ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ కేసుల భారం అధికంగాగల 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రెమ్‌డెసివిర్ సరఫరా చేయనున్న కేంద్ర ప్రభుత్వం

సరఫరా సజావుగా సాగేలా తయారీదారులకు రాష్ట్రాల కేటాయింపు;
డిమాండు-సరఫరాలను పర్యవేక్షించనున్న ‘ఎన్‌పిపిఎ’.. జాతీయ నియంత్రణ సంస్థ

Posted On: 21 APR 2021 9:40PM by PIB Hyderabad

దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇటీవల కోవిడ్-19 కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తలెత్తిన సమస్యల పరిష్కారంతోపాటు పరిస్థితిని సమర్థంగా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ‘సంపూర్ణ ప్రభుత్వం’ కింద కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చురుకైన చర్యలపై అత్యున్నత స్థాయిలో క్రమం తప్పకుండా సమీక్ష, పర్యవేక్షణ కొనసాగుతాయి. ఆస్పత్రులలో విషమస్థితిలోగల కోవిడ్-19 రోగుల సంఖ్య పెరిగిపోవడంతో వైద్యపరంగా కేసుల సమర్థ నిర్వహణ అవసరం కావడంతో ‘రెమ్‌డెసివిర్’కు డిమాండ్ పెరిగిపోయింది. ఈ మందును ప్రయోగాత్మక చికిత్సలో భాగంగా సముచిత రీతిలో మాత్రమే వాడాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకూ సూచించింది. అంతేకాకుండా ఈ మందును అక్రమంగా నిల్వచేయడం, నల్లబజారులో విక్రయించడంపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరింది.

   ఈ నేపథ్యంలో కోవిడ్-19 చికిత్సలో ‘రెమ్‌డెసివిర్’ ఇంజెక్షనుకు దేశమంతటా ఆకస్మిక డిమాండ్ పెరుగుదల దృష్ట్యా దీని దేశీయ తయారీదారుల ఉత్పత్తి సామర్థ్యం పెంచబడింది. తదనుగుణంగా తయారీదారుల కృషికి ప్రభుత్వం కూడా అన్నివిధాలా మద్దతునిస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం నెలకు 38 లక్షల ఇంజెక్షన్లు తయారవుతుండగా, ఉత్పత్తి సామర్థ్యాన్ని 74 లక్షల స్థాయికి పెంచే దిశగా 20 అదనపు తయారీ ప్రదేశాలకూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరోవైపు దేశీయ సరఫరాను పెంచడం లక్ష్యంగా 2021 ఏప్రిల్ 11 నుంచే ‘రెమ్‌డెసివిర్’ ఎగుమతులను నిషేధించింది. అంతేకాకుండా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఇంజెక్షన్ కొరతపై వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరఫరా సజావుగా సాగేలా కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఔషధ విభాగంతో సమన్వయం ద్వారా దేశంలోని 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 2021 ఏప్రిల్ 30వరకూ ‘రెమ్‌డెసివిర్’ సరఫరా అయ్యేలా మధ్యంతర కేటాయింపులు చేసింది.

   తీవ్ర, విషమస్థితిలోగల, ఆక్సిజన్ మద్దతు అనివార్యమైన కోవిడ్-19 కేసుల విషయంలో మాత్రమే ప్రయోగాత్మక చికిత్స కింద ‘రెమ్‌డెసివిర్’ ఇంజెక్షన్ వాడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైద్యపరమైన ఆక్సిజన్ అందజేయనున్న 14 రాష్ట్రాలకు, ఇంజెక్షన్ అధిక సరఫరా అవసరమున్న మరో 5 రాష్ట్రాలకు సంబంధించి ‘రెమ్‌డెసివిర్’ కేటాయింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 

***(Release ID: 1713370) Visitor Counter : 92


Read this release in: English , Urdu , Hindi , Bengali , Odia