ఆయుష్

కరోనా ఇబ్బందులను తగ్గించేందుకు యోగా


అంతర్జాతీయ యోగా దినోత్సవం-2021 సందర్భంగా; ఆయుష్‌ మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త ప్రచారం

Posted On: 04 MAY 2021 11:14AM by PIB Hyderabad

చక్కటి ఆరోగ్యం కోసం యోగాను దినచర్యలో భాగంగా చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి, ఆయుష్ మంత్రిత్వ శాఖ,  యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ (ఎంవైఏఎస్‌) కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) స్ఫూర్తిని చాటుతున్నాయి. ఐడీవై-2021కి 50 రోజుల కౌంట్‌డౌన్‌గా ఈ నెల 2వ తేదీన వర్చువల్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. మరో రెండు నెలల లోపులో ఐడీవై రాబోతోంది. 

    క్రీడాకారులు యోగా సాధన చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, శ్రీ పుల్లెల గోపీచంద్‌తో కేంద్ర క్రీడల శాఖ మంత్రి శ్రీ కిరెన్‌ రిజిజు జరిపిన సంభాషణ దృశ్యాలను ఈ కార్యక్రమంలో ప్రసారం చేశారు. యోగాపై, ప్రముఖ అథ్లెట్‌ శ్రీమతి అంజు బాబీ జార్జ్‌ ఇచ్చిన సందేశాన్ని కూడా ప్రసారం చేశారు.

    ఆయుష్ మంత్రిత్వ శాఖ,  యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖల సామాజిక మాధ్యమ వేదికల్లో కార్యక్రమం ప్రసారంకాగా, 5 వేలకు పైగా వీక్షకులు వీక్షించారు. కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా, ఐడీవై ప్రచార కార్యక్రమాల్లో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనకుండా చూడడం అవసరం. అందుకే, ప్రజలు ఇళ్లలో ఉండే పాల్గొనేలా డిజిటల్‌, వర్చువల్‌, ఎలక్ట్రానిక్‌ వేదికల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. "యోగా చేయండి, ఇంట్లోనే ఉండండి" నినాదాన్ని ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ప్రచారం చేస్తోంది.

    ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాలపై రెండో దశ కరోనా విస్తృత ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో, బహుముఖ ప్రయోజనకారి అయిన యోగా, ప్రజలకు అమితంగా సాయం చేస్తుందని రుజువైంది. యోగాను నిరంతరం సాధన చేసేవారికి శారీరక వ్యాయామాన్ని మించిన ఆరోగ్య ప్రయోజనాలతోపాటు, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. యోగా ఇచ్చే పునఃభరోసా, ఉపశమన లక్షణాలతో కరోనా నుంచి రక్షణతోపాటు రోజువారీ సమతౌల్య జీవనానికి బాటలు వేసుకోవచ్చు. యోగాను స్థిరంగా సాధన చేయడం వల్ల ఆరోగ్యంతోపాటు సహజ రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. జీవక్రియ, మెరుగుదల, సరైన రక్త ప్రసరణకు తోడ్పడడంతోపాటు, శ్వాసకోశ, హృదయ సంబంధ, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గించడానికి యోగా రోజువారీ అభ్యాసం సాయపడుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుదల, భావోద్వేగాల నియంత్రణకు కూడా యోగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో సాధారణంగా కనిపిస్తున్న భయం, ఆందోళన, ఒత్తిడి, విసుగు, నిరాశ, నిస్పృహలను ఎదుర్కొనేలా యోగా తోడ్పడుతుంది. ప్రజల ఆలోచనలు, దినచర్యలోకి ఐడీవై-2021ను తీసుకురావడానికి ఇది తగిన సందర్భం.

    ఈ నెల 2న నిర్వహించిన కార్యక్రమం ఐడీవైకి విస్తృత ప్రచారంతోపాటు, ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా గత సంవత్సరాల కంటే ఎక్కువగా స్ఫూర్తిని నింపి, అంతర్జాతీయ ఆరోగ్య ఉద్యమంగా మారింది. కొత్త వాళ్లు యోగా నేర్చుకునేందుకు ఉత్తమ పరిచయ కార్యక్రమాల్లో ఒకటైన "కామన్‌ యోగా ప్రొటోకాల్‌"పై, ఆరోగ్యం కోసం గరిష్ఠ సంఖ్యలో ప్రజలు దీనిలో భాగస్వాములు కావలసిన అవసరంపై ఈ కార్యక్రమంలో ప్రధాన చర్చ జరిగింది. 

    45 నిమిషాల నిడివిలో, ప్రత్యేక క్రమానుగత యోగాసనాలను కలిగిన కార్యక్రమం సీవైపీ. యోగాను పరిపూర్ణత సాధించిన మన దేశ యోగా గురువులు 2015లో దీనిని రూపొందించారు. లింగ, వయోభేదంతో సంబంధం లేకుండా, సాధారణ శిక్షణ లేదా ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా ప్రజలంతా సులభం నేర్చుకునేలా దీనిని రూపొందించారు.

    "డిఫర్డ్‌ స్ట్రీమింగ్‌" పద్ధతిలో, ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యోగా నిపుణుల బృందం పాల్గొంది. బెంగళూరులోని ఎస్‌-వ్యాస విశ్వవిద్యాలయం కులపతి డా.హెచ్‌.ఆర్‌.నాగేంద్ర, లోనావాలోని కైవల్యధామ సెక్రటరీ జనరల్‌ శ్రీ ఒ.పి.తివారీ, చెన్నైలోని కృష్ణమాచార్య యోగా మందిరం యోగాచార్యుడు శ్రీ ఎస్‌.శ్రీధరన్‌, ఫిజియాలజీ విశ్రాంత ఆచార్యుడు, పుదుచ్చేరిలోని సెంటర్ ఆఫ్ యోగిక్ సైన్స్ ఏవీ మెడికల్‌ కాలేజ్‌ & హాస్పిటల్‌ డైరెక్టర్‌ డా.మదన్‌మోహన్‌, బెంగళూరులోని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సమన్వయకర్త శ్రీమతి కమలేష్‌ బర్వాల్‌ ఈ బృందంలో ఉన్నారు.

***


(Release ID: 1715900) Visitor Counter : 223