మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

పాఠ్యప్రణాళిక ప్రాతిపదికగా రూపొందిన వందకుపైగా కామిక్ పుస్తకాల ఆవిష్కరణ లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర విద్యామంత్రి


దీక్షా పోర్టల్, మొబైల్ యాప్, వాట్సాప్ చాట్.బాట్ ద్వారా అందుబాటులోకి వచ్చిన కామిక్స్

పిల్లల్లో విద్యతోపాటుగా, సాంస్కృతిక, సామాజిక వివేచనను పెంపొందిస్తాయన్న రమేశ్ పోఖ్రియాల్ 'నిశాంక్'

Posted On: 25 MAR 2021 4:41PM by PIB Hyderabad

  కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సి.బి.ఎస్.ఇ.)కి అనుబంధించిన పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు రూపొందించిన వందకుపైగా బొమ్మల కథల (కామిక్) పుస్తకాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఈ నెల 24న ఆవిష్కరించారు. జాతీయ విద్యా, పరిశోధనా శిక్షణా మండలి (ఎన్‌.సి.ఇ.ఆర్.టి.) మార్గదర్శకత్వంలో ఈ పుస్తకాలకు రూపకల్పన జరిగింది. ఆన్‌లైన్‌లో దీక్షా (DIKSHA) వెబ్ పోర్టల్ (diksha.gov.in) లేదా దీక్షా యాప్ ద్వారా ఈ కామిక్ పుస్తకాలను పొందవచ్చు. ఏదైనా ఆండ్రాయిడ్ (Android) స్మార్ట్‌ఫోన్‌ ద్వారా వీటిని పొందడానికి అవకాశం కల్పించారు. వాట్సాప్ (WhatsApp) సహాయంతో పనిచేసే కొత్త చాట్‌బాట్ ద్వారా ఈ పుస్తకాలను పొందేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేశారు. డిజిటల్ పద్ధతిలో అభ్యసించే వ్యవస్థ పరిధిని మరింత విస్తరించడానికి ఈ వాట్సాప్ చాట్‌బాట్ విభిన్నమైన అవకాశాన్ని కల్పిస్తుంది. విద్యార్థుల సామర్థ్యం ప్రాతిపదికగా సి.బి.ఎస్.ఇ. రూపొందించిన విద్యా ప్రాజెక్టులో భాగంగా, విజ్ఞాన శాస్త్రం, గణితం, ఇంగ్లీష్ తరగతులకోసం ఉద్దేశించిన మధింపు వ్యవస్థను కూడా కేంద్రమంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు.

  ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని విద్యా, అక్షరాస్యతా శాఖ కార్యదర్శి అనితా కర్వాల్, సి.బి.ఎస్.ఇ. చైర్మన్ మనోజ్ ఆహుజా పాల్గొన్నారు. విద్యా మంత్రిత్వ శాఖ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పలు సంస్థల సీనియర్ అధికారులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

    ఈ సందర్భంగా రమేశ్ పొఖ్రియాల్ మాట్లాడుతూ, విద్యార్థులకు పరిపూర్ణ స్థాయి విద్యను అందించడం, 2020వ సంవత్సరపు నూతన లిద్యా విధానం నిర్దేశించిన దార్శికతను సాధించడం లక్ష్యంగా కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యతా శాఖ ఈ కామిక్ పుస్తకాలను తీసుకువచ్చినట్టు తెలిపారు. 3నుంచి 12వ తరగతి వరకూ ఉన్న ఎన్.సి.ఇ.ఆర్.టి. పుస్తకాల పాఠ్యాంశాలకు అనుబంధంగా ఆ కామిక్ పుస్తకాలకు రూపకల్పన చేసినట్టు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవతో, మన పిల్లల్లో విద్యతో పాటుగా సాంస్కృతిక, సామాజిక వివేచన పెంపొందుతుందని మంత్రి చెప్పారు. ఎంతో సృజనాత్మకంగా, విభిన్న పద్ధతిలో ఈ పుస్తకాలకు రూపకల్పన చేసిన వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు ఆయన అభినందనలు తెలిపారు.

   కేవలం పాఠ్యపుస్తకాలను మాత్రమే చదవుకునే పద్ధతిని ఇకపై మార్చుకోవాలని, వాస్తవ ప్రపంచం, దైనందిన జీవితం తదితర కార్యకలాపాలను కూడా తెలుసుకుని అవగాహన పెంచుకునే అంశాలపైకి దృష్టిని మరల్చాలని 2020వ సంవత్సరపు జాతీయ విద్యా విధానం నిర్దేశిస్తోంది. కేవలం విద్యాభ్యాసానికే కాక, విషయాలపై పూర్తిస్థాయి అవగాహనకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటోంది. అన్ని రకాల సృజనాత్మక ఆలోచనలకు విద్యావిధానం ప్రాముఖ్యం ఇస్తోంది. అందుకే ఎన్.సి.ఇ.ఆర్.టి. పాఠ్య ప్రణాళిక పరిధిలో 3నుంచి 12వ తరగతి వరకూ గల పుస్తకాల్లోని అధ్యాయాల ప్రాతిపదికగా ఈ కామిక్ పుస్తకాలను రూపొందించారు. తగిన సృజనాత్మక బోధనా పద్ధతులతో వీటికి రూపకల్పన చేశారు. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వివిధ పాఠశాలలకు సంబంధించిన భాషా విభాగాలు, లలితకళలు, ప్రదర్శన కళలు, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలు కలసి ఈ కామిక్ పుస్తకాలను తీర్చిదిద్దాయి. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్ము, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన పాఠశాలలు ఈ కామిక్స్ రూపకల్పనలో పాలుపంచుకున్నాయి

  ఎన్.సి.ఇ.ఆర్.టి. పాఠ్యపుస్తకాల్లోని అధ్యాయాలు, పాఠ్యాంశాలు ఆధారంగా రూపొందిన ఈ కామిక్ పుస్తకాల్లో పొందు పరిచిన కథనా రీతి, కథల్లోని పాత్రలు ఎంతో విభిన్నంగా,.. విద్యార్థులు, ఉపాధ్యాయులు తమకు తాము పోల్చుకునేలా ఉంటాయి. కామిక్ పుస్తకాల్లోని ప్రధాన లక్షణాల్లో కొన్నింటిని ఈ కింద పరిశీలించవచ్చు.:

  • ప్రతి కామిక్ పుస్తకం, వర్క్ షీట్లతో కూడిన చిన్న చిన్న అంశాలతో రూపొందింది. అభ్యాస లక్ష్యాలను, ఆశించిన ఫలితాలను ఈ పుస్తకాల్లో  వివరంగా పొందుపరిచారు.
  • విద్యాభ్యాసంలో మౌలికమైన భావనలను సులభ గ్రాహ్యంగా ఉండేలా, అభ్యాస ప్రక్రియలో అంతరాలను తగ్గించేలా ఈ పుస్తకాలను తీర్చిదిద్దారు.
  • లైంగిక సున్నితత్వం, మహిళా సాధికారత, విలువలతో కూడిన విద్య, ఇతర జీవన నైపుణ్యాలు వంటి అంశాల అధ్యయనంలో సమస్యలను పరిష్కరించేందుకు ఈ పుస్తకాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

 

*****



(Release ID: 1707647) Visitor Counter : 183