ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

వ్యవసాయాన్నిలాభసాటిగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం అవసరం: ఉపరాష్ట్రపతి


• ఆదాయాన్ని పెంచేదిశగా వ్యవసాయంలో అవసరమైన మార్పులు తీసుకురావాలి, ఈ ధోరణిని మరింతగా ప్రోత్సహించాలి

• వ్యవసాయంరంగంలో సానుకూల మార్పులకోసం విధాన నిర్ణేతలు, ప్రచార మాధ్యమాలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

• సమస్యల కారణంగానే రైతులు తమ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారు

• కరోనా సమయంలోనూ అన్నదాతలు రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేశారని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

• చదువుకున్న యువత వ్యవసాయం వైపు ఆకర్షితులు కావడం ఆశించదగిన పరిణామం

• ఖర్చును తగ్గించి, ఆదాయాన్ని పెంచే ప్రకృతి వ్యవసాయం మీద రైతులు దృష్టి పెట్టాలి

• ‘అగ్రికల్చర్ ఇన్ ఇండియా: కాంటెంపరరీ చాలెంజెస్-ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్‌కమ్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

Posted On: 31 MAR 2021 5:18PM by PIB Hyderabad

భారతీయ రైతుల స్థాయిని పెంచడంతోపాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ  రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మరింత స్పష్టమైన ఫలితాలు సాధించడం తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సమన్వయంతో కృషిచేయల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ కందా రచించిన ‘అగ్రికల్చర్ ఇన్ ఇండియా: కాంటెంపరరీ చాలెంజెస్-ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్‌కమ్’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు సమస్యల కారణంగా రైతులు తమ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని  ప్రదర్శించలేకపోతున్నారని, ఈ సమస్యలను ఇలాగే కొనసాగించడం సరికాదని ఆయన సూచించారు.

భూ కమతాల విస్తీర్ణం తగ్గడం, రుతుపవనాలపైనే ఆధారపడటం, నీటిపారుదల సౌకర్యాల లేమి, సరైన సమయానికి అవసరమైనంతమేర వ్యవసాయ రుణాలు అందకపోవడం మొదలైన సమస్యలే రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్న ఉపరాష్ట్రపతి, వీటి కారణంగానే వ్యవసాయం లాభసాటిగా కనిపించడం లేదన్నారు. వ్యవసాయం లాభసాటి కావాలంటే రైతులు ఖర్చును తగ్గించి, మంచి ఆదాయాన్ని అందించే ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని, దాన్ని రైతులు వినియోగించుకుని లాభాలు పొందడానికి అవకాశం ఉందని తెలిపారు.

అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, రైతులు తమ అంత:శక్తితో వ్యవసాయరంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారన్న ఉపరాష్ట్రపతి,కరోనా మహమ్మారి సమయంలోనూ రికార్డు స్థాయిలో ఉత్పాదన సాధించడం భారతీయ అన్నదాతలకే చెల్లిందన్న విషయాన్ని గుర్తుచేస్తూ వారిపై ప్రశంసలు కురిపించారు.

టీమ్ ఇండియా స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో విస్తృతమైన, అత్యంత అవసరమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి,  వ్యవసాయంలో సానుకూల మార్పులు తీసుకొచ్చేందుకు పార్లమెంటు, రాజకీయ నాయకులు (పొలిటికల్ లీడర్స్), విధాన నిర్ణేతలు (పాలసీ మేకర్స్), ప్రసార సాధనాలు (ప్రెస్) కృషి చేయాలన్నారు.  ‘వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకొచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాల్సిన తక్షణావసరం ఉందన్న ఆయన, ఈ  పురోగతి సుస్థిరంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా మనదే’ అని పేర్కొన్నారు.

2022 కల్లా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం చేస్తోందన్న ఉపరాష్ట్రపతి, ఉత్పత్తితోపాటు రైతుల సంక్షేమంపైనా ప్రభుత్వం దృష్టిపెట్టిందన్నారు.ఇందుకోసం పరిపూర్ణమైన వ్యూహంతోపాటు పలు సంస్కరణలు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలు కూడా ఇందులో భాగమేనని ఉపరాష్ట్రపతి తెలిపారు.

ఉత్పత్తి సమస్య, ధరల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రాధాన్యతను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, రవాణా, నిల్వ, గిడ్డంగుల వంటి మౌలిక వసతులు, పంటల్లో వైవిధ్యత, పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్ వంటి వాటిపై దృష్టిపెట్టాలనిసూచించారు. ఈ మార్పుల కారణంగా వ్యవసాయంలో ఆదాయం పెరుగుతుందని తెలిపారు.

పంటల వైవిధ్యత గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, భారతదేశంలో ఆహార వినియోగ పద్ధతులు మారుతున్నాయని, తృణధాన్యాలపై తక్కువ ఆధారపడుతూ, పౌష్టికాహారంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో తక్కువ నీరు, తక్కువ విద్యుత్ అవసరమయ్యే పంటల ఉత్పత్తి దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. రైతులు సైతం మార్కెట్ డిమాండ్ ను బట్టి, కొత్త పంటల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. 

ఈ మధ్యకాలంలో చదువుకున్న యువత వ్యవసాయం వైపు ఆకర్షితులై అద్భుతాలు సృష్టించడం ఆనందదాయకమన్న ఉపరాష్ట్రపతి, కరీంనగర్ జిల్లాకు చెందిన సంధ్య, మల్లికార్జున్ రెడ్డి వ్యవసాయం చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. వారికి అభినందనలు తెలియజేసిన ఉపరాష్ట్రపతి, ఇదే విధంగా చదువుకున్న యువత వ్యవసాయం మీద దృష్టి కేంద్రీకరించాలని, చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా వ్యవసాయంలో ఆదాయ మార్గాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి శ్రీ పద్మనాభయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ బి. వినోద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ కందా, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, డైరెక్టర్ ప్రొఫెసర్ జువ్వాడి దేవీ ప్రసాద్, బీఎస్పీ బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ అనిల్ షాతోపాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

***


(Release ID: 1708756) Visitor Counter : 243