సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

సొంత లోక్‌సభ నియోజకవర్గం 'ఉధంపూర్‌-కథువా-దోడా'కు కొవిడ్‌ సంబంధిత పరికరాలు పంపిన కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్‌


కొవిడ్‌ను ఓడించడానికి ప్రధాని మోదీ నాయకత్వంలో కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపు

Posted On: 09 MAY 2021 6:09PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డా.జితేంద్ర సింగ్‌, తన సొంత లోక్‌సభ నియోజకవర్గం 'ఉధంపూర్‌-కథువా-దోడా'కు తొలి విడత కొవిడ్‌ సంబంధిత పరికరాలను పంపారు.

    ముఖ కవచాలు, శానిటైజర్లు, యాంటిసెప్టిక్స్‌, టాయిలెట్‌ వస్తువులు, రోగ నిరోధక శక్తి ప్రేరకాలు, కొవిడ్‌ సంబంధిత పరికరాలతో నిండిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మూడు వారాలపాటు కరోనా లక్షణాలతో బాధపడిన తర్వాత, ఇవాళ (ఆదివారం) చేసిన పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిందని డా.జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. తనకు నయమైన తర్వాత చేసిన మొట్టమొదటి పని తన నియోజకవర్గ ప్రజలకు కొవిడ్‌ పరికరాలను పంపడమేనని తెలిపారు. ఇందుకోసం నెల క్రితమే అన్నీ సిద్ధం చేసుకున్నా, తాను కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడం, నెగెటివ్‌ వచ్చేవరకు ఎవరినీ ప్రత్యక్షంగా కలవొద్దన్న సూచనలతో ఈ పంపిణీ వాయిదా పడిందని కేంద్ర మంత్రి చెప్పారు.

    తాను క్వారంటైన్‌లో ఉన్నప్పటికీ, తన నియోజకవర్గంలోని ఉధంపూర్‌, కథువా, దోడా, రియసి, రాంబన్‌, కిష్ట్వార్‌ జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో శనివారం సమగ్ర సమీక్ష జరిపానని డా.జితేంద్ర సింగ్‌ చెప్పారు. ఆ ప్రాంతాల్లోని పార్టీ కార్యకర్తలు, అధికార యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరిపానని, అవసరమైన సమయంలో అందుబాటులోకి వచ్చానని వివరించారు. సంఘ సేవ చేస్తున్న యువత, స్వచ్ఛంద సంస్థలను కేంద్ర మంత్రి అభినందించారు.

    తన నియోజకవర్గానికి వెళ్తున్న ఈ సాయం, ఇకపైనా కొనసాగుతుందని డా.జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. అవసరమైన సామగ్రిని  వివిధ మార్గాల ద్వారా సేకరించి, పంచాయతీ స్థాయి వరకు అందేలా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు పంపుతామన్నారు. అవసరమైన ప్రాంతాలకు లోటు లేకుండా, న్యాయబద్ధంగా పరికరాల పంపిణీ జరిగేలా అటు అధికారులు, ఇటు కార్యకర్తలతో జమ్ము, కథువా వంటి ప్రాంతాల్లో ఉన్న తన పార్లమెంటు కార్యాలయాలు సమన్వయం చేసుకుంటాని వివరించారు. 

    ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కతాటిపైకి వచ్చి, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కలిసికట్టుగా కరోనాపై పోరాడదామని పార్టీలు, ప్రముఖులకు డా.జితేంద్ర సింగ్‌ పిలుపునిచ్చారు. శతాబ్దానికి ఒక్కసారి వచ్చే విపత్తుగా కరోనాను అభివర్ణించిన కేంద్ర మంత్రి, అన్ని సమస్యలు, అజెండాలను అందరూ పక్కనబెడితే, మానవత్వం భవిష్యత్‌ దిశగా మనుగడ సాగిస్తుందని అభిలషించారు.

***



(Release ID: 1717314) Visitor Counter : 143