వ్యవసాయ మంత్రిత్వ శాఖ

సంప్రదాయ సేంద్రియ సాగు ప్రాంతాల గుర్తింపునకు కేంద్రం కసరత్తు!


వాటిని సేంద్రియసాగు ఉత్పత్తి కేంద్రాలుగా మార్చే ప్రక్రియలో
వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ

తొలిసారిగా అండమాన్ నికోబార్ దీవుల్లోని 14,491హెక్టార్ల ధ్రువీకరణ
‘విస్తృత ప్రాంత ధ్రువీకరణ’ పథకం కింద సత్వర ప్రక్రియకు చర్యలు

దీనితో దేశంలోని సేంద్రియ ఆహార మార్కెట్.తో
భూముల సత్వర అనుసంధానానికి అవకాశాలు

రైతులు తమ పొలాలను సేంద్రియ సాగుకు అర్హమైమవిగా
వెంటనే మార్చుకునే వెసులుబాటు

Posted On: 27 APR 2021 11:09AM by PIB Hyderabad

  దేశంలోని సంప్రదాయ సేంద్రియ సాగు ప్రాంతాలను గుర్తించేందుకు కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ విశేషంగా కృషి చేస్తోంది. సేంద్రియ సాగు ప్రాంతాలన్నింటినీ ధ్రువీకరించి, వాటిని సేంద్రియ ఉత్పత్తుల కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో ఈ కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల పరిధిలోని 14,491 హెక్టార్ల విస్తీర్ణం గల సేంద్రియ సాగు ప్రాంతాన్ని ధ్రువీకరించింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని కార్ నికోబార్, నాన్.కౌవ్రీ సమూహ దీవుల పరిధిలో ఈ ప్రాంతం ఉంది. భారతీయ భాగస్వామ్య పూచీ వ్యవస్థ (పి.జి.ఎస్.) పరిధిలోని ‘విస్తృత ప్రాంత ధ్రువీకరణ’ పథకం కింద గుర్తించిన అతి విస్తృతమైన, అవిచ్ఛిన్నమైన సేంద్రియ ధ్రవీకరణ పత్రం పొందిన ప్రాంతగా ఇది మారింది.

   కార్ నికోబార్, నాన్ కౌవ్రీ సమూహ దీవుల పరిధిలోని ఈ భూములు సంప్రదాయపరమైన సేంద్రియ సాగుకు ఎన్నో ఏళ్లుగా ప్రసిద్ధి చెందాయి. జన్యుమార్పిడి విత్తనాలకు సంబంధించిన ఎలాంటి రసాయనాలు వినియోగం, అమ్మకం వంటివి ఈ సమూహ దీవుల్లో జరక్కుండా అండమాన్ నికోబార్ దీవుల కేంద్రపాలిత ప్రాంతపు పరిపాలనా యంత్రాంగం కూడా నిషేధం అమలుచేస్తూ వస్తోంది. ఇక్కడ భూ కమతాలకు సంబంధించి దీవుల వారీగా, రైతుల వారీగా సమాచార వ్యవస్థను పరిపాలనా యంత్రాంగం రూపొందించింది. స్థానిక ప్రజా సంఘాల సహకారంతో ఇది సాధ్యమైంది. ఈ భూముల్లో అమలు చేస్తున్న సాగు విధానాలు, వినియోగిస్తున్న విత్తనాలు, సాగు పరికరాలు వంటి వివరాలతో ఈ సమాచార వ్యవస్థకు రూపకల్పన చేశారు. ఈ భూములను పరిశీలించిన నిపుణుల కమిటీ,.. వీటిని పి.జి.ఎస్. పథకం కింద సేంద్రియ సాగు ప్రాంతాలుగా ధ్రువీకరించవచ్చని సిఫార్సు చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సులు, నివేదికల ప్రాతిపదికన, కార్ నికోబార్, నాన్.కౌవ్రీ సమూహ దీవుల్లోని 14,491 హెక్టార్ల విస్తీర్ణాన్ని సేంద్రియ సాగు ప్రాంతంగా భారత ప్రభుత్వం ధ్రువీకరించింది.

https://ci3.googleusercontent.com/proxy/xbYwrJWe3DCANgW5WfEXW4Uem8v-mPcoiKPXIKFaXAidIMwN_zkDSJXc_ckNweOQKO_dbEGGatvMLvT_kHTdsMorIUIDG2ivZozD5tNzpa425cVH4WesVbNhMA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001B96X.jpg

https://ci3.googleusercontent.com/proxy/-YigxAOVAjWl-dFynUC_eySupI6v2UPt7wl3AzetFTlRA3F1V-HMy3RXkezJACwtB4Eb_q8H5W7zOrHSfBq4foFKYrvqeMqARizbFFxg4G24TxqlmTi1-hDW8g=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002FQYM.jpg

   ఈ దీవులతో పాటుగా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతపు రాష్ట్రాలు, జార్ఖండ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలు, రాజస్థాన్ రాష్ట్రంలోని ఎడారి ప్రాంతపు జిల్లాల ప్రాంతాలను.. అందులోనూ రసాయనాలు, జన్యుమార్పిడి  విత్తనాల వినియోగం లేని ప్రాంతాలను సేంద్రియ సాగు ప్రాంతాలుగా ధ్రువీకరించవచ్చు. ఈ ప్రక్రియకు సంబంధించి కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోంది. అలాంటి ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలను సేంద్రియ సాగు ప్రాంతాలుగా మార్చివేసేందుకు, ఆ ప్రాంతంకోసమే ప్రత్యేకంగా వ్యవసాయ ఉత్పాదనల మార్కెటింగ్ సదుపాయాలను కల్పించేందు, ఆ ఉత్పాదనల బ్రాండింగ్, లేబెల్లింగ్ ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. వ్యక్తిగతంగా, సొంతంగా సాగుచేసుకుంటున్న రైతులను కూడా ధ్రువీకరించిన సేంద్రియ సాగు రైతుల సమూహం పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ మరో పథకం చేపట్టింది. పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పి.కె.వి.వై.) పథకం కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పథకం ప్రకారం, భారతీయ భాగస్వామ్య పూచీ వ్యవస్థ పరిధిలో అమలు జరిగే జాతీయ సేంద్రియ ఉత్పాదనా కార్యక్రమం (ఎన్.పి.ఒ.పి.)లోని ఏదో ఒక పథకం కింద జరిగే ధ్రువీకరణ ద్వారా వ్యక్తిగత రైతులు ఆర్థిక సహాయాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఆయా రాష్ట్రాల ద్వారా ధ్రువీకరణ సంస్థల ద్వారా ఈ ఆర్థిక సహకారం అందుబాటులో ఉంటుంది.   

   అండమాన్ నికోబార్ దీవుల తర్వాత, లక్షద్వీప్, లఢక్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా సేంద్రియ సాగు ధ్రవీకరణ ప్రక్రియకోసం కసరత్తు చేస్తున్నాయి. తమతమ పరిధిలో సంప్రదాయకంగా ఉన్న సేంద్రియ సాగు ప్రాంతాలను ధ్రువీకరించిన సేంద్రియ సాగు ప్రాంతాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇన్నాళ్లూ బయటి ప్రపంచానికి తెలియకుండా ఉన్న ఈ ప్రాంతాలు, ఇపుడు సేంద్రియ సాగు ధ్రవీకరణ ప్రక్రియతో సమూలంగా మారనున్నాయి. దేశంలో ఆవిర్భిస్తున్న సేంద్రియ ఆహార మార్కెట్.తో ఈ ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడబోతోంది.

 

విస్తృత ప్రాంత ధ్రువీకరణ ద్వారా, సంప్రదాయ వ్యవసాయ ప్రాంతాన్ని సేంద్రియ సాగు ప్రాంతంగా రూపొందించే లక్ష్యం:

  • అధునాతన వ్యవసాయ విధానాలు ఇప్పటికే పూర్తిగా వేళ్లూనుకు పోయినప్పటికీ, కొండ ప్రాంతాలు, గిరిజన జిల్లాలు, ఎడారి ప్రాంతాలు, వర్షాధారిత సాగు ప్రాంతాల్లో రసాయనాలు, ఆధునిక వ్యవసాయ ఉపకరణాల ఊసులేని సంప్రదాయ వ్యవసాయం కొనసాగుతూనే ఉంది. కేవలం అతి తక్కువ కసరత్తుతోనే ఈ ప్రాంతాలను సేంద్రియ సాగు ధ్రువీకరణ పరిధిలోకి దాదాపు ఇప్పటికిప్పుడే మార్చివేసే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ తన పరిధిలోని పి.కె.వి.వై. అనే ప్రధాన పథకం కింద సత్వర ధ్రువీకరణ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. సంప్రదాయ సాగులో ఉండే ఈ ప్రాంతాలను మరింత పరిఫుష్టంగా మార్చేందుకు “విస్తృత ప్రాంత ధ్రువీకరణ” (ఎల్.ఎ.సి.) కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు జరుపుతోంది.

  సేంద్రియ ఉత్పాదనా వ్యవస్థలలో పాతుకుపోయిన నిబంధన ప్రకారమైతే, రసాయనాలు, ఆధునిక ఉపకరణాల వినియోగం ఉన్న ప్రాంతాలు సేంద్రియ సాగు ప్రాంతాలుగా అర్హత సాధించాలంటే రెండు లేక మూడేళ్ల పరివర్తన వ్యవధి అవసరమవుతుంది. ఈ వ్యవధిలో సదరు రైతులు కూడా ప్రమాణబద్ధమైన సేంద్రియ వ్యవసాయ విధానాలను పాటించి, తమ తమ పొలాలను సేంద్రియ సాగు ధ్రువీకరణ ప్రక్రియ పరిధిలోకి తీసుకురావాలి. ఈ ధ్రువీకరణ ప్రక్రియలో భాగంగా పొలాలకు సంబంధించి సంబంధిత అధికారులు సవివరమైన భూమి పత్రాల తయారీ (డాక్యుమెంటేషన్)పై క్రమం తప్పకుండా పరిశీలన జరపాల్సి ఉంటుంది. ఇక విస్తృత ప్రాంత ధ్రువీకరణ (ఎల్.ఎ.సి.) ప్రక్రియలో మాత్రం నిబంధనలు సరళంగా ఉంటాయి. ఈ ప్రక్రియ కింద, సాగు ప్రాంతాన్ని దాదాపుగా వెంటవెంటనే ధ్రువీకరణ జరిపేందుకు అవకాశం ఉంటుంది. ఎల్.ఎ.సి. అనేది సత్వర ధ్రువీకరణ ప్రక్రియ. అంతేకాక, రైతులకు వ్యయపరంగా వెసులుబాటు ఉంటుంది. రైతులు కూడా భాగస్వామ్య పూచీ పథకం కింద తమ ఉత్పాదనలకు మార్కెటింగ్ సుదుపాయం కోసం రెండు మూడేళ్ల వరకూ వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

  ఎల్.ఎ.సి. ప్రక్రియ కింద ఒక్కో ప్రాంతంలోని ఒక్కో గ్రామాన్ని, ఒక్కో గ్రూపుగా, సమూహం (క్లస్టర్) గా పరిగణిస్తారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియలు కూడా సరళంగా ఉంటాయి. వాటిని గ్రామాలవారీగా అమలుచేస్తారు. తమ అధీనంలోని వ్యవసాయ భూమికి, పశుగణానికి సంబంధించి రైతులు కూడా ప్రమాణబద్ధమైన పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. గ్రామాలవారీగా తనిఖీ ప్రక్రియ పూర్తి కాగానే, వారంతా సామూహికంగా ధ్రువీకరణ పొందుతారు. దీనితో వారు పరివర్తనా వ్యవధిని పాటించాల్సిన అవసరం కూడా ఉండదు. ధ్రువీకరణ ప్రక్రియ కూడా ఎప్పటికప్పుడు వార్షిక పరిశీలన, తనిఖీ ప్రాతిపదికన జరుగుతుంది.

నేపథ్యం

  సురక్షితమైన ఆహారం, రసాయనాల ఊసేలేని ఆహారోత్పాదనకు, ఆహారోత్పత్తిలో సుస్థిరతకు పూచీగా నిలిచే సేంద్రియ వ్యవసాయం చక్కని ఆచరణయోగ్యమైన ప్రత్యామ్నాయ సాగుగా ఇపుడు గుర్తింపు పొందింది. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి సంక్షోభం నేపథ్యంలో దీని ప్రాముఖ్యత, ఆవశ్యకత మరింత పెరిగింది. సేంద్రియ ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ కూడా పెరుగుతోంది. ఈ విషయంలో భారతదేశం ఏ మాత్రం మినహాయింపు కాదు. పర్యావరణపరంగా, మానవ ప్రయోజనాల పరంగా చూస్తే, రసాయనాల ఊసులేని పంటల సాగుకు ఉన్న ప్రాముఖ్యతను అర్థంచేసుకున్న కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆసక్తిని చూపిస్తోంది. సేంద్రియ సాగును, ప్రకృతి వ్యవసాయాన్ని కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రోత్సహిస్తూ వస్తోంది. పరంపరాగత్ కృషి వికాస్ కార్యక్రమం పరిధిలోని పలు పథకాల కింద సేంద్రియ సాగును ప్రభుత్వం 2014నుంచి విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. దేశం ఈశాన్య ప్రాంతంలో కూడా ఇందుకోసం సేంద్రియ పథకం అమలు చేస్తోంది. భారతదేశంలో ఇపుడు 30లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణానాన్ని సేంద్రియ సాగు ధ్రువీకరణ పరిధిలోకి తీసుకువచ్చారు.  సేంద్రియ సాగు అనే ఉద్యమంలో నెమ్మదిగా మరింత మంది రైతులు కూడా భాగస్వాములవుతున్నారు. సేంద్రియ సాగు పరిధిలోని భూమి విస్తీర్ణం ప్రకారం భారతదేశం ఐదవ స్థానంలో ఉన్నట్టు  2021వ సంవత్సరపు అంతర్జాతీయ సర్వే నివేదిక తెలిపింది. 2019 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే, సేంద్రియ సాగు ఉత్పత్తిదారుల సంఖ్య ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.

 

****(Release ID: 1714474) Visitor Counter : 209