సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

జమ్ము జి.ఎం.సి.లో కోవిడ్ చికిత్సపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సమీక్ష


ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ల లెక్కల తనిఖీకి ఆదేశం

Posted On: 12 MAY 2021 5:55PM by PIB Hyderabad

  కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము కాశ్మీర్ లో అవసరమైన రోగులందరికీ సమాన ప్రాతిపదికన ఆక్సిజన్ సిలిండర్లు, కృత్రిమ శ్వాస పరికరాల (వెంటిలేటర్ల) పంపిణీ జరిగేలా చూసేందుకు ఆక్సిజన్ సిలిండర్ల, వెంటిలేటర్ల లెక్కలను తనిఖీ చేయాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు పిలుపునిచ్చారు. ఆక్సిజన్ లేదన్న కారణంతో ఒక మరణం సంభవించినా సరే.., అది తీవ్రమైన సామాజికత అశాంతికి దారితీస్తుందని, జరిగిన మంచి పని అంతా అర్థరహితమై, వ్యర్థమై పోతుందని ఆయన అన్నారు. ఆక్సిజన్ అందుబాటులో లేని కారణంతో ఒక మరణం కూడా జరక్కుండా జమ్ము లోని అగ్రశ్రేణి వైద్యసంస్థ అయిన ప్రభుత్వ వైద్య కళాశాల (జి.ఎం.సి.) తగిన చర్యలు తీసుకుంటుందనే బలమైన సందేశం జనంలోకి వెళ్లాలని, వారిలో అది ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జి.ఎం.సి.లో కోవిడ్ చికిత్సా సదుపాయాలకు సంబంధించి కొన్ని ఆందోళనకర వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆ సంస్థ పరిపాలనా యంత్రాంగం, వైద్య సిబ్బందితో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్రమంత్రి ఈ పిలుపునిచ్చారు. స్వతంత్ర హోదాకలిగిన సహాయమంత్రిగా ఉంటున్న డాక్టర్ జితేంద్ర సింగ్,.. ప్రధానమంత్రి కార్యాలయంలో ఈశాన్య ప్రాంత వ్యవహారాల శాఖ, సిబ్బంది ప్రజా ఫిర్యాదుల శాఖ, అణుశక్తి శాఖ, అంతరిక్ష పరిశోధన శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు, ఆర్థిక వ్యవహారాల కమిషనర్ అటల్ ధుల్లో, డివిజనల్ కమిషనర్ రాఘవ్ లాంగర్, జమ్ము డిప్యూటీ కమిషనర్ అన్షుల్ గర్గ్, జి.ఎం.సి. ప్రిన్సిపాల్ డాక్టర్ శాస్త్రి సుదాన్ శర్మ తదితరులు హాజరయ్యారు.

 

  కోవిడ్ చికిత్సా నిర్వహణ ప్రక్రియలో సామాజిక నిర్వహణ చాలా ముఖ్యమైన భాగమని, అవసరమైన సమాచారాన్ని సమాజానికి తెలియపర్చి, వారి సహకారం తీసుకోవడానికి జి.ఎం.సి. సంస్థే గాక, పరిపాలనా యంత్రాంగం కూడా ఏ మాత్రం సందేహించవలసిన అవసరం లేదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 జమ్ములోని జి.ఎం.సి.తో పాటుగా, జమ్ము కాశ్మీర్ లోని వివిధ జిల్లాల ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పరిపాలనా యంత్రాగం తీసుకున్న పలు చర్యలను గురించి కేంద్రమంత్రి వివరించారు. ఒక్కొక్కటి నిమిషానికి 1,200 లీటర్ల చొప్పున సామర్థ్యంతో కూడిన రెండు ఆక్సిజన్ ప్లాంట్లను జి.ఎం.సి.లో ఏర్పాటు చేసినట్టు అధికారల మంత్రికి తెలిపారు. జమ్ములోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రిలో నిమిషానికి వెయ్యి లీటర్ల సామర్థ్యంతో కూడిన ఆక్సిజన్ ప్లాంటును కూడా ఏర్పాటు చేశారు. గాంధీనగర్ ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిమిషానికి వెయ్యి లీటర్ల సామర్థ్యంతో కూడిన మరో ప్లాంటును కూడా ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా జి.ఎం.సి.లో ఆక్సిజన్ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు మరో రెండు ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారని తెలిపారు. కాగా, ప్రస్తుతం జి.ఎం.సి.లో 400 సిలిండర్ల ఆక్సిజన్ బఫర్ నిల్వగా ఉన్నట్టు అధికారులు కేంద్రమంత్రికి తెలిపారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు తీసుకున్న చర్యలను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. అయితే, మొత్తం కేంద్ర పాలిత ప్రాంతంలో ఆక్సిజన్ సామర్థ్యంపై, వెంటిలేటర్ల సదుపాయాలపై లెక్కలను తనిఖీ చేయించాలని, కీలక సమయంలో చికిత్స లోపించిందన్న కారణంతో రోగులు ప్రాణాలు కోల్పోకుండా కాపాడుకోవడం అప్పుడే సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. ప్రజల అమూల్యమైన ప్రాణాలను కాపాడేందుకు కోవిడ్ వైరస్ మహమ్మారిపై పోరాటం జరుపుతున్న ఆసుపత్రి సిబ్బందికి, పరిపాలనా సిబ్బందికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఆయన చెప్పారు.

  జి.ఎం.సి.లో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను పర్యవేక్షించేందుకు ఒక మెకానికల్ ఇంజినీర్ ను, ఒక బయోమెడికల్ ఇంజినీర్ ను నియమించాలని డివిజనల్ కమిషనర్.ను కేంద్రమంత్రి ఆదేశించారు. అలాంటపుడే, ఆక్సిజన్ సరఫరా కోసం రోగుల సంబంధీకులు, నర్సులు కష్టాలు పడవలసిన పని ఉండదని అన్నారు. ఆసుపత్రిలో వైద్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు బులిటెన్ ను జారీ చేస్తూ ఉండాలని, ఆసుపత్రిలో జరిగే పరిణామాలను ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని ఆదేశించారు.  కోవిడ్ రోగుల కీలకమైన చికిత్సలో వెంటిలేటర్ల పాత్ర, క్షేత్రస్థాయి పరిస్థితులపై కూడా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సమీక్ష జరిపారు. జమ్ములోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి దాదాపు 60 వెంటిలేటర్లు సరఫరా చేస్తున్నట్టు అధికారులు మంత్రికి తెలియజేశారు.

  ఆసుపత్రిలో సిబ్బంది కొరత  సమస్యను అధిగమించేందుకు పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులను, చివరి సంవత్సరం వైద్య విద్యార్థులను, పార్మాస్యూటికల్, నర్సింగ్ విద్యార్థులను కోవిడ్ చికిత్సా నిర్వహణ విధుల్లో వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. జి.ఎం.సి. డాక్టర్లు,.. చోప్రా నర్సింగ్ హోమ్.లోని తమ ప్రైవేటు గదులను, చేంబర్లను ఆసుపత్రికి అప్పగించాలని, వాటిని కోవిడ్ చేంబర్లుగా మార్చుకునేందుకు సహకరించాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు. రోగుల బంధువులకోసం సరైన నిబంధనావళిని, పి.పి.ఇ. కిట్లను ఏర్పాటు చేయాలని అన్నారు. రోగుల బంధువుల సమస్యను పోలీసు బలంతో ఎదుర్కొనే బదులు, సున్నితంగా వ్యవహరించాలని ఈ విషయంలో సామాజిక వాలంటీర్లు, ఎన్జీవోలు వంటి స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన బాధ్యతలను డిప్యూటీ కమిషనర్ గర్గ్ కు మంత్రి అప్పగించారు.

  జమ్ములో వ్యాక్సినేషన్ ప్రక్రియపై కూడా మంత్రి సమీక్ష జరిపారు. ఒక్క జమ్ము ప్రాంతంలోనే 45 సంవత్సరాలకు పైబడిన జనాభాలో 96శాతం మందికి వ్యాక్సీన్లు వేసినట్టు, మొత్తం కేంద్ర పాలిత ప్రాంతంలో అయితే దాదాపు 60శాతం మందికి టీకాలు వేసినట్టు అధికారులు మంత్రికి తెలిపారు. 18-45 సంవత్సరాల మధ్య వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని, వారికి ప్రతి రోజూ 200నుంచి 250 చొప్పున డోసులు ఇస్తున్నామని తెలిపారు. ఈ గ్రూపులోని 16,438మందికి ఇప్పటి వరకూ తొలి డోసు టీకాలు వేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా ప్రజలకు మెరుగైన సమాచారం అందించాలని, ఏదైనా సమయంలో ఎక్కడైనా ఏ టీకా కేంద్రమైనా పనిచేయని పక్షంలో ఆ విషయాన్ని నిక్కచ్చిగా ప్రజలకు తెలియజేయాలని అన్నారు.

  తీవ్రమైన అస్వస్థతతో చికిత్స అవసరమైన వారిని మాత్రమే జి.ఎం.సి. ఆసుపత్రికి తరలించేలా ఒక క్రమపద్ధతిని రూపొందించుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. కాగా, కోవిడ్ రోగులకు హోమ్ కిట్లను అందజేస్తన్నామని, తీవ్రమైన వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న రోగులు మాత్రమే ఆసుపత్రిలో చేరేలా చూసేందుకు కాల్ సెంటర్లను నిర్వహిస్తూ కోవిడ్ రోగులకు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉన్నామని అధికారులు తెలిపారు.

  కోవిడ్ పై పోరాటంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఈ విషయంలో ప్రజలతో సంప్రదింపులు జరిపేందుకు పౌర సామాజిక గ్రూపులు, స్వచ్ఛంద సేవా సంస్థలకు ప్రమేయం కల్పించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. కోవిడ్ పైపోరాటంలో కేంద్రపాలిత ప్రాంతానికి తగిన మద్దతు ఇచ్చేందుకు, అవసరమైన చోట్ల అంతరాలను పూడ్చేందుకు, తద్వారా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, జమ్ము కాశ్మీర్ లో మౌలిక వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు  కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టబడి ఉందని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

 

<><><>



(Release ID: 1718169) Visitor Counter : 130