రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఏఎఫ్‌ఎంఎస్‌లో వైద్యాధికారులుగా 110 మంది మెడికల్ క్యాడెట్ల నియామకం

Posted On: 15 MAY 2021 2:25PM by PIB Hyderabad

సాయుధ బలగాల వైద్య కళాశాల (ఏఎఫ్‌ఎంసీ) 55వ బ్యాచ్‌ (సీ3)కు చెందిన 110 మంది మెడికల్‌ క్యాడెట్లను వైద్యాధికారులుగా సాయుధ బలగాల వైద్య సేవల్లోకి (ఏఎఫ్‌ఎంఎస్‌) తీసుకున్నారు. వీరిలో 21 మంది మహిళలు కూడా ఉన్నారు. ఏఎఫ్‌ఎంసీలో చిన్నపాటి వేడుక నిర్వహించి, కళాశాల లెఫ్టినెంట్‌ జనరల్‌ నర్‌దీప్‌ నైథానీ వీరందరినీ వైద్యాధికారులుగా నియమించారు. వీరిలో 94 మందిని సైన్యంలోకి, 10 మందిని వాయుసేనలోకి, ఆరుగురిని నౌకాదళంలోకి తీసుకున్నారు. ఏఎఫ్‌ఎంసీ శిక్షణ కల్నల్‌ ఏకే షాక్య కొత్త వైద్యాధికారులతో రాజ్యాంగ విధేయత ప్రమాణం చేయించారు. 1982 తర్వాత తొలిసారిగా, కొవిడ్‌ కారణంగా ఈ ఏడాది పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ను రద్దు చేశారు.

    దేశంలోని అత్యుత్తమ సమీకృత వైద్య సంస్థ అయిన ఏఎఫ్‌ఎంఎస్‌లో విధుల్లోకి చేరిన అధికారులను లెఫ్టినెంట్‌ జనరల్‌ నైథానీ అభినందించారు. వారి విజయం పట్ల వారి తల్లిదండ్రులనూ ప్రశంసించారు. 2016లో ఏఎఫ్‌ఎంసీలో ప్రవేశం పొందిన సీ3 బ్యాచ్‌ విలక్షణమైన బ్యాచ్‌ అని, 100 శాతం విజయం సాధించిందని, ఇది ఏఎఫ్‌ఎంసీ అధ్యాపకులకు దక్కిన గౌరవమని అభివర్ణించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో వీరంతా వైద్యరంగంలోకి ప్రవేశించారన్నారు. కొవిడ్‌ పోరాటయోధులుగా కొత్త సభ్యులంతా విధుల్లో చేరుతున్న సందర్భంగా; కళాశాలలో నేర్చుకున్న జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని రోగులకు సేవలందించడంలో ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. నిష్టగా నేర్చుకున్న విద్య, శిక్షణ ద్వారా; కొత్తగా నియమితులైన వైద్యాధికారులు సైనిక వైద్యుల తరహాలో అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా పని చేస్తారని లెఫ్టినెంట్‌ జనరల్‌ నైథానీ విశ్వాసం వ్యక్తం చేశారు.

    విద్యార్థులను వైద్యాధికారులుగా నియమించేందుకు గతంలో నాలుగైదు వారాలుగా ఉన్న సన్నాహక వ్యవధిని ఈ బ్యాచ్‌కు మాత్రం రెండు వారాలుగా మార్చారు. కొవిడ్ సంబంధింత అంశాల్లో పనిచేసేలా వీరిని ప్రత్యేకంగా సిద్ధం చేసేందుకు, ఈ రెండు వారాలను పూర్తిగా ఉపయోగించారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్‌ఏ) ధృవీకరణ కోర్సు అయిన బేసిక్ లైఫ్ సపోర్ట్ (బీఎల్‌ఎస్‌)తోపాటు అడ్వాన్స్‌డ్‌ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ (ఏసీఎల్‌ఎస్‌ను)ను యువ వైద్యులు పూర్తి చేశారు. సాయుధ దళాల సిబ్బందితోపాటు సాధారణ పౌరులకు కూడా కొవిడ్‌ చికిత్సలు అందిస్తున్న, దేశవ్యాప్తంగా ఉన్న 31 ఏఎఫ్‌ఎంఎస్‌ ఆసుపత్రుల్లో వీరంతా తక్షణం విధుల్లో చేరతారు.

    విద్యతోపాటు అన్ని విభాగాల్లో ప్రతిభ చూపిన వైద్య విద్యార్థులకు లెఫ్టినెంట్‌ జనరల్‌ నర్‌దీప్‌ నైథానీ జ్ఞాపికలు, పతకాలు, బహుమతులు అందించారు. ఆయన ఇదే కళాశాల 17వ బ్యాచ్‌ (క్యూ) విద్యార్థి. అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి ఇచ్చే రాష్ట్రపతి పతకం, కళింగ ట్రోఫీతోపాటు, ఎంబీబీఎస్‌ కోర్సులో ఉత్తమ విద్యార్థిగా నిలిచినవారికి ఇచ్చే డీజీఏఎఫ్‌ఎంఎస్ బంగారు పతకాన్ని వినీత రెడ్డి దక్కించుకున్నారు. రెండో అత్యుత్తమ ప్రదర్శనకు ఇచ్చే మేజర్‌ జనరల్ ఎన్‌డీపీ కిరానీ ట్రోఫీని కళాశాల క్యాడెట్‌ కెప్టెన్‌ అయిన శుయాష్ సింగ్ అందుకున్నారు. ఎంబీబీఎస్‌ ఆఖరి పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన నిఖిత దత్తాకు లెఫ్టినెంట్ జనరల్ థాపర్ బంగారు పతకం లభించింది.

***


(Release ID: 1718861) Visitor Counter : 170