రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ 2021 సీజన్లో ఎరువుల లభ్యత ఉండేలా పలు చర్యలు తీసుకున్న ప్రభుత్వం
Posted On:
14 APR 2021 11:01AM by PIB Hyderabad
ఖరీఫ్ 2021 సీజన్లో ఎరువుల లభ్యతను సమీక్షించడానికి, కేంద్ర మంత్రులు (కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్) డి. వి. సదానంద గౌడ, ఆ శాఖ సహాయమంత్రి మన్సుఖ్ మాండవియా 12.04.2021 న సాయంత్రం 04.00 గంటలకు ప్రముఖ తయారీదారులు / దిగుమతిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎరువుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశీయంగా లక్షిత ఉత్పత్తి గురించి, వివిధ కంపెనీల ఎరువులు/ముడిసరుకుల దిగుమతుల గురించి వివరంగా చర్చించారు. దేశంలో యూరియా లభ్యతకు సంబంధించి, రాబోయే కాలంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు వివిధ యూరియా యూనిట్ల పునరుద్ధరణకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఎరువుల పరిశ్రమ ప్రశంసించింది. ప్రస్తుతం నడుస్తున్న ఖరీఫ్ 2021 సీజన్లో ఏ ఒక్క రాష్ట్రంలోనూ యూరియా లభ్యతకు ఇబ్బందులు లేవని ఎరువులశాఖ కార్యదర్శి తెలిపారు.
ఖరీఫ్ 2021 సీజన్లో పోస్పాటిక్, పొటాసిక్ ఎరువులు సకాలంలో తగినంతగా రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రతి కంపెనీ సంసిద్ధతను అంచనా వేశారు. ముడి పదార్థాలు, ఎరువుల ధరల పెరుగుదల , ఈ విషయంలో ప్రపంచ పోకడలు వంటి వివిధ సమస్యలను కంపెనీలు ఈ సందర్భంగా ప్రస్తావించాయి. దేశానికి మేలు చేసేలా రూపొందించిన వారి వ్యూహం గురించి తెలియజేశాయి. ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఐఐ) డైరెక్టర్ జనరల్ సతీశ్ చంద్ర ఖరీఫ్ మాట్లాడుతూ 2021 సీజన్ మొదటి మూడు నెలల డిమాండ్‌ను అందుకోవడానికి తగినన్ని నిల్వలు ఉన్నాయని ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు.
07.04.2021 నాటి నోటిఫికేషన్ ద్వారా ఇఫ్కో ఫాస్ఫాటిక్ ఎరువుల ధరల పెంచడానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ముడి పదార్థాల ధరల పెరుగుదలకు సంబంధించి కంపెనీల ఆందోళనలను ప్రభుత్వం అర్థం చేసుకుంది. యుఎస్ఎ, బ్రెజిల్ చైనా వంటి ప్రధాన ఎరువుల మార్కెట్లలో పోటీ, డిమాండ్ కారణంగా గత మూడు, నాలుగు నెలల్లో, ముడి పదార్థాలు, ఫినిష్డ్ ప్రొడక్టుల ధరలు గణనీయంగా పెరిగాయని కంపెనీలు విశదీకరించాయి. మొరాకో, రష్యా నుండి దిగుమతులపై యుఎస్ఎ కౌంటర్వైలింగ్ సుంకం విధించడం, మధ్యప్రాచ్య దేశాల నుంచి సరఫరాలను అమెరికాకు మళ్లించడంతో సరఫరా గొలుసు మారిందని కంపెనీలు తెలియజేశాయి. చైనాలో డిమాండ్ పెరగడం, దిగుమతులు తగ్గడం వల్ల భారత ఉపఖండానికి సరఫరాలు పడిపోయాయి. యూరప్, యుఎస్ఎ మార్కెట్లలో డీఏపీ ధరలు పెంచాలని అంతర్జాతీయ కంపెనీలు కోరుతున్నాయి. సరఫరా, ధరల వ్యవస్థను సజావుగా ఉంచేలా సరఫరాదారులను ఒప్పించడానికి దౌత్య మార్గం ద్వారా ప్రభుత్వ జోక్యం కోసం కంపెనీలు అభ్యర్థించాయి.
వివిధ రాష్ట్రాలకు వివిధ ఎరువుల అవసరాలను ఈ సందర్భంగా కార్యదర్శి (ఎరువులు) ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వివిధ ఎరువుల సరఫరాల గురించి సకాలంలో తెలియజేయాలని కంపెనీలకు సూచించారు. కంపెనీలు రాబోయే రోజుల్లో రైతులకు సకాలంలో, తగినంత మొత్తంలో, సరసమైన ధరలకు అందిస్తామని కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు. రిటైల్ పాయింట్లు, హోల్‌సేల్ పాయింట్లు, రేక్ పాయింట్లు, గిడ్డంగులు మొదలైన వాటి వద్ద ఉన్న పాత రేట్ల ప్రకారమే అమ్ముతామని అన్ని ప్రధాన కంపెనీలు స్పష్టం చేశాయి. పోస్పాటిక్, పొటాసిక్ ఎరువుల ధరను మార్చడానికి ముందు, ఎరువుల శాఖను సంప్రదించాలని ఎరువులు, రసాయనాలశాఖ సహాయమంత్రి (కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్) అన్ని సంస్థలకు సూచించారు. ఎఫ్ఏఐతో పాటు కంపెనీలు ఒక బృందంగా ఏర్పడి అంతర్జాతీయ సరఫరాదారులతో చర్చలు జరుపుతాయని, పోస్పాటిక్, పొటాసిక్ ఎరువుల విషయంలో ముడిసరుకు, తుది ఉత్పత్తుల కోసం ఉత్తమమైన ఒప్పందాన్ని పొందడానికి వ్యూహాన్ని అవలంబిస్తామని పరిశ్రమ ప్రముఖులు హామీ ఇచ్చారు. వివిధ ఎరువులు సకాలంలో లభించేలా చూడటానికి పరిశ్రమ చేస్తున్న కృషిని మంత్రి ప్రశంసించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారి ప్రయత్నాలకు తోడ్పడే అన్ని అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటాయని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ వనరుల నుండి ముడిసరుకులు, ఫినిష్డ్ ఫెర్జిలైజర్స్ సకాలంలో సరఫరా కావడానికి దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చారు. బ్లాక్ మార్కెటింగ్, అక్రమంగా నిల్వ చేయడాన్ని అడ్డుకోవడం, ఎరువుల ట్యాగింగ్ తప్పనిసరి చేసేలా అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఖరీఫ్ 2021 సీజన్లో ఎరువుల లభ్యతకు ఇబ్బంది ఉండదని, ఈ విషయంలో అవసరమైన అన్ని సమష్టి ప్రయత్నాలు చేయాలని సమావేశం నిర్ణయించింది.
***
(Release ID: 1711819)
Visitor Counter : 167