సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్ నేపథ్యంలోనూ నిరాటంకంగా సమాజ సేవా కార్యక్రమాలు!


ఉద్ధంపూర్ లోక్ సభ స్థానం పరిధిలో కార్యక్రమాలపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమీక్ష

మోదీ పాలన ఏడేళ్లు ముగిసిన సందర్భంగా 30న జరిపే సేవా కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులతో చర్చ


Posted On: 27 MAY 2021 6:05PM by PIB Hyderabad

   జమ్ము కాశ్మీర్ లోని ఉద్ధంపూర్-కథువా-దోడా లోక్ సభ నియోజకవర్గం పరిధిలో కోవిడ్ సంబంధమైన సమాజ సేవా కార్యక్రమాలపై సమీక్ష కోసం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ రోజు ఒక సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, ప్రముఖ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఇప్పటివరకూ చేపట్టిన సమాజ సేవా కార్యక్రమాలపై  సమావేశంలో చర్చించారు. అలాగే, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏడేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా మహమ్మారి వైరస్ కట్టడికోసం  ఈ నెల 30వ తేదీన నిర్వహించ తలపెట్టిన సామాజిక "సేవా" కార్యక్రమంపై కూడా ఆయన ఈ సమావేశంలో చర్చించారు.

  ఈ నెల 28వ తేదీనుంచి నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల స్థాయిలో రక్తదాన శిబిరాలతో పాటుగా పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించనట్టు ఈ సమావేశంలో తెలిపారు. ఈ నెల 30న నియోజకవర్గంలోని ఆరు జిల్లాల పరిధిలో ఉన్న వివిధ పంచాయతీల్లో "సేవ" పేరిట నిర్వహించదలుచుకున్న సామాజిక సేవా కార్యక్రమాలను గురించి కూడా చర్చించారు. కోవిడ్ సంబంధమైన సామగ్రి అంటే,.. మాస్కులు, శానిటైజర్లు, ఆహార రేషన్, ఆక్సీమీటర్లు వంటి వాటిని కూడా ఈ కార్యక్రమంలో పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.

https://ci3.googleusercontent.com/proxy/I1xVbMqJYtCdSX_2JraBlHn_Dnx8UosG0YsBQwRMSj61kYlpox6ALxJtH-ULUBgV0UDeKQ2PKSONSmitId9QIrIHtilLRpDcEPfrMqXXS1e2M5W9W8YttGf5rg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0017VJF.jpg

   ఈ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, కోవిడ్ సెంకడ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో తన నియోజకవర్గం పరిధిలో సేవా కార్యక్రమాల ఏర్పాట్లను గురించి ప్రస్తావించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్ల లభ్యత విషయంలో ఎప్పటికప్పుడు అవసరానికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వసతుల లేమి కారణంగా రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. తన నియోజకవర్గంలోని అన్ని జిల్లాల్లోనూ సకాలంలోనే ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయని, అన్ని జిల్లాల్లోనూ కోవిడ్ సంబంధిత సామగ్రిని కార్యకర్తలు సజావుగా పంపిణీ చేశారని ఆయన చెప్పారు.

  నియోజకవర్గంలోని గ్రామాలకు కూడా కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందే ఆస్కారం ఉన్నందున ‘టెలీ-కన్సల్టేషన్’ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని, ఇందుకోసం గుర్తింపు పొందిన వైద్యులను ‘టెలీ-కన్సల్టేషన్’ ప్యానెల్ లో చేర్చేందుకు అవసరమైన మార్గదర్శక సూత్రాలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. టెలీ మెడిసిన్ ఏర్పాటుతో విచక్షణా రహితంగా జరిగే రెఫరల్ వ్యవస్థ ద్వారా జిల్లాల్లోని ఆసుపత్రులకు వచ్చే రోగుల ఒత్తిడి ఇకపై తగ్గుతుందని అన్నారు.  

  జమ్ము కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఇప్పటికే 66శాతంపైగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్టు గణాంకాల ద్వారా తెలుస్తోందని, ఇది వ్యాక్సినేషన్ జాతీయ సగటుకంటే ఎక్కువని అన్నారు. దీని ద్వారా, ఇక్కడి ప్రజలు వ్యాక్సినేషన్ చేయించుకునేందుకు ఏ మాత్రం వెనుకాడబోరని తెలుస్తోందని, ఇది చాలా ప్రోత్సాహకరమైన పరిణామమని ఆయన అన్నారు.

  జమ్ము కాశ్మీర్ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివీ రేటు, మరణాల రేటు చాలా రోజులుగా గణనీయంగా తగ్గుతూ వస్తోందని, ఇది శుభ సూచకమని మంత్రి అన్నారు. వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో కేంద్ర పాలిత ప్రాంతంలో ఆరోగ్య రక్షణ సదుపాయాలు బలోపేతం కావడం ప్రజల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని అన్నారు.

  కేంద్ర ప్రభుత్వపు ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 30వ తేదీన నియోజకవర్గ వ్యాప్తంగా కోవిడ్ సంబంధిత సామగ్రిని పంపిణీ చేయడంతో పాటు, రక్తదాన శిబిరాలను కూడా నిర్వహించబోతున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.

  ఉద్ధంపూర్ లోక్ నియోజకవర్గానికి కోవిడ్ బాధితుల సహాయ సామగ్రిని పంపించినందుకు, అవసరమైన చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసినందుకు కేంద్ర మంత్రికి ఈ సమావేశంలో భాగస్వామ్య వర్గాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

  ప్రజా ప్రతినిధులు, ప్రముఖ నాయకులతో ముచ్చటించిన సందర్భంగా, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి వైరస్ సవాళు విసిరినప్పటికీ, నియోజకవర్గం మారుమూల ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ మాత్రం ఆగిపోలేదని అన్నారు. అన్ని వేళల్లోనూ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఇది తెలియజేస్తున్నదని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు.

 

<><><>



(Release ID: 1722289) Visitor Counter : 111