నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

‘నేశనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిశెంసీ సోలర్ పీవీ మాడ్యూల్స్’ పేరు తో ఉత్ప‌త్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహ‌క ప‌థ‌కాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 07 APR 2021 3:54PM by PIB Hyderabad

అధిక సామ‌ర్ధ్యం క‌లిగిన సోలర్ పీవీ (ఫోటో వాల్టిక్) మాడ్యూల్స్ లో గీగా వాట్ (జిడబ్ల్యు) శ్రేణి నిర్మాణ శ‌క్తి ని సాధించ‌డం కోసం ‘నేశనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిశెంసీ సోలర్ పీవీ (ఫోటో వాల్టిక్) మాడ్యూల్స్’  పేరు తో ఉత్ప‌త్తి తో ముడిప‌డిన‌టువంటి ప్రోత్సాహ‌క ప‌థ‌కాన్ని (పిఎల్ఐ) ని అమలు చేయాలంటూ నూత‌న & న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి మంత్రిత్వ శాఖ చేసిన ప్ర‌తిపాద‌న కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  ఈ ప్రాజెక్టు ను అమలు చేయడానికి 4,500 కోట్ల రూపాయలు వ్య‌యమవుతుంది.

ప్ర‌స్తుతం సోలర్ సామర్థ్యం పెంపుద‌ల కోసం దిగుమ‌తి చేసుకొంటున్న సోల‌ర్ పివి సెల్స్ మరియు మాడ్యూల్స్ పైనే ఆధార‌ప‌డటం జరుగుతోంది.  ఎందుకంటే దేశీయ త‌యారీ ప‌రిశ్ర‌మ దగ్గర సోల‌ర్ పివి సెల్స్, మాడ్యూల్స్ సంబంధిత నిర్వ‌హ‌ణ సామర్ధ్యాలు ప‌రిమితం గా మాత్రమే ఉంటున్నాయి. ‘నేశ‌న‌ల్ ప్రోగ్రామ్‌ ఆన్ హై ఎఫిశెంసీ సోలర్ పీవీ (ఫోటో వాల్టిక్) మాడ్యూల్స్’ తో విద్యుత్తు వంటి వ్యూహాత్మ‌క‌ రంగం లో దిగుమ‌తులపై ఆధార‌ప‌డే ధోరణి త‌గ్గనుంది.  ఇది ‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ కార్య‌క్ర‌మాని కి సైతం ఊతాన్ని అందించ‌గలదు.
 
సోల‌ర్ పివి త‌యారీ సంస్థ‌ల‌ ను పార‌ద‌ర్శ‌క‌మైన‌టువంటి స్ప‌ర్ధాత్మ‌క బిడ్డింగ్ ప్ర‌క్రియ ద్వారా ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది.  సోల‌ర్ పీవీ మేన్యుఫాక్చ‌రింగ్ ప్లాంటుల ను ప్రారంభించిన త‌రువాత 5 సంవ‌త్స‌రాల పాటు పిఎల్ఐ ని విత‌ర‌ణ చేస్తారు. మరి ఇది అధిక సామ‌ర్ధ్యం క‌లిగినటువంటి సోల‌ర్ పివి మాడ్యూల్స్ అమ్మ‌కాల పై ఆధారపడి ఉంటుంది.   త‌యారీదారు సంస్థ‌ల కు అధిక సామ‌ర్ధ్యం క‌లిగిన సోల‌ర్ పీవీ మాడ్యూల్స్ తో పాటు వాటికి అవ‌స‌ర‌మైన వ‌స్తు సామ‌గ్రి ని దేశీయ బ‌జారు నుంచి సేక‌రించేందుకు కూడా ప్ర‌తిఫ‌లాన్ని ముట్ట‌చెప్ప‌డం జ‌రుగుతుంది.  ఈ విధంగా, మాడ్యుల్స్ సామ‌ర్ధం పెరుగుతూ పోతుంది.  అంతేకాకుండా స్థానికం గా విలువ జోడింపు సైతం పుంజుకొంటుంది. ఈ రెంటికి అనుగుణం గా పిఎల్ఐ సొమ్ము ను అందించడం జరుగుతుంది.

ఈ ప‌థ‌కం ద్వారా అందగలవని ఆశిస్తున్న ప్ర‌యోజ‌నాలు/ఫ‌లితాలు :

• ఇంటిగ్రేటెడ్ సోల‌ర్ పివి మేన్యుఫాక్చ‌రింగ్ ప్లాంటు ల సామ‌ర్ధ్యం లో 10,000 మెగా వాట్ మేర‌కు వృద్ధి చోటుచేసుకోగలదు;

•  సోలర్ పీవీ మేన్యుఫాక్చ‌రింగ్ ప్రాజెక్టుల‌ లో దాదాపుగా 17,200 కోట్ల రూపాయ‌ల విలువైన ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డి అందిరాగలదు;

•  5 సంవత్సరాల కాలం లో ‘బేల‌న్స్ ఆఫ్‌ మెటీరియ‌ల్స్’ కోసం 17,500 కోట్ల రూపాయ‌ల మేర‌కు గిరాకీ పెరగగలదు;
 
•  సుమారు 30,000 మంది కి ప్ర‌త్య‌క్ష ఉపాధి, ఇంచుమించు 1,20,000 మంది కి ప‌రోక్ష ఉపాధి అవ‌కాశాలు లభించగలవు;

•  ప్ర‌తి సంవత్సరం ర‌మార‌మి 17,500 కోట్ల రూపాయ‌ల విలువ మేర‌కు దిగుమ‌తులు చేసుకోవలసిన అవసరం తలెత్తదు; అంతేకాదు,

• అధిక సామర్థ్యం కలిగిన సోల‌ర్ పీవీ మాడ్యూల్స్ ను దక్కించుకోవడానికి గాను పరిశోధ‌న - అభివృద్ధి (ఆర్‌ & డి) కార్యాల కు జోరు ల‌భిస్తుంది.



 

***



(Release ID: 1710173) Visitor Counter : 185