మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
జాతీయ విద్యా విధానం 2020 అమలుపై ఉన్నత స్థాయీ సమావేశాన్ని నిర్వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
పాఠశాలల్లో విధానం అమలు కోసం రూపొందిన " సార్థక్''ను ఆవిష్కరించిన శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్'
అమృత్ మహోత్సవాల్లో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయుల సంపూర్ణ అభివృద్ధికి తోడ్పడే " సార్థక్'' ఆవిష్కరణ
పాఠశాల విద్యలో సమూల మార్పులు తీసుకుని రావడానికి ప్రతి ఒక్కరూ " సార్థక్''ను మార్గదర్శంగా తీసుకోవాలని పిలుపు ఇచ్చిన మంత్రి
" సార్థక్'' సమగ్రంగా,సౌకర్యవంతంగా ప్రతి ఒక్కరి వినియోగానికి అనువుగా ఉంటుంది శ్రీ రమేష్ పోఖ్రియాల్
Posted On:
08 APR 2021 5:01PM by PIB Hyderabad
జాతీయ విద్యా విధానం 2020 ను అమలు చేయడానికి అనుసరించవలసిన కార్యాచరణ కార్యక్రమంపై ఈ రోజు న్యూ ఢిల్లీ లో విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఉన్నత స్థాయీ సమావేశాన్నినిర్వహించారు. సమావేశానికి ఉన్నత విద్య కార్యదర్శి శ్రీఅమిత్‌ఖరే, పాఠశాల విద్య కార్యదర్శి శ్రీమతి అనితా కార్వాల్, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
జాతీయ విద్యా విధానం-2020ని లక్ష్యాల మేరకు అమలు చేసి ఆశించిన ఫలితాలను సాధించేలా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయ సహకారాలను అందించాలన్న లక్ష్యంతో పాఠశాల విద్య, అక్షరాస్యత మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రణాళికను రూపొందించింది. నాణ్యమైన విద్య ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల సంపూర్ణ వికాసం సాధించడానికి తోడ్పడే ఈ ప్రణాళికను " సార్థక్' పేరిట అమలు చేయనున్నారు. " సార్థక్" అమలుకు నిర్ధేశించిన కార్యాచరణ కార్యక్రమాన్ని మంత్రి ఈ రోజు 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాల్లో భాగంగా విడుదల చేశారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వం జాతీయ విద్యా విధానం-2020కి రూపకల్పన చేసి విడుదల చేసింది. విద్య ఉమ్మడి జాబితాలో వుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని సమాఖ్యవాద స్పూర్తితో జాతీయ విద్యావిధానాన్ని కేంద్రం రూపొందించింది. తమ అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జాతీయ విద్యా విధానంలో తగిన మార్పులను చేసుకోవడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం స్వేచ్ఛ ఇచ్చింది. జాతీయ విద్యా విధానం సజావుగా లక్ష్యాల మేరకు అమలు జరిగేలా చూడడానికి రానున్న పది సంవత్సరాల్లో అమలు చేయవలసిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది.
రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో సుదీర్ఘంగా విస్తృతంగా చర్చలు జరిపి, విద్యారంగంతో సంబంధం వున్న స్వతంత్ర సంస్థలు వ్యక్తుల నుంచి సలహాలు సూచనలను స్వీకరించి వీటికి అనుగుణంగా " సార్థక్” ప్రణాళికకు కేంద్రం సిద్ధం చేసింది. ఈ వర్గాల నుంచి 7177 పైగా సూచనలు సలహాలు అందాయి. ఉపాధ్యాయుల నుంచి సలహాలు సూచనలను స్వీకరించడానికి ' శిక్షా పర్వ్'పేరిట 2020 సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమంలో 15 లక్షలకు పైగా సూచనలు అందాయి.
" సార్థక్” ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రసంగించిన విద్యా శాఖ మంత్రి పాఠశాల విద్యా రంగంలో సమూల మార్పులను ఈసుకుని రావడానికి విద్యారంగంతో సంబంధం వున్న ప్రతి ఒక్కరూ ప్రణాళికను ఉపయోగించుకోవాలని కోరారు. సాధించవలసిన లక్ష్యాలు, దీనికోసం అమలు చేయవలసిన ప్రణాళిక , దీనివల్ల ప్రయోజనాలను " సార్థక్” లో స్పష్టంగా తెలియజేశామని మంత్రి అన్నారు. ప్రణాళికను అమలు చేయడం ద్వారా 304 ఫలితాలను సాధించవలసి ఉంటుందని అన్నారు. నూతన వ్యవస్థ ద్వారా కాకుండా ప్రస్తుతం అమలులో వున్నవ్యవస్థను వినియోగించుకుంటూ నూతన లక్ష్యాల సాధనకు ఉపయోగపడేవిధంగా ప్రణాళిక రూపకల్పన జరిగిందని అన్నారు. దశల వారీగా ప్రణాళికను అమలు చేసి నూతన విద్యా విధానం లక్ష్యాలను సాధించవలసి ఉంటుందని మంత్రి వివరించారు.
విద్యారంగంతో సంబంధం వున్న వర్గాల నుంచి అందిన సలహాలు సూచనల మేరకు రూపొందిన " సార్థక్' ను ఆచరణసాధ్యమైన ప్రణాళికగా రూపొందించడం జరిగింది.
" సార్థక్' ను అమలు చేసిన తరువాత విద్యా రంగంలో కింది మార్పులు చోటు చేసుకుంటాయని అంచనా వేయడం జరిగింది.
· జాతీయ విద్యా విధానంలో పొందుపరచిన విధంగా పాఠశాల విద్య, ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య, ఉపాధ్యాయ విద్య మరియు వయోజన విద్యా రంగాల్లో జాతీయ మరియు రాష్ట్ర పాఠ్య ప్రణాళికా వ్యవస్థల రూపకల్పనకు సంస్కరణలు
· అన్ని స్థాయిల్లో స్థూల నమోదు నిష్పత్తి (జిఇఆర్), నెట్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (ఎన్‌ఇఆర్), పరివర్తన రేటు విద్యార్థుల కొనసాగే అంశాలలో అభివృద్ధి సాధించి మధ్యలో విద్యను నిలిపివేసే డ్రాప్ అవుట్‌లు మరియు పాఠశాలలకు రాని పిల్లల సంఖ్యలో తగ్గింపు.
· గ్రేడ్ 3 ద్వారా నాణ్యమైన విద్యాప్రమాణాలల్లో మెరుగుదల
·మాతృభాష / స్థానిక / ప్రాంతీయ భాషల ద్వారా బోధన మరియు అభ్యాసానికి ప్రాధాన్యతనిస్తూ అన్ని దశలలో అభ్యాస ఫలితాలలో మెరుగుదల.
· అన్ని దశలలో పాఠ్యాంశాల్లో వృత్తి విద్య, క్రీడలు, కళలు, భారతదేశ జ్ఞానం, 21 వ శతాబ్దపు నైపుణ్యాలు, పౌరసత్వ విలువలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన మొదలైన అంశాలకు ప్రాధాన్యత
· బోర్డు పరీక్షలు మరియు వివిధ ప్రవేశ పరీక్షలలో సంస్కరణలు.
· అన్ని దశలలో అనుభవపూర్వక అభ్యాసం పరిచయం మరియు తరగతి గదిలో ఉపాధ్యాయులచే వినూత్న బోధనలను ప్రవేశ పెట్టడం.
· నాణ్యత మరియు వైవిధ్యభరితమైన బోధన-అభ్యాస సామగ్రి అభివృద్ధి చేయడం
* ప్రాంతీయ / స్థానిక / వాడుక భాషలో పాఠ్య పుస్తకాల లభ్యత.
· ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాల నాణ్యతలో మెరుగుదల.
· నిరంతర వృత్తి అభివృద్ధి ద్వారా కొత్తగా నియమించబడిన ఉపాధ్యాయుల నాణ్యత మరియు సామర్థ్యం పెంపు.
· విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు సురక్షితమైన, సమగ్రమైన, అనుకూలమైన అభ్యాస వాతావరణం అందుబాటులోకి తేవడం
· పాఠశాలల్లో ప్రవేశానికి ఎదురవుతున్న సమస్యలను తొలగించి మౌలిక సదుపాయాల మెరుగుదల.
· రాష్ట్రాలలోసమీకృత విధానాల ద్వారా ఆన్‌లైన్, పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో అభ్యాస ఫలితాలు మరియు పాలనలో ఏకరీతి ప్రమాణాలను సాధించడం
· విద్యా ప్రణాళిక మరియు పాలనలో సాంకేతిక పరిజ్ఞానం, తరగతి గదులలో ఐసిటి మరియు నాణ్యమైన ఇ-కంటెంట్ అందుబాటులో ఉండేలా చూడడానికి చర్యలు
విద్యారంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్ది సవాళ్లను ఎదుర్కోవటానికి " సార్థక్' వారిని తీర్చి దిద్దుతుంది. భారతదేశ సంప్రదాయం, సంస్కృతి మరియు విలువ వ్యవస్థతో పాటు 21 వ శతాబ్దపు నైపుణ్యాలను నింపడానికి వారికి సహాయపడుతుందని మంత్రి అన్నారు. " సార్థక్' వల్ల 25 కోట్ల మంది విద్యార్థులు, 15 లక్షల పాఠశాలలు, 94 లక్షల మంది ఉపాధ్యాయులు, విద్యా నిర్వాహకులు, తల్లిదండ్రులు మరియు సమాజంతో సహా అన్ని వాటాదారులకు ప్రయోజనం కలుగుతుందని శ్రీపోఖ్రియాల్అన్నారు.
***
(Release ID: 1710600)
Visitor Counter : 301