రైల్వే మంత్రిత్వ శాఖ

"బీజీ రైలు మార్గాన్ని మించిన వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన నడక మార్గపు అనుభవాన్ని చార్‌ధామ్‌ యాత్రికులు పొందాలి: శ్రీ పీయూష్ గోయల్‌


చార్‌ధామ్‌ ప్రాజెక్టుల్లో చివరి మైలు వరకు అనుసంధానంపై రైల్వే శాఖ మంత్రి సమీక్ష
యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ను అనుసంధానించే కొత్త బీజీ రైలు మార్గంపై ముగింపు దశకు వచ్చిన "తుది స్థాన సర్వే"

Posted On: 27 MAY 2021 3:56PM by PIB Hyderabad

చార్‌ధామ్‌ యాత్రికులు చివరి అడుగు వరకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన అనుభవాన్ని పొందేలా చార్‌ధామ్‌ అనుసంధానత ఉండాలని రైల్వే శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్‌ సూచించారు. చార్‌ధామ్‌ ప్రాజెక్టుల్లో చివరి మైలు వరకు అనుసంధానతపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

    యాత్రికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని కేంద్ర మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. మొత్తం ప్రాజెక్టు పూర్తవడం కోసం, సంపూర్ణ అనుసంధానతకు ఉన్న మార్గాలను వ్యయ సమస్యలతో కలిపి సమగ్ర పరిశీలించాలని చెప్పారు.

    పర్యాటక అవసరాలు తీర్చడానికి, యాత్రికులు సురక్షితంగా, సమయానికి ఆలయాలకు చేరుకునేందుకు ఈ ప్రాజెక్టుకు సమగ్ర ప్రణాళిక అవసరమని శ్రీ పీయూష్‌ గోయల్‌ అన్నారు.

    చార్‌ధామ్‌ క్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ను అనుసంధానించే కొత్త బ్రాడ్‌ గేజ్‌ రైలు మార్గంపై "తుది స్థాన సర్వే" ముగింపు దశకు వచ్చింది. 

    125 కిలోమీటర్ల పొడవైన రిషికేశ్-కర్ణప్రయాగ్‌ కొత్త బీజీ రైలు మార్గం ప్రాజెక్టులో భాగమైన కర్ణప్రయాగ్ స్టేషన్ నుంచి కేదార్‌నాథ్- బద్రీనాథ్ రైలు మార్గం ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతమున్న దోయివాలా స్టేషన్ నుంచి గంగోత్రి-యమునోత్రి రైలు మార్గం ప్రారంభమవుతుంది. చార్‌ధామ్‌ బీజీ రైలు మార్గం సర్వే ప్రకారం; చార్‌ధామ్‌ ఆలయాల కంటే దిగువన ఉన్న బార్కోట్, ఉత్తరకాశి, సోన్‌ప్రయాగ, జోషిమఠ్‌ వద్ద కొత్త బీజీ రైలు మార్గం టెర్మినల్ స్టేషన్లు ముగుస్తాయి. నిటారైన భూభాగం, బీజీ మార్గానికి ఉన్న పరిమితులే ఇందుకు కారణం.

    పర్యాటక అవసరాలు తీర్చడానికి, యాత్రికులు సురక్షితంగా, సమయానికి ఆలయాలకు చేరుకునేలా చేయడానికి; కొత్త బీజీ రైల్వే టెర్మినల్ స్టేషన్లను ఆలయాలతో అనుసంధానించడానికి 'రికనైజన్స్‌ ఇంజినీరింగ్ సర్వే' (ఆర్‌ఈఎస్) జరుగుతోంది. పర్యావరణహిత,  సురక్షిత, పర్యాటక ఆకర్షణీయంగా అనుసంధానత ఉండడం దీని లక్ష్యం.

    దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రలో పాల్గొంటారు. పర్వతారోహణం, ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు కూడా దేశవిదేశాల నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్తారు. ప్రస్తుతమున్న రహదారి మార్గం పర్వతవాలుల నుంచి సాగుతుంది. వాహనాల రద్దీ, రహదారి సామర్థ్యం, భద్రత, వేగం వంటివి ఈ మార్గంలోని ఆందోళనకర సమస్యలు. ఈ ఆలయాలను రైలు మార్గంతో అనుసంధానించడం వల్ల, ఇక్కడికి ప్రయాణం ఎలాంటి వాతావరణంలోనైనా సురక్షితంగా, ఆర్థిక భారం లేకుండా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉంటుంది.
 

****



(Release ID: 1722215) Visitor Counter : 140