జల శక్తి మంత్రిత్వ శాఖ

ప్రపంచం ముంగిట తీవ్రమైన నీటి ఎద్దడి


బ్రిక్స్ ఇంటర్నేషనల్ ఫోరమ్ వెబినార్ లో కేంద్రమంత్రి రత్తన్ లాల్ కటారియా వ్యాఖ్య

నీటి నిర్వహణలో అనుభవాలను పరస్పరం పంచుకోవాలని సూచన

--సామాజిక విప్లవానికి నాంది జలజీవన్ మిషన్ పథకం--

Posted On: 10 APR 2021 3:48PM by PIB Hyderabad

బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ (బి.ఆర్.ఐ.సి.ఎస్.) కూటమికి చెందిన బ్రిక్స్ ఇంటర్నేషనల్ ఫోరం అనే పౌర సంస్థ ఆధ్వర్యంలో జరిగిన  వెబినార్‌ సదస్సులో కేంద్ర జలశక్తి సహాయ మంత్రి  రత్తన్ లాల్ కటారియా ప్రసంగించారు.  సురక్షితమైన తాగునీరు కొరత వంటి ఉమ్మడి సమస్యల పరిష్కారంలో బ్రిక్స్ దేశాల పాత్రను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. 2017-18 సంవత్సరంలో తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొన్న ప్రపంచంలోని తొలి నగరంగా దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ అవతరించిందని, ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న జల సంక్షోభం తీవ్రతకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చని కటారియా వ్యాఖ్యానించారు. బ్రెజిల్ లో ఇప్పటికీ 30లక్షలమంది జనాభాకు సురక్షితమైన తాగునీరుఅందుబాటులో లేదని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరోవైపు ప్రపంచంలోని ఉపరితల జల వనరులు, భూగర్భ జల వనరుల్లో నాలుగో వంతు కలిగి ఉన్న రష్యా స్వదేశీ వినియోగంకోసం రోజూ తలసరిగా 248 లీటర్ల నీటిని అందిస్తోందని ఆయన అన్నారు.

 ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆకలి, పేదరికం, నీటి ఎద్దడి మరింత తీవ్రతరమయ్యాయని కటారియా అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 220 కోట్ల మంది జనాభాకు ఇప్పటికీ సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేని నేపథ్యంలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొనే విషయంలో ఇతరుల అనుభవంనుంచి దేశాలన్నీ పాఠాలు నేర్చుకోవాలని కటారియా సూచించారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యతను ఏ ప్రభుత్వం తప్పించుకోజాలదని, ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానంలో పొందుపరిచిన ప్రకారం తాగునీటి హక్కు మానవహక్కుల పరిధిలోకి వస్తుందని కటారియా అన్నారు.  

  గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించడానికి గల సిసలైన ప్రాధాన్యతను భారత ప్రభుత్వం గుర్తించిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రియాశీలక నాయకత్వంలో గ్రామాల్లోని ఇళ్లన్నింటికీ పైపుల ద్వారా మంచినీరు అందించే బృహత్తర పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని కటారియా తెలిపారు. 2024వ సంవత్సరానికల్లా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ పైపులద్వారా మంచినీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా 2019వ సంవత్సరం ఆగస్టు నెలలో జలజీవన్ మిషన్ అనే పథకాన్ని మొత్తం రూ. 3.60లక్షల కోట్లతో (48బిలియన్ డాలర్లతో) ప్రారంభించినట్టు మంత్రి కటారియా తెలిపారు.

  గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం ఇంత భారీ స్థాయిలో పథకం చేపట్టడం దేశంలో ఇదివరకెన్నడూ జరగలేదని, బహుశా ప్రపంచంలోనే ఇలాంటిది మొదటి పథకం కావచ్చని ఆయన చెప్పారు. కేవలం ఒకటిన్నర సంవత్సర కాలంలోనే భారతదేశపు గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు నాలుగు కోట్ల మేర నీటి కుళాయిలు ఏర్పాటుచేసినట్టు ఆయన తెలిపారు. పథకం పనులు ఇదే వేగంతో సాగితే, నిర్దేశించిన గడువుకంటే చాలా ముందుగానే పథకం లక్ష్యం పూర్తయ్యే అవకాశాలు
ఉన్నాయని కటారియా చెప్పారు.

Image

  జలజీవన్ మిషన్ పథకం ఫలితం కేవలం పైపుల ద్వారా ఇళ్లకు నీటి సరఫరా చేయడంతోనే ముగిసిపోలేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం సామాజిక విప్లవానికి నాంది పలికిందని ఆయన అన్నారు. కులం, వర్ణం, మతం వంటి అంశాలకు అతీతంగా ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికీ రోజుకు తలసరిగా 55లీటర్ల చొప్పున సురక్షితమైన నీరు అందుబాటులోకి వచ్చిందని కేంద్రమంత్రి అన్నారు. దీనితో మహిళలకు సుదూర ప్రాంతాలనుంచి నీటిని మోసుకువచ్చే ప్రయాస తప్పిందని అన్నారు. వాస్తవానికి ఆయా గ్రామాల్లో నీటి సరఫరాను బలోపేతం చేసుకునేందుకు గ్రామాల స్థాయిలోనే కమిటీలు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఈ కమిటీల్లో 50శాతం భాగస్వామ్యం మహిళలకే ఉండేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. దీనితో నీటి సరఫరా నిర్వహణలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలకు సాధికారత ఏర్పడిందని కేంద్రమంత్రి చెప్పారు.

  నీటి సరఫరా వ్యవస్థ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పైపులు, కుళాయిలు, వాటర్ పంపులు, నిల్వ ట్యాంకులు వంటివి జలజీవన్ మిషన్ పథకానికి చాలా అవసరమని, ఈ పథకం అమలుతో పైప్ ఫిట్టర్లు, ప్లంబర్లు, ఎలెక్ట్రీషియన్లు, పంపు ఆపరేటర్లు వంటి నైపుణ్యం కలిగిన కార్మికులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుందని అన్నారు. దీనితో గ్రామీణ యువతకు నైపుణ్యంలో శిక్షణ ఇచ్చే అంశాన్ని కూడా జలజీవన్ మిషన్ తన ప్రణాళికలో చేర్చిందని మంత్రి చెప్పారు.

  జలజీవన్ మిషన్ అమలు ప్రక్రియను ఒక విజయగాథగా కటారియా అభివర్ణించారు. ఈ విషయంతో తన అనుభవాలను ఇతరదేశాలతో పంచుకోవడానికి భారతదేశం సంసిద్ధంగా ఉందన్నారు. నీటి సరఫరా రంగంలో ప్రభుత్వ స్థాయిలోనూ, పౌర సంఘాల స్థాయిలోను బ్రిక్స్ దేశాలు అనుసరించే ఉత్తమ, సృజనాత్మక విధానాలను ఇతరులతో పంచుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. నీటిని సమంజసమైన పద్ధతిలో వినియోగించుకోవడానికి, సమర్థమైన నీటి నిర్వహణా విధానాలను రూపొందించుకోవడానికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థల సంఘానికి బ్రిక్స్ కూటమి ఒక ప్రతిరూపమని అన్నారు. సమానత్వం, విశ్వాసం, పరస్పర అవగాహన అన్న అంశాల పునాదులపై ఈ కూటమి ఏర్పడిందని ఆయన చెప్పారు.

   ఈ వెబినార్ సదస్సుకు కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్  మంత్రి ప్రొఫెసర్ ప్రిన్స్ విలియం మిషికీ, రష్యాకు చెందిన ఇంటర్నేషనల్ బిజినెస్ అగ్జిలరేషన్ సెంటర్ సహ వ్యవస్థాపకుడు యూలియా బెర్గ్, బ్రిక్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు, ఇండో రష్యన్ యూత్ క్లబ్ ఫెడరేషన్ అధ్యక్షురాలు పూర్ణిమా ఆనంద్, జర్మనీకి చెందిన విదేశీ వాణిజ్య ఫెడరల్ సమాఖ్య కన్సల్టెంట్ వోకర్ షాప్కే, తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం బ్రిక్స్ కార్యక్రమాల 15వ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఈ వెబినార్ సదస్సులో తెలియజేశారు. బ్రిక్స్ కూటమి 13వ శిఖరాగ్ర సదస్సుకు భారతదేశం అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తోంది. బ్రిక్స్ కూటమిలోని దేశాలను సమైక్యం చేస్తూ ఉమ్మడి ప్రయోజనాల సాధనకోసం భారతదేశం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది.

 

***



(Release ID: 1710947) Visitor Counter : 201