సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పరిస్థితులలో కేంద్ర మంత్రిత్వశాఖలు/విభాగాలు కచ్చితంగా


పాటించాల్సిన మార్గదర్శకాలపై సిబ్బంది-శిక్షణ విభాగం ఆదేశాలు జారీ

Posted On: 19 APR 2021 9:22PM by PIB Hyderabad

కోవిడ్-19 కేసుల సంఖ్య అసాధారణ స్థాయిలో పెరగడంతోపాటు మహమ్మారి వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాల్సిన దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు కచ్చితంగా అనుసరించాల్సిన  కొన్ని సూచనలు/మార్గదర్శకాలపై కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖలోని సిబ్బంది-శిక్షణ విభాగం (డీవోపీటీ) ఈ రోజు ఆదేశాలు జారీచేసింది. ఇవి తక్షణం అమలులోకి రానుండగా 30.04.2021 వరకు లేదా తదుపరి ఆదేశాల జారీదాకా... ఏది ముందైతే ఆ తేదీవరకూ కొనసాగుతాయి. ఈ ఆదేశాల గురించి కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి-(డోనెర్) శాఖ (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పెన్షన్ల శాఖ, అణుశక్తి-అంతరిక్ష మంత్రిత్వశాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. ఇవాళ కొన్ని నిర్దిష్ట సూచనలతో జారీచేసిన అధికారిక ఉత్తర్వు (ఓఎం)ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు.

   ఈ ఉత్తర్వులకు అనుగుణంగా అండర్ సెక్రటరీ, తత్సమాన స్థాయి అధికారులందరూ స్వయంగా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ స్థాయికి దిగువనున్న సిబ్బంది వాస్తవ కార్యాలయ హాజరును 50 శాతానికి పరిమితం చేయాలి. సంబంధిత శాఖ కార్యదర్శి లేదా విభాగాధిపతి ఈ హాజరు పర్యవేక్షణ బాధ్యతను నిర్వర్తిస్తారు. అయితే, పాలన కారణాల రీత్యా మరింతమంది సిబ్బంది కార్యాలయ విధులకు హాజరు కావాలని కూడా వారు ఆదేశించవచ్చు. దీనికి తగినట్లుగా సిబ్బంది వంతులవారీ విధుల హాజరీని వారు సిద్ధం చేయవచ్చు. ఇక డిప్యూటీ సెక్రటరీ, తత్సమాన-అంతకుమించిన హోదాగల అధికారులు క్రమం తప్పకుండా కార్యాలయ విధులకు రావాల్సి ఉంటుంది. కార్యాలయాల్లో రద్దీని తగ్గించడంలో భాగంగా కింద చూపిన ప్రకారం నిర్దేశించిన విభజిత పని వేళలను అధికారులు/సిబ్బంది తప్పక అనుసరించాల్సి ఉంటుంది:

ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5:30 గంటలు

ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:00 గంటలు

ఉదయం 10:00 నుంచి సాయంత్రం 6:30 గంటలు

   ఏదైనా నిర్దిష్ట దినాన కార్యాలయానికి హాజరుకాని అధికారులు సమాచార మార్పిడి కోసం టెలిఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాన అందుబాటులో ఉండాలి. దీంతోపాటు అన్నివేళలా ఇంటినుంచి పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. నియంత్రణ మండళ్ల పరిధిలో నివసించే అధికారులకు ఆ మండళ్ల ప్రకటనను రద్దుచేసేదాకా కార్యాలయ హాజరీనుంచి మినహాయింపు కొనసాగుతుంది. దివ్యాంగులు, గర్భిణులకూ కార్యాలయ హాజరీనుంచి మినహాయింపు ఇవ్వవచ్చు. అయితే, తదుపరి ఆదేశాలు జారీ అయ్యేదాకా వారు ఇంటినుంచి పనిచేయడం కొనసాగించాలి.

   కార్యాలయ విధులకు హాజరయ్యే అధికారులందరూ కోవిడ్ అనుగుణ ప్రవర్తనా శైలిని తప్పక అనుసరించాలి. ఆ మేరకు మాస్కు ధారణ, భౌతిక దూరం, శానిటైజర్ వాడకం, తరచూ సబ్బు-నీటితో చేతులు శుభ్రం కడుక్కోవడం తదితర పద్ధతులను తూచా తప్పకుండా పాటించాలి. ఎలివేటర్లు, మెట్లమార్గాలు, వరండాలు, అల్పాహార ప్రాంతాలుసహా సామూహిక ప్రదేశాలు, వాహనాలు నిలిపే స్థలాల్లో గుమికూడకుండా జాగ్రత్త వహించాలి. సమావేశాలు నిర్వహించాల్సి వస్తే వీలైనంత వరకూ వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయాన్ని వాడుకోవాలి. అలాగే కార్యాలయాలకు బయటి వ్యక్తులు, సందర్శకుల రాకను అవసరమైనంత మేర తగ్గించాలి. ఈ నెల.. అనగా- 06.04.2021న జారీచేసిన అధికారిక ఉత్తర్వుకు అనుగుణంగా 45 ఏళ్లు, అంతకుమించి వయసున్న అర్హులైన ఉద్యోగులు టీకా తీసుకోవాల్సిందిగా సూచించడమైనది. ఇక ముఖ్యంగా పని ప్రదేశాలను... ముఖ్యంగా తరచూ అందరూ స్పర్శించే ప్రాంతాల్లో ఉపరితలాలను వీలైనన్ని సార్లు రోగకారక నిర్మూలన చర్యలద్వారా శుభ్రం చేస్తూండాలి.

   కోవిడ్ అనుగుణ ప్రవర్తనశైలిపై కేంద్ర దేశీయాంగ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ, సిబ్బంది-శిక్షణ మంత్రిత్వ శాఖలు ఎప్పటికప్పుడ జారీచేసే సూచనలు/ఆదేశాలను కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వశాఖలు/విభాగాల కార్యాలయాలు, ఉద్యోగులు తప్పనిసరిగా పాటించాలి. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా బయోమెట్రిక్ హాజరీ పద్ధతిని తాత్కాలికంగా నిలిపివేసి, ప్రత్యక్ష హాజరీ రిజిస్టర్లు నిర్వహించాలి. దేశ పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా ఈ సూచనలు/ఆదేశాలన్నిటినీ ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించగలరని ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు కూడా ఇదే మార్గదర్శకాలను అనుసరించగలవని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

***



(Release ID: 1712826) Visitor Counter : 147