ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఢిల్లీలో కోవిడ్-19 రోగులకు ఆక్సీజన్ సరఫరాపై తాజా సమాచారం


పీఎం కేర్స్ నిధులతో ఢిల్లీ ఎయిమ్స్, ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో రెండు మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు వేగంగా ఏర్పాట్లు

ఈ రోజు రాత్రికి పూర్తి కానున్న పనులు: రేపటి నుంచి రోగులకు ఆక్సిజన్ సరఫరా

Posted On: 04 MAY 2021 7:37PM by PIB Hyderabad

కోవిడ్-19 కేసుల సంఖ్య ఇటీవలకాలంలో విపరీతంగా పెరిగిపోవడంతో ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ సౌకర్యం ఉన్న ఐసీయూ పడకల అవసరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఢిల్లీలో కోవిడ్-19 బారిన పడి చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరుతున్న వారికి ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం కావలసిన పరిమాణంలో ఆక్సిజన్ ను సరఫరా చేసే అంశంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ 2021 ఏప్రిల్ 23వ తేదీన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సమావేశంలో ఢిల్లీలోని అయిదు ఆసుపత్రుల్లో డిఆర్‌డిఓ సహకారంతో పిఎస్‌ఎ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిని ఎయిమ్స్ ట్రామా సెంటర్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ (ఆర్‌ఎంఎల్), సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ, మరియు ఎయిమ్స్, ఝాజ్జార్, హర్యానాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరగడంతో వివిధ ప్రాంతాల్లో  పీఎం కేర్స్ నిధులతో 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను మూడు నెలలలోగా ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వీటిని ఏర్పాటు చేయడానికి 2021 ఏప్రిల్ 24వ తేదీన అనుమతులు మంజూరు అయ్యాయి. ఉత్తర్వులు వెలువడిన వారం రోజులలోనే రెండు ప్లాంట్లను  డిఆర్‌డిఓ సాంకేతిక భాగస్వామి అయిన మెస్సర్స్ ట్రైడెంట్ న్యూమాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్  కోయంబత్తూర్ నుంచి విమానాల్లో తరలించింది. 48 ప్లాంట్లను సిద్ధం చేయడానికి మెస్సర్స్ ట్రైడెంట్ న్యూమాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. మెస్సర్స్ ట్రైడెంట్ న్యూమాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిద్ధం చేసిన ప్లాంటులు 2021 మే 4వ తేదీన ఢిల్లీకి చేరాయి. వీటిని ఢిల్లీ ఎయిమ్స్, ఆర్‌ఎంఎల్ ల్లో నెలకొల్పడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రోజు రాత్రికి వీటిని నెలకొల్పడం జరుగుతుంది. కనెక్షన్లు ఇచ్చిన తరువాత వీటిని పరిశీలిస్తారు. రేపు సాయంత్రానికి వీటి ద్వారా ఆక్సిజన్ సరఫరా ప్రారంభం అయ్యే అవకాశం వుంది. 

ఈ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు దేశీయ జియో-లైట్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తూ నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.   ఈ వ్యవస్థ 190 మంది రోగులకు 5 ఎల్ఫీయం ఆక్సిజన్ సరఫరా చేయడం  లేదా రోజుకు 195 సిలిండర్లను ఛార్జ్  చేస్తుంది.  మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ (ఎంఓపి) టెక్నాలజీని ఎల్‌సిఎ, తేజస్ కోసం ఆన్-బోర్డ్ ఆక్సిజన్ ఉత్పత్తి కోసం  డిఆర్‌డిఓ అభివృద్ధి చేసింది. రవాణా సమస్యలు లేకుండా వీటిని ఏ ప్రాంతానికైనా తరలించడానికి అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో కోవిడ్ -19 రోగులకు సహాయకారిగా ఇవి పనిచేస్తాయి.  సిఎస్‌ఐఆర్ తన పరిశ్రమల ద్వారా 120 ఎంఓపి ప్లాంట్ల సరఫరాకు ఆర్డర్ ఇచ్చింది. మిగిలిన ప్లాంటులు సకాలంలో సరఫరా అయ్యేలా చర్యలను తీసుకుంటున్నారు. 

కోవిడ్-19  మహమ్మారికి వ్యతిరేకంగా అన్ని ప్రభుత్వ శాఖలు ప్రజల సహకారంతో కేంద్ర ప్రభుత్వం పోరాటం చేస్తోంది. వివిధ  కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రాలు మరియు యుటిఎస్ లతో కలిసి సంఘటితంగా సమగ్ర ప్రణాళికను అమలు చేస్తూ ప్రజలను, దేశాన్ని కోవిడ్ బారి నుంచి రక్షించడానికి కృషి చేస్తున్నాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ భారత్ ను నిర్మించాలంటూ ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకొని వైద్య సౌకర్యాల కల్పన, పరికరాల తరలింపు లాంటి అంశాలలో అన్ని శాఖలు కలసి పనిచేస్తున్నాయి.   తమ  భాగస్వామ్య  పరిశ్రమల ద్వారా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో డిఆర్‌డిఓ,సిఎస్‌ఐఆర్ లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు  సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నాయి. 

***


(Release ID: 1716041) Visitor Counter : 259