ప్రధాన మంత్రి కార్యాలయం

‘జాతీయ డిజిటల్ ఆరోగ్య కార్యక్రమం’ ప్రగతిపై ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష


పౌరులకు వివిధ సేవలు.. వినూత్న ఆవిష్కరణల ద్వారా డిజిటల్
ఆరోగ్య సాంకేతిక విప్లవానికి నాంది పలకనున్న ‘ఎన్‌డీహెచ్ఎం’;
‘ఎన్‌డీహెచ్ఎం’ కింద కార్యకలాపాల విస్తరణకు సత్వర చర్యలు: ప్రధానమంత్రి;
విస్తృత ఆరోగ్య సేవలు పొందేలా ‘ఎన్‌డీహెచ్ఎం’ ద్వారా
పౌరులకు జీవన సౌలభ్య కల్పన: ప్రధానమంత్రి

Posted On: 27 MAY 2021 3:25PM by PIB Hyderabad

జాతీయ డిజిటల్ ఆరోగ్య కార్యక్రమం (ఎన్‌డీహెచ్ఎం) ప్రగతిపై ప్రధానమంత్రి తన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2020 ఆగస్టు 15నాటి తన ప్రసంగంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి ‘‘ఎన్‌డీహెచ్ఎం’’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచీ ఈ కార్యక్రమం కింద డిజిటల్ మాడ్యూళ్లు, రిజిస్టర్లకు రూపకల్పన చేయగా, ప్రస్తుతం దీన్ని ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. ఈ వేదిక ద్వారా ఇప్పటివరకూ 11.9 లక్షల మందికి ‘‘ఆరోగ్య గుర్తింపు’’ (హెల్త్ ఐడీ) సంఖ్య ఇవ్వగా- 1,490 ఆరోగ్య సదుపాయాలతోపాటు 3,106 మంది వైద్యులు  నమోదయ్యారు.

   డిజిటల్ ఆరోగ్య సదుపాయాల కోసం సార్వత్రిక-పరస్పర ఆధారిత సమాచార సాంకేతిక ‘‘ఏకీకృత ఆరోగ్య వేదిక’’ (యూహెచ్ఐ)ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. ‘‘జాతీయ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ’’లో అంతర్భాగంగా  ప్రభుత్వ/ప్రైవేటు పరిష్కారాలు, అనువర్తనా(యాప్)ల అనుసంధానానికి ఈ వేదిక వీలు కల్పిస్తుంది. వినియోగదారులు దీన్ని పరిశోధనల కోసమేగాక దూరవాణి సంప్రదింపులు లేదా లేబొరేటరీ పరీక్షలువంటి  ఆరోగ్య సేవలు పొందడానికి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరోవైపు ఈ పర్యావరణ వ్యవస్థలో భాగస్వామ్యానికి తగిన గుర్తింపుగల ఆరోగ్య సంరక్షణ సేవాప్రదాన సంస్థలకు మాత్రమే అవకాశం ఉంటుంది. దీనివల్ల పౌరులకు వివిధ సేవల ప్రదానంతోపాటు వినూత్న ఆవిష్కరణల ద్వారా డిజిటల్ ఆరోగ్య సాంకేతిక విప్లవానికి మార్గం సుగమం కానుంది. ఈ తరహాలో దేశవ్యాప్తంగాగల ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, మానవ వనరులను మరింత సమర్థంగా వినియోగించుకోవచ్చు.

   ఈ సమావేశంలో భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) రూపొందించిన ‘‘యూపీఐ ఇ-ఓచర్’’ వినియోగం గురించి కూడా ప్రధానమంత్రి చర్చించారు. నిర్దేశిత వినియోగదారు మాత్రమే నిర్దిష్ట ప్రయోజనంతో ముడిపడిన ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు ఈ డిజిటల్ చెల్లింపు విధానం అనుమతిస్తుంది. అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను లక్ష్యం మేరకు, సమర్థంగా అందించేందుకూ ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ‘యూపీఐ ఇ-ఓచర్’ తక్షణ వినియోగానికి ఆరోగ్య సేవలు అనువైనవిగా ఉండవచ్చు.

   ‘ఎఎన్‌డీహెచ్ఎం’ కింద కార్యకలాపాల విస్తరణకు సత్వర చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. విస్తృత ఆరోగ్య సేవలు పొందే దిశగా పౌరులకు జీవన సౌలభ్య కల్పనలో ‘ఎన్‌డీహెచ్ఎం’ తోడ్పడుతుందని ప్రధాని చెప్పారు. ఈ సాంకేతిక వేదిక, రిజిస్ట్రీల రూపకల్పన తప్పనిసరి అంశాలని ఆయన అన్నారు. అయితే, ఈ వేదిక ఉపయోగం ఏమిటో పౌరులకు తెలియాలంటే దీనిద్వారా సేవలు అందుబాటులోకి రావాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు వైద్యులతో దూరవాణి సంప్రదింపులు, లేబొరేటరీ పరీక్షల లభ్యత, డాక్టర్లకు పరీక్ష నివేదికలు లేదా ఆరోగ్య రికార్డుల బదిలీసహా పైన పేర్కొన్న వాటిలో దేనికైనా చెల్లింపులు వంటివి డిజిటల్ మార్గంలో సాగినప్పుడే ఈ వేదిక సద్వినియోగం అయినట్లు భావించాలని పేర్కొన్నారు. ఈ దిశగా చర్యల సమన్వయానికి కృషి చేయాల్సిందిగా ఆరోగ్య, ఎలక్ట్రానిక్స్-ఐటీ మంత్రిత్వ శాఖలతోపాటు ‘ఎన్‌హెచ్ఎ’ని ప్రధాని ఆదేశించారు.

 

***


(Release ID: 1722211) Visitor Counter : 258