వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాన్ని ప్రారంభించిన పీయూష్ గోయల్
ఈ పథకం సీడ్ ఫండింగ్‌ను పరిరక్షిస్తూ, ఆవిష్కరణకు స్ఫూర్తినిచ్చి, పరివర్తన తేగల భావనకు మద్దతునిచ్చి, అమలుకు తోడ్పడి, స్టార్టప్ విప్లవాన్ని ప్రారంభిస్తుంది
ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్న 3,600 స్టార్టప్‌లు
Posted On:
19 APR 2021 6:45PM by PIB Hyderabad
రైల్వేలు, వాణిజ్యం& పరిశ్రమ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ సోమవారం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీం (ఎస్ఐఎస్ఎఫ్ఎస్)ను ప్రారంభించారు. భావనల రుజువు, నమూనాల అభివృద్ధి, ఉత్పత్తి పరీక్షలు, మార్కెట్ ప్రవేశం, వాణిజ్యీకరణ చేసేందుకు స్టార్టప్‌లకు ఆర్ధిక సహాయాన్ని అందించడం ఈ పథకం లక్ష్యం. స్టార్టప్ ఇండియా చొరవ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా 16 జనవరి, 2021న ఏర్పాటు చేసిన ప్రారంభ్ః స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్ ను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేస్తూ ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇందుకోసం ఉద్దేశించిన రూ. 945 కోట్ల కార్పస్ నిధిని, భారతదేశ వ్యాప్తంగా ఉన్న అర్హులైన ఇన్‌క్యుబేటర్లు ( స్టార్టప్‌లకు యాజమాన్యం, నిర్వహణ తదితర అంశౄల్లో శిక్షణను ఇచ్చే సంస్థలు) ద్వారా అర్హులైన స్టార్టప్‌లకు రానున్న నాలుగేళ్ళల్లో అందించనున్నారు. దాదాపు 300 ఇన్‌క్యుబేటర్ల ద్వారా సుమారు 3,600 స్టార్టప్‌లకు ఈ పథకం మద్దతు కల్పిస్తుందని అంచనా.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రకటించిన 3 నెలల్లోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని, ఇటీవలి కాలంలో ఇంత వేగంగా ప్రారంభించినది ఈ పథకాన్నేనని గోయల్ చెప్పారు. ప్రస్తుతం కాలం క్లిష్టంగా ఉన్నప్పటికీ, తమ సంకల్పం బలంగా ఉందని, గతంలో ఎన్నడూ లేని విధంగా స్టార్టప్‌లను సాధికారం చేయడం తమకు అత్యంత ముఖ్యమని అన్నారు.
ఎస్ఐఎస్ఎఫ్ఎస్ సీడ్ ఫండింగ్‌ను పరిరక్షించడమే కాక, ఆవిష్కరణకు స్ఫూర్తిని ఇచ్చి, పరివర్తన తేగల భావనలకు మద్దతునిచ్చి, అమలుకు సౌలభ్యాన్ని కల్పించి, స్టార్టప్ విప్లవాన్ని ప్రారంభిస్తుందని మంత్రి తెలిపారు. ఈ పథకం బలమైన స్టార్టప్ వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు. ముఖ్యంగా, భారతదేశంలో తరచుగా నిధుల కొరత ఉండే టైర్ 2, టైర్ 3 పట్టణాలు దీని నుంచి లబ్ధి పొందుతాయన్నారు. తాను ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆవిష్కర్తలు ముందుకు వచ్చి, ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని కోరుకుంటున్నానని మంత్రి చెప్పారు.
ప్రధానమంత్రి మోడీ మార్గదర్శనంలో, భారతదేశంలోని స్టార్టప్ వాతావరణంలో బలమైన మార్పును తెచ్చేందుకు డిపిఐఐటి అవిశ్రాంతంగా పని చేసిందని గోయల్ అన్నారు. ఈ శాఖ ద్వారాలు తెరిచి, ఎటువంటి అభిప్రాయాలు లేకుండా, పెద్ద ఎత్తున యువత ఆవిష్కరణ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించి, ఆహ్వానిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఉపాధి కోరుకుంటున్నవారి నుంచి ఉపాధి కల్పించే వారి వరకూ దృక్పధంలోనూ, వైఖరిలోనూ మార్పు వచ్చిందని, ఇది నవీన భారతదేశానికి స్టార్టప్‌లు వెన్నుముక కావడానికి తోడ్పడుతోందని మంత్రి వివరించారు. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీం భావనలు, వాటి అమలుకు మధ్య వారధిలా వ్యవహరిస్తుందన్నారు. స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో స్వతంత్ర, అత్యున్నత స్థాయి లక్ష్యం వ్యవస్థాపకతను ప్రోత్సహించడమే కాక, ఆవిష్కరణలను గుర్తించే సంస్కృతిని సృష్టిస్తాయన్నారు.
భారతీయ స్టార్టప్‌ల పరివర్తనా సామర్ధ్యానికి 2020 ఒక హామీ పత్రంలాంటిదని- తమ శక్తి, ఉత్సాహంతో స్టార్టప్‌లు సమర్ధవంతమైన, సరసమైన పరిష్కారాలతో ముందుకు రావడంతో భారతదేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సరఫరా చివరి మైలు వరకు అందించడం సాధ్యమైందని గోయల్ చెప్పారు. యువ వాణిజ్యవేత్తల సామర్ధ్యాన్ని, చురుకుదనాన్ని, అంకితభావాన్ని ఆయన కొనియాడారు. భారతీయ స్టార్టప్‌లు కేవలం దేశం కోసమే కాక సకల మానవాళి కోసం శిక్షణ పొందుతూ, ఉత్పత్తి చేస్తూ, ఆవిష్కరణలు చేస్తున్నాయన్నారు.
అనుసంధానం, సహకారం, ఉత్ప్రేరణ నినాదంతో, స్టార్టప్ ఆవిష్కరణ సవాళ్ళు, జాతీయ స్టార్టప్ అవార్డులు, రాష్ట్రాలకు ర్యాంకింగ్‌లు, ఎస్‌సిఒ స్టార్టప్ ఫోరం, ప్రారంభ్ తదితరాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి చెప్పారు.
ఈ పథకం కోసం డిపిఐఐటి సృష్టించిన ఆన్‌లైన్ పోర్టల్ దీని కింద నిధుల కోసం ఇన్‌క్యుబేటర్లు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తుంది. అలాగే, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీంను అమలు చేసేందుకు, పర్యవేక్షించేందుకు డిపిఐఐటి నిపుణులతో సలహా కమిటీ (ఇఎసి)ని సృష్టించింది. ఇఎసి ఎంపిక చేసిన అర్హులైన ఇన్‌క్యుబేటర్లకు దాదాపు రూ. 5 కోట్ల వరకు నిధులను అందిస్తారు. తమ భావనకు రుజువు, లేక నమూనా అభివృద్ధి లేక ఉత్పత్తి పరీక్షల ధృవీకరణ కోసం ఎంపికైన ఇన్‌క్యుబేటర్లు రూ. 20 లక్షలవరకు నిధులను స్టార్టప్‌లకు మంజూరు చేస్తారు. స్టార్టప్‌లు మార్కెట్లోకి ప్రవేశించేందుకు, వాణిజ్యీకరణకు రూ. 50 లక్షలవరకు పెట్టుబడులను లేక మార్చ దగిన రుణపత్రాలు (కన్వెర్టబుల్ డిబెంచర్లు) లేక రుణ సంబంధ పరికరాల ద్వారా అందిస్తారు. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీంకు సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలను స్టార్టప్ ఇండియా పోర్టల్ లో (www.startupindia.gov.in) ఉంచడం జరిగింది.
మంచి భవిష్యత్తు లేదా ఆశాజనకంగా ఉన్న స్టార్టప్‌లకు వాటి తొలి దశలోనే మద్దతు ఇవ్వడం వల్ల అందరికీ భారీ ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. దేశం నలుమూలల్లో ఉన్న స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చేందుకు 300 ఇన్‌క్యబేటర్లకు దృశ్యమాధ్యమం ద్వారా స్టార్టప్‌లకు శిక్షణను ఇవ్వడాన్ని ప్రోత్సహించేలా చూడాలని సీడ్ ఫండ్ పథకం యోచిస్తోంది. భారతదేశంలోని టైర్ 2, టైర్ 3 ప్రాంతాలలో ఆవిష్కరణలు పెరగడం ద్వారా దీని ప్రభావం స్పష్టమవుతుంది.
***
(Release ID: 1712760)
Visitor Counter : 271