ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా, ఆవిష్కర్తలుగా దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి – ఉపరాష్ట్రపతి పిలుపు


• విద్యయొక్క భారతీయ సంప్రదాయాన్ని పునర్నిర్మించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి

• వ్యక్తిత్వ నిర్మాణంతో పాటు ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడమే విద్య ప్రధాన లక్ష్యం కావాలి

• ఆదివాసీలను గౌరవించి, వారి పట్ల సున్నితంగా వ్యవహరించాలి – విధాన రూపకర్తలకు ఉపరాష్ట్రపతి సూచన

• ఆదివాసీల నుంచి నేర్చుకోవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి.

• విపత్తు నిర్వహణను పాఠశాల విద్యలో అంతర్భాగంగా చేర్చాలని పిలుపు

• లింగ వివక్ష, కులతత్వం, మతతత్వం, అవినీతి వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా యువత పోరాటం చేయాలని సూచన

• భువనేశ్వర్ లోని ఉత్కళ్ విశ్వవిద్యాలయ 50వ స్నాతకోత్సవంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి

• ఐదుగురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ ప్రదానం*

Posted On: 03 APR 2021 11:59AM by PIB Hyderabad

భారతీయ సనాతన సంస్కృతి నుంచి ప్రేరణ పొందడం ద్వారా యువత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా, ఉన్నతమైన ఆవిష్కరణల ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. 21వ శతాబ్ధపు సవాళ్ళకు అనుగుణంగా విద్యార్థులను ఉద్యోగార్థులుగా గాక, ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగే విధంగా విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు వారిని తీర్చిదిద్దాలని సూచించారు. 

ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని ఉత్కళ్ విశ్వవిద్యాలయ 50వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అంతర్జాతీయ విద్యా రంగానికి భారతదేశం అందించిన ఉన్నతమైన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, పురాతన భారతీయ విద్యాలయాలైన తక్షశిల, నలంద, వల్లభీ మరియు విక్రమశిలల సేవలను ప్రస్తావించారు. దేశాన్ని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయేలా పౌరులను తీర్చిదిద్దేందుకు ఈ ఉన్నతమైన భారతీయ సనాతన సంప్రదాయాన్ని తిరిగి బలోపేతం చేయవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. విద్య యొక్క లక్ష్యం కేవలం అభిజ్ఞా వికాసమే గాక, ఉన్నతమైన పౌరులుగా విద్యార్థుల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దడం కూడా అన్న ఆయన, 21వ శతాబ్ధపు అవసరాలకు అనుగుణమైన నైపుణ్యంతో పాటు, మంచి పౌరులుగా విద్యార్థులను తయారు చేయాలని సూచించారు. 

ఒడిశా రాష్ట్ర మొత్తం జనాభాలో 23 శాతం మేర 62 వేర్వేరు ఆదివాసీ ప్రజలు ఉన్నారన్న ఉపరాష్ట్రపతి, వారి అభివృద్ధి మరియు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. గిరిజనులు పట్ల గౌరవంగా, సున్నితంగా వ్యవహరించాలని నొక్కి చెప్పిన ఆయన, ప్రకృతితో మమేకమౌతూ, సహజ సంపదను కాపాడుకుంటూ నిరాండబర జీవితాన్ని గడిపే వారి నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా షెడ్యూల్డు కూలాలు మరియు షెడ్యూల్డు తెగల పరిశోధన మరియు శిక్షణ సంస్థ అధ్యయనాన్ని ఉపరాష్ట్రపతి ఉదహరించారు. ఒడిశాలోని ఆదివాసీ జనాభా ఎక్కువగా కోవిడ్ -19 మహమ్మారి బారిన పడలేదని ఈ పరిశోధన వెల్లడించిందన్న ఆయన, దీనికి కారణం వారి ప్రత్యేకమైన ఆచార పద్ధతులు, సమూహాలకు దూరంగా నడవడం, రోగనిరోధక శక్తిని పెంచే సహజమైన ఆహారం తీసుకోవడం లాంటివని పేర్కొన్నారు. 

ఒడిశాలో తుఫానులు, వరదలు, కరవు వంటి ప్రకృతి వైపరిత్యాల గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, విపత్తు నిర్వహణను ప్రాథమిక స్థాయి నుంచే విద్యా రంగంలో భాగం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రజలను సిద్ధం చేసేందుకు ఇదో మంచి ప్రయత్నంగా మారగలదని అభిప్రాయపడ్డారు. 

ఒడిశా రాష్ట్ర గొప్ప సంస్కృతి, ఉన్నతమైన చరిత్ర గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, కళింగ భూమి అశోక చక్రవర్తికి శాంతి పాఠం నేర్పించిందని, ఈ ప్రదేశాన్ని పాలించిన రాజులు ఆగ్నేయాసియాతో సాంస్కృతిక సంబంధాలను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. శ్రీలంక, జావా, సుమత్రా, బాలి, బర్మా సహా వివిధ దేశాలతో వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకున్న కళింగ ప్రాంత సాహసోపేతమైన సముద్ర వర్తకుల కృషిని, వారు పాటించిన సంప్రదాయాలు అభినందనీయమని తెలిపారు. కళింగ బోట్ మైన్, వ్యాపారుల నైపుణ్యాలను మరియు ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రశంసించిన ఆయన, యువతరం వారి నుంచి ప్రేరణ పొందడమే గాక, సంతోషకరమైన మరియు సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని సూచించారు. 

9వ, 10వ శతాబ్ధంలో ఒడిశా భూమకర రాజవంశానికి చెందిన మహిళా పాలకుల సుదీర్ఘ వారసత్వాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, మహిళా సాధికారతకు ఇదో గొప్ప నిదర్శనమని, ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని లింగవివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సూచించారు. లింగవివక్షతో పాటు, కులతత్వం, మతతత్వం, అవినీతి వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా యువతరం ముందుకు కదిలి సానుకూల మార్పునకు సారథులు కావాలని ఆకాంక్షించారు.  

విద్యార్థులను భవిష్యత్తు నాయకులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, నిర్వాహకులుగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, వారి భవిష్యత్తు దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉందని, ఏ రంగంలోనైనా విజయం సాధించేందుకు క్రమశిక్షణ, నిజాయితీ మరియు కష్టపడే తత్వాన్ని అలవరుచుకోవాలని సూచించారు. మార్పునకు యువతే కీలకమన్న ఉపరాష్ట్రపతి, దేశ సమస్యల విషయంలో సున్నితంగా ఆలోచించాలని, ఆకలి, వ్యాధులు, అజ్ఞానం లాంటి దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న అంశాలకు వ్యతిరేకంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

స్నాతకోత్సవం అనేది విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైనదిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, వారి వ్యక్తిగత సామర్థ్యాలను, అభిరుచి, పట్టుదల, చిత్తశుద్ది మరియు నేర్చుకునే విశాల దృక్పథాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించిన ఆయన, విద్యార్థులు భవిష్యత్ సృష్టికర్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఉత్కళ్ విశ్వవిద్యాలయాన్ని ఒడిశా రాష్ట్రాభివృద్ధికి ఒక మైలురాయిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తున్న విశ్వవిద్యాలయాన్ని ప్రశంసించారు.

*ఈ సందర్భంగా ఉత్కళ్ విశ్వవిద్యాలయం తరుఫున రిజర్వుబ్యాంక్ గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ గిరీష్ చంద్ర ముర్ము, ఒరిస్సా హైకోర్టుకు చెందిన జస్టిస్ సంజు పాండా, బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బి.ఎ.ఆర్.సి) సంచాలకులు డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి, ఒడిశా ప్రభుత్వ సలహాదారు డాక్టర్. బిజయా కుమార్ సాహులకు ఉపరాష్ట్రపతి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.*

ఈ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ ప్రొ. గణేశీ లాల్, ఒడిశా రాష్ట్ర మంత్రి డా. అరుణ్ కుమార్ సాహు, ఉత్కళ్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. సబిత ఆచార్య, రిజిస్ట్రార్ డా. అవయ కుమార్ నాయక్, అధ్యాపకులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరుల పాల్గొన్నారు.

***


(Release ID: 1709349) Visitor Counter : 215