రక్షణ మంత్రిత్వ శాఖ
కొవిడ్ రెండో దశపై పోరాటంలో రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ దళాలు, డీఆర్‌డీవో, ఇతర రక్షణ సంస్థల ప్రయత్నాలపై సమీక్షించిన రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
రాష్ట్రాలకు వైద్య ఆక్సిజన్ సరఫరా, ఆరోగ్య మౌలిక వసతులను పెంచేందుకు రవాణా మద్దతుపై సమీక్ష
Posted On:
17 MAY 2021 5:36PM by PIB Hyderabad
కొవిడ్ రెండో దశపై పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సాయంగా రక్షణ మంత్రిత్వ శాఖ, త్రివిధ దళాలు, డీఆర్‌డీవో, ఇతర రక్షణ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలపై రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష జరిగింది. 'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్' జనరల్ బిపిన్ రావత్, రక్షణ శాఖ కార్యదర్శి డా.అజయ్ కుమార్, నౌకాదళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్. భదౌరియా, సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవణె, రక్షణ ఆర్&డీ విభాగం కార్యదర్శి, డీఆర్‌డీవో ఛైర్మన్ డా.జి.సతీష్‌రెడ్డి, అదనపు కార్యదర్శి (రక్షణ ఉత్పత్తులు) సంజయ్ జాజు, సాయుధ బలగాల వైద్య సేవల (ఏఎఫ్‌ఎంఎస్) ఏడీజీ, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
వివిధ రాష్ట్రాల్లో డీఆర్‌డీవో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కొవిడ్ ఆసుపత్రులు, సైనిక ఆసుపత్రుల్లో అదనపు పడకల ఏర్పాటు, పీఎం కేర్స్ నిధులతో 'ప్రెజర్ స్వింగ్ అడ్సర్ప్‌షన్' (పీఎస్‌ఏ) ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, ప్రస్తుత అవసరాలకు తగినట్లు వైద్యులు, ఆరోగ్య నిపుణుల సంఖ్య పెంపుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. దిల్లీ, లఖ్‌నవూ, వారణాసి, అహ్మదాబాద్, పట్నాలో ఏర్పాటు చేసిన ఆసుపత్రులు కొవిడ్ రోగులకు సేవలు అందిస్తున్నాయని డీఆర్‌డీవో ఛైర్మన్ డా.సతీష్ రెడ్డి వివరించారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేష్, హల్ద్వానీతోపాటు, జమ్ము, శ్రీనగర్‌లో ఆయా ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
దిల్లీలో నాలుగు, హరియాణాలో ఒక పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంటును డీఆర్‌డీవో ఏర్పాటు చేసిందని, ఈ నెలాఖరుకల్లా 150-175 ప్లాంట్ల ఏర్పాటుకు పనులు జరుగుతున్నట్లు డా.సతీష్ రెడ్డి తెలిపారు.
రవాణా మద్దతు, ఆరోగ్య అదనపు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలకు సాయం అందించడంలో త్రివిధ దళాలు కనబరుస్తున్న అద్భుత సమన్వయాన్ని 'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్' జనరల్ బిపిన్ రావత్ ప్రశంసించారు. స్థానిక ప్రభుత్వాలకు సాయంగా సుదూర, మారుమూల ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను సైన్యం ఏర్పాటు చేసిందని చెప్పారు.
కొవిడ్‌పై పోరాటంలో ఏ ఒక్క అంశాన్నీ సైన్యం వదిలిపెట్టడం లేదని సైన్యాధిపతి ఎం.ఎం.నరవణె స్పష్టం చేశారు. గుర్తించిన ప్రదేశాల్లోని సైనిక ఆస్పత్రులు సాధారణ పౌరుల కొవిడ్ చికిత్స కోసం పడకలు కేటాయించాయని రక్షణ మంత్రికి వివరించారు. దిల్లీలోని బేస్ ఆసుపత్రిలోనూ సౌకర్యాలు పెరుగుతున్నాయన్నారు. ఈ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్ సరఫరాను పెంచడానికి అదనపు ఆక్సిజన్ ప్లాంట్లు, సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్లను సేకరిస్తున్నట్లు చెప్పారు.
వైద్య ఆక్సిజన్ కంటైనర్లు, ఇతర వైద్య పరికరాలను విదేశాల నుండి తీసుకురావడంలో నౌకాదళం అందిస్తున్న మద్దతు గురించి నౌకాదళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్ రక్షణ మంత్రికి వివరించారు. పౌరులకు కొవిడ్ చికిత్స అందించేందుకు వివిధ ప్రదేశాల్లో నౌకాదళం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య సౌకర్యాలను గురించి కూడా ప్రస్తావించారు.
వివిధ మిషన్లలో భాగంగా ఆక్సిజన్ కంటైనర్లు, ఇతర వైద్య సామగ్రిని తీసుకొచ్చేందుకు వైమానిక దళం 990 ప్రయాణాలను పూర్తి చేసిందని వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్. భదౌరియా రక్షణ మంత్రికి చెప్పారు.
త్రివిధ దళాలు అందించిన సాయాన్ని ప్రశంసించిన రక్షణ శాఖ కార్యదర్శి డా.అజయ్ కుమార్, ఆరోగ్య నిపుణుల కొరతను భర్తీ చేసేందుకు దాదాపు 800 మంది వైద్యులను నియమించినట్లు వెల్లడించారు.
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో కలిసి లఖ్‌నవూ, బెంగళూరులో 250 పడకల ఆసుపత్రులను రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) ఏర్పాటు చేశాయి. 'పారిశ్రామిక సామాజిక బాధ్యత' నిధులతో ఆక్సిజన్ ప్లాంట్లను కూడా పీఎస్‌యూలు ఏర్పాటు చేస్తున్నాయి.
కొవిడ్ రోగుల చికిత్స కోసం 2-డీజీ ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి డీఆర్‌డీవో అందించిన సహకారాన్ని రక్షణ మంత్రి అభినందించారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్నాయని, అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కొవిడ్ సవాళ్లు ఉన్నప్పటికీ, సాధారణ విధులను కొనసాగించాలని త్రివిధ దళాలు, రక్షణ మంత్రిత్వ శాఖ సంస్థలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారు.
కొవిడ్ రెండో దశపై పోరాటంలో రక్షణ మంత్రిత్వ శాఖ, ఇతర రక్షణ సంస్థలు అందించిన సాయంపై రక్షణ మంత్రి నిర్వహించిన నాలుగో సమీక్ష ఇది. మొదటి మూడు సమీక్షలు ఏప్రిల్ 20, ఏప్రిల్ 24, మే 1వ తేదీన జరిగాయి.
***
(Release ID: 1719475)
Visitor Counter : 182