పర్యటక మంత్రిత్వ శాఖ
"ట్యాపింగ్ ది పొటెన్షియల్ ఆఫ్ కశ్మీర్: అనథర్ డే ఇన్ ప్యారడైజ్" పేరిట, కశ్మీర్‌లో ఈ నెల 11-13 తేదీల్లో భారీ పర్యాటక ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిర్వహించనున్న కేంద్ర పర్యాటక శాఖ
Posted On:
10 APR 2021 11:53AM by PIB Hyderabad
ఈ నెల 11, 12, 13 తేదీల్లో, "ట్యాపింగ్ ది పొటెన్షియల్ ఆఫ్ కశ్మీర్: అనథర్ డే ఇన్ ప్యారడైజ్" పేరిట, కశ్మీర్‌లో భారీ పర్యాటక ప్రోత్సాహక కార్యక్రమాన్ని కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించబోతోంది. జమ్ము&కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర పర్యాటక & సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర్య బాధ్యత) శ్రీ ప్రహ్మాద్ సింగ్ పటేల్ ప్రారంభ కార్యక్రమంలో ఉపన్యసించనున్నారు.
జమ్ము&కశ్మీర్ పర్యాటక విభాగం, ఫిక్కి, ఇండియన్ గోల్ఫ్ టూరిజం అసోసియేషన్ (ఐజీటీఏ)తో కలిసి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతోంది. జమ్ము&కశ్మీర్ పర్యాటక సౌందర్యాన్ని ప్రదర్శించి; ఆ ప్రాంతాన్ని విశ్రాంతి, సాహస, పర్యావరణ, వివాహాలు, చిత్రీకరణలు, మైస్ కార్యక్రమాల గమ్యస్థానంగా మార్చడం ఈ మూడు రోజుల కార్యక్రమం లక్ష్యం. కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ సహా సీనియర్ అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
తులిప్ గార్డెన్ పర్యటన సహా అనేక ఆసక్తికర కార్యక్రమాలు, చర్చలు, సాంకేతిక పర్యటనలు, ప్రదర్శనలు, ముఖాముఖులు ఈ మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఉంటాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ పర్యాటక నిర్వాహకులు బీ2బీ కార్యక్రమంలో పాల్గొని, జమ్ము&కశ్మీర్‌లోని పర్యాటక నిర్వాహకులతో చర్చలు జరుపుతారు. జమ్ము&కశ్మీర్ పర్యాటక ఉత్పత్తుల ప్రదర్శనలు ఉంటాయి. కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్, జమ్ము&కశ్మీర్ పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ సర్మద్ హఫీజ్ సహా సీనియర్ అధికారుల ప్రసంగాలు ఈ కార్యక్రమంలో ఉంటాయి.
'ప్రాధాన్యత పర్యాటక ప్రాంతంగా మరింత ఉన్నత దశకు కశ్మీర్‌ను తీసుకెళ్లడం', 'ఉత్తేజభరిత సంఘటనల ప్రాంతంగా కశ్మీర్‌ను మార్చడం', 'విభిన్న కశ్మీర్ పర్యాటక ఉత్పత్తుల ప్రదర్శన', 'వజ్వాన్, జఫ్రాన్, షికారా కథ కొనసాగింపు' అంశాలపై ఈ నెల 12న ప్యానెల్ చర్చలు, సమావేశాలతోపాటు, మాస్టర్ చెఫ్ పంకజ్ బదౌరియాతో 'చాయ్ పే చర్చ'ను నిర్వహిస్తారు. ప్రఖ్యాత దాల్ సరస్సు వద్ద లేజర్, సాంస్కృతిక ప్రదర్శనలను జమ్ము&కశ్మీర్ పర్యాటక శాఖ ఏర్పాటు చేయనుంది. కెన్యా, వియత్నాం, జార్జియా దౌత్యవేత్తలు సహా ముఖ్య ఆహ్వానితులు, దేశంలోని ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారులతో శ్రీనగర్‌లోని రాయల్ స్ప్రింగ్స్ గోల్ఫ్ కోర్సులో గోల్ఫ్ పోటీలను కూడా నిర్వహించనున్నారు.
***
(Release ID: 1710879)
Visitor Counter : 162