నీతి ఆయోగ్
అటల్ ఇన్నోవేషన్ మిషన్ నూతన మిషన్ డైరెక్టర్ గా డాక్టర్ చింతన్ వైష్ణవ్ నోటిఫికేషన్ విడుదల
Posted On:
05 APR 2021 9:38AM by PIB Hyderabad
నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఎఐఎం) నూతన మిషన్ డైరెక్టర్ గా సామాజిక సాంకేతిక నిపుణుడుగా గుర్తింపు పొందిన డాక్టర్ చింతన్ వైష్ణవ్ నియమితులయ్యారు. 2017 జూన్ నుంచి అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శ్రీ రామనాథన్ రమణన్ నుంచి డాక్టర్ చింతన్ వైష్ణవ్ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డాక్టర్ చింతన్ వైష్ణవ్ పనిచేస్తున్నారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ బాధ్యతలు చేపట్టడానికి ఆయన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి వస్తున్నారు.
ఆవిర్భావం నుంచి మిషన్ డైరెక్టర్ గా పనిచేస్తూ సంస్థకు విలువైన సేవలు అందించి బలమైన పునాది వేసిన శ్రీ రామనాథన్ రమణన్ కు అటల్ ఇన్నోవేషన్ మిషన్ కృతజ్ఞతలు తెలిపింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ లక్ష్యాలను సాధించడానికి శ్రీ రామనాథన్ రమణన్ ప్రతిభావంతులైన యువ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరక్టర్ గా 2021 ఏప్రిల్ లో డాక్టర్ వైష్ణవ్ బాధ్యతలు స్వీకరిస్తారు. నూతన డైరక్టర్ కు అటల్ ఇన్నోవేషన్ మిషన్ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది.
మానవ మరియు సాంకేతిక అంశాలతో ముడిపడిన అంశాలను అధ్యయనం చేసి అవసరమైన వ్యవస్థలను రూపొందించే అంశంలో డాక్టర్ చింతన్ వైష్ణవ్ ప్రపంచవ్యాపితంగా గుర్తింపు పొందారు. ఇంజనీర్ అయిన డాక్టర్ చింతన్ వైష్ణవ్ ఉపాధ్యాయుడిగా, ఆవిష్కర్తగా మరియు వ్యవస్థాపకుడిగా భారతదేశం మరియు అమెరికాల్లో ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థ కు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి పట్టు కలిగివున్నారు. పరిశోధన, బోధనా రంగాలకు ఆయన తన సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో బోధనా అంశాలకు, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో కలసి నివసిస్తూ వారి సమస్యలను అర్ధం చేసుకుని జీవన స్థితిగతులను మెరుగు పరచడానికి దోహదపడే అంశాలను అమలు చేయడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. వాణిజ్య మరియు లాభాపేక్షలేని సంస్థల నిర్వహణలో ఆయన భాగస్వామిగా వున్నారు. సాంకేతిక అంశాలతో ముడిపడిన వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, విధానాల రూపకల్పన లాంటి అంశాలపై ఆయన అంకుర సంస్థలు, సంస్థలు, ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందించారు.
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ మరియు పాలసీలో టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ మరియు పాలసీలో డాక్టర్ వైష్ణవ్ పీహెచ్‌డీ చేశారు.
దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆవిష్కరణ మరియు బలమైన వ్యవస్థాపకత పర్యావరణ వ్యవస్థ రూపకల్పన, అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ పనిచేస్తోంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనుసరిస్తున్న సమగ్ర విధానాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలతో దేశంలో పెద్ద సంఖ్యలో అంకురా సంస్థలు ఏర్పాటు అయ్యాయి. వీటిద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేక విజయాలను నమోదు చేసింది.
ఇప్పటివరకు అటల్ ఇన్నోవేషన్ మిషన్ 650 జిల్లాల్లోని పాఠశాలల్లో 7259 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి వీటిద్వారా 3.5 మిలియన్ల మంది విద్యార్థులకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఇంతేకాకుండా 68 అటల్ ఇంక్యుబేటర్లను ద్వారా 2000 కి పైగా అంకుర సంస్థల స్థాపనకు అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహకరించింది. వీటిలో 625 అంకుర సంస్థలు మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. సాంఘిక-ఆర్ధిక ప్రభావంతో ఉత్పత్తి ఆవిష్కరణల కోసం అటల్ ఇన్నోవేషన్ మిషన్ 56 అటల్ న్యూ ఇండియా పోటీలను నిర్వహించి ఛాలెంజ్ విజేతలను ఎంపిక చేసింది. గ్రామీణ భారతదేశ అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేయాలన్న లక్ష్యంతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ 20 అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్లను నెలకొల్పడానికి సహకరించింది. వ్యవస్థలో మారుపులు తీసుకుని రావాలన్న లక్ష్యంతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ 30కి పైగా కార్పొరేట్ సంస్థలు, అంతర్జాతీయ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 5000 మందికి పైగా సలహాదారులు కలిగి వున్న అతి పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసింది. లక్ష్యాల సాధనకు అన్ని వర్గాలతో కలసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ కార్యక్రమాలను అమలు చేస్తోంది.
***
(Release ID: 1709619)
Visitor Counter : 242