ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ జల దినం సందర్భం లో ‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రేన్’ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
కేన్- బేత్ వా లింక్ ప్రాజెక్టు కు సంబంధించిన చరిత్రాత్మకమైన ఎమ్ఒఎ పై సంతకాలయ్యాయి
భారతదేశం అభివృద్ధి, భారతదేశం స్వావలంబన లు జల భద్రతపైన, జల సంధానం పై ఆధారపడి ఉన్నాయి: ప్రధాన మంత్రి
జల పరీక్ష ను అత్యంత గంభీరత్వం తో నిర్వహించడం జరుగుతోంది: ప్రధాన మంత్రి
Posted On:
22 MAR 2021 2:25PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రేన్’ ప్రచార ఉద్యమాన్ని ప్రపంచ జల దినం అయినటువంటి ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నదుల ను ఒకదానితో మరొక దానిని సంధానించడం కోసం ఉద్దేశించినటువంటి జాతీయ ప్రణాళిక లో ఒకటో ప్రాజెక్టు గా కేన్- బేత్ వా లింక్ ప్రాజెక్టు ను కార్యరూపం లోకి తీసుకు రావడం కోసం ఒక ఒప్పంద పత్రం పైన కేంద్ర జల శక్తి మంత్రి, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి సమక్షం లో సంతకాలు చేశారు. ఇదే కార్యక్రమం లో భాగం గా రాజస్థాన్, ఉత్తరాఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ లకు చెందిన సర్పంచుల ను, వార్డు ప్రముఖుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడారు.
ప్రధాన మంత్రి ఈ సందర్భం లో మాట్లాడుతూ, వర్షపు నీటి ని ఒడిసి పట్టేందుకు ఉద్దేశించిన ఒక ప్రచార ఉద్యమాన్ని అంతర్జాతీయ జల దినం నాడు మొదలు పెట్టుకోవడం తో పాటుగా కేన్- బేత్ వా లింక్ కాలువ కు సంబంధించి ఒక పెద్ద చొరవ ను తీసుకోవడమైందన్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లలో లక్షల కొద్దీ కుటుంబాల కు మేలు చేయాలన్న అటల్ జీ కల ను నెరవేర్చడం కోసం ఈ ఒప్పందం ముఖ్యమైందని కూడా ఆయన అన్నారు. జల భద్రత, తగినటువంటి జల నిర్వహణ లకు తావు లేనిదే సత్వర అభివృద్ధి సాధ్యం కాదు అని ఆయన అన్నారు. భారతదేశం అభివృద్ధి, భారతదేశం స్వావలంబన ల దార్శనికత మన జల వనరుల పైన, మన జల సంధానం పైన ఆధారపడి ఉందని ఆయన చెప్పారు.
భారతదేశం అభివృద్ధి కి సాటివచ్చే విధం గా జల సంక్షోభం తాలూకు సవాలు కూడా పెరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. రాబోయే తరాల పట్ల తన బాధ్యత ను దేశ ప్రస్తుత తరం నిర్వర్తించవలసి ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వం తన విధానాల లో, తన నిర్ణయాల లో జల పాలన ను ఒక ప్రాధాన్య అంశం గా తీసుకొందని ఆయన స్పష్టం చేశారు. గడచిన ఆరు సంవత్సరాల లో ఈ దిశ లో అనేక చర్యల ను చేపట్టడం జరిగిందన్నారు. ‘ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన’ ను గురించి, ప్రతి వ్యవసాయ క్షేత్రానికి సాగునీటి ని అందించే ప్రచార ఉద్యమం అయినటువంటి ‘హర్ ఖేత్ కో పానీ’ ని గురించి, ‘ఒక్కొక్క నీటి చుక్క కు మరింత అధిక పంట’ ప్రచార ఉద్యమాన్ని గురించి, నమామీ గంగే మిశన్ ను గురించి, జల జీవన్ మిశన్ లేదా అటల్ భూజల్ యోజన ను గురించి ఆయన మాట్లాడారు. ఈ పథకాలన్నిటి తాలూకు పనులు శరవేగం గా సాగుతున్నట్లు వెల్లడించారు.
భారతదేశం వాన నీటి ని ఎంత ఉత్తమమైన విధం గా వినియోగించుకొంటే భూగర్భ జలం పై దేశం ఆధారపడటం అంతగా తగ్గిపోతుంది అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ కారణం గా వాననీటి ని ఒడిసిపట్టడం వంటి ప్రచార ఉద్యమాలు సఫలం కావడానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల తో పాటు గ్రామీణ ప్రాంతాల ను కూడా జల శక్తి అభియాన్ లో చేర్చడం జరిగిందని ఆయన చెప్పారు. వాన కాలానికి ముందు నాటి రోజుల లో జల సంరక్షణ సంబంధిత ప్రయాసల ను ముమ్మరం చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. సర్పంచు లు, జిల్లా మేజిస్ట్రేట్ లు/ జిల్లా కలెక్టర్ లకు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్తూ, దేశవ్యాప్తం గా నిర్వహిస్తున్న ‘జల శపథం’ అనే కార్యక్రమం ప్రతి ఒక్క వ్యక్తి చేసే శపథం కావాలి అని పేర్కొన్నారు. నీటి విషయం లో మన స్వభావం లో వచ్చే మార్పుల ను బట్టే ప్రకృతి సైతం మనలను సమర్ధిస్తుందని ఆయన అన్నారు.
వాన నీటి ని వృథా పోనీయకుండా ఆదా చేయడానికి తోడు మన దేశం లో నదీ జలాల నిర్వహణ అంశాన్ని కూడా కొన్ని దశాబ్దుల పాటు చర్చించడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. దేశం లో జల సంక్షోభం తలెత్తకుండా ఉండటానికి గాను ఈ దిశ లో సత్వర కృషి ని చేపట్టవలసిన అవసరం ప్రస్తుతం ఉందని ఆయన అన్నారు. కేన్- బేత్ వా లింక్ ప్రాజెక్టు కూడా ఈ దార్శనికత లో ఒక భాగమేనని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ను కార్యరూపం లోకి తీసుకు వచ్చినందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు.
కేవలం ఏడాదిన్నర కాలం కిందట, మన దేశం లోని 19 కోట్ల గ్రామీణ కుటుంబాల లో 3.5 కోట్ల కుటుంబాలు మాత్రమే నల్లా నీటి ని అందుకొన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. జల జీవన్ మిశన్ ను ప్రవేశపెట్టిన తరువాత, సుమారు 4 కోట్ల కుటుంబాల ఇంత తక్కువ కాలం లో తాగునీటి ని గొట్టపు మార్గం ద్వారా అందుకొన్నాయని చెప్తూ ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజల భాగస్వామ్యం తో పాటు స్థానిక పరిపాలన నమూనా జల జీవన్ మిశన్ లో కీలకమైన అంశాలు గా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
స్వాతంత్య్రం అనంతర కాలం లో మొట్టమొదటిసారి గా, జల పరీక్ష విషయం లో ఒక ప్రభుత్వం చాలా గంభీరం గా పని చేస్తోందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. జల పరీక్షల కు సంబంధించినటువంటి ఈ ప్రచార ఉద్యమం లో గ్రామీణ ప్రాంతాల కు చెందిన సోదరీమణుల ను, కుమార్తెల ను భాగస్వాముల ను చేసినట్లు ఆయన వివరించారు. కరోనా కాలం లో ఇంచుమించు 4.5 లక్షల మంది మహిళల కు జల పరీక్షల విషయం లో శిక్షణ ను ఇవ్వడమైందని ఆయన చెప్పారు. జలాన్ని పరీక్ష చేయడం కోసమని ప్రతి ఒక్క పల్లె లో కనీసం అయిదుగురు మహిళల కు శిక్షణ ను ఇవ్వడం జరుగుతోందన్నారు. జల పరిపాలన లో మహిళ ల భాగస్వామ్యం అధికం అవుతున్న కొద్దీ ఉత్తమ ఫలితాలు సిద్ధించడం ఖాయం అని చెప్తూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
*****
(Release ID: 1706625)
Visitor Counter : 322