పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
3 రోజులలో 22 మార్గాల్లో ఉడాన్ సర్వీసులు ప్రారంభం
ఈశాన్యంలో ఆరు మార్గాల్లో అందుబాటులోకి వచ్చిన విమాన సర్వీసులు
Posted On:
30 MAR 2021 4:57PM by PIB Hyderabad
విమాన సర్వీసులు లేని ప్రాంతాల్లో సర్వీసులను ప్రారంభించడానికి రూపొందిన ఉడాన్ పథకం కింద గత మూడు రోజులలో 22 నూతన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వీటిలో ఈశాన్య భారతదేశంలో ఆరు కొత్త మార్గాలు వున్నాయి. షిల్లాంగ్ (మేఘాలయ) నుంచి సిల్చార్ (అస్సాం)కి నేరుగా ఉడాన్ పథకం కింద ఈ రోజు విమాన సర్వీసు ప్రారంభమయ్యింది. ఉడాన్ పథకం కింద షిల్లాంగ్ (మేఘాలయ) నుంచి అగర్తాలా (త్రిపుర) మధ్య నిన్న విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు జరిగిన కార్యక్రమానికి పౌర విమానయాన శాఖ, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు, సంబంధిత వ్యక్తులు హాజరయ్యారు. దేశంలో విమాన సేవలను విస్తృతం చేసి ఆర్ధికంగా వెసలుబాటుగా వుండే మార్గాల్లో అందరికి అందుబాటులో వుండే ధరలతో విమాన సర్వీసులను ప్రారంభించాలన్న ఉడాన్ పథకం లక్ష్యంలో భాగంగా ఈ మార్గాలలో సర్వీసులను ప్రారంభించారు. ఇంతవరకు విమాన సర్వీసులు లేని 57 విమానాశ్రయాల నుంచి ( 5 హేలీ పోర్టులు, రెండు జల విమానాశ్రయాలతో సహా) 347 మార్గాల్లో దేశవ్యాపితంగా ఉడాన్ పథకం కింద విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి.
2021 మార్చ్ 28వ తేదీన ఒక్క రోజులోనే 18 కొత్త మార్గాల్లో ఉడన్ పథకం కింద విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గోరఖ్పూర్ (ఉత్తర ప్రదేశ్) నుంచి లక్నో (ఉత్తర ప్రదేశ్), కర్నూలు (ఆంధ్రప్రదేశ్) బెంగళూరు (కర్ణాటక), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), మరియు చెన్నై (తమిళనాడు), ఆగ్రా (ఉత్తర ప్రదేశ్) నుంచి బెంగళూరు (కర్ణాటక) మరియు భోపాల్ (మధ్యప్రదేశ్), ప్రయాగ్రాజ్ (ఉత్తర ప్రదేశ్) నుంచి భువనేశ్వర్ (ఒడిశా)మరియు భోపాల్ (మధ్యప్రదేశ్) విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ మార్గాలతో పాటు,దిబ్రుఘర్ (అస్సాం) నుంచి దిమాపూర్ (నాగాలాండ్) వరకు కొత్త విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది.
గత ఏడాది జరిగిన ఉడాన్ 4 బిడ్డింగ్ ప్రక్రియలో ఇండిగో విమానయాన సంస్థకు షిల్లాంగ్-అగర్తాలా, షిల్లాంగ్ - సిల్చార్, కర్నూలు - బెంగళూరు, విశాఖపట్నం, మరియు చెన్నై మార్గాలు లభించాయి. వీటితో పాటు ఉడాన్ 3 కింద ఆగ్రా నుంచి బెంగళూరు మరియు ఆగ్రా నుంచి భోపాల్ మార్గం, ఉడాన్ 2లో ప్రయాగ్రాజ్ నుంచి భువనేశ్వర్ మరియు ప్రయాగ్రాజ్ నుంచి భోపాల్ మార్గాలను ఈ సంస్థకు కేటాయించడం జరిగింది. ఉడాన్ 3 బిడ్డింగ్ ప్రక్రియలో దిబ్రుఘర్ నుంచి దిమాపూర్ ను కేటాయించారు. ఉడాన్ 3 బిడ్డింగ్ ప్రక్రియలో లక్నో - గోరఖ్‌పూర్ మార్గం అలయన్స్ కు లభించింది.
***
(Release ID: 1708579)
Visitor Counter : 263