ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 కారణంగా ఉత్పన్నమైన సామాజిక కళంకాల పరిష్కారం
Posted On:
16 MAR 2021 1:24PM by PIB Hyderabad
కొవిడ్ వల్ల ఉత్పన్నమైన సామాజిక కళంకాలతోపాటు, కొవిడ్ రోగులు, కొవిడ్ సంబంధిత కార్యక్రమాల్లో వైద్య సిబ్బంది ఎదుర్కొన్న వివక్షను పరిష్కరించడం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొవిడ్-19 సమాచార వ్యూహంలోని ప్రధానాంశం. కీలక అభివృద్ధి భాగస్వాముల సాయంతో, కళంక వ్యతిరేక కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దీనిలో భాగంగా ఈ క్రింది చర్యలు చేపట్టింది.
1. కళంకాలు, వివక్షపై ముందస్తుగా నమోదు చేసిన చరవాణి సందేశాలను 12 లక్షల మంది ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు మంత్రిత్వ శాఖ పంపింది.
2. వైద్య సిబ్బంది చేసే సేవలపై స్ఫూర్తిదాయక కథనాలను వెబ్‌సైట్, దూరదర్శన్, రేడియో, భాగస్వామ్య ఏజెన్సీల ద్వారా ప్రసారం చేసింది.
3. మీడియా, కమ్యూనిటీ రేడియో, యువత, స్వచ్ఛంద సేవకులు, సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు సందేశాలు అందేలా చేసింది.
4. కొవిడ్ సంబంధిత వివక్ష తగదని చాటే అనేక శ్రవణ, దృశ్య, సమాచార మార్గదర్శినులు, సామాజిక మాధ్యమ సందేశాలను రూపొందించి, మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో, సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఉంచింది. వాటినే రాష్ట్ర ప్రభుత్వ నెట్‌వర్కుల ద్వారా ప్రజల్లోకి పంపింది.
5. కొవిడ్ రోగుల ఇళ్ల బయట ఎలాంటి పత్రాలు లేదా సూచికలు ఏర్పాటు చేయవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది.
కొవిడ్-19 నేపథ్యంలో, అంటువ్యాధుల (సవరణ) అత్యవసర ఆదేశం-2020ని, గతేడాది ఏప్రిల్ 22న కేంద్రం తీసుకొచ్చింది.
తర్వాత, అది పార్లమెంటులో ఆమోదం పొంది, సెప్టెంబర్ 29న అమల్లోకి వచ్చింది. వైద్య సిబ్బందిని వివక్షకు గురిచేసి, వారి జీవనం, పని పరిస్థితులపై ప్రభావం చూపి, విధులకు హాజరవకుండా ఆటంకం కలిగించేలా ప్రవర్తించినవారిపై ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకునేలా ఈ సవరణ చేస్తుంది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.
***
(Release ID: 1705246)