ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19పై డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షతన మంత్రుల బృందం (జీఓఎం) 25వ సమావేశం
కోవిడ్ టీకా రెండో మోతాదు తప్పక తీసుకోవాలని పౌరులకు వినతి;
మౌలిక వైద్య వసతులు.. వైద్య ఆక్సిజన్ సరఫరాల పెంపుపై సమగ్ర నివేదిక
Posted On:
08 MAY 2021 3:11PM by PIB Hyderabad
కోవిడ్-19పై దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా ఇవాళ ఇక్కడ నిర్వహించిన ఉన్నతస్థాయి మంత్రుల బృందం (జీఓఎం) 25వ సమావేశానికి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్.పూరి, ఓడరేవులు-నౌకాయాన-జలమార్గాల శాఖ (ఇన్‌చార్జి)సహా రసాయనాలు-ఎరువుల శాఖ సహాయమంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ, దేశీయాంగ శాఖ సహాయమంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే డిజిటల్ మాధ్యమంద్వారా, నీతి ఆయోగ్ (ఆరోగ్య విభాగం) సభ్యుడు డాక్టర్ వినోద్ కె.పాల్ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారానూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
డాక్టర్ హర్షవర్ధన్ ముందుగా మాట్లాడుతూ- రోజువారీగా కోలుకుంటున్న కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతుండటాన్ని జీఓఎంలోని ఇతర సభ్యులకు వివరించారు. ఈ మేరకు గడచిన 24 గంటల్లో 3 లక్షల మందికిపైగా కోవిడ్ నుంచి కోలుకున్నారని ఆయన వెల్లడించారు. జిల్లాస్థాయి గణాంకాలను వివరిస్తూ- ‘‘మొత్తం 180 జిల్లాల్లో గత 7 రోజులుగా, 18 జిల్లాల్లో 14 రోజులుగా, 54 జిల్లాల్లో 21 రోజులుగా, 32 జిల్లాల్లో 28 రోజులుగా ఒక్క తాజా కేసు కూడా నమోదు కాలేదు’’ అని తెలిపారు. అదేవిధంగా ‘‘మొత్తం క్లిష్టమైన కేసులకుగాను 4,88,861 మంది రోగులకు ఐసీయూ పడకలు; 1,70,841 మందికి వెంటిలేటర్ తోడ్పాటు, మరో 9,02,291 మందికి ఆక్సిజన్ మద్దతు సమకూర్చాం’’ అని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా నేటివరకూగల చురుకైన కేసులకుగాను 1.34 శాతం ఐసీయూలలో ఉండగా, వారిలో 0.39 శాతం వెంటిలేటర్లపైనా, మరో 3.70 శాతం ఆక్సిజన్ ఆధారిత చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
‘‘దేశవ్యాప్తంగా ఇవాళ్టివరకూ ఇచ్చిన మొత్తం టీకాల సంఖ్య 16.73 కోట్లు దాటింది. ఇందులో నిన్న ఒక్కరోజునే 23 లక్షల మందికి టీకాలు వేయబడ్డాయి. అలాగే రాష్ట్రాలకు 17,49,57,770 డోసుల టీకాలు సరఫరా చేస్తే- అందులో 16,65,49,583 డోసులు వినియోగించగా, మరో 84,08,187 డోసులు అందుబాటులో ఉన్నాయి’’ అని డాక్టర్ హర్షవర్ధన్ మంత్రుల బృందానికి వివరించారు. ఇక త్వరలోనే రాష్ట్రాలకు మరో 53,25,000 డోసులు పంపబోతున్నామని ఆయన తెలియజేశారు.
రెండు కోవిడ్ టీకాలద్వారా లభించే పూర్తిస్థాయి రక్షణ గురించి డాక్టర్ హర్షవర్ధన్ పునరుద్ఘాటించారు. కోవిడ్‌పై పోరులో వ్యాధి నిరోధకతను అనేక రెట్లు ఉత్తేజితం చేసే రెండో మోతాదు టీకాను తప్పక తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పౌరులకు మళ్లీ విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అందే టీకాలలో 70 శాతాన్ని రెండో మోతాదు ఇవ్వడానికి కేటాయించాల్సిందిగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. భారతదేశంలో రోగ నిర్ధారణ సదుపాయాల గురించి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వివరిస్తూ- రోజుకు 25,00,000 పరీక్షలు నిర్వహించగల సామర్థ్యం సంతరించుకున్నట్లు తెలిపారు. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 30,60,18,044 పరీక్షలు నిర్వహించగా, ఇందులో 18,08,344 పరీక్షలు కేవలం గత 24 గంటల్లో నిర్వహించినవని ఆయన గుర్తుచేశారు. కోవిడ్ నిర్ధారణ కోసం నిరుడు దేశం మొత్తంమీద పుణెలోని ఎన్ఐవి లేబొరేటరీ ఒక్కటి మాత్రమే ఉండగా, నేడు 2,514 ప్రయోగశాలల సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో కోవిడ్ కేసుల క్రమం గురించి జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సిడిసి) డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కుమార్ సింగ్ సమగ్రంగా వివరించారు. దేశంలో కేసుల పెరుగుదల 2/3 అంచెల నగరాల పరిధిలోని ప్రాంతాలకూ విస్తరిస్తున్న దృష్ట్యా ఆ ప్రాంతాల్లో పరీక్ష సదుపాయాలతోపాటు ఆస్పత్రుల మౌలిక వసతులను గణనీయంగా పెంచాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా గత 7 రోజులలో కేసుల అత్యధిక పెరుగదల ఆధారంగా మహారాష్ట్ర (1.27%), కర్ణాటక (3.05%), కేరళ (2.35%), ఉత్తర ప్రదేశ్ (2.44%), తమిళనాడు (1.86%), ఢిల్లీ (1.92%), ఆంధ్రప్రదేశ్ (1.90%), పశ్చిమ బెంగాల్ (2.19%), ఛత్తీస్‌గఢ్ (2.06%), రాజస్థాన్ (2.99%), గుజరాత్ (2.40%), మధ్యప్రదేశ్ (2.24%) రాష్ట్రాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.
దేశంలో చురుకైన కేసుల సంఖ్యరీత్యా అగ్రస్థానంలోగల 20 జిల్లాలు/మహా నగరాల జాబితాలో బెంగళూరు (అర్బన్), గంజాం, పూణే, ఢిల్లీ, నాగ్‌పూర్, ముంబై, ఎర్నాకుళం, లక్నో, కోళికోడ్ (కాలికట్), థానే, నాసిక్, మళప్పురం, త్రిస్సూర్, జైపూర్, గుర్గావ్, చెన్నై, తిరువనంతపురం, చంద్రాపూర్, కోల్‌కతా, పాలక్కాడ్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తి అధికంగాగల ప్రాంతాల్లో అనారోగ్యాలు, మరణాలను తగ్గించే దిశగా సకాలంలో వైద్య సంరక్షణ కల్పించాల్సిన అవసరాన్ని సమావేశం నొక్కి చెప్పింది. అలాగే కేసుల పెరుగుదలను పసిగట్టి, ముందస్తుగా సన్నద్ధం కావడం, ‘ర్యాట్’ (RAT) విధానంలో పరీక్షల సంఖ్యను పెంచి, వ్యాధిబారిన పడినవారిని గుర్తించడం తదితర చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. అదేవిధంగా వ్యాధి వ్యాప్తి చలనశీలత ఆధారంగా వైద్య-సాంక్రమిక వ్యాధుల అధ్యయనంతో ముడిపిన జన్యు పర్యవేక్షణకు ప్రాధాన్యం, వైద్యపరమైన/వయసుతో ముడిపడిన కొత్త కేసుల తీవ్రత వంటివాటిపై దృష్టి సారించడం వంటి ప్రాధాన్య చర్యలు చేపట్టాలని సమావేశం నొక్కిచెప్పింది.
సాధికార బృందం-1 చైర్మన్ హోదాలో డాక్టర్ వి.కె.పాల్ తమ బృందం చేసిన కృషిపై సమగ్ర నివేదిక సమర్పించారు. ఆస్పత్రులలో చేరిన రోగుల విషయంలో సమర్థ వైద్య నిర్వహణకు సంబంధించి మౌలిక ఆస్రత్రి సదుపాయాల పెంపు దిశగా చేపట్టిన వివిధ చర్యలను అందులో ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగా సామాజిక సంఘాల నేతృత్వం, కఠిన ఆంక్షల ముమ్మర అమలు ద్వారా వ్యాధి వ్యాప్తి నిరోధానికి చేపట్టాల్సిన అత్యవసర చర్యలను వివరించారు. భయాందోళనలకు తావులేని, తప్పుడు సమాచారాన్ని నిరోధించగల రీతిలో సందేశ ప్రచార విస్తృతి, వ్యాప్తిని పెంచాలని సూచించారు. అంతేకాకుండా కోవిడ్ చికిత్సపై అపోహలు తొలగించి, రోగులకు గృహ సంరక్షణను ప్రోత్సహించేలా ఈ సందేశ సేవలు ఉండాలని పేర్కొన్నారు. తద్వారా ఆస్పత్రులపై భారం తగ్గించడంతోపాటు రెమ్‌డెసివిర్, ఆక్సిజన్, ఇతర మందుల హేతుబద్ధ వినియోగంపై అవగాహన పెంచాలన్నారు. దీంతోపాటు ఏకాంత చికిత్స పడకల కోసం రైలు బోగీల వినియోగం పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ సంరక్షణపై మరింత మెరుగ్గా దృష్టి సారించడం గురించి వివరించారు. సాంక్రమిక వ్యాధుల అధ్యయన నిదర్శనాల్లో పురోగతిని, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు ఇతర స్థానిక పాలన సంస్థలకు చేయూత సహా చలనశీల మార్గనిర్దేశం కోసం వివిధ భాగస్వాముల ద్వారా సరికొత్త సాంకేతిక సలహాలు అందజేయడం గురించి కూడా తెలిపారు.
ఇక ద్రవరూప వైద్య ఆక్సిజన్ (ఎల్ఎంఓ) ఉత్పత్తి, కేటాయింపు, సరఫరాలపై ప్రస్తుత పరిస్థితి గురించి కేంద్ర రోడ్డు రవాణా-జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమానే (సాధికార బృందం-2 చైర్మన్) వివరాలు సమర్పించారు. కోవిడ్ రోగుల ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా ద్రవరూప వైద్య ఆక్సిజన్ ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి పెంచామని ఆయన తెలిపారు. దేశీయంగా రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం నేడు 9,400 మెట్రిక్ టన్నులకు పెరిగిందని చెప్పారు. అలాగే ‘ఎల్ఎంఓ’ దిగుమతికి చేపట్టిన చర్యలు, ‘పీఎం కేర్స్ నిధి’ మద్దతుతో చేపట్టిన ‘పీఎస్ఏ’ ఆక్సిజన్ యంత్రాగారాల ఏర్పాటుకు సంబంధించి ‘డీఆర్‌డీఓ, ఐసీఎంఆర్’ల సహకారంతో ఇప్పటిదాకా సాధించిన ప్రగతిని గురించి నివేదించారు. అంతేకాకుండా ట్యాంకర్ల లభ్యత పెంపు, ‘ఎల్ఎంఓ’ ట్యాంకర్ల రాకపోకలపై ప్రత్యక్ష పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన వెబ్ పోర్టల్, మొబైల్ అనువర్తనాల పనితీరు తదితరాలను కూడా ఆయన వివరించారు.
నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ అమితాబ్ కాంత్, విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీ హర్షవర్ధన్ ష్రింగ్లా, వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ అనూప్ వాధ్వాన్, ఆరోగ్యశాఖ పరిశోధనల విభాగం కార్యదర్శి-ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ, జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఆరోగ్యశాఖ) డైరెక్టర్-అదనపు కార్యదర్శి శ్రీమతి వందనా గుర్నానీ, కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్తి ఆహుజా, ఇదే శాఖలో ఆరోగ్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్ఎస్) డాక్టర్ సునీల్ కుమార్, విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్‌టీ) శ్రీ అమిత్ యాదవ్ సహా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంలోని ‘ఐటీబీపీ’ ప్రతినిధి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1717283)
Visitor Counter : 249