ఉక్కు మంత్రిత్వ శాఖ

పశ్చిమ బంగాల్‌లోని బుర్న్‌పూర్‌లో వాయురూప ఆక్సిజన్‌ సదుపాయమున్న భారీ కొవిడ్‌ సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌


కొవిడ్‌పై పోరాటం కోసం పరీక్షలు, శోధన, టీకా కార్యక్రమాన్ని మరింత పెంచాలని పిలుపు

Posted On: 19 MAY 2021 6:51PM by PIB Hyderabad

పశ్చిమ బంగాల్‌లోని బుర్న్‌పూర్‌ ఐఎస్‌పీ (సమీకృత ఉక్కు ప్లాంటు)లో సెయిల్‌ ఏర్పాటు చేసిన 200 పడకల కొవిడ్‌ సంరక్షణ కేంద్రాన్ని కేంద్ర ఉక్కు, పెట్రోలియం &సహజవాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ జాతికి అంకితం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే, కేంద్ర పర్యావరణం, అడవులు & వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ బాబుల్‌ సుప్రియో, దక్షిణ అసాన్సోల్‌ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్‌, సెయిల్‌ ఛైర్‌పర్సన్‌ సోమ మొందల్‌ సహా ఇతర ప్రముఖులు వర్చువల్‌ పద్ధతిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

    దేశంలో ద్రవరూప వైద్య ఆక్సిజన్‌ (ఎల్‌ఎంవో) అవసరాల్లో అధిక భాగాన్ని తీర్చిన ఉక్కు రంగాన్ని శ్రీ ప్రధాన్ అభినందించారు. ఉక్కు సంస్థలు ఉక్కు సంకల్పాన్ని కనబరిచాయన్నారు. ఎల్‌ఎంవో ఉత్పత్తిని పెంచడానికి, వాయురూప ఆక్సిజన్‌ వినియోగాన్ని అవి తగ్గించుకున్నాయని చెప్పారు. కొవిడ్‌ మొదటి దశలో రోజుకు 3 వేల మె.ట. కంటే తక్కువగా ఉన్న ఆక్సిజన్‌ డిమాండ్‌ ప్రస్తుతం రోజుకు 10 వేల మె.ట.కు చేరిందని, ఇందులో 4 వేలకుపైగా మె.ట.లను ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉక్కు సంస్థలు అందిస్తున్నాయని వివరించారు.

    వాయురూప ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలకు దగ్గరగా కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపును కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ పిలుపునకు స్పందించి, వాయురూప ఆక్సిజన్‌తో కూడిన తొలి కొవిడ్‌ సంరక్షణ కేంద్రాన్ని బుర్న్‌పూర్‌ ఐఎస్‌పీలో సెయిల్‌ ప్రారంభించడాన్ని ప్రశంసించారు. వాయురూప ఆక్సిజన్‌ను దూర ప్రాంతాలకు చేరవేయడం కష్టమన్న శ్రీ ప్రధాన్‌, కొవిడ్‌ ఉపశమన ఆదేశాలను ఉక్కు, పెట్రోలియం రంగాలు త్వరగా అమలు చేశాయని చెప్పారు.

    బుర్న్‌పూర్‌లో, సమీప ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలతోపాటు కాంట్రాక్టు కార్మికులు, స్థానిక వీధి వ్యాపారులు, వర్తకుల పట్ల శ్రద్ధ చూపాలని కొవిడ్‌ సంరక్షణ కేంద్రానికి శ్రీ ప్రధాన్‌ సూచించారు. టౌన్‌షిప్‌లోకి వచ్చేవారు ఇక్కడి వైద్య సౌకర్యాలు పొందేందుకు అర్హులు కావడం భద్రత ప్రొటోకాల్‌లో భాగంగా ఉండాలని చెప్పారు. ఈ కేంద్రంలో పరీక్షలు, శోధన సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. సౌకర్యాల ఏర్పాటుతోపాటు, సంరక్షణ కేంద్రం నిర్వహణ, పరిశుభ్రతను ఐఎస్‌పీ నిర్వహించాలని సూచించారు. సంస్థ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, వారి కుటుంబీకులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇతరులందరికీ టీకాలు వేసేందుకు భారీ కార్యక్రమాలు చేపట్టాలని సెయిల్‌కు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.

    సంక్షోభ సమయంలో విలువైన పాత్రను పోషించిన సెయిల్‌కు శ్రీ కులస్తే కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు 69 వేల మె.ట. ఎల్‌ఎంఓను సెయిల్ అందించినట్లు వివరించారు. వైద్య సదుపాయాలను కూడా సెయిల్‌ విస్తరిస్తోందని, సామాన్యులకు సాయం చేస్తోందని చెప్పారు. కంటికి కనిపించని శత్రువుతో పోరాడాలనే మన సంకల్పానికి ఇవన్నీ సూచికలుగా ఆయన అభివర్ణించారు.

    సెయిల్‌కు చెందిన మొత్తం ఐదు సమీకృత ఉక్కు ప్లాంట్లు ఆక్సిజన్‌తో కూడిన కొవిడ్ సంరక్షణ ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాయి. వాయురూప ఆక్సిజన్‌తో కూడిన 500 పడకల భారీ కొవిడ్ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో బర్న్‌పూర్ ఐఎస్‌పీ మొదటిది. మొదటి దశలో, బర్న్‌పూర్‌ ఐఎస్‌పీలోని తన 32 గదుల 'ఛోటాదిఘరి విద్యాపీఠ్‌ హెచ్‌ఎస్ స్కూల్‌'ను 200 పడకల కొవిడ్‌ చికిత్స కేంద్రంగా మార్చి అందుబాటులోకి తెచ్చింది. ఆసుపత్రి అవసరాలకు సరిపోయేలా పాఠశాల భవనానికి మూడు వారాల్లోగా మార్పులు చేస్తారు. మొదటి అంతస్తు వరకు రోగులు సాఫీగా వెళ్లేందుకు ఉక్కు ర్యాంపును ఏర్పాటు చేశారు. 8 పడకల ఐసీయూను కూడా ఏర్పాటు చేశారు. కంప్రెస్డ్ ఎయిర్, సక్షన్‌ లైన్‌ వంటి ఐసీయూ ఏర్పాట్లను కూడా అమరుస్తున్నారు. ప్లాంటు నుంచి వాయురూప ఆక్సిజన్‌ను ఇక్కడకు తీసుకొచ్చేందుకు 1.5 కి.మీ. పైప్‌లైను వేశారు. ఈ కేంద్ర నిర్వహణను జిల్లా యంత్రాంగానికి అప్పగిస్తారు. నీరు, విద్యుత్, ఆక్సిజన్‌ను ఉక్కు ప్లాంటు ఉచితంగా అందిస్తుంది.

    ఉక్కు సంస్థలు ఇచ్చే ఎల్‌ఎంవో ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీన 538 మె.ట. నుంచి ప్రారంభమైంది. మంగళవారం, సెయిల్ 1345 మె.ట. ఎల్‌ఎంఓ అందించగా, మొత్తం ఉక్కు రంగం 3914 మె.ట. పంపిణీ చేసింది.

***



(Release ID: 1720116) Visitor Counter : 146