రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

యాస్‌ తుపాను ప్రభావాన్ని తగ్గించేందుకు త్రివిధ దళాల చర్యలు

Posted On: 23 MAY 2021 6:10PM by PIB Hyderabad

యాస్‌ తుపాను ఈ నెల 26న తూర్పు తీరాన్ని తాకుతుందన్న అంచనాల నేపథ్యంలో, వైపరీత్య ప్రభావాన్ని తగ్గించేందుకు సాయుధ దళాలు చర్యలు ప్రారంభించాయి. ఆదివారం నాటికి, 950 మంది 'జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం' (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సిబ్బందిని, 70 టన్నుల సామగ్రిని జామ్‌నగర్‌, వారణాసి, పట్నా, అరక్కోణం నుంచి కోల్‌కతా, భువనేశ్వర్‌, పోర్ట్‌ బ్లెయిర్‌కు 15 రవాణా విమానాల ద్వారా వాయుసేన చేరవేసింది. అత్యవసరమైతే రంగంలోకి దిగడానికి 16 రవాణా విమానాలు, 26 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచింది. 'మానవత సాయం, విపత్తు ఉపశమనం' (హెచ్‌ఏడీఆర్‌), పశ్చిమ తీరంలోని సహాయ ఆపరేషన్ల నుంచి 10 హెచ్‌ఏడీఆర్‌ పల్లెట్లను భువనేశ్వర్, కోల్‌కతాకు నౌకాదళం తరలించగా, పోర్ట్ బ్లెయిర్‌లో మరో ఐదింటిని సిద్ధంగా ఉంచారు. తూర్పు, అండమాన్ & నికోబార్‌ నౌకాదళాలకు చెందిన ఎనిమిది నౌకలు హెచ్‌ఏడీఆర్‌ సిబ్బందితో కలిసి పనిచేస్తున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇవి సాయాన్ని అందిస్తాయి. అవసరమైన వెంటనే రంగంలోకి దిగి, ప్రభుత్వ యంత్రాంగాలకు సాయం చేయడానికి కోల్‌కతా, భువనేశ్వర్, చిలికాలో నాలుగు గజ ఈతగాళ్ల బృందాలు, 10 వరద సహాయ బృందాలను సిద్ధంగా ఉంచారు.

    ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఏడు వరద సహాయ బృందాలు, రెండు గజ ఈతగాళ్ల బృందాలను అండమాన్‌ & నికోబార్‌ దీవుల్లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే మోహరించారు. గాలింపు, సహాయ చర్యలు చేపట్టేందుకు విశాఖపట్నం, పోర్ట్‌ బ్లెయిర్‌లో ఒక నౌకాదళ విమానం, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అవసరాల మేరకు రంగంలోకి దిగేందుకు సైన్యానికి చెందిన 8 వరద సహాయ బృందాలు, 3 ఇంజినీర్‌ టాస్క్‌ఫోర్సులను అప్రమత్తం చేశారు. ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలతో త్రివిధ దళాలు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాయి. కొవిడ్‌ చికిత్సకు కావలసిన ఆక్సిజన్‌, ఔషధాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆసుపత్రులకు అందజేయడానికి రహదారి, రైలు మార్గాలను సంరక్షించాల్సిన అవసరం గురించి త్రివిధ దళాలకు తెలుసు. యాస్‌ తుపాను ప్రభావాన్ని సాధ్యమైనంత తగ్గించేందుకు, తోటి భారతీయుల ప్రాణాలను కాపాడేందుకు, వారికి సాయం చేసేందుకు సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయి.

 

***



(Release ID: 1721220) Visitor Counter : 162