వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలోని భాగస్వాముల సమష్టి శక్తిని ఏకతాటిపైకి తెస్తున్న వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి


‘ఏఐఎఫ్’కు రూ.8,000 కోట్లకుపైగా విలువైన దరఖాస్తులు

రూ.4,000 కోట్లకుపైగా విలువైన దరఖాస్తులు మంజూరు;

రూ.8,000 కోట్లకుపైగా విలువైన దరఖాస్తులతో

వ్యవసాయ మౌలిక వసతుల రూపు దాల్చనున్న ‘ఏఐఎఫ్’;

8,000 కోట్లకుపైగా బలమైన ‘ఏఐఎఫ్’లో వినూత్న

మౌలిక-రైతు భాగస్వామ్య నమూనాల ఆవిష్కరణ

Posted On: 28 APR 2021 9:36AM by PIB Hyderabad

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి రూ.8,216 కోట్ల విలువైన 8,665 దరఖాస్తులు అందిన నేపథ్యంలో ఈ నిధి రూ.8,000 కోట్ల మైలురాయిని అధిగమించింది. ఇందులో అత్యధిక  వాటా (58 శాతం) ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా (పీఏసీఎస్)లదే కాగా, వ్యవసాయ పారిశ్రామికవేత్తల వాటా (24శాతం) వ్యక్తిగత రైతుల వాటా (13 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. విస్తృతస్థాయి ప్రాజెక్టుల కోసం వచ్చిన ఈ పెట్టుబడులు దేశవ్యాప్తంగా రైతులకు అమూల్య ప్రయోజనాలను సమకూరుస్తాయి. దరఖాస్తుల సంఖ్యరీత్యా ఆంధ్రప్రదేశ్ (2,125) మధ్యప్రదేశ్ (1,830), ఉత్తర ప్రదేశ్ (1,255), కర్ణాటక (1,071), రాజస్థాన్ (613) తొలి 5 స్థానాల్లో నిలిచాయి. ఇక ఈ రాష్ట్రాల్లో నాలుగు తమ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల శక్తిని చాలావరకూ సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఒక్క మధ్యప్రదేశ్ రాష్ట్రం మాత్రం అధికశాతం దరఖాస్తులను ‘పీఏసీఎస్’లతో నిమిత్తం లేకుండా సమర్పించింది. మొత్తంమీద వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలోని భాగస్వాములందరి సమష్టి శక్తిని వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఏకతాటిపైకి తెస్తోంది.

   క్షేత్రస్థాయిలో పెట్టుబడులను వేగవంతం చేసేందుకు కేంద్ర వ్యవసాయ సహకార-రైతు సంక్షేమ శాఖ అనేక వినూత్న చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇఫ్కో, హాఫెడ్, నాఫెడ్ తదితరాలుసహా 150కిపైగా రైతు ఉత్పత్తిదారు సంస్థలు, జీవనోపాధి సంస్థలను ప్రత్యక్షంగా భాగస్వాములను చేసింది. సీఐఐ, ఫిక్కి మద్దతుతో 90కిపైగా వ్యవసాయ వ్యాపార భాగస్వాములు పాల్గొనగా, వ్యవసాయ వాణిజ్య సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో ఆర్య సీఎంఏ, మహింద్ర అగ్రి, టాటా కన్జ్యూమర్, ఇఫ్కో, ఎస్కార్ట్స్ క్రాపింగ్ సొల్యూషన్స్ తదితర కీలక సంస్థలు ప్రదర్శనలిచ్చాయి. ఈ మేరకు ‘ఏఐఎఫ్’ కింద రైతుల, రైతుసంఘాల, స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో తాము పోషించబోయే పాత్రను విశదం చేశాయి.

   ఆయా రాష్ట్రాల్లో ప్రగతిని కేంద్ర వ్యవసాయ శాఖ క్రమబద్ధంగా సమీక్షిస్తూ, పరస్పర అనుభవాల స్వీకరణను ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి 190కిపైగా శాఖలు, సంస్థలు పాల్గొనగా రాష్ట్రాల స్థాయి సదస్సును కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా ‘పీఏసీఎస్’ల నేతృత్వంలోని తన నమూనాను ప్రదర్శించగా, మధ్యప్రదేశ్ తన స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శక్తిని ప్రదర్శించింది. దీంతోపాటు రాష్ట్రాలు పెద్ద సంఖ్యలో రైతులు, స్థానిక పారిశ్రామికవేత్తలతో భాగస్వామ్యానికి సిద్ధమయ్యాయి.

   ఈ చొరవతో మొత్తంమీద దరఖాస్తుల సంఖ్య పెరగడంతోపాటు రకరకాల వినూత్న మౌలిక వసతులు... సంప్రదాయ అద్దె కేంద్రాలు, వ్యవసాయ యంత్రాల బ్యాంకులు (రూ.25 కోట్ల విలువైన 130 దరఖాస్తులు) వంటివాటిపై ఆసక్తి వ్యక్తమైంది. అలాగే అత్యాధునిక-కచ్చితమైన ఉత్పాదకాల వినియోగం (రూ.1,300 కోట్ల విలువైన 200 దరఖాస్తులు)పైనా ఆసక్తి వ్యక్తమైంది. ఈ విధంగా సరికొత్త భాగస్వామ్య నమూనాలతో రైతులను, వ్యవసాయ వాణిజ్య సంస్థలను ఏఐఎఫ్ చేరువ చేసింది. తద్వారా పొలం వద్దనే కార్యకలాపాలకు వీలుగా కూడలి-శాఖల తరహా వ్యవస్థ సృష్టికి మార్గం సుగమం చేసింది. మరోవైపు కొత్త పద్ధతుల అనువర్తనం, అనుసరణ దిశగా వ్యవసాయ వాణిజ్య సంస్థలు ఏఐఎఫ్ సహా సరికొత్త వ్యవసాయ-సాంకేతిక అంశాలపై రైతు ఉత్పత్తిదారు సంస్థలకు అవగాహన పెంచుతున్నాయి. ఇక ఈ పథకం కోసం https://agriinfra.dac.gov.in పేరిట ఒక పోర్టల్ ఏర్పాటు చేయబడింది. దీనిద్వారా దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను సమర్పించడంతోపాటు భాగస్వాములందరూ తమ దరఖాస్తుల నిరంతర ప్రగతిని కూడా పర్యవేక్షించవచ్చు.

   వ్యవసాయ వాణిజ్య సంస్థలు, రైతులను ఒక వేదికపైకి చేర్చడంతోపాటు రాష్ట్రాల మధ్య అనుభవాల పరస్పర స్వీకరణ వంటి సముచిత చర్యలతో ఏఐఎఫ్ వేగం పుంజుకుంటోంది. అదే సమయంలో ప్రపంచ స్థాయి వ్యవసాయ మౌలిక వసతుల నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాల అనుసరణ దిశగా ముందడుగు వేస్తోంది. మొత్తంమీద దేశంలో వ్యవసాయ మౌలిక వసతుల ముఖచిత్రాన్ని పూర్తిగా రూపాంతరీకరణ చేయగల శక్తిసామర్థ్యాలు ‘ఏఐఎఫ్’కు ఉన్నాయడంలో సందేహం లేదు.

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి గురించి...

   వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్) అన్నది- పంటకోత అనంతర నిర్వహణ మౌలిక వసతులతోపాటు సామూహిక వ్యవసాయ ఆస్తులకు సంబంధించిన ఆచరణ సాధ్యమైన పథకాలలో పెట్టుబడులకు వడ్డీ రాయితీ-రుణహామీలతో దీర్ఘకాలిక రుణ సదుపాయం కల్పించే వ్యవస్థ. ఈ పథకం 2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2029 దాకా (పదేళ్లపాటు) కొనసాగుతుంది. దీనికింద బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థలు రూ.లక్ష కోట్ల మేర రుణాల రూపంలో అందజేస్తాయి. దీనిపై వడ్డీలో ఏడాదికి 3 శాతం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయంగా అందుతుంది. దీంతోపాటు ‘సీజీటీఎంఎస్ఈ’ కింద రూ.2కోట్ల వరకూ రుణాలకు హామీ ఉంటుంది. ఇందుకు అర్హులైన లబ్ధిదారులలో రైతులు, రైతు ఉత్పత్తిదారు సంస్థలు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, సహకార మార్కెటింగ్ సంస్థలు, స్వయంసహాయ సంఘాలు, సంయుక్త బాధ్యతగల బృందాలు (జేఎల్ జీ), బహుళార్థ సహకార సంఘాలు, వ్యవసాయ పారిశ్రామికులు, అంకుర సంస్థలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు లేదా స్థానిక పాలన సంస్థలు ప్రోత్సహించే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పథకాలు వంటివి ఉన్నాయి.

 

***



(Release ID: 1714730) Visitor Counter : 410