రైల్వే మంత్రిత్వ శాఖ
ఆదివారం ఉదయానికి దిల్లీ, తెలంగాణ, యూపీకి రికార్డు స్థాయిలో 250 మె.ట. ఎల్‌ఎంఓ సరఫరా చేయనున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు
రెండో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా రేపు సాయంత్రానికి 120 మె.ట. ద్రవరూప వైద్య ఆక్సిజన్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్న దిల్లీ
ఇవాళ హరియాణాకు అందిన 79 టన్నుల వైద్య ఆక్సిజన్
ఇప్పటివరకు 813 టన్నుల ద్రవరూప వైద్య ఆక్సిజన్ సరఫరా చేసిన రైల్వేలు
Posted On:
01 MAY 2021 5:59PM by PIB Hyderabad
ద్రవరూప వైద్య ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) పంపిణీలో వేగాన్ని మరింత పెంచిన రైల్వే శాఖ, ఇప్పటివరకు 813 మెట్రిక్ టన్నులను 56 ట్యాంకర్ల ద్వారా వివిధ రాష్ట్రాలకు సరఫరా చేసింది. 14 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమకు కేటాయించిన పనిని ఇప్పటికే పూర్తి చేయగా, మరో 5 రైళ్లు 18 ట్యాంకర్లలో 342 మె.ట. ఆక్సిజన్‌తో గమ్యస్థానాలకు వెళ్తున్నాయి. సాధ్యమైనంత తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ ఎల్‌ఎంఓను ఆయా రాష్ట్రాలకు చేర్చడానికి రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది.
ఐదు ట్యాంకర్లతో కూడిన రెండు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా హరియాణాకు ఇవాళ 79 మె.ట. ఎల్‌ఎంఓ అందింది. 2 ట్యాంకర్లలో 30.6 మె.ట. తీసుకువచ్చే మూడో రైలు అంగుల్‌లో ఇప్పటికే బయలుదేరింది.
బొకారో నుంచి జబల్‌పూర్, సాగర్ వచ్చిన రెండో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా 70.77 మె.ట. ఎల్‌ఎంఓను మధ్యప్రదేశ్ శుక్రవారం అందుకుంది. రూర్కెలా నుంచి 22.19 మె.ట.లతో ఇప్పటికే బయల్దేరిన మూడో రైలు ఈ రాత్రికి జబల్‌పూర్ చేరుకోనుంది.
బొకారో నుంచి మూడు ట్యాంకర్లలో 44.88 మె.ట. ఆక్సిజన్‌ను తీసుకుని మరో రైలు ఉత్తరప్రదేశ్ బయల్దేరింది. ఆ రాష్ట్రానికి ఇది 8వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్. యూపీకి ఇప్పటివరకు 355 మె.ట. అందగా, మరింత ఆక్సిజన్ ప్రయాణమార్గంలో ఉంది.
దుర్గాపూర్ నుంచి 120 మె.ట. ఆక్సిజన్‌ను నింపుకుని బయల్దేరిన ఆరు ట్యాంకర్లు మరో 24 గంటల్లో దిల్లీ చేరుకుంటాయి.
అంగుల్ నుంచి తెలంగాణకు 124.26 మె.ట. ఆక్సిజన్‌తో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు బయల్దేరింది. ఇది తెలంగాణకు మొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్.
ఇప్పటివరకు, మహారాష్ట్రకు 174 మె.ట., యూపీకి 355 మె.ట., మధ్యప్రదేశ్‌కు 134.77 మె.ట., దిల్లీకి 70 మె.ట., కలిపి మొత్తం 813 మె.ట. ద్రవరూప వైద్య ఆక్సిజన్‌ను రైల్వే శాఖ సరఫరా చేసింది. తెలంగాణకు బయల్దేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ అతి త్వరలోనే అక్కడకు చేరుకోనుంది.
***
(Release ID: 1715426)
Visitor Counter : 180