రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఎస్పీఓటూ ఆధారిత అనుబంధ ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థను రూపొందించిన డీఆర్‌డీవో; ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో ఇదొక వరం

Posted On: 19 APR 2021 4:32PM by PIB Hyderabad

'రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ' (డీఆర్‌డీవో), ఎస్పీఓటూ (రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి) ఆధారిత అనుబంధ ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థను రూపొందించింది. పర్వతాల్లోని అత్యధిక ఎత్తైన ప్రాంతాల్లో విధులు నిర్వహించే సైనికుల కోసం దీనిని తయారు చేసింది. డీఆర్‌డీవోకు చెందిన, బెంగళూరులోని 'డిఫెన్స్‌ బయో ఇంజినీరింగ్‌ &ఎలక్ట్రో మెడికల్‌ ల్యాబొరేటరీ' (డీఈబీఈఎల్‌) ఈ కొత్త వ్యవస్థకు రూపునిచ్చింది. ప్రాణాంతకంగా మారే 'హైపోక్సియా'కి (కణజాలానికి ఆక్సిజన్‌ అందని స్థితి) సైనికులు గురికాకుండా, ఎస్పీఓటూ స్థాయుల ఆధారంగా అనుబంధ ఆక్సిజన్‌ను ఈ వ్యవస్థ అందిస్తుంది. ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో ఈ స్వయంచాలిత వ్యవస్థ ఒక వరంగా కూడా మారగలదు.

    రక్తం ద్వారా కణజాలానికి చేరే ఆక్సిజన్ సరిపోక, శరీరానికి కావలసిన కనీస శక్తి కూడా అందని పరిస్థితే హైపోక్సియా. ఒక వ్యక్తికి కరోనా వైరస్‌ సోకిన తర్వాత సరిగ్గా ఇదే పరిస్థితి తలెత్తుతోంది. ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారకాల్లో ఇది కూడా ఒకటిగా మారింది.

    వాతావరణ ఒత్తిళ్లు, తక్కువ ఉష్ణోగ్రతలు, తేమతో కూడిన పర్వతాగ్రాలపై సమర్థవంతంగా పనిచేసేలా ఈ వ్యవస్థ హార్డ్‌వేర్‌ను రూపొందించారు. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో నమ్మకమైన పనితనాన్ని నిర్ధరించేలా ఈ వ్యవస్థలో పొందుపరిచిన సాఫ్ట్‌వేర్ భద్రత తనిఖీలు కీలకంగా ఉంటాయి.

    మణికట్టు వద్ద ఏర్పాటుచేసే 'పల్స్ ఆక్సీమీటర్ మాడ్యూల్' నుంచి 'వైర్‌లెస్ ఇంటర్‌ఫేస్‌' ద్వారా ఒక వ్యక్తి ఎస్పీఓటూ స్థాయులను ఈ పరికరం గుర్తిస్తుంది. ఆ స్థాయులకు అనుగుణంగా శరీరానికి ఆక్సిజన్ సరఫరా జరిగేలా 'సోలెనాయిడ్ వాల్వ్‌'ను నియంత్రిస్తుంది. ఎక్కడికైనా మోసుకెళ్లగలిగే తేలికపాటి సిలిండర్ నుంచి సన్నటి పైపుల ద్వారా ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. ఒక లీటరు, ఒక కిలో బరువుతో 150 లీటర్ల ఆక్సిజన్ సరఫరా నుంచి 10 లీటర్లు, 10 కిలోల బరువుతో 1500 లీటర్ల ఆక్సిజన్ సరఫరా వరకు వివిధ పరిమాణాల్లో ఈ వ్యవస్థ లభిస్తుంది. నిమిషానికి రెండు లీటర్ల (ఎల్‌పీఎం) ఆక్సిజన్‌ పంపిణీతో 750 నిమిషాలు ఇది పని చేయగలదు.
    
    క్షేత్ర స్థాయి పరిస్థితుల కోసం ఈ పరికరాన్ని దేశీయంగా రూపొందించడం వల్ల, చవకగా లభించడంతోపాటు మెరుగైన పనితీరును కనబరిచే ప్రత్యేక లక్షణాలతో ఇది ఉంటుంది. దీనిని ఇప్పటికే భారీగా ఉత్పత్తి కూడా చేస్తున్నారు.

    ప్రస్తుత మహమ్మారి సమయంలో ఈ పరికరం ఒక వరం. కొద్దిపాటి కరోనా లక్షణాలతో ఇంట్లోనే ఉండి ఆక్సిజన్‌ ఆధారిత చికిత్స తీసుకునే రోగులకు దీని ద్వారా 2/5/7/10 ఎల్పీఎంతో ఆక్సిజన్‌ అందించవచ్చు. ఎస్పీఓటూ స్థాయి పడిపోతే ఈ స్వయంచాలిత వ్యవస్థ అలారం మోగిస్తుంది కాబట్టి, ఇంట్లో ఉపయోగించుకునేవారికి ప్రయోజనకారి. అవసరాన్ని బట్టి 2, 5, 7, 10 ఎల్పీఎం ఆక్సిజన్‌ సరఫరాను స్వయంచాలితంగా తగ్గిస్తుంది లేదా పెంచుతుంది. దీనివల్ల నమోదయ్యే సరైన ఆక్సిజన్‌ సరఫరా రేటు కారణంగా ప్రాణవాయువు ఆదా అయ్యి, ఎక్కువ కాలం వస్తుంది.

    సాధారణ వ్యక్తులు కూడా దీనిని సులభంగా నిర్వహించే సౌలభ్యం ఉన్నందున, రోగి ఎస్పీఓటూ స్థాయులను నిరంతరం పర్యవేక్షించే శ్రమ వైద్య సిబ్బందికి తగ్గుతుంది. క్రమబద్ధీకరించిన 'ఫ్లో కంట్రోల్ వాల్వ్' (పీఎఫ్‌సీవీ) ద్వారా, తక్కువ ఆక్సిజన్‌ స్థాయుల వద్ద (ముందే ఏర్పాటు చేసిన <90%, <80%) ఆక్సిజన్ వినియోగాన్ని ఆదా చేయడానికి (± 0.5 ఎల్పీఎంతో 1-10 ఎల్పీఎం) 'ఆటోమేటెడ్ కాలిబ్రేటెడ్ వేరియబుల్ ఫ్లో కంట్రోల్‌' ఉపకరిస్తుంది. పరిమిత లక్షణాలున్న కొవిడ్‌ రోగికి, తక్కువ స్థాయి ఆక్సిజన్‌ వ్యవస్థ నుంచి 750 నిమిషాల పాటు ఆక్సిజన్‌ అందించే '10 కేజీలు-1500 లీటర్ల ఆక్సిజన్‌ వ్యవస్థ' వరకు అవసరం.

    వైద్య వనరులు పరిమిత స్థాయిలో లభ్యమవుతున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చిన ఈ స్వయంచాలక, సులభతర ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థ ఒక వరం వంటిది. ఈ పరికరం ఉత్పత్తి, దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో నమోదవుతున్న కరోనా రోగుల నిర్వహణలో తలెత్తుతున్న ఇబ్బందులను తగ్గిస్తుంది.

***


(Release ID: 1712757) Visitor Counter : 307