సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కశ్మీర్ లోయలో ‘ప్రజా ఉద్యమం’లా టీకా కార్యక్రమం


సామాజిక నాయకులతో చర్చలో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు;

గ్రామీణ-మారుమూల ప్రాంతాలకు ఉచిత దూరవాణి

సంప్రదింపుల సదుపాయం పునరుద్ధరణకు సూచన

Posted On: 22 MAY 2021 4:38PM by PIB Hyderabad

   కశ్మీర్ లోయలో టీకాల కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కశ్మీర్ నాయకులతో ఇవాళ చర్చించిన సందర్భంగా కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. కోవిడ్ మహమ్మారి దాడిని తిప్పికొట్టడంద్వారా భూలోక స్వర్గమైన క‌శ్మీర్‌ రక్షణ కోసం రాజకీయ, సైద్ధాంతిక భేదాభిప్రాయాలకు అతీతంగా ఏకం కావాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆయన చెప్పారు. ఈ మేరకు దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా కశ్మీర్ లోయకు చెందిన రాజకీయ, సామాజిక సంఘాల నాయకులతో డాక్టర్ జితేంద్ర సింగ్ చర్చించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ- మోదీ ప్రభుత్వం ప్రారంభించిన టీకాల కార్యక్రమాన్ని ‘ప్రజా ఉద్యమం’గా మలచడంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, సామాజిక ఉద్యమకారులు, మతపెద్దలు, సీనియర్ నాయకులు కీలకపాత్ర పోషించగలరని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ లోయలో టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయడమంటే దేశానికి ఒక సానుకూల సందేశం పంపినట్లు కాగలదని చెప్పారు.

   కశ్మీర్ లోయలో పౌర సమాజ సభ్యులందరూ స్థానిక పాలన యంత్రాంగంతో మమేకమై పనిచేస్తుండటాన్ని ఆయన అభినందించారు. మహమ్మారిపై ఈ సామూహిక పోరులో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి సూచించారు. కశ్మీర్ లోయసహా దేశమంతటా పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని డాక్టర్ సింగ్ పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో అవసరమైనప్పుడల్లా జిల్లా పాలన యంత్రాంగంతో, వైద్య లోకంతో ప్రధానమంత్రి సంభాషిస్తున్నారని, తద్వారా సకాలంలో ప్రతి అవసరం తీరేలా భరోసా ఇస్తున్నారని ఆయన వివరించారు.

   పవిత్ర రంజాన్ మాసం, వసంత రుతుప్రవేశం, పర్యాటకుల రాక పెరుగుదలసహా అమరనాథ్ యాత్ర మొదలు కాబోయే సమయంలో దురదృష్టవశాత్తూ కోవిడ్ మహమ్మారి కశ్మీర్ లోయను చుట్టుముట్టిందని మంత్రి చెప్పారు. దృఢ సంకల్పం, సామూహిక కృషితో ఈ విపత్తును అధిగమించి ప్రశాంతంగా జీవించే పరిస్థితులు ఏర్పడగలవన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా ప్రజా సన్నిహిత టీకాల శిబిరాల నిర్వహణలో సామాజిక సంఘాల నాయకులను భాగస్వాములను చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఈ శిబిరాల కోసం టీకాలను తగిన సంఖ్యలో సిద్ధం చేసుకోవాలని కూడా ఆయన సూచించారు.

   గ్రామీణ ప్రాంతాలతోపాటు ఏకాంత గృహవాస చికిత్స పొందుతున్న రోగుల కోసం ఉచిత దూరవాణి సంప్రదింపుల సదుపాయాన్ని భారీస్థాయిలో కల్పించే దిశగా అవసరమైన ఆదేశాలను ఇప్పటికే జారీచేసినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మేరకు కోవిడ్ సురక్షిత విధివిధానాలను పాటిస్తూ పంచాయతీ భవనాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, పార్టీల కార్యకర్తలు ఈ దూరవాణి సంప్రదింపుల కేంద్రాలను నిర్వహించవచ్చునని ఆయన చెప్పారు. మహమ్మారిపై పోరాటంలో ఇటువంటి వైద్య వృత్తిపరమైన మార్గదర్శకత్వం సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న సొంత వైద్య పద్ధతులకు తావులేకుండా చేయగలదని మంత్రి పేర్కొన్నారు.

   ఈ సందర్భంగా పలువురు నాయకులు తన దృష్టికి తెచ్చిన అంశాలపై డాక్టర్ జితేంద్ర సింగ్  స్పందిస్తూ- వైద్య సిబ్బంది నియామకం కోసం మే 24వ తేదీనుంచి తక్షణ ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈలోగా మానవ వనరుల కొరతను తీర్చేదిశగా  ‘జీఎంసీ’తోపాటు ఇతర అనుబంధ ఆస్పత్రులలో తుది సంవత్సర ‘ఎంబీబీఎస్, విద్యార్థి (పోస్టు గ్రాడ్యుయేట్) వైద్యులు’సహా నర్సింగ్ సిబ్బందిని నియమించవచ్చునని సూచించారు. అలాగే వెంటిలేటర్ల నిర్వహణకు స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు.

   జమ్ము-కశ్మీర్... రెండు ప్రాంతాలతోపాటు ‘సౌరా’లోని షేర్-ఇ-కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (స్కిమ్స్‌)సహా ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన వైద్యాధికారులు, వివిధ జిల్లాల పాలన యంత్రాంగాలతో తాను నిరంతరం సంప్రదిస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విషమ స్థితిలోగల కోవిడేతర రోగులకు... ప్రధానంగా కేన్సర్ రోగులకు ‘కీమో’ మోతాదులు, మూత్రపిండాల రోగులకు రక్తశుద్ధి సంబంధిత సమస్యలపై నాయకుల ఆందోళనపై మంత్రి స్పందించారు. ఇటువంటి రోగులకు శ్రీన‌గ‌ర్‌లోని ‘జీఎంసీ, స్కిమ్స్’ ఆస్పత్రులలో పడకలు కేటాయించేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

   కశ్మీర్‌కు కోవిడ్ సంబంధిత సామగ్రిని పంపినందుకు చర్చలో పాల్గొన్న నాయకులంతా మంత్రికి కృతజ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే ఇతర జిల్లాల్లో పంపిణీ కోసం తగినంత సామగ్రి అందించాలని వారు కోరారు. కాగా, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ వారంలోనే రెండు రాజధాని నగరాలు జమ్ము, శ్రీన‌గ‌ర్‌లకు కోవిడ్ సంబంధిత సామగ్రిని వేర్వేరుగా పంపారు. ఈ మేరకు ఆ రెండు ప్రాంతాలకూ మాస్కులు, శానిటైజర్లు, ఇతర అనుబంధ సరంజామాతో కూడిన కిట్లు  విడివిడిగా రవాణా అయ్యాయి.

   కోవిడ్ నియంత్రణ సన్నద్ధత, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు నిర్వహించిన డాక్టర్ జితేంద్ర సింగ్ నిర్వహించిన ఈ సమావేశంలో డాక్టర్ రఫీ, మొహమ్మద్ అన్వర్ ఖాన్, దరక్షాన్ ఆండ్రబీ, అల్తాఫ్ ఠాకూర్, మంజూర్ భట్, గులాం అహ్మద్ మీర్, బిలాల్ ప్యారే, ఆరిఫ్ రజా, అలీ మహ్మద్ మీర్, అశోక్ భట్ తదితరులు పాల్గొన్నారు.

 

***


(Release ID: 1720963) Visitor Counter : 141