రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

2025నాటికి 305 బిలియన్ డాలర్ల స్థాయికి భారతీయ రసాయన పరిశ్రమ: సదానంద గౌడ


రసాయనాల తయారీ ప్రతిభ, పోటీ తత్వంపై జాతీయ చర్చా కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రసంగం

Posted On: 06 APR 2021 5:54PM by PIB Hyderabad

రసాయనాల విషయంలో పోటీతత్వం, సుస్థిరత లక్ష్యంగా రసాయనాల తయారీ ప్రక్రియలో ప్రతిభ, సృజనాత్మకత అన్న అంశంపై ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ చర్చా కార్యక్రమంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి  డి.వి. సందానంద గౌడ ప్రసంగించారు. చర్చా కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్ పద్ధతిలో ఆయన ప్రసంగించారు. రసాయనాలు, పెట్రో కెమికల్స్ శాఖ కార్యదర్శి యోగేంద్ర త్రిపాఠి, రసాయనాల శాఖ అదనపు కార్యదర్శి సమీర్ కుమార్ బిశ్వాస్; భారతీయ రసాయన మండలి డైరెక్టర్ జనరల్ హెచ్. ఎస్. కారంగ్లే; హెచ్.ఐ.ఎల్. ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.పి. మొహంతి; భారతదేశంలో ఐక్యరాజ్యసమితి పారిశ్రామికాభివృద్ధి సంస్థ (యునిడో-యు.ఎన్.ఐ.డి.ఒ.) ప్రతినిధి డాక్టర్ రెనే వాన్ బెర్కెల్, కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

  ఈ సందర్భంగా కేంద్రమంత్రి సదానంద గౌడ ప్రసంగిస్తూ, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో రసాయనాలు, పెట్రో కెమికల్స్ రంగం ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. 2019లో 178 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న భారతీయ రసాయన పరిశ్రమ, 2025వ సంవత్సరానికల్లా 304 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని భావిస్తున్నట్టు చెప్పారు. అప్పటికి రసాయనాలకు డిమాండ్ సంవత్సరానికి 9శాతం మేర పెరిగే సూచనలున్నాయన్నారు. ఇంతటి బృహత్తర లక్ష్యం సాధించాలంటే విధానపరమైన చర్యలు, కంపెనీల స్థాయిలో చొరవ, పరిశ్రమ-విద్యాసంస్థల భాగస్వామ్యం, వివేచన కూడిన పెట్టుబడులు, అంతర్జాతీయ అనుసంధానం ఎంతో అవసరమని మంత్రి అన్నారు. స్వదేశీ రసాయనాల పరిశ్రమ అభివృద్ధికి ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో) తగిన సహకారం అందిస్తుందని అన్నారు. ఇందుకు సంబంధించి ఉత్తమమైన అంతర్జాతీయ విధానాలు, పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటిని యునిడో అందజేస్తుందని అన్నారు.

  దేశంలో మౌలిక అవసరాలు తీర్చడం, జీవన ప్రమాణాలు పెంపొందించడంలో రసాయనాల పరిశ్రమ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. జవుళి రంగం, కాగిత రంగం, పెయింట్స్, సబ్బులు, డిటర్జెంట్లు, ఔషధాలు తదితర ఉత్పాదనల తయారీకి సంబంధించి ఆయా పరిశ్రమలకు రసాయన రంగం ఎంతో సహాయాన్ని, సహకారాన్ని అందిస్తోందని మంత్రి అన్నారు. పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధిలో రసాయన పరిశ్రమ ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. ఎరువుల, వ్యవసాయ రసాయనాల పరిశ్రమలు ఆహార భద్రతకు ఎంతగానో దోహదపడుతున్నాయని, అందువల్ల భారతదేశ అభివృద్ధికి, వ్యవసాయాధార ఆర్థిక వ్యవస్థకు ఈ పరిశ్రమలు ఎంతో కీలకమైనవని అన్నారు. అలాగే, అందుబాటు ధరల్లో వస్త్రాలను అందించడంలో సింథటిక్ ఫైబర్ పరిశ్రమ కీలకపాత్ర పోషిస్తోందని, ఔషధ పరిశ్రమ దేశ జన బాహుళ్యానికి తక్కు ధరల్లో ఔషధాలు అందిస్తోందని మంత్రి అన్నారు.

   ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితి, కోవిడ్19 వైరస్ వ్యాప్తి వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, స్వదేశీ పరిశ్రమలు, పెట్టుబడిదారులు ఇప్పటికీ మరింత ఆశాభావంతో, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారని కేంద్రమంత్రి అన్నారు. భారతీయ కంపెనీలు, రసాయనాల పరిశ్రమలు ప్రస్తుత పరిస్థితిని సానుకూలంగా మలుచుకుని రసాయన పారిశ్రామిక రంగంలో నిర్మాణాత్మక మార్పులు తీసుకురావాలన్నారు. భారతదేశాన్ని తయారీ రంగపు ప్రధాన కేంద్రంగా మార్చడంలో భారతీయ శాస్త్రవేత్తలు, విధాన నిర్ణాయక కర్తలు, రైతులు, సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తగిన సామర్థ్యం చూపగలరని తాను ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు మంత్రి చెప్పారు.  ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో ప్రపంచ అవసరాలకోసం అవసరమైన ఉత్పాదనలను దేశం తయారు చేయగలదని ఆయన అన్నారు. భారతదేశంలోని రసాయన పారిశ్రామిక రంగాన్ని మరింత సమర్థంగా, పోటీ తత్వంతో తీర్చిదిద్దే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహణకు చొరవ చూపించిన యునిడో సంస్థకు సందానంద గౌడ కృతజ్ఞతలు తెలిపారు.

   భారతదేశంలో స్వచ్ఛమైన తయారీ (స్వచ్ఛ ఉద్యోగ్) పథకం కింద యునిడో ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. రసాయనాల విషయంలో పోటీతత్వం, సుస్థిరత లక్ష్యంగా వాటి తయారీ ప్రక్రియలో ప్రతిభ, సృజనాత్మకత అన్న అంశంపై జాతీయ చర్చా కార్యక్రమం కూడా నిర్వహించింది. రసాయనాల తయారీ రంగంలో ఎదరుయ్యే సవాళ్లు, పరిశ్రమ ప్రగతి, విధాన నిర్ణాయకుల క్రియాశీలక పాత్ర, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం ప్రాతిపదికగా చేపట్టే మార్పులు తదితర అంశాలు ఈ చర్చా కార్యక్రమంలో ప్రస్తావనకు వచ్చాయి. యునిడో అనేది ఐక్యరాజ్యసమితి సంస్థకు చెందిన ప్రత్యేక ఏజెన్సీగా ఏర్పాటైంది. పేదరికం తగ్గించే లక్ష్యంతో పారిశ్రామిక అభివృద్ధి, సమ్మిళిత ప్రపంచీకరణ, పర్యావరణ సుస్థిరత తదితర అంశాలకు సంబంధించిన కార్యకలాపాలను ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది.  

 

****



(Release ID: 1709971) Visitor Counter : 179