గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గిరిజనులకు వరం వన్ ధన్ వికాస్ యోజన


దేశ గిరిపుత్రులకు సాధికారిత కల్పిస్తున్న పథకం

గిరిజనులను ప్రగతి పధంలో నడిపిస్తున్న మహారాష్ట్రలోని థానే జిల్లాలోని షాహపూర్ ఆదివాసీ ఎకాత్మిక్ సమాజిక్ సంస్థ

Posted On: 08 APR 2021 1:02PM by PIB Hyderabad

గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులకు (ఎంఎఫ్‌పి)కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) లభించేలా చూసి వాటిని విలువ ఆధారిత ఉత్పతులుగా మార్కెటింగ్ చేసి గిరిజనులకు సాధికారిత కల్పించడానికి అమలు జరుగుతున్న వన్ ధన్ వికాస్ యోజన పథకం లక్ష్యాల మేరకు దేశంలో అమలు జరుగుతోంది.మహారాష్ట్రలోని థానే జిల్లాలోని షాహపూర్ ఆదివాసీ ఎకాత్మిక్ సమాజిక్ సంస్థ అమలు చేస్తున్న ఈ పథకం స్థానిక గిరిజనులకు ఉపాధి  కల్పిస్తూ వారికి సాధికారిత కల్పిస్తోంది. 

గిరిజనులను తగిన శిక్షణ ఇచ్చి వారందరూ కలసి పనిచేస్తూ తాము సేకరించిన అటవీ ఉత్పత్తులను విలువ ఆధారిత వస్తువులుగా సిద్ధం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలను సాధించ గలుగుతారని షాహపూర్ ఆదివాసీ ఎకాత్మిక్ సమాజిక్ సంస్థ రుజువు చేసింది. 

 

పశ్చిమ కనుమల్లో పర్వత శ్రేణుల మధ్య ఒక పెద్ద తాలూకా మహారాష్ట్రలోని థానే జిల్లాలోని షాహపూర్. ఇది అభివృద్ధిపథంలో నడుస్తున్న ప్రాంతం. ఇక్కడ పురాతన కట్కారి గిరిజన తెగకు చెందిన వారు ఎక్కువగా నివసిస్తున్నారు. కట్కారి తెగ గిరిజనులు మహారాష్ట్ర  (పూణే, రాయగఢ్  మరియు థానే జిల్లాలు) గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తారు. వీరిలో ఎక్కువమంది వ్యవసాయ కూలీలు. వీరు అడవుల్లో సేకరించిన వంట చెరకు, పళ్ళను విక్రయిస్తూ జీవనం సాగిస్తారు.వీరికి అండగా నిల్చొని జీవన స్థితిగతులను మెరుగుపరచాలన్న లక్ష్యంతో  కట్కారి గిరిజనుడైన సునీల్ పవరన్ తన స్నేహితులతో కలసి ఆదివాసీ ఎకాత్మిక్ సమాజిక్ సంస్థ ను నెలకొల్పారు. వన్ ధన్ వికాస్ యోజన పథకం కింద ఈయన నెలకొల్పిన సంస్థలో గిరిజనులు సభ్యులుగా చేరారు. ప్రస్తుతం ఈ సంస్థలో 300 మంది సభ్యులు వున్నారు. అడవుల్లో లభించే వస్తువులను వాణిజ్య వస్తువులుగా అభివృద్ధి చేసి గిరిజనులకు సాధికారిత కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ అడవుల్లో ఎక్కువగా లభించేఉత్పత్తులపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఈ సంస్థ 35 రకాల ఉత్పత్తులను, శుద్ధి చేసిన ఆహార పదార్ధాలను అందుబాటులోకి తెచ్చింది. 

అడవుల్లో ఎక్కువగా లభించే  తిప్పతీగ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. తిప్పతీగను గిరిజనులు అడవుల నుంచి సేకరిస్తారు. ఇలా సేకరించిన తిప్పతీగను ఎనిమిది నుంచి పది రోజుల పాటు  ఎండబెడతారు. ఎండిన తిప్పతీగను షాహపూర్ లో ఏర్పాటు చేసిన  కేంద్రానికి తీసుకుని వచ్చి దానిని పొడిగా చేసి ప్యాక్ చేసి కొనుగోలుదారులకు రవాణా చేస్తారు. దీనిని ట్రైబ్స్ ఇండియాతో సహా అనేకమంది కొనుగోలు చేస్తున్నారు. గత 17 నెలల్లో తిప్పతీగ అమ్మకాల ద్వారా సంస్థ 18,50,000 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. తిప్పతీగ  అమ్మకాల ద్వారా 12,40,000 రూపాయలు, తిప్పతీగ పొడి అమ్మకాల ద్వారా 6,10,000 లక్షల రూపాయలు ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది. 

డాబర్, బైద్యనాథ్, హిమాలయ, వితోబా, శరంధర్, భూమి సహజ ఉత్పత్తులు కేరళ, త్రివిక్రమ్, మరియు మైత్రి ఆహారాలు వంటి ప్రముఖ సంస్థలు   ఆదివాసీ ఎకాత్మిక్ సమాజిక్ సంస్థ నుంచి  తిప్పతీగ ను కొనుగోలు చేశాయి.  ఇంతవరకు  ఆదివాసీ ఎకాత్మిక్ సమాజిక్ సంస్థ నుంచి హిమాలయ, డాబర్ మరియు భూమి సంస్థలు 1,57,00,000  రూపాయల విలువ చేసే  450 టన్నుల తిప్పతీగను కొనుగోలు చేశాయి. 

దేశాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ తన ప్రభావాన్ని ఆదివాసీ ఎకాత్మిక్ సమాజిక్ సంస్థ కూడా చూపింది. అయితే, దైర్యం కోల్పోకుండా పనిచేసిన సంస్థ సభ్యులు లాక్ డౌన్ సమయంలో కూడా పట్టుదలతో పనిచేసి నిలదొక్కుకున్నారు. 2020 మార్చి- జూన్ నెలల మధ్య సంస్థ గిరిజనుల నుంచి 34,000 కేజీల ముడి తిప్పతీగను కొనుగోలు చేసింది. లాక్ డౌన్ ముగిసి సాధారణ పరిస్థితుల నెలకొనడంతో సంస్థ తన కార్యకలాపాలను విస్తృతం చేస్తూ తన ఉత్పత్తులను ఈ - కామర్స్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. 

  తిప్పతీగ కు ప్రాధాన్యత ఇస్తూనే నెలతాడి, కివి,త్రిఫల,మునగ,వేప,నారింజ లాంటి ఉత్పత్తుల అమ్మకాలపై సంస్థ తన కార్యకలాపాలను విస్తరించింది. 

  ఆదివాసీ ఎకాత్మిక్ సమాజిక్ సంస్థ సాధించిన విజయాలతో స్ఫూర్తి పొందిన అనేక వేలమంది  గిరిజనులు   వన్ ధన్ వికాస్ యోజన కింద సంస్థలుగా ఏర్పాటు అవుతున్నారు. ఇంతవరకు  వన్ ధన్ వికాస్ యోజన పధకం కింద 12000 మందికి లబ్ది కలిగిస్తూ 39 సంస్థల ఏర్పాటుకు భారత  గిరిజన సహకార మార్కెటింగ్ సమాఖ్య ఆమోదం తెలిపింది.

గిరిజనుల జీవన స్థితిగతులను మెరుగుపరచాలన్న లక్ష్యంతో అటవీ ఉత్పత్తులకు (ఎంఎఫ్‌పి)కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) లభించేలా చూసి వాటిని విలువ ఆధారిత ఉత్పతులుగా మార్కెటింగ్ చేసి గిరిజనులకు సాధికారిత కల్పించడానికి అమలు జరుగుతున్న వన్ ధన్ వికాస్ యోజన పథకం. దీని కింద వన్ ధన్ కేంద్రాలను నెలకొల్పి వీటిద్వారా గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులను విలువ ఆధారిత వస్తువులుగా మార్చి ఒక బ్రాండ్ పేరుతో విక్రయించడం ఈ పథకం లక్ష్యంగా వుంది. గిరిజనులకు అవసరమైన ఆర్ధిక సహకారాన్ని, శిక్షణ ఇచ్చి వస్తువుల విక్రయానికి సౌకర్యాలను కల్పించడం ద్వారా వారి వ్యాపారం ఆదాయం వృద్ధి సాధించడానికి  వన్ ధన్ వికాస్ యోజన పథకం అవకాశం కల్పిస్తోంది. కలసి పనిచేయడం ద్వారా విజయాలను సాధించి జీవన స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి సమిష్టిగా పనిచేసే వారికి  వన్ ధన్ వికాస్ యోజన పథకం ఒక వరంలా ఉంటుందని షాహపూర్ ఆదివాసీ ఎకాత్మిక్ సమాజిక్ సంస్థ సాధించిన  నిదర్శనంగా ఉంటుంది. 

ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో గిరిజనులకు స్థానం కలిగిస్తూ  గిరిజన సహకార మార్కెటింగ్ సమాఖ్య  తన వంతు కర్తవ్యాన్ని పోషిస్తూ గిరిజనుల జీవన స్థితిగతుల్లో సమూల మార్పులను తీసుకుని వస్తోంది. 

 

***

 


(Release ID: 1710449) Visitor Counter : 370