ప్రముఖ చలనచిత్ర దర్శకుడు స్వర్గీయ శ్రీ సత్యజిత్ రే శతజయంత్యుత్సవాలను పురస్కరించుకుని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ దేశ విదేశాల్లో ఆయనకు ఘన నివాళిగా ఏడాది పాటు వేడుకలు నిర్వహిస్తోంది.
శ్రీ సత్యజిత్ రే చలనచిత్ర దర్శకుడు, రచయిత, చిత్రకారుడు, గ్రాఫిక్ డిజైనర్, సంగీత దర్శకుడుగా బహుముఖ ప్రజ్ఞాశాలి. అడ్వర్ టైజింగ్ రంగంలో కెరీర్ ను ప్రారంభించిన ఆయన ప్రముఖ నవలాకారుడు విభూతిభూషణ్ బందోపాధ్యాయ్ రచన పథేర్ పాంచాలిని తెరకెక్కించడం ద్వారా దర్శకుడుగా మారారు. ఆ చిత్రం ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఆయన చారులత, ఆగంతక్, నాయక్ వంటి అద్భుత చిత్రాలు రూపొందించారు. ఆయన చక్కని రచయిత. ప్రముఖ నేర పరిశోధకుడు ఫెలుదా, శాస్త్రవేత్త ప్రొఫెసర్ షొంకు వంటి పాత్రలకు బెంగాలీ సాహిత్యంలో ప్రముఖ స్థానం తెచ్చారు. 1992లో ఆయనకు దేశంలోని అత్యుత్తమ పౌర పురస్కారం భారతరత్న ఇచ్చి ప్రభుత్వం సత్కరించింది.
శతజయంత్యుత్సవాల్లో భాగంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా విభాగాలు డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్, ఫిలింస్ డివిజన్, ఎన్ఎఫ్ డిసి, ఎన్ఎఫ్ఏఐ, కోల్కతా ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ (ఎస్ఆర్ఎఫ్ టిఐ) వరుసగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహా పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు ఈ వేడుకల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని మహమ్మారి ఆవరించి ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాల నిర్వహణకు హైబ్రిడ్ విధానం - డిజిటల్, ఫిజికల్ రెండూ - ప్రభుత్వం ఎంచుకుంది.
ప్రముఖ చలనచిత్రకారుని వారసత్వానికి గుర్తింపుగా చలనచిత్ర రంగంలో అద్భుత ప్రతిభావంతులకు ఈ ఏడాది నుంచి సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ఇవ్వబోతున్నారు. ప్రతీ ఏడాది భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో (ఐఎఫ్ఎఫ్ఐ) ఈ అవార్డును బహూకరిస్తారు. అవార్డు కింద రూ.10 లక్షల నగదు, ప్రశంసాపత్రం, దుశ్వాలువ, నెమలి మెడల్, స్ర్కోల్ అందచేస్తారు.
కార్యక్రమాలు, వేడుకలు
1. దేశంలోని వివిధ ప్రాంతాల్లోను, విదేశాల్లో అక్కడి రాయబార కార్యాలయాల సహకారంతోను సత్యజిత్ రే ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్, ఫిలింస్ డివిజన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తాయి. ఆ ఉత్సవాల్లో శ్రీ సత్యజిత్ రే చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రదర్శిస్తారు. 74వ కేన్స్ చలనచిత్రోత్సవంలో శ్రీ సత్యజిత్ రే చిత్రాల ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించాలని కూడా యోచిస్తున్నారు.
2. భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ), 2021 సందర్భంగా సత్యజిత్ రే చిత్రాల రెట్రోస్పెక్టివ్ ను డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహిస్తోంది. ఈ రెట్రోస్పెక్టివ్ ప్రపంచంలో జరిగే ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ చలనచిత్రోత్సవాలన్నింటిలోనూ ప్రదర్శనకు ఉంచుతారు.
3. ఫిలింస్ డివిజన్ ముంబైలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమాలో ప్రత్యేకంగా సత్యజిత్ రే విభాగం ఏర్పాటు చేయనుంది. ఈ విభాగం రాబోయే ఏడాది కాలంలో దేశంలోని అన్ని మ్యూజియంలను సందర్శిస్తూ సత్యజిత్ రే జీవితానికి చెందిన ప్రముఖ ఘట్టాలను భౌతికంగాను, డిజిటల్ గాను ప్రదర్శనకు ఉంచుతుంది. సత్యజిత్ రే చిత్రాల్లోని ప్రముఖ సన్నివేశాలు, ఇంటర్వ్యూలు ఇందులో ఉంటాయి.
4. నేషనల్ ఫిలిం ఆర్కివ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్ఏఐ) శ్రీ సత్యజిత్ రే నిర్దేశకత్వంలో అందుబాటులో ఉన్న చిత్రాలు, ప్రచార సామగ్రి పునరుద్ధరణ, డిజిటైజేషన్ చేపడుతుంది. అలాగే సత్యజిత్ రే చిత్రాల పోస్టర్ల వర్చువల్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తుంది.
5. ఎన్ఎఫ్ డిసి శ్రీ సత్యజిత్ రే నిర్దేశకత్వంలోని ఎంపిక చేసిన ఐదు చిత్రాల ప్రదర్శనను ఒటిటి ప్లాట్ ఫారం సినిమాస్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహిస్తుంది.
6. కోల్కతాకు చెందిన సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ (ఎస్ఆర్ఎఫ్ టిఐ) సొంత ప్రాంగణంలో శ్రీ సత్యజిత్ రే విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ ప్రముఖ చలనచిత్ర మేధావిపై అవగాహన మరింతగా పెంచేందుకు ఈ సంస్థ ఆయన చిత్రాలపై ఒక కోర్సును కూడా నిర్వహిస్తుంది. అలాగే బాలల కోసం శ్రీ సత్యజిత్ రే చిత్రాలతో పాఠశాలలకు అందించగల ఒక ప్యాకేజిని సిద్ధం చేస్తుంది. శ్రీ సత్యజిత్ రే చిత్రాల్లోని ఆలోచనలపై ఫిలిం స్కూళ్లలో అంతర్ కళాశాల పోటీలు నిర్వహిస్తుంది.
7. శ్రీ సత్యజిత్ రే వ్యక్తిత్వం; కళా, సాహిత్య రచనలను ప్రదర్శిస్తూ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
ఈ కార్యకలాపాలన్నింటి పర్యవేక్షణ కోసం సమాచార, ప్రసారాత శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఒక అమలు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కమిటీలో సభ్యులుగాను, సీనియర్ దర్శకుడు శ్రీ ధృతిమాన్ ఛటర్జీ నామినేటెడ్ సభ్యుడుగాను ఉంటారు.