ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

చట్టసభల్లో నిర్మాణాత్మక, ప్రయోజనాత్మక చర్చలు జరగాలి – ఉపరాష్ట్రపతి


• చట్టసభలు అంతరాయాలకు వేదిక కారాదు, సభ్యుల ప్రసంగాలు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాలి.

• ప్రజాప్రతినిధులు మాట్లాడే అంశానికి సంబంధించి అధ్యయనం చేయాలి, మాతృభాషలో మాట్లాడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి

• దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి

• యువత నైపుణ్యాభివృద్ధి మీద విశ్వవిద్యాలయాలు దృష్టి పెట్టాలి

• ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి శ్రీ నూకల నరోత్తమ రెడ్డి శతజయంతి ఉత్సవాలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

• విద్యావేత్తగా, పత్రికా సంపాదకుడిగా, ఉన్నత విలువలు కల రాజకీయనాయకుడిగా శ్రీ నరోత్తమ్ రెడ్డి గారి జీవితం ఆదర్శనీయం

• శ్రీ నరోత్తమ్ రెడ్డి గారి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచన

• శ్రీ నరోత్తమ్ రెడ్డి శతజయంతి సంచికను ఆవిష్కరించిన చేసిన ఉపరాష్ట్రపతి

Posted On: 27 MAR 2021 1:52PM by PIB Hyderabad

చట్టసభలు నిర్మాణాత్మక, ప్రయోజనాత్మక చర్చలకు వేదికలు కావాలే తప్ప, అంతరాయాలకు కాదని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రముఖ విద్యావేత్త, పత్రికా సంపాదకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి శ్రీ నూకల నరోత్తమ్ రెడ్డి గారి శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సమావేశ మందిరంలో ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా శతజయంతి కమిటీ సభ్యులను అభినందించిన ఆయన, ఇలాంటి మహనీయుల జీవితం గురించి, సమాజానికి వారు చూపిన బాట గురించి ముందు తరాలకు తెలుసుకోవాలని, అందు కోసం ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు.

చిన్నతనం నుంచే మంచి ప్రతిభ కనపరచిని శ్రీ నరోత్తమ రెడ్డి సమాజసేవ మీద దృష్టి సారించి, రాజకీయాల్లోకి వచ్చారన్న ఉపరాష్ట్రపతి, నిజాం వ్యతిరేక పోరాటం మొదలుకుని  ప్రజలను చైతన్య పరిచే అనేక ఉద్యమాల్లో వారు కీలక పాత్ర పోషించారని తెలిపారు. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించిన గోలకొండ పత్రికకు సంపాదకులుగా, ఆ పత్రికకు ప్రజాభిమాన్ని సంపాదించిపెట్టడంలో కీలక పాత్ర పోషించారన్న ఆయన, శ్రీ సురవరం నెలకొల్పిన విలువలు, ప్రామాణికత ఏ మాత్రం తగ్గకుండా పత్రికను ముందుకు తీసుకుపోయారని తెలిపారు. 

రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా సేవలందించిన శ్రీ నరోత్తమ రెడ్డి గారు అనేక కీలక చర్చల్లో ప్రజా గళాన్ని వినిపించారన్న ఉపరాష్ట్రపతి వారి స్ఫూర్తిని ఈ తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. సభకు అంతరాయాలు కల్పించడం ద్వారా ప్రజా ప్రయోజనాలకు భంగం కలగడమే తప్ప ఎలాంటి ప్రయోజనమూ లేదన్న ఆయన ‘డిస్కస్.... డిబేట్... డిసైడ్... అండ్ డోంట్ డిస్రప్ట్’ (చర్చించాలి, సంభాషించాలి, నిర్ణయించాలి. అంతే తప్ప అడ్డుకోకూడదు) అని తెలిపారు. సభ్యులు సభలోకి రావడానికి ముందే విషయం గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలన్న ఆయన, సభ్యులు ఏం మాట్లాడుతున్నారే విషయం ప్రజలు తెలుసుకోవాలని, ఇందుకోసం వీలైనంత వరకూ సభ్యులు మాతృభాషలో మాట్లాడేందుకు ప్రాధాన్యత ఇవ్వాని ఉపరాష్ట్రపతి తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాజ్యసభలో 22 భాషల్లో మాట్లాడేందుకు సభ్యులకు అవకాశం కల్పించి, అందుకు తగిన సౌకర్యాలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

విద్యారంగం పట్ల శ్రీ నూకల నరోత్తమ రెడ్డి గారు అమిత శ్రద్ధను కనబరిచారన్న ఉపరాష్ట్రపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రెండు దశాబ్ధాలు సిండికేట్ సభ్యునిగా, మూడేళ్ళ పాటు ఉపకులపతిగా సేవలు అందించి విశ్వవిద్యాలయ ప్రమాణాలు పెంచేందుకు కృషి చేశారని తెలిపారు. 56 ఏళ్ళ క్రితం రాజ్యసభలో నరోత్తమ్ రెడ్డి గారి ప్రసంగాలను వింటే, దేశంలో విద్యాప్రమాణాలను పెంచేందుకు ఆయన పడిన తపన మనకు అవగతమౌతుందన్నారు.

విద్యా ప్రమాణాల విషయంలో ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాల పాత్ర మరింత కీలకమైనదన్న ఉపరాష్ట్రపతి, దేశ జనాభాలో 60 శాతానికి మించి ఉన్న యువశక్తిని దేశాభివృద్ధిలో భాగస్వాముల్ని చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం యువత నైపుణ్యాభివృద్ధి మీద మరింత దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 21వ శతాబ్ధపు అవసరాలకు, అవకాశాలకు అనుగుణంగా భారతీయ యువతను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన, మారుతున్న అవసరాలు, సాంకేతికత మీద యువత దృష్టి కేంద్రీకరించాలని, అవకాశాలను అందిపుచ్చుకునేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నూతన విద్యా విధానం – 2020 గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, సమగ్ర వికాసానికి ప్రాధాన్యత ఇస్తూ, భారాన్ని తగ్గించే ప్రయత్నం చేయటమే కాక, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దే దిశగా ఉపయోగ పడే విధంగా ఈ విధానం ఉందని, ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఉన్న లోపాల్లో చాలా వరకూ ఈ నిర్ణయాల ద్వారా సవరించటం సాధ్యమౌతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

కళలు, సంస్కృతి పట్ల నరోత్తమ్ రెడ్డి గారికి ఎంతో అభిమానమన్న ఉపరాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ చైర్మన్ గా, జాతీయ లలిత కళా అకాడమీలోనూ జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా వారు సేవలందించారని, అనేక మంది ఉత్తమ కళాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా చొరవ తీసుకున్నారన్నారు. ఆనాటి నాయకులు పాటించిన ప్రమాణాలు, వారు అనుసరించిన విలువలు, నీతి-నిజాయితీకి కట్టుబడి సామాజిక అభ్యున్నతే ధ్యేయంగా వారు చేసిన కృషి చిరస్మరణీయమైనదన్న ఆయన, ఇలాంటి నాయకుల జీవితాలను యువత అధ్యయనం చేయాలని, వారు జీవితాంతం పాటించిన విలువలు, దేశభక్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. 

ఈ సందర్భంగా శ్రీ నూకల నరోత్తమ రెడ్డి గారి శతజయంతి సంచికను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి శ్రీ మహమ్మూద్ అలీ, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య శివారెడ్డి, శతజయంతి కమిటీ కన్వీనర్ శ్రీ నూకల రాజేంద్ర రెడ్డి సహా శ్రీ నూకల నరోత్తమ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, అభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు.

***



(Release ID: 1708057) Visitor Counter : 192