల లు పనిచేస్తున్నాయి. మొదట్లో ఒక రోజు లో కొన్ని వంద ల పరీక్ష లు అయ్యేవి. ఇప్పుడు 20 లక్షల కు పైబడి పరీక్షలు ఒక రోజు లో జరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశం లో 33 కోట్ల కు పైగా నమూనాల ను పరీక్షించడమైంది. ఇంత పెద్ద కార్యం ఈ యోధుల వల్ల మాత్రమే సాధ్యం అవుతోంది. నమూనాల ను సేకరించే పని లో ఎంతో మంది ఫ్రంట్‌లైన్ శ్రమికులు నిమగ్నమై ఉన్నారు. సంక్రమించిన రోగుల మధ్య కు వెళ్లడం, వారి నమూనా ను తీసుకోవడం- ఇది ఎంత గొప్ప సేవో కదా. తమను తాము రక్షించుకోవడానికి, ఈ సహచరులు ఇంత వేడి లో కూడా నిరంతరం పిపిఇ కిట్ ను ధరించే ఉండవలసి వస్తుంది. ఆ తరువాత, ఆ నమూనా ప్రయోగశాల కు చేరుతుంది. అందువల్ల నేను మీ సలహాల ను, ప్రశ్నల ను చదువుతున్నప్పుడు మన ఈ స్నేహితుల ను గురించిన చర్చ కూడా జరగాలి అని రూఢి చేసుకొన్నాను. వారి అనుభవాల నుంచి మనం కూడా చాలా తెలుసుకుంటాం. దిల్లీ లో లేబ్ టెక్ నిశన్ గా పనిచేస్తున్న ప్రకాశ్ కాండ్‌పాల్ గారి తో మాట్లాడదాం.
మోదీ గారు: ప్రకాశ్ గారూ నమస్కారం.
ప్రకాశ్ గారు: నమస్కారాలు గౌరవనీయ ప్రధాన మంత్రి గారూ.
మోదీ గారు: ప్రకాశ్ గారూ.. మొదట ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) శ్రోతలందరికీ మీ గురించి చెప్పండి. మీరు ఈ పని ని ఎంతకాలం నుంచి చేస్తున్నారు ? కరోనా కాలం లో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ? ఎందుకంటే దేశ ప్రజలు దీన్ని టీవీ లో గానీ, వార్తాపత్రికల లో గానీ చూడరు. అయినా ఒక రుషి లాగా ప్రయోగశాల లో పని చేస్తున్నారు. కాబట్టి మీరు చెప్పినప్పుడు, దేశం లో పని ఎలా జరుగుతుందనే దాని గురించి ప్రజలకు కూడా తెలుస్తుంది.
ప్రకాశ్ గారు: దిల్లీ ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ అయినటువంటి ఇన్స్ టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సైన్సెస్ (ఐఎల్‌బిఎస్) అనే ఆసుపత్రి లో గడచిన 10 సంవత్సరాలు గా నేను లేబ్ టెక్ నిశన్ గా పని చేస్తున్నాను. నాకు ఈ రంగం లో 22 సంవత్సరాల అనుభవం ఉంది. ఐఎల్‌బిఎస్ కన్నా ముందు నేను దిల్లీ లోని అపోలో హాస్పిటల్, రాజీవ్ గాంధీ కేన్సర్ హాస్పిటల్, రోటరీ బ్లడ్ బ్యాంక్ ల వంటి ప్రతిష్టాత్మక సంస్థల లో పనిచేశాను. సర్.. నేను ప్రతి చోటా బ్లడ్ బాంక్ విభాగం లో పనిచేసినప్పటికీ గత ఏడాది 2020వ సంవత్సరం ఏప్రిల్ 1 వ తేదీ నుంచి నేను ఐఎల్‌బిఎస్ వైరాలజీ విభాగం పరిధి లోని కోవిడ్ పరీక్షల ప్రయోగశాల లో పని చేస్తున్నాను. నిస్సందేహంగా కోవిడ్ మహమ్మారి కారణం గా వైద్య రంగం తో పాటు సంబంధిత అన్ని విభాగాల పై చాలా ఒత్తిడి ఉంది. దేశం, మానవత, సమాజం మా నుండి ఎక్కువ బాధ్యతాయుత తత్వాన్ని, సహకారాన్ని, అధిక సామర్థ్యాన్ని ఆశించడం ఒక అవకాశం గా భావిస్తున్నాను. సర్.. దేశం, ప్రజలు, సమాజం ఆశించే సహకారాని కి అనుగుణం గా పనిచేయడం గర్వాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు మా కుటుంబ సభ్యులు కూడా భయపడినప్పుడు నేను వారితో చెప్తాను- దేశం కోసం అసాధారణ పరిస్థితులలో సరిహద్దులలో పని చేసే వారితో పోలిస్తే మేం చేసేది చాలా తక్కువే అని. వారు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఒక విధం గా వారు నాతో సహకరిస్తారు. వారి వంతు సహకారాన్ని అందిస్తారు కూడాను .
మోదీ గారు: ప్రకాశ్ గారూ.. ఒక వైపు ప్రభుత్వం ప్రతి ఒక్కరి నీ దూరం పాటించండని చెబుతోంది. దూరం పాటించండి. కరోనా లో ఒకరికి మరొకరు దూరం గా ఉండండి అని. మరి మీరు ముందుంటూ, కరోనా వైరస్ మధ్య లో ఉండవలసివస్తుంది. కాబట్టి ఇది దీనికి ఇదే ప్రాణాలను పణం పెట్టేటటువంటి వ్యవహారం. ఈ పరిస్థితి లో కుటుంబం ఆందోళన చెందడం చాలా సహజం. కానీ ఇప్పటికీ ఈ లేబ్ టెక్ నిశన్ ఉద్యోగం సాధారణ వృత్తుల లో ఒకటి. మహమ్మారి పరిస్థితుల లో పని గంటలు చాలా పెరిగి ఉంటాయి. రాత్రి పూట లేబ్‌ల లో గడపవలసి ఉంటుంది. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ప్రజల నమూనాల ను పరీక్షిస్తున్నారాయె. అలాంటప్పుడు భారం పెరగనే పెరుగుతుంది. కానీ మీ భద్రత కోసం జాగ్రత లు తీసుకుంటున్నారా, లేదా?
ప్రకాశ్ గారు: తప్పకుండా జాగ్రత చర్యల ను తీసుకొంటాం సర్. మా ఐఎల్ బిఎస్ ప్రయోగశాల డబ్ల్యు హెచ్ఒ గుర్తింపు ను పొందింది. కాబట్టి అన్ని ప్రోటోకాల్స్ అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉంటాయి. మేం లేబ్ కు 3 అంచెల దుస్తుల లో వెళ్తాం. దానితోనే పని చేస్తాం. విసర్జించేందుకు, లేబులింగ్ చేయడానికి, పరీక్షించడానికి పూర్తి ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ ప్రకారమే విధులు నిర్వర్తిస్తాం. సర్.. నా కుటుంబం, నా పరిచయస్తుల లో చాలా మంది ఈ సంక్రమణ నుంచి దూరంగా ఉన్నారంటే ఇదంతా ఈశ్వరుని కరుణే. జాగ్రతగా ఉంటూ, సంయమనం తో మెలగితే, అప్పుడు మీరు దానితో ఒకింత తప్పించుకోవచ్చును.
మోదీ గారు: ప్రకాశ్ గారూ.. మీలాంటి వేల మంది గత ఒక సంవత్సరం నుండి లేబ్ లో కూర్చొని చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ని రక్షించడానికి కృషి చేస్తున్నారు. ఈ రోజు దేశం ఈ విషయాలన్నింటిని తెలుసుకుంటుంది. ప్రకాశ్ గారూ.. మీ ద్వారా మీ సహోద్యోగులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. దేశప్రజల తరఫు నుంచి కూడాను ధన్యవాదాలు పలుకుతున్నాను. మీరు ఆరోగ్యం గా ఉండండి. మీ కుటుంబం ఆరోగ్యం గా ఉండు గాక. మీకు నా వైపు నుంచి చాలా శుభాకాంక్షలు..
ప్రకాశ్ గారు: ధన్యవాదాలు ప్రధాన మంత్రి గారూ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞుడి ని.
మోదీ గారు: - ధన్యవాదాలు సోదరా.
మిత్రులారా, ఒక విధం గా నేను సోదరుడు ప్రకాశ్ గారితో అయితే మాట్లాడాను. కానీ అతని మాటలలో వేల కొద్దీ లేబ్ టెక్ నిశన్ ల సేవ తాలూకు సుగంధం మన వరకు వ్యాపిస్తోంది. ఈ మాటల్లో వేలాది, లక్షలాది ప్రజల సేవాభావం మనకు కనిపిస్తుంది. మనమందరం మన బాధ్యతను కూడా గ్రహించాం. సోదరుడు ప్రకాశ్ గారి లాంటి మన సహోద్యోగులు ఎంతో కష్టపడి, అంకితభావం తో పని చేస్తున్నారు. అదే అంకితభావం తో వారి సహకారం కరోనా ను ఓడించడం లో సహాయపడుతుంది.
ప్రియమైన నా దేశవాసులారా, మనం మన కరోనా యోధుల గురించి మాట్లాడుతున్నాం. గత ఒకటిన్నర సంవత్సరాల లో మనం వారి బోలెడంత అంకితభావాన్ని, కృషి ని చూశాం. ఈ పోరాటం లో దేశం లో అనేక ప్రాంతాల యోధులు చాలా మంది కూడా ప్రముఖ పాత్ర ను పోషిస్తున్నారు. మీరు ఆలోచించండి.. మన దేశానికి ఇంత పెద్ద సంకటం దాపురించింది. ఇది దేశం లోని ప్రతి వ్యవస్థ ను ప్రభావితం చేసింది. ఈ దాడి నుంచి వ్యవసాయ వ్యవస్థ చాలా వరకు తన ను తాను రక్షించుకొంది. సురక్షితంగా ఉండడమే కాకుండా పురోగతి ని సాధించింది- మరింత పురోగతి సాధించింది! ఈ మహమ్మారి కాలం లో కూడా మన రైతులు రెకార్డ్ స్థాయి లో వ్యవసాయ ఉత్పత్తుల ను పెంచారని మీకు తెలుసా ? రైతులు రెకార్డ్ స్థాయి లో ఉత్పత్తి చేశారు. కాబట్టి ఈ సారి దేశం రెకార్డ్ స్థాయి లో పంటల ను కూడా కొనుగోలు చేసింది. ఈ సారి రైతుల కు చాలా చోట్ల ఆవాల పంట కు కనీస మద్దతు ధర కంటే ఎక్కువ లభించింది. రెకార్డ్ స్థాయి లో ఆహార ధాన్యాల ఉత్పత్తి వల్ల మన దేశం ప్రతి పౌరుని కి సహాయాన్ని అందించగలదు. ఈ సంక్షోభ కాలం లో 80 కోట్ల మంది పేద ప్రజల కు ఉచిత రేశన్ లభిస్తుంది. పేద ప్రజల ఇళ్ళ లో పొయ్యి వెలగని రోజు అంటూ ఉండకూడదనే లక్ష్యం తో ఉచిత రేశన్ ను అందించడం జరుగుతోంది.
మిత్రులారా, ప్రస్తుతం మన దేశం లోని రైతులు, అనేక ప్రాంతాలలో కొత్త ఏర్పాటుల ను సద్వినియోగం చేసుకొని అద్భుతాలు చేస్తున్నారు. ఉదాహరణ కు అగర్ తలా రైతుల ను తీసుకోండి! ఈ రైతులు చాలా మంచి పనస పండ్ల ను ఉత్పత్తి చేస్తారు. వాటి డిమాండ్ దేశ విదేశాలలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి అగర్ తలా కిసాను లు పండించిన పనస పండ్ల ను రైలు ద్వారా గువాహాటీ కి తీసుకు రావడమైంది. ఈ జాక్‌ఫ్రూట్‌ల ను ఇప్పుడు గువాహాటీ నుంచి లండన్ కు పంపడం జరుగుతోంది. అదే విధం గా మీరు బిహార్ కు చెందిన ‘శాహీ లీచీ’ పేరు ను వినే ఉంటారు. 2018 లో ప్రభుత్వం ఈ ‘శాహీ లీచీ’కి జిఐ టాగ్ ను ఇచ్చింది. తద్వారా దానికి బలమైప గుర్తింపు లభించాలి, రైతులకు మరింత ప్రయోజనం ఉండాలి అనేది ఉద్దేశ్యం. ఈసారి బిహార్ కు చెందిన ‘శాహీ లీచీ’ లను కూడా విమానం లో లండన్ కు పంపడం జరిగింది. మన దేశం తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఇటువంటి ప్రత్యేకమైన రుచులు, ఉత్పత్తుల తో నిండి ఉంది. దక్షిణ భారతదేశం లో, విజయనగరం లోని మామిడి పండ్ల ను గురించి మీరు తప్పక విని ఉంటారు. ఇప్పుడు ఈ మామిడి పండ్లు తినడానికి ఇష్టపడని వారు ఎవరుంటారు ? కాబట్టి ఇప్పుడు కిసాన్ రైలు వందల టన్నుల విజయనగరం మామిడి ని దిల్లీ కి చేరుస్తోంది. దీనివల్ల దిల్లీ ప్రజల కు, ఉత్తర భారతదేశం ప్రజల కు విజయనగరం మామిడిపండ్లు తినడానికి దొరుకుతాయి. విజయనగరం రైతుల కు మంచి ఆదాయం లభిస్తుంది. కిసాన్ రైలు ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల టన్నుల ఉత్పత్తుల ను రవాణా చేసింది. ఇప్పుడు రైతు లు పండ్లు, కూరగాయలు, ధాన్యాల ను దేశం లోని ఇతర మారుమూల ప్రాంతాల కు చాలా తక్కువ ఖర్చు తో పంపించగలుగుతున్నారు.
ప్రియమైన నా దేశవాసులారా, ఈ రోజు మనం మే 30 న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో మాట్లాడుకుంటున్నాం. యాదృచ్చికంగా ఇది ఈ ప్రభుత్వానికి 7 సంవత్సరాల కాలం పూర్తి అయ్యే సమయం. కొన్నేళ్లుగా దేశం ‘సబ్ కా-సాథ్, సబ్ కా-వికాస్, సబ్ కా-విశ్వాస్’ అనే మంత్రాన్ని అనుసరించింది. మనమందరం దేశ సేవ లో ప్రతి క్షణం అంకితభావం తో పనిచేశాం. చాలా మంది నాకు లేఖలు పంపారు. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో 7 సంవత్సరాల మన ప్రయాణాన్ని గురించి కూడా నేను చర్చించాలి అని వారు సూచన చేశారు. మిత్రులారా, ఈ 7 సంవత్సరాలలో ఏమైనా సాధించామూ అంటే, అది దేశాని కి చెందింది, దేశ వాసులదీనూ. ఈ సంవత్సరాల్లో మనం జాతీయ గౌరవానికి సంబంధించిన అనేక క్షణాలను కలిసి అనుభవించాం. ఇప్పుడు భారతదేశం ఇతర దేశాల ఆలోచనల కు, ఒత్తిడి కి లోను కాకుండా స్వీయ సంకల్పం తో నడవడాన్ని చూస్తే, మనందరికీ గర్వం కలుగుతుంది. మనకు వ్యతిరేకం గా కుట్ర చేసే వారికి ఇప్పుడు భారతదేశం తగిన సమాధానాన్ని ఇస్తుందని గమనించినప్పుడు, మన విశ్వాసం పెరుగుతుంది. జాతీయ భద్రత సమస్యల పై భారతదేశం రాజీ పడనప్పుడు, మన దళాల బలం పెరిగినప్పుడు మనం సరైన మార్గం లో పయనిస్తున్నాం అని భావిస్తాం.
మిత్రులారా, నేను దేశం లోని ప్రతి మూల నుంచి చాలా మంది దేశవాసుల సందేశాల ను, వారి లేఖల ను అందుకొంటున్నాను. 70 సంవత్సరాల తరువాత విద్యుత్తు మొదటిసారి గా తమ గ్రామాని కి చేరుకున్నందుకు, వారి పిల్లలు విద్యుత్తు వెలుగు లో ఫ్యాన్ కింద కూర్చొని చదువుకుంటున్నారంటూ చాలా మంది కృతజ్ఞత లు తెలిపారు. తమ గ్రామం కూడా ఇప్పుడు పట్టణానికి రోడ్డు ద్వారా అనుసంధానమైందని ఎంతో మంది అంటున్నారు. రహదారి నిర్మాణం తరువాత మొదటి సారి గా తాము కూడా ప్రపంచం లోని ఇతర ప్రాంతాల తో కలిసిపోయినట్టు గా వారు భావించారని ఒక ఆదివాసీ ప్రాంతాని కి చెందిన కొంత మంది సహచరులు నాకు సందేశం పంపారని నాకు జ్ఞాపకం ఉంది. అదే విధం గా కొందరు బ్యాంకు ఖాతా ను తెరచిన ఆనందాన్ని పంచుకుంటున్నారు. కొందరు వివిధ పథకాల సహాయం తో కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించినప్పుడు ఆ ఆనందం లో నన్ను కూడా భాగస్వామి కండి అంటూ ఆహ్వానిస్తారు. ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ లో భాగం గా ఇల్లు లభించిన తరువాత గృహ ప్రవేశానికి ఎందరో దేశవాసుల నుంచి నాకు నిరంతరమూ చాలా ఆహ్వానాలు వస్తూనే ఉంటున్నాయి. ఈ 7 సంవత్సరాల లో ఇలాంటి లక్షలాది ఆనందాల లో నేను పాలుపంచుకున్నాను. కొద్ది రోజుల క్రితం గ్రామానికి చెందిన ఒక కుటుంబం ‘జల్ జీవన్ మిశన్’ లో భాగం గా ఇంట్లో ఏర్పాటు చేసిన నీటి నల్లా ఫోటో ను నాకు పంపింది. ఆయన ఆ ఫోటో కు ‘నా గ్రామాని కి చెందిన జీవన ధార’ అని శీర్షిక ను రాశాడు. ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన 7 దశాబ్దాల లో మన దేశం లో 3.5 కోట్ల గ్రామీణ కుటుంబాలకు మాత్రమే నీటి కనెక్శన్ ఉంది. కానీ గత 21 నెలల్లోనే నాలుగున్నర కోట్ల ఇళ్ల కు పరిశుభ్రమైన నీటి కనెక్శన్ లు లభించాయి. వీటిలో15 నెలలు కరోనా కాలానికి చెందినవే. ‘ఆయుష్మాన్ యోజన’ తో కూడా దేశం లో ఒక కొత్త విశ్వాసం వచ్చింది. ఉచిత చికిత్స తో ఎవరైనా పేద వ్యక్తి ఆరోగ్యం గా ఇంటికి చేరుకొన్నప్పుడు ఆ వ్యక్తి కి తను కొత్త జీవితాన్ని పొందినట్లు అనిపిస్తుంది. దేశం తన తో ఉందన్న బరోసా ఆ వ్యక్తి కి ఏర్పడుతుంది. ఇలాంటి చాలా కుటుంబాల ఆశీర్వచనాల తో, కోట్ల మంది తల్లుల ఆశీర్వాదం తో, మన దేశం దృఢం గా అభివృద్ధి వైపు పయనిస్తోంది.
మిత్రులారా, ఈ 7 సంవత్సరాలలో, ‘డిజిటల్ లావాదేవీల’లో ప్రపంచాని కి కొత్త దిశ ను చూపించే పని ని భారతదేశం చేసింది. ఈ రోజు న మీరు ఏ ప్రదేశం లో అయినా డిజిటల్ చెల్లింపు తేలిక గా చేయగలుగుతున్నారు. ఈ కరోనా సమయం లో సైతం ఇది చాలా ఉపయోగకరం గా ఉంది. ఈ రోజులలో పరిశుభ్రత పై దేశవాసుల ఆసక్తి, అప్రమత్తత పెరుగుతున్నాయి. మనం రెకార్డ్ ఉపగ్రహాలను కూడా ప్రయోగిస్తున్నాం. రెకార్డ్ రోడ్లను కూడా నిర్మిస్తున్నాం. ఈ 7 సంవత్సరాల లో దేశం లోని అనేక పాత వివాదాలు కూడా పూర్తి శాంతి, సామరస్యాల తో పరిష్కారం అయ్యాయి. ఈశాన్య ప్రాంతాల నుంచి కశ్మీర్ వరకు శాంతి పై, అభివృద్ధి పై కొత్త విశ్వాసం పుట్టుకొచ్చింది. మిత్రులారా, దశాబ్దాలుగా చేయలేని ఈ పనులన్నీ ఈ 7 సంవత్సరాల లో ఎలా జరిగాయి ? ఇవన్నీ ఎందుకు సాధ్యమయ్యాయి అంటే ఈ 7 సంవత్సరాల లో మనం ప్రభుత్వం- ప్రజలు అనే భావన కంటే ఎక్కువ గా ‘ఒకే దేశం’ అనే భావన తో కలిసి పనిచేశాం. ఒక జట్టు గా పని చేశాం. ‘టీం ఇండియా’ గా పని చేశాం. ప్రతి పౌరుడు దేశాన్ని అభివృద్ధి చేయడం లో కొన్ని అడుగులు వేయడానికి ప్రయత్నించాడు. అవును! సఫలత లు ఉన్న చోటే పరీక్ష లు కూడా ఉంటాయి. ఈ 7 సంవత్సరాల లో మనం కలిసి చాలా కష్టమైన పరీక్షలను ఎదుర్కొన్నాం. ప్రతి సారీ మనమందరం విజయాన్ని సాధించాం. దృఢం గా బయటపడ్డాం. కరోనా మహమ్మారి రూపం లో ఇంత పెద్ద పరీక్ష నిరంతరం జరుగుతోంది. ఇది ప్రపంచం మొత్తాన్ని కలవరపెట్టిన సంక్షోభం. ఎంతో మంది తమ ప్రియతములను కోల్పోయారు. పెద్ద దేశాలు కూడా దీని విధ్వంసం నుండి రక్షణ ను పొందలేకపోయాయి. ఈ మహమ్మారి కాలం లో ‘సేవ, సహకారం’ అనే సంకల్పం తో భారతదేశం ముందుకు సాగుతోంది. కరోనా మొదటి వేవ్ లో కూడా మనం శక్తిమంతం గా పోరాడాం. ఈ సారి కూడా వైరస్ కు వ్యతిరేకం గా పోరాటం లో భారతదేశం విజయం సాధిస్తుంది. ‘రెండు గజాల దూరం’, మాస్కుల కు సంబంధించిన నియమాలను గానీ, లేదా వ్యాక్సీన్ కు సంబంధించిన నియమాలను గానీ మనం సడలించకూడదు. ఇదే మనం గెలుపు ను దక్కించుకొనే దారి. మళ్లీ ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో కలిసినప్పుడు దేశవాసుల మరెన్నో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణల ను గురించి మాట్లాడుకుందాం. కొత్త విషయాల ను గురించి చర్చిద్దాం. మీ సలహాల ను ఇలాగే నాకు పంపుతూ ఉండండి. మీరందరూ ఆరోగ్యం గా ఉండండి. దేశాన్ని ఇదే విధం గా అభివృద్ధి చేస్తూ ఉండండి. చాలా చాలా ధన్యవాదాలు.
***
(Release ID: 1722864)
Visitor Counter : 359
Read this release in:
Gujarati
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam