పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

పౌర విమానయాన సిబ్బందికి వేగంగా సమర్ధంగా టీకాలు వేయడానికి మార్గదర్శకాలు జారీ


సిబ్బందికి టీకాలు వేయడానికి ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పించనున్న విమానాశ్రయాల నిర్వాహకులు

నోడల్ అధికారులను నియమించాలని సూచన

కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సౌకర్యాల కల్పన

Posted On: 06 MAY 2021 3:23PM by PIB Hyderabad

విమానయాన రంగంలో పనిచేస్తున్న సిబ్బందికి వేగంగా సమర్ధంగా టీకాలను ఇవ్వడానికి అనుసరించవలసిన మార్గదర్శకాలను పౌర విమానయాన మంత్రిత్వశాఖ విడుదల చేసింది. కోవిడ్-19 వేగంగా విస్తరిస్తున్న సమయంలో విమానయాన రంగంలో పనిచేస్తున్న సిబ్బంది  ప్రజలను తరలించడంతో పాటు   వ్యాక్సిన్లు, మందులు, ఆక్సిజన్ సాంద్రతలు వంటి ముఖ్యమైన  వైద్య సరకులను గమ్య స్థానాలకు చేర్చడంలో విశేషమైన సేవలను అందించారు. టీకాల కార్యక్రమంలో పౌర విమానయాన సిబ్బంది,ఈ రంగంతో సంబంధం ఉన్న ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వారికి  ప్రాధాన్యత  ఇవ్వాలని కోరుతూ  గతంలో  అన్ని రాష్ట్రాలకు పౌరవిమానయాన కార్యదర్శి లేఖ రాశారు. 

దీనిప్రకారం పౌరవిమానయాన రంగంలో  ఉన్న అన్ని సంస్థలు తమ సిబ్బందికి టీకాలు వేయించడానికి చర్యలు తీసుకోవలసి ఉంటుంది.  టీకాలు ఇవ్వడానికి ఇప్పటికే ప్రభుత్వ/ ప్రైవేట్ సంస్థలతో కుదుర్చుకున్న ఏర్పాట్లను ఈ సంస్థలు కొనసాగించవలసి ఉంటుంది. 

తమ విమానాశ్రయాల్లో పనిచేస్తున్న విమానయాన సిబ్బంది లేదా ఈ రంగంతో సంబంధం ఉన్న వారికి ( కాంట్రాక్టు,తాత్కాలిక తదితర) టీకాలు వేయడానికి తమతమ విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించడం జరిగింది. దీనికోసం విమానాశ్రయాల్లో కోవిడ్ టీకాల కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర  ప్రభుత్వాలు, సేవలు అందించే ప్రైవేట్ సంస్థలను  ( ఆసుపత్రులు) గుర్తించి చర్చలుజరపాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 

టీకాలు వేయడానికి అవసరమైన కేంద్రాలు, విడివిడిగా వేచి ఉండడానికి స్థలాలు( టీకా వేయడానికి ముందు, టీకా వేసిన తరువాత) లాంటి ఏర్పాట్లను విమానాశ్రయాల నిర్వాహకులు కల్పించవలసి ఉంటుంది. వీటిలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఇక్కడకి వచ్చేవారికి కనీస సౌకర్యాలను ( హెల్ప్ డెస్క్, తాగునీరు, మరుగుదొడ్లు, వెంటిలేషన్ ఫ్యాన్లు) కల్పించవలసి ఉంటుంది. సేవలను అందించేవారిని సంప్రదించి టీకా ధరను నిర్వాహకులు నిర్ణయించవలసి ఉంటుంది. విమానయాన రంగంతో సంబంధం ఉన్నవారందరికి ఈ ధరను వర్తింపజేయాలి. విమానాశ్రయ నిర్వహణ పనులను నిర్వహిస్తున్న సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న సిబ్బంది ఈ కేంద్రాల్లో టీకాలు తీసుకొనేలా చూడవలసి ఉంటుంది. సేవలను అందించేవారికి ఆన్‌లైన్ పద్దతిలో చెల్లింపులు చేయడానికి చర్యలు తీసుకోవాలని కూడా ఈ మార్గదర్శకాల్లో సూచించడం జరిగింది. 

తక్కువ మంది సిబ్బంది పనిచేస్తున్న విమానాశ్రయాల్లో టీకాలు కేంద్రాలను ఏర్పాటు చేయడం వెసలుబాటుగా ఉండకపోవడంతో వీటిని ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ సంస్థలు ముందుకు రాకపోవచ్చును. ఇటువంటి పరిస్థితుల్లో టీకాల కార్యక్రమాన్ని నిర్వహించాలని స్థానిక/ జిల్లా యంత్రాంగాలను నిర్వాహకులు సంప్రదించవలసి ఉంటుంది. విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసే కేంద్రాల్లో తొలుత సిబ్బందికి ఆ తరువాత వారి కుటుంబ సభ్యులకు టీకాలు వేయడానికి ప్రణాళికను సిద్ధం చేయవలసి ఉంటుంది. 

ఏటీసీ , విమానయాన సంస్థల సిబ్బంది (కాక్‌పిట్ మరియు క్యాబిన్ ), మిషన్ క్రిటికల్ మరియు ప్రయాణీకులతో సంబంధం వుండే సిబ్బందికి  ప్రాధాన్యతనివ్వాలని మార్గదర్శకాల్లో సూచించారు.  అన్ని విమానాశ్రయ నిర్వాహకులు ప్రయత్నాలను సమన్వయం కోసం నోడల్ అధికారిని (ప్రత్యామ్నాయ నోడల్ అధికారిని కూడా సంసిద్ధతలో ఉంచుతూ ) నియమించాలని సూచించారు.

టీకాల కార్యక్రమం అమలు జరుగుతున్న తీరును పరిశీలించి, కార్యక్రమాన్ని సమన్వయం చేయడానికి ఎయిర్పోర్ట్స్ అధారిటీ అఫ్ ఇండియా చైర్మన్ తరచూ మంత్రిత్వశాఖ డీజీసీఏ తో సమీక్ష నిర్వహించి తగిన చర్యలను తీసుకోవలసి ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వాక్సిన్ సకాలంలో సరఫరా అయ్యేలా చూడడానికి మంత్రిత్వశాఖ తగిన చర్యలను తీసుకుంటుంది. 

స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చునని అయితే కేంద్ర ఆరోగ్యశాఖ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. 

***



(Release ID: 1716609) Visitor Counter : 193