ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ కట్టడిపై కేంద్ర ఆరోగ్య మంత్రి అత్యున్నత సమీక్ష
కేసులు పెరిగే 11రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరిస్థితిపై చర్చ
కరోనాపై పోరులో కేంద్రం మద్దతు కొనసాగుతుందని హామీ
ఆక్సిజన్, వెంటలేటర్లు, మానవ వనరులు, మందులు,
ఆసుపత్రి పడకల పెంపుపై రాష్టాలకు సూచనలు
Posted On:
17 APR 2021 3:59PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇటీవల కోవిడ్-19 వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ కేసుల కట్టడిపై ఈ రోజు జరిగిన ఒక అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. కోవిడ్ వ్యాప్తి నిరోధం, నియంత్రణా చర్యల నిర్వహణకోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్న చర్యలపై 11రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖా మంత్రులతో కేంద్రమంత్రి ఈ సమీక్ష నిర్వహించారు. మూడు గంటలకు పైగా ఈ సమీక్షా సమావేశం జరిగింది. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఆందోళనకరంగా కోవిడ్ కేసులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర ఆరోగ్యమంత్రి మాట్లాడుతూ, కొత్త కేసుల పెరుగుతున్న తీరును క్లుప్తంగా వివరించారు. భారతదేశంలో ఈ నెల 12వ తేదీన ఒకే రోజున అత్యధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయని, ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నా అత్యధిక సంఖ్యలో కేసులు కూడా అదే రోజున దేశంలో రికార్డయ్యాయని అన్నారు. ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 22.8శాతం కేసులు భారత్ లోనే రికార్డయ్యాయన్నారు. “భారతదేశంలో ప్రస్తుతం అతి వేగంగా 7.6శాతం వృద్ధి రేటుతో కొత్త కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.“ అన్నారు. గత ఏడాది జూన్ నెలలో కేసుల వృద్ధి రేటు 5.5శాతం ఉండగా, ప్రస్తుతం దానికి 1.3రెట్లు ఎక్కువగా కేసులు తలెత్తుతున్నాయన్నారు. దీనితో ప్రతిరోజూ క్రియాశీలక కోవిడ్ కేసుల వృద్ధి ఆందోళనకరమైన స్థాయిలో ఉందని ప్రస్తుతం క్రియాశీలక కేసుల సంఖ్య 16,79,000కు చేరిందని అన్నారు. మరణాల్లో కూడా ఏకంగా 10.2శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు. రోజువారీ కొత్త కేసుల సంఖ్య, రోజూ కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య మధ్య అంతరం పెరుగుతున్నదంటే,..రికవరీల సంఖ్యకంటే వ్యాధి వ్యాప్తి వేగమే ఎక్కువగా ఉన్నట్టుగా, క్రియాశీలక కేసులు (యాక్టివ్ కేసులు) పెరుగుతున్నట్టుగా భావించవచ్చని అన్నారు. ”అత్యధిక రోజువారీ కేసుల సంఖ్యను 11రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే దాటేశాయి. ముంబై, పుణె, నాసిక్, ఠాణె, లక్నో, రాయ్.పూర్, అహ్మదాబాద్, ఔరంగా బాద్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.. ” అని ఆయన అన్నారు.
కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచుకున్న అంశాన్ని కూడా డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. : “కరోనా మహమ్మారి తొలిసారి విరుచుకుపడినపుడు ఉన్న ఒకే ఒక లేబరేటరీ స్థాయినుంచి 2,463 లేబరేటరీల స్థాయికి ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెరిగాయి. దీనితో ప్రతిరోజూ 15లక్షలమేర కరోనా పరీక్షలు నిర్వహించగలుగుతున్నాం. గత 24 గంటల్లో మొత్తం 14,95,397 పరీక్షలు నిర్వహించాం. దీనితో ఇప్పటి వరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 26,88,06,123కు చేరింది. వ్యాధి తీవ్రత ప్రాతిపదికగా కోవిడ్ కేసుల చికిత్స కోసం మూడంచెల మౌలిక సదుపాయాల పద్ధతిని అనుసరిస్తున్నాం. దీనితో ఇపుడు 2,084 కోవిడ్ ఆసుపత్రులు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో 89 కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుండగా, మిగిలిన 1,995 ఆసుపత్రులు రాష్ట్రాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 4,043 కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు, 12,673 కోవిడ్ కేర్ సెంటర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటిలో మొత్తంగా 18,52,265 పడకలు ఉండగా, 4,68,974 పడకలు కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రుల్లోనే ఉన్నాయి.” అని అన్నారు. గత ఏడాది కేంద్రం 34,228 కృత్రిమ శ్వాస పరికరాలను (వెంటిలేటర్లను) రాష్ట్రాలకు మంజూరు చేసిందని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. తాజాగా, 1,121 వెంటిలేటర్లను మహారాష్ట్రకు అందించనున్నట్టు ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 1,700, జార్ఖండ్ కు 1,500, గుజరాత్ కు 1,600, మధ్యప్రదేశ్ కు 152, చత్తీస్ గఢ్ కు 230 వెంటిలేటర్లు సరఫరా చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి చెప్పారు.
ఆయా కేటగిరీలలో వ్యాక్సీన్ అందుకున్న వారి సంఖ్యను డాక్టర్ హర్షవర్ధన్ వివరిస్తూ, వ్యాక్సీన్ల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటివరకూ వినియోగించిన వ్యాక్సీన్ల సంఖ్య (వృథా అయిన వాటితో సహా) దాదాపు 12కోట్ల 57 లక్షల 18 వేల డోసులుగా ఉందని, కేంద్రం 14కోట్ల, 15లక్షల డోసులను రాష్ట్రాలకు అందించిందని ఆయన చెప్పారు. దాదాపు కోటీ 58లక్షల వ్యాక్సీన్ డోసులు ఇప్పటికీ రాష్ట్రాలకు అందుబాటులో ఉన్నాయని, మరో కోటీ 16లక్షల 84 వేల వ్యాక్సీన్లు సరఫరా అయ్యే దశలో ఉన్నాయని వచ్చే వారానికల్లా ఆ వ్యాక్సీన్లు విడుదలవుతాయని మంత్రి చెప్పారు. “ప్రతి చిన్న రాష్ట్రంలోనూ నిల్వలు 7 రోజుల తర్వాత తిరిగి భర్తీ అవుతూ ఉన్నాయి. పెద్ద రాష్ట్రాల్లో 4 రోజుల తర్వాత భర్తీ అవుతున్నాయి” అని ఆయన అన్నారు. వ్యాక్సీన్లకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. వ్యాక్సీన్లను అందించే కసరత్తును మరింత వేగవంతం చేయాలని ఆయన గట్టిగా పిలుపునిచ్చారు.
జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్.సి.డి.సి.) డైరెక్టర్ డాక్టర్ ఎస్.కె. సింగ్ మాట్లాడుతూ, ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాప్తి పరిస్థితిపై విశ్లేషణను అందించారు. రోజువారీ కేసుల పెరుగుదల, అనేక జిల్లాల్లో రోజువారీ పాజిటివ్ కేసులు, వేగంగా పెరుగుతున్న మరణాల రేటు, ఆయా రాష్ట్రాల్లో ఆసుపత్రులు, మౌలిక సదుపాయాల వ్యవస్థ, మరింత మంది ఆరోగ్య రక్షణ సిబ్బంది ఆవశ్యకత వంటి అంశాలను ఆయన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో పంచుకున్నారు.
కోవిడ్ కేసుల కట్టడికి, చికిత్సకు తాము తీసుకుంటున్న చర్యలను గురించి ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖల మంత్రులు ఈ సమావేశంలో వివరించారు. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాను బలోపేతం చేయడం, ఆసుపత్రుల్లో రెమ్ డెసివిర్ ఇంజక్షన్ల సరఫరాను మెరుగుపరచడం, వెంటిలేటర్ల నిల్వలను మరింత పెంచడం, వ్యాక్సీన్ డోసుల సంఖ్యను పెంచడం వంటి అంశాలను దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు ప్రస్తావించారు. వైద్యపరంగా వినియోగించే ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను క్రమబద్ధం చేయడం, నల్లబజారులో అసాధారణ ధరలకు అమ్ముడుబోయిన రెమ్ డెసివిర్ వంటి అత్యవసర ఔషధాల ధరలను నియంత్రించడం వంటి అంశాలను సమీక్షలో పాల్గొన్న పలువురు ప్రస్తావించారు. మహారాష్ట్రలో రెట్టింపు ఉత్పరివర్తనాలతో కరోనా స్ట్రెయిన్ వ్యాపించడంపై కీలకంగా చర్చ జరిగింది. దీనిపై సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఇక, ఢిల్లీలోని కేంద్రప్రభుత్వ ఆసుపత్రుల్లో గత ఏడాదిలో చేసినట్టుగా అదనపు పడకలు ఏర్పాటు చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం తలెత్తిన అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనడానికి ఇది అవసరమని పేర్కొంది.
కాగా, ప్రకృతి వైపరీత్య ప్రతిస్పందనా నిధికి సంబంధించిన వార్షిక కేటాయింపు నిధిలో సగం మొత్తాన్ని రాష్ట్రాలు వాడుకునేందుకు, జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద ఇప్పటివరకూ వినియోగించని పెండింగ్ నిధులను వాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇస్తూ తాను నోటిఫికేషన్ జారీ చేసిన అంశాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. జాతీయ ఆరోగ్య పథకం కింద ఈ నెల ఒకటవ తేదీనాటికి వినియోగించని పెండింగ్ నిధులను కోవిడ్ కట్టడికోసం రాష్ట్రాలు వాడుకోవడానికి వీలుగా నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఈ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, వైద్యపరంగా వినియోగించే ఆక్సిజన్ సరఫరాకు, రెమ్ డెసివిర్ నిల్వలను బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యలను రాష్ట్రాలకు వివరించారు. పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డి.పి.ఐ.ఐ.టి.) కార్యదర్శి, ఔషధ వ్యవహారాల శాఖ కార్యదర్శి తనతో జరిపిన అనేక సమావేశాల అనంతరం ఈ మేరకు చర్య తీసుకున్నట్టు తెలిపారు. వైద్యపరమైన ఆక్సిజన్ సరఫరా విధానానికి సంబంధించి అక్సిజన్. తయారీ సంస్థలనుంచి ఒక క్యాలెండర్ ను రాష్ట్రాలకు విడుదల చేసినట్టు ఈ సందర్భంగా తెలిపారు. తయారీ సంస్థలనుంచి ఆక్సిజన్ సిలిండర్లను నిరాటంకంగా పంపించేందుకు తీసుకున్న చర్యలను కూడా వివరించారు.
గత ఫిబ్రవరి నెలనుంచి కోవిడ్ కేసులు పెరగడం, చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే అత్యధిక కేసులు నమోదు కావడం తదితర అంశాలను డాక్టర్ హర్షవర్ధన్ వివరిస్తూ, పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. ముందు ముందు కేసులు మరింతగా పెరిగినా పరిస్థితిని దీటుగా ఎదుర్కొనేలా కోవిడ్ ఆసుపత్రుల సంఖ్యను, అక్సిజన్ సదుపాయం కలిగిన పడకల సంఖ్యను పెంచాలని, వైద్యపరమైన ఇతర మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. తమతమ పరిధిలోని ఐదారు నగరాలపై దృష్టిని కేంద్రీకరించాలని, కోవిడ్ కట్టడిలో భాగంగా ఈ నగరాలను వైద్య కళాశాలలతో గానీ, ఆయా నగరాలకు ఆనుకుని ఉన్న రెండుమూడు జిల్లాలతో గానీ అనుసంధానం చేసుకోవాలని ఆయన రాష్ట్రప్రభుత్వాలను కోరారు. వైరస్ లక్షణాలు పొడసూపిన వెంటనే పాజిటివ్ కేసులను పసిగట్టాలని, వైరస్ సోకిన రోగుల ఆరోగ్య పరిస్థితి మరింత విషమించకుండా నివారించేందుకు ఇది వీలు కలిగిస్తుందని ఆయన సూచించారు. కమ్యూనిటీ క్వారంటైన్ సాధించేందుకు కంటెయిన్మెంట్ జోన్ల పరిధిని పెంచాలని వైరస్ కట్టడికి దీన్ని ఒక వ్యూహంగా తీసుకోవాలని అన్నారు. వైరస్ ఉత్పరివర్తనాల తీరును ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు వీలుగా వాటి పరీక్షలకు సంబంధించిన చిత్రాలను కోవిడ్ కు సంబంధించిన ఇండియన్ జినోమిక్ కన్షార్షియా నోడల్ అధికారికి పంపించాలని కేంద్రమంత్రి రాష్ట్రాలకు మరోసారి గుర్తు చేశారు. వైరస్ స్ట్రెయిన్ల ఉత్పరివర్తనా ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకునేందుకు జినోమ్ సీక్వెన్సెంగ్ కోసం తాము తీసుకున్న చర్యలను ఎన్.సి.డి.సి. డైరెక్టర్ ఈ సమీక్షా సమావేశంలో వివరించారు.
ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులు వరుసగా...టి.ఎస్. సింగ్ దేవ్ (చత్తీస్ గఢ్), సత్యేంద్ర జైన్ (ఢిల్లీ), డాక్టర్ కె. సుధాకర్ (కర్ణాటక), డాక్టర్ ప్రభురామ్ చౌదరి (మధ్యప్రదేశ్), రాజేశ్ తోపే (మహారాష్ట్ర), జై ప్రతాప్ సింగ్ (ఉత్తరప్రదేశ్), కె.కె. శైలజ (కేరళ), డాక్టర్ రఘు శర్మ (రాజస్థాన్). ఆయా రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖల కార్యదర్శులు, అదనపు ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా సమీక్షా సమావేశంలో పాలుపంచుకున్నారు
****
(Release ID: 1712523)
Visitor Counter : 244