బొగ్గు మంత్రిత్వ శాఖ

వాణిజ్య బొగ్గు బ్లాకుల కేటాయింపు కోసం రెండోదశ వేలం మొదలయింది.


బొగ్గు ఉత్పత్తిలో మనదేశం ఆత్మనిర్భర్గా మారడానికి ఈ వేలం సహాయపడుతుందని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు

Posted On: 25 MAR 2021 1:55PM by PIB Hyderabad

వాణిజ్య బొగ్గు మైనింగ్ కోసం 67 గనుల కేటాయింపునకు భారత్ తన రెండోదశ బొగ్గుగనుల వేలాన్ని  ప్రారంభించింది. 2014 నుండి వేలం విధానం ప్రారంభమైన తరువాత వేలంలో ఇంత భారీగా గనులను కేటాయించడం ఇదే మొదటిసారి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు మంత్రి ప్రహ్లాద్ జోషి  వేలం ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నీతిఆయోగ్ సీఈఓ  అమితాబ్ కాంత్, కార్యదర్శి (బొగ్గు)  అనిల్ కుమార్ జైన్ పాల్గొన్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖ వేలం వేస్తున్న మొత్తం 67 గనుల్లో 23 గనులు సీఎం (ఎస్పీ) చట్టం కింద, 44 గనులు ఎంఎండీఆర్ చట్టం కింద ఉన్నాయి. వీటిలో చిన్న  పెద్ద నిల్వలు, కోకింగ్,  నాన్-కోకింగ్ గనులు ఉన్నాయి. ఇవి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,  ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించి ఉన్నాయి.  వీటిలో ఇది వరకే కొన్నింట్లో బొగ్గు కోసం తవ్వకాలు జరిగాయి. "మేము బొగ్గును దేశంలోని ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి ఊతంతా చేస్తున్నాము. మనదేశ బొగ్గు రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయి. అందువల్ల, దేశంలో ఇప్పటికీ ఎవరూ వాడుకోని బొగ్గుబ్లాకులను ఉపయోగించుకోవాలని నేను పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నాను. మీ వ్యాపారాలను పెంచుకోండి  భారతదేశాన్ని వృద్ధి మార్గంలో తీసుకెళ్లండి ” అని ఈ సందర్భంగా జోషి అన్నారు. "వాణిజ్య బొగ్గు తవ్వకం కొత్త పెట్టుబడులను తెస్తుంది. భారీ ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.  బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రాల్లో సామాజిక-ఆర్థిక అభివృద్ధిని పెంచుతుంది. మార్కెట్ ఆధారిత బొగ్గు ఆర్థిక వ్యవస్థ బొగ్గు ఉత్పత్తిలో భారత్ ఆత్మనిర్భరత సాధించడానికి  సహాయపడుతుంది” అని  జోషి అన్నారు.  బొగ్గురంగంలో గత విజయాలను పరిశీలించాక,  భవిష్యత్తులో వేలం నిర్వహించడానికి ప్రభుత్వం ‘రోలింగ్ యాక్షన్’ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించినట్టు మంత్రి ప్రకటించారు.  రోలింగ్ వేలం విధానం మొట్టమొదట బొగ్గురంగంలోనే అమలు అవుతోందని,  బొగ్గు బ్లాకులు ఎల్లప్పుడూ వేలానికి అందుబాటులో ఉంటాయని జోషి వివరించారు.  "రోలింగ్ యాక్షన్ విధానంలో  కీలక సాంకేతిక డేటాతో పాటు గనుల సమగ్ర జాబితాను అప్‌లోడ్ చేస్తాము.  వేలం  తదుపరి దశలో గనులను చేర్చడానికి బిడ్డర్లు తమ ప్రాధాన్యతలను తెలియజేయవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ.  వేలం విధానాన్ని వేగవంతం చేస్తుంది. బిడ్డర్లు ప్రణాళిక ప్రకారం బిడ్స్ వేయడానికి ఈ కొత్త విధానం ఉపయోగపడుతుంది.  వ్యవస్థలో పారదర్శకతను మరింత పెంచుతుంది” అని  జోషి అన్నారు. వాణిజ్య బొగ్గు తవ్వకాలను ప్రోత్సహించడంతో పాటు, కోల్ ఇండియా లిమిటెడ్  ప్రస్తుత వేలం విధానాన్ని సంస్కరిస్తుందని వెల్లడించారు.  సిఐఎల్  వివిధ ఈ–వేలం విండోలను విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని  జోషి అన్నారు. ఇది ‘‘ఒక బొగ్గు గ్రేడ్ – ఒక ధర”విధానం వైపు వెళ్ళడానికి సహాయపడుతుందన్నారు.  ఈ-వేలం విండో ద్వారా మార్కెట్ ఆధారిత ధరలకు బొగ్గును అమ్మడం వల్ల వ్యవస్థను సరళీకృతం అవుతుందని,  పారదర్శకత పెరుగుతుందని మంత్రి వివరించారు.  ‘‘వాణిజ్య బొగ్గు తవ్వకం ప్రారంభించడం దేశంలోని బొగ్గు రంగంలో తీసుకున్న అత్యంత విప్లవాత్మక చర్య.  ఇది భారత బొగ్గు రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను తీసుకొస్తుంది. పోటీతత్వాన్ని పెంచుతుంది. ఈ రంగంలోకి మరింత మంది ఇన్వెస్టర్లు వస్తారు.  భారత బొగ్గు రంగం ఉత్పాదకతపరంగా,  ఆధునీకరణలో భారీ మార్పులను చూస్తుంది ”  అని అమితాబ్‌ కాంత్‌ వివరించారు.  "ఈ వేలంపాటలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాం. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండి, బొగ్గు నాణ్యత బాగున్న చోట ఉన్న గనులనే వేలానికి ఉంచుతున్నాం.  మౌలిక సదుపాయాల సౌకర్యాలకు దగ్గరగా ఉన్న వాటినే వేలం వేస్తున్నాం. ఆవాసాల తరలింపు కనీస స్థాయిలో జరగాలి. కోకింగ్ బొగ్గు గనుల దిగుమతిని కూడా తగ్గించడానికి వీలుగా మరిన్ని కోకింగ్ బొగ్గు గనులను కేటాయిస్తున్నాం” అని కార్యదర్శి (బొగ్గు) కార్యదర్శి  అనిల్ కుమార్ జైన్ ఈ కార్యక్రమంలో అన్నారు. గతేడాది జరిగిన వాణిజ్య బొగ్గు మైనింగ్ వేలంపాటలో 19 గనులను కేటాయించారు. బిడ్డర్లు 9.5 శాతం నుండి 66.75 శాతం వరకు ప్రీమియం కోట్ చేశారు. బొగ్గు మంత్రిత్వ శాఖ,  బిడ్డర్ల మధ్య ఒప్పందాలు ఈ ఏడాది జనవరిలో జరిగాయి.  గరిష్టంగా 51 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం లెక్కన చూసినప్పుడు, రాష్ట్రాలకు ఈ వేలం పాటల నుంచి రూ. 7000 కోట్ల ఆదాయం వస్తుంది.  

***(Release ID: 1707662) Visitor Counter : 173