జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్ వార్షిక కార్యాచరణను సిద్ధంచేసిన హర్యానా, ఒడిశా


రాష్ర దినోత్సవం నవంబర్ 2020 నాటికి 'హర్ ఘర్ జల్' రాష్ట్రంగా హర్యానా

Posted On: 13 APR 2021 4:21PM by PIB Hyderabad

జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా  తమ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వున్న ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇవ్వడానికి 2021-22 ఆర్ధిక సంవత్సరంలో అమలు చేయనున్న కార్యాచరణ పథకాన్ని హర్యానా, ఒడిశా రాష్ట్రాలు సిద్ధం చేశాయి. తాము అమలు చేయనున్న కార్యాచరణ కార్యక్రమాలను రెండు రాష్ట్రాలు ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించాయి. తమ రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిన నవంబర్ 21, 2022 నాటికి జల్ జీవన్ మిషన్ లక్ష్యాన్ని సాధిస్తామని హర్యానా తెలియజేసింది. నిర్ధేశించిన జాతీయ లక్ష్యం కన్నా ముందుగానే హర్యానా ఈ లక్ష్యాన్ని చేరుకోనున్నది. 2024 నాటికి లక్ష్యాన్ని చేరుకుంటామని ఒడిశా పేర్కొంది. 

జల్ జీవన్ మిషన్ కింద  జరుగుతున్న పథకాల అమలుపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు సిద్ధం చేసిన వార్షిక కార్యాచరణ ప్రణాళికలను  డిడిడబ్ల్యుఎస్ కార్యదర్శి అధ్యక్షతన వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు / శాఖల అధికారులు, నీతి ఆయోగ్ అధికారులు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ గత నెల రోజులుగా సమీక్షిస్తూ వాటిని ఆమోదిస్తూ వస్తోంది. కమిటీ ఆమోదం పొందిన తరువాత పథకం అమలుకు అవసరమైన నిధులను విడుదల చేయడం జరుగుతోంది. కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరును క్షేత్ర సందర్శనలు, సమీక్షా సమావేశాల ద్వారా మదింపు వేస్తూ జల్ జీవన్ మిషన్ లక్ష్యాల మేరకు అమలు జరిగేలాచర్యలను అమలు చేస్తున్నారు. 

రెండు రాష్ట్రాలు అందించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికలను పరిశీలించిన కమిటీ దీనిని అమలు చేయడానికి కొన్ని సలహాలు, సూచనలను అందించింది. నీటి సరఫరాను మదింపు వేసి ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన చర్యలను అమలు చేయడానికి సెన్సార్ ఆదారిత టెక్నాలజీని వినియోగించాలని రాష్ట్రాలకు కమిటీ సూచించింది. ప్రజల అలవాట్లలో మార్పులను తీసుకుని రావడానికి ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ (ఐఇసి)వ్యవస్థను రూపొందించాలని కమిటీ సూచించింది. 

హర్యానా రాష్ట్రంలో 31.03 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉన్నాయి.  వీటిలో 26.93 లక్షల (86.8%) గ్రామీణ కుటుంబాలకు 2021 మార్చి 31 నాటికి కొళాయి కనెక్షన్లు ఇచ్చారు.  2021-22లో 4.09 లక్షల కొళాయి  కనెక్షన్లను అందించాలని రాష్ట్రం లక్ష్యంగా నిర్ణయించుకున్నది. 

గృహాలకు ఇస్తున్న కొళాయి కనెక్షన్ల సంఖ్యతో పాటు నీటి వినియోగం పెరుగుతున్నందున నీటి వనరులపై దృష్టి సారించాలని హర్యానా రాష్రానికి కమిటీ సూచించింది. జల వనరుల లభ్యత పరిమితంగా వున్నందున ప్రజల నీటి వినియోగ అలవాట్లు, నీటి యాజమాన్య విధానాల్లో మార్పులు తీసుకుని వచ్చి జల వినియోగం సక్రమంగా సాగేలా చూడడానికి చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. వేసవి కాలం, కరోనా వల్ల ప్రజలు తరచు చేతులను శుభ్రం చేసుకోవలసి ఉన్నందున నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందని కమిటీ పేర్కొంది. 

జల నాణ్యత, సరఫరా అంశాలకు జల్ జీవన్ మిషన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. గ్రామాల్లో నీటి నాణ్యత పరీక్షలను నిర్వహించడానికి ప్రతి గ్రామంలో కనీసం అయిదు మంది ముఖ్యంగా మహిళలకు నీటి నాణ్యత కిట్ల ఉపయోగంలో తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. తరచు నీటి నాణ్యతను ప్రయోగశాలలలో పరీక్షించడం ద్వారా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం / గ్రామీణ నీటి సరఫరా విభాగం గ్రామీణ గృహాలకు సురక్షితమైన తాగునీటి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాయి. 

కరోనా మహమ్మారి సమయంలో  నీటి కొరత, జల కాలుష్య సమస్య ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయడం ద్వారా  పరిశుభ్రతను సాధించడానికి. ప్రతి గృహంలో పనిచేసే కొళాయిని అమర్చడం ద్వారా బహిరంగ ప్రదేశాల్లో రద్దీని నివారించడానికి అవకాశం కలుగుతుంది. దీనితో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్మ కల్పించే అంశానికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. 

2021-22లో జల్ జీవన్ మిషన్ కు బడ్జెట్ లో కేటాయించిన 50,011 కోట్ల రూపాయలకు అదనంగా 15 ఆర్ధిక సంఘం నీరు, పారిశుధ్యం, రాష్ట్ర వాటా, బయటి నిధులు ఇతర రాష్ట్ర ప్రాజెక్టుల కింద  కేటాయించిన 26,940 కోట్ల రూపాయలు అందుబాటులో వున్నాయి. బడ్జెట్ కేటాయింపులు కూడా ఉన్నాయి.  2021-22లో దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు రక్షిత నీరు సరఫరా చేయడానికి లక్ష కోట్ల రూపాయలు అందుబాటులో ఉంటాయి. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడుల కల్పనా ద్వారా ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అవకాశం కలుగుతుంది. 

ఒడిశాలో 85.66 లక్షల కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. వీటిలో 23.25 లక్షల కుటుంబాలు (27.15%) కొళాయి ద్వారా రక్షిత మంచి నీటిని పొందుతున్నాయి. 2019 ఆగష్టు 5వతేదీన జల్ జీవన్ మిషన్ ప్రారంభం అయిన నాటికి ఒడిశా లో కేవలం 3.63% ప్రజలకు మాత్రమే కొళాయి కనెక్షన్లు అందుబాటులో వున్నాయి. గత 18 నెలల కాలంలో ఒడిశాలో 20.15 లక్షల గ్రామీణ కుటుంబాలకు కొళాయి కనెక్షన్లు లభించేలా జల్ జీవన్ మిషన్ చర్యలు అమలు చేసింది. రాష్ట్రంలో 2,996 గ్రామాల్లో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ వుంది. 57పంచాయతీలను హర్ ఘర్ జల్ గా  ఒడిశా ప్రకటించింది. 

2021-22లో  29,749 పాఠశాలలు మరియు 43,727 అంగన్వాడీ కేంద్రాలలో పైపుల నీటి సరఫరాను అందించాలని ఒడిశా యోచిస్తోంది.  తద్వారా 100% పాఠశాలలు, ఆశ్రమ శాలలు  మరియు అంగన్‌వాడీ కేంద్రాలలో తాగడానికి, మధ్యాహ్నం భోజనం వండడానికి, చేతితో కడుక్కోవడానికి మరియు  మరుగుదొడ్లలో  వాడటానికి పంపు నీటి కనెక్షన్ ఉండేలా చూడాలని రాష్ట్రం నిర్ణయించింది. 

2023-24 నాటికి  ప్రతి గ్రామీణ గృహాల్లో 100% కొళాయి  కనెక్షన్‌ను అందించాలని  ఒడిశా లక్ష్యంగా నిర్ణయించుకుంది.  ఇప్పటికే శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించిన ఒడిశా  రాష్ట్రవ్యాప్తంగా 4.64 లక్షల తాగునీటి వనరుల నీటి నాణ్యత నిఘా- శానిటరీ తనిఖీలు నిర్వహించడానికి స్వయం సహాయక బృంద సభ్యులకు శిక్షణ ఇచ్చింది.  నీటి వనరుల కేంద్రం నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో నీటి నాణ్యతను పరీక్షించవలసి ఉంటుంది.  క్షేత్రపరీక్షలో పరీక్షలను నిర్వహించడానికి అవసరమైన  వస్తు సామగ్రిని పంచాయతీ స్థాయిలో అందిస్తున్నారు.   నీటి నాణ్యతను  రుతుపవనాల రాకకి  ముందు, అనంతర కాలంలో 2023-24 తరచుగా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన ఉప కమిటీకి పరికరాలను అప్పగించి తగిన చర్యలను అమలు చేయడానికి చర్యలను తీసుకుంటున్నారు. 

వేసవికాలంలో ఒడిశా రాష్ట్రంలో నీటి నాణ్యత మరియు కొరతకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీనిని పరిష్కరించడానికి కలుషితమైన నీటిని పరీక్షించడం మరియు శుద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని జాతీయ కమిటీ సూచించింది. ప్రస్తుత సంవత్సరంలో 19 ప్రయోగశాలలకు ఎన్‌ఎబిఎల్ అక్రిడిటేషన్‌ను పొందాలనిఒడిశా యోచిస్తోంది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్‌లను అందించడానికి జరుగుతున్న ప్రయత్నాలు ప్రజలు ముఖ్యంగా  మహిళలు ,బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి గౌరవప్రదమైన సురక్షిత జీవితాన్ని గడపడం ద్వారా వారి  జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి.

***

 


(Release ID: 1711711) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Hindi , Punjabi , Odia