ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సమగ్ర ఆరోగ్య సమాచార వేదిక ఆవిష్కరణ!
“సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు ఇది.; దేశ ప్రజారోగ్య చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభించాం”
“వ్యాధులను పసిగట్టే ప్రపంచ స్థాయి అతిపెద్ద
అన్.లైన్ నిఘావ్యవస్థ ఇదే”
“అధునాతన వ్యవస్థ అమలులో భారతదేశానిదే అగ్రతాంబూలం”
ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్రమంత్రి హర్షవర్ధన్,
ఇతర వక్తల అభిప్రాయాలు
Posted On:
05 APR 2021 4:35PM by PIB Hyderabad
సమగ్ర ఆరోగ్య సమాచార వేదిక (ఐ.హెచ్.ఐ.పి.)ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ నెల 5వ తేదీన వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ డిజిటల్ విధానంలో హాజరయ్యారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న సమగ్ర వ్యాధి నిఘా కార్యక్రమానికి (ఐ.డి.ఎస్.పి.కి) మరింత నవీకరించిన తదుపరి తరం కార్యక్రమంగా . ఐ.హెచ్.ఐ.పి. అనే వేదికను రూపొందించారు.
వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖల మంత్రులు.. బల్బీర్ సింగ్ సిద్ధు (పంజాబ్), అలెగ్జాండర్ లాలూ హెక్(మేఘాలయ), డాక్టర్ కె. సుధాకర్ (కర్ణాటక), డాక్టర్ ప్రభురామ్ చౌధరి (మధ్యప్రదేశ్), జై ప్రతాప్ సింగ్ (ఉత్తరప్రదేశ్), ఈటల రాజేందర్ (తెలంగాణ), టి.ఎస్. సింగ్ దేవ్ (చత్తీస్ గఢ్), డాక్టర్ ఆర్. లాల్తంగ్లియానా (మిజోరాం), ఎస్. పాంగ్నీయు ఫోమ్ (నాగాలాండ్) ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి ఆహుజా, ఆరోగ్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీల్ కుమార్, ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, ఎన్.సి.డి.సి. డైరెక్టర్ డాక్టర్ సుజీత్ సింగ్, ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారతదేశం ప్రతినిధి డాక్టర్ రోడెరికో ఆఫ్రిన్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు, జాతీయ ఆరోగ్య కార్యక్రమం మేనేజింగ్ డైరెక్టర్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య శాఖల సీనియర్ అధికారులు కూడా ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, ఆరోగ్య రక్షణ వ్యవస్థను, సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించడంలో దేశం చూపిన సాహసాన్ని, దార్శనికతను అభినందించారు. “వ్యాధులపై ముందస్తు నిఘాతో వ్యవహరించే ఈ వ్యవస్థకు సంబంధించి ఈ రోజును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. భారతదేశపు ప్రజారోగ్య పయనంలో మేం ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాం. వ్యాధులపై నిఘాతో వ్యవహరించే విషయంలో ఎంతో అధునాతన వ్యవస్థను అమలుచేయడంలో భారతదేశమే అగ్రగామిగా నిలిచింది.” అని ఆయన అన్నారు. సాఫ్ట్ వేర్ ప్రాతిపదికగా పనిచేసే ఇలాంటి వేదికను సకాలంలో వినియోగించడం అవసరమని ఆయన అభిప్రాయ పడ్డారు. : “వ్యాధులపై నిఘాతో వ్యవహరించడంలో భారతదేశం చేపట్టిన కార్యక్రమానికి సంబంధించి సమాచారాన్ని, నిర్వహణా కార్యకమాలను నిక్షిప్తం చేయడానికి ఐ.హెచ్.ఐ.పి. కొత్త రూపం ఎంతో దోహదపడుతుంది. ఇదివరరకు కనుగొన్న 18 వ్యాధులతో పోల్చితే అదనంగా 33 వ్యాధులను పసిగట్టగలిగాం. వాస్తవరూపంలో డిజిటల్ సమాచారాన్ని పొందడానికి ఈ వ్యవస్థ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పటివరకూ కాగితాల సహాయంతో పనిచేసే పద్ధతికి స్వస్తి చెప్పడానికి కూడా ఇది దోహదపడుతుంది.”
వ్యాధులపై నిఘాకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్ లైన్ వేదిక అన్నారు., జాతీయ డిజిటల్ ఆరోగ్య పథకానికి అనుగుణంగా దీనికి రూపకల్పన చేసినట్టు కేంద్రమంత్రి తెలిపారు. దేశంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న ఇతర డిజిటల్ సమాచార వ్యవస్థలకు అనువుగా ఉపయోగపడేలా ఇది ఉందన్నారు. అధునాతన సమాచార వ్యవస్థతో కూడిన నవీకరించిన ఐ.హెచ్.ఐ.పి. వాస్తవ ప్రాతిపదికన కచ్చితమైన సమాచార సేకరణకు, విశ్లేషణకు ఎంతగానో దోహదపడుతుందని, ఆధారాల ప్రాతిపదికగా విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కొత్త పరిణామాలకు సంబంధించిన కసరత్తులో పాలుపంచుకున్న జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్.సి.డి.సి.), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.)లను, ఇతర సంస్థలను ఆయన అభినందించారు. వాస్తవాల ప్రాతిపదికన, కేసులవారీగా సమాచారాన్ని, సమగ్ర విశ్లేషణకోసం రూపొందించిన ఆరోగ్య సమాచార వ్యవస్థను ఐ.హెచ్.ఐ.పి. అందిస్తుందని, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలెక్ట్రానిక్ పరికాల ద్వారా విశ్లేషణతో కూడిన నివేదికలను తయారు చేస్తుందని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. దీనికి తోడు, ఆరోగ్య పరీక్షలను కూడా ఎలెక్ట్రానిక్ పద్ధతిలో పర్యవేక్షించేందుకు వీలుంటుందన్నారు.
వ్యాధి వ్యాప్తికి సంబంధించిన సూచనలను ముందస్తుగానే పసిగట్టేందుకు ఇంతటి అధునాతన డిజిటల్ వేదికను వినియోగించడంవల్ల దేశంలోని సమితులు స్థాయిలో, అతి చిన్న గ్రామాల స్థాయిలో వ్యాధి వ్యాప్తిని తొలిదశలోనే నిరోధించేందుకు వీలుంటుందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో వ్యాధినిరోధం, చికిత్సకోసం ఏడాది అంతా ముందువరుసలో నిలిచి ఎంతో శ్రమించిన ఆరోగ్య రక్షణ సిబ్బందిని ఆయన ప్రశంసించారు. “వైరస్ మహమ్మారి వ్యాప్తి జరిగే కష్ట సమయంలో కూడా వ్యాధులను పసిగట్టే అధునాతన నిఘా వ్యవస్థకు రూపకల్పన చేయగలమని భారతదేశం ప్రపంచానికి చాటిచెప్పింది.” అన్నారు. ఈ డిజిటల్ వేదిక రూపకల్పనను ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంలో భాగంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తికి అనుగుణంగా జరిగిన కృషిగా కేంద్రమంత్రి ఈ వేదికను అభివర్ణించారు.
“135కోట్లమంది జనాభా కలిగిన భారత్ వంటి దేశానికి వివిధ వ్యాధులపై కచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారం, సకాలంలో అందించే వ్యవస్థ ఉండటం ఎంతో కీలకం, అత్యంత ఆవశ్యకం.” అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్య రక్షణలో కచ్చితత్వంకోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఇటీవలి కాలంలో బాగా పెరిగిందని, దీనితో వ్యాధికారక జన్యువులపై అధ్యయనం, వ్యాధులను పసిగట్టే వ్యవస్థను విస్తృతం చేయడం వంటి కార్యకలాపాలు కూడా క్రమంగా పెరిగాయని ఆయన అన్నారు. అయితే, వివిధ రాష్ట్రాలు అందించే సమాచారంపై ఈ డిజిటల్ వేదిక విజయం ఆధారపడి ఉంటుందని, ఈ విషయంలో తగిన జాగరూకతతో వ్యవహరించడం అవసరమని ఆయన హెచ్చరించారు.
వ్యాధుల వ్యాప్తిని పసిగట్టే డిజిటల్ సమాచార వ్యవస్థ రూపకల్పన చేసినందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే అభినందనలు తెలిపారు. ఆరోగ్యరక్షణ రంగంలో భారతదేశం సరికొత్త నాణ్యతా ప్రమాణాలు నెలకొల్పిందని ఆయన అన్నారు.: “ఐ.హెచ్.ఐ.పి. వ్యవస్థ రూపకల్పనతో అధీకృత సమాచార సేకరణ సులభంగా మారింది. దేశవ్యాప్తంగా గ్రామాల, సమితుల స్థాయినుంచి సమాచారం అందుతూ ఉండటంతో ఇది సాధ్యమైంది. ఈ వ్యవస్థ అమలుతో మనం ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తి దిశగా స్వావలంబన సాధించేందుకు పురోగమిస్తున్నాం.” అని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మాట్లాడుతూ, వ్యాధులపై నిఘా వ్యవస్థ అందుపాటులోకి వచ్చిన ప్రాంతాన్ని, ఎన్ని వ్యాధులకు ఈ వ్యవస్థను వర్తింపజేశామన్న అంశాలను, ఎంత పరిమాణంలో సమాచారాన్ని సేకరించామన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ప్రపంచ స్థాయిలోనే అతిపెద్ద ఆరోగ్య సమాచార డిజిటల్ వేదికల్లో ఒకటిగా ఐ.హెచ్.ఐ.పి.ని అభివర్ణించవచ్చని అన్నారు. అట్టడుగు స్థాయి ఆరోగ్య రక్షణ కార్యకర్తల ద్వారా సమాచారం వాస్తవ సమయం ప్రాతిప్రతిదికగా అందుతుందని, తమ వద్దఉన్న ట్యాబుల ద్వారా వారు కచ్చితమైన సమాచారం అందిస్తారని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం, సబ్ డివిజనల్ ఆరోగ్య కేంద్రం, జిల్లా ఆరోగ్య కేంద్రం స్థాయిల్లోని డాక్టర్ల వద్దకు ఆరోగ్యరక్షణకోసం వచ్చిన పౌరులనుంచి ఆరోగ్య పరీక్షల ద్వారా అందిన క్షేత్రస్థాయి సమాచారం ఇందులో ఉంటుందని ఆయన చెప్పారు.
సమగ్ర ఆరోగ్య సమాచార వేదికను ప్రారంభమైన ఈ రోజును ‘చారిత్రిక దినం’గా ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారతదేశానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న డాక్టర్ రోడెరికో ఆఫ్రిన్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్య రక్షణ కార్యకలాపాల్లో ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఆరోగ్య రక్షణకు సంబంధించి సకాలంలో చర్యలు తీసుకునేందుకు సమగ్ర ఆరోగ్య సమాచార వేదికకు సంబంధించిన వెబ్ పోర్టల్ గొప్పవనరుగా పనిచేస్తుందని ఆయన అన్నారు. సకాలంలో దీన్ని రూపకల్పన చేసిన భారతదేశం కృషి ఎంతో అభినందనీయమని డాక్టర్ రోడెరికో ఆఫ్రిన్ అన్నారు.
****
(Release ID: 1709798)
Visitor Counter : 227