సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కోవిడ్-19వల్ల మరణించిన 67 మంది పాత్రికేయుల కుటుంబాలకు ఆర్థిక సహాయంపై మంత్రిమండలి ఆమోదం


సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోని జర్నలిస్టుల
సంక్షేమ పథకం కింద ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షలు;

దరఖాస్తుల సత్వర పరిశీలన కోసం వారానికోసారి
సమావేశం కావాలని ‘జేడబ్ల్యూఎస్’ కమిటీ నిర్ణయం;

Posted On: 27 MAY 2021 7:23PM by PIB Hyderabad

   కోవిడ్ మహమ్మారివల్ల 2020, 2021 సంవత్సరాల్లో మరణించిన పాత్రికేయుల కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ స్వచ్ఛందంగా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా గౌరవనీయులైన మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్ మార్గనిర్దేశంలో మంత్రిత్వశాఖ, పత్రికా సమాచార సంస్థ (పీఐబీ) సంయుక్తంగా పాత్రికేయుల వివరాలను క్రోడీకరించి సంకలనం చేశాయి. ఈ జాబితాలోని పాత్రికేయుల కుటుంబాలకు ‘జర్నలిస్టుల సంక్షేమ పథకం’ (జేడబ్ల్యూఎస్) కింద ప్రత్యేక ఆర్థిక సహాయ కార్యక్రమం చేపట్టనుంది.

   ఈ మేరకు సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అమిత్ ఖారే నేతృత్వంలోని  ‘జేడబ్ల్యూఎస్’ కమిటీ రూపొందించిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఇవాళ ఆమోదం తెలిపింది. కాగా, కోవిడ్-19వల్ల మరణించిన 26 మంది పాత్రికేయులను కమిటీ గుర్తించింది. దీనికి మంత్రిమండలి అంగీకారం నేపథ్యంలో సదరు పాత్రికేయుల కుటుంబాలకు తలా రూ.5 లక్షల వంతున ఆర్థిక సహాయం అందుతుంది. ఇంతకుముందు 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ వల్ల మరణించిన 41 మంది పాత్రికేయుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది. దీంతో ఇప్పటిదాకా సాయం అందుకున్న కుటుంబాల సంఖ్య 67కు చేరింది. మహమ్మారికి బలైపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు కమిటీ ప్రగాఢ సంతాపం తెలిపింది.

   కోవిడ్-19 వల్ల మరణించిన పలువురు పాత్రికేయుల కుటుంబాలకు ‘పత్రికా సమాచార సంస్థ’ (పీఐబీ) చేదోడువాదోడుగా నిలిచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయ పథకం గురించి వివరించడమే కాకుండా దరఖాస్తు ఫారాలను నింపడంలో వారికి చురుగ్గా తోడ్పడింది. మరోవైపు ‘జేడబ్ల్యూఎస్’ కింద కొత్తగా అందే దరఖాస్తుల సత్వర పరిశీలన కోసం ప్రతివారం సమావేశం కావాలని పథకం కమిటీ నిర్ణయించింది. అలాగే కోవిడ్-19 కాకుండా ఇతర కారణాలతో మరణించిన 11 మంది పాత్రికేయుల కుటుంబాలు సమర్పించిన దరఖాస్తులను కూడా కమిటీ పరిగణనలోకి తీసుకుంది.

   జర్నలిస్టుల సంక్షేమ పథకం కమిటీ సమావేశంలో ఇతర సభ్యులైన పీఐబీ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ జైదీప్ భట్నాగర్, సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ విక్రమ్ సహాయ్ సహా కమిటీలోని పాత్రికేయ సంఘాల ప్రతినిధులు శ్రీ సంతోష్ ఠాకూర్, శ్రీ అమిత్ కుమార్, శ్రీ ఉమామహేశ్వర్ కుమార్, కుమారి సర్జనా శర్మ తదితరులు కూడా పాల్గొన్నారు.

   జర్నలిస్టుల సంక్షేమ పథకం (జేడబ్ల్యూఎస్)కింద ఆర్థికసాయం కోసం పాత్రికేయులు, వారి కుటుంబాలు ‘పీఐబీ’ వెబ్ సైట్ https://accreditation.pib.gov.in/jws/default.aspx ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

***



(Release ID: 1722358) Visitor Counter : 166