ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అశోక్ విహార్ లోని దీప్ మార్కెట్ దగ్గర జన్ ఔషధీ కేంద్రాన్ని ప్రారంభించిన - డాక్టర్ హర్ష్ వర్ధన్

"ఈ రోజున, దేశంలోని వివిధ జిల్లాలలో 7,500 జన్ ఔషధీ కేంద్రాలు ఉన్నాయి"

"పౌరులందరికీ నాణ్యమైన, అనుకూలమైన, సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది"

Posted On: 07 MAR 2021 5:07PM by PIB Hyderabad

జన్ ఔషధీ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, ఈ రోజు, అశోక్ విహార్‌లోని డీప్ మార్కెట్ దగ్గర జన్ ఔషధీ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా, కేంద్ర ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ, జనరిక్ ఔషధాల వ్యాప్తిని ప్రోత్సహించి, పెంపొందించడం కోసం, ఇకనుంచి ప్రతీ ఏడాదీ, మార్చి నెల 7వ తేదీన, జన్ ఔషధీ దినోత్సవంగా జరుపుకుందామని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ,  2019 మార్చి, 7వ తేదీన ప్రకటించినట్లు, తెలిపారు.   సమాజంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన ఔషధాల అందుబాటు భరోసాతో పాటు ఫార్మసిస్టులకు అర్ధవంతమైన ఉపాధిని కల్పించాలనే లక్ష్యంతో, ఈ ఏడాది, నిర్వహిస్తున్న 3వ జన్ ఔషధీ దినోత్సవాన్ని “సేవా-భీ-రోజ్-గార్-భీ” అనే ఇతివృత్తంతో నిర్వహించడం జరిగింది.

గత వారం రోజులుగా నిర్వహిస్తున్న, "జన్ ఔషధీ వారోత్సవాలు" ఈ రోజుతో ముగుస్తున్నాయని, డాక్టర్ హర్ష వర్ధన్, తెలియజేశారు.  జన్ ఔషధీ గురించి అవగాహన కల్పించడం కోసం, 2021 మార్చి, 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు, వైద్య శిబిరాలు నిర్వహించడం, శానిటరీ న్యాప్‌-కిన్ ‌ల పంపిణీ, పాదయాత్ర, బైక్ ర్యాలీ మొదలైన వివిధ కార్యక్రమాలను ఏర్పాటుచేయడం జరిగింది.   తన ఇటీవలి పర్యటనలో నాగాలాండ్ ‌లోని మోన్ వద్ద, జన్ ఔషధాల లభ్యతపై కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.  ఈశాన్య భారతదేశంలో భౌగోళికంగా మారుమూల ప్రాంతాలలో ఈ జిల్లా ఒకటి.

ఇప్పటివరకు, ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధీ ప్రాజెక్టు (పి.ఎమ్.‌బి.జె.పి) ప్రస్తానం గురించి, డాక్టర్ హర్ష వర్ధన్ వివరిస్తూ,  “ఈ పథకం మొదటి ఆరు సంవత్సరాల్లో, అంటే 2008 నుండి 2014 సంవత్సరం వరకు 86 దుకాణాలు మాత్రమే ప్రారంభించడం జరిగింది.  ఆ తర్వాత ఆరేళ్లలో, అంటే 2020 సంవత్సరం వరకు, ఈ దుకాణాల సంఖ్య 7,300 కు పెరిగింది.  దేశంలోని అన్ని జిల్లాల్లో, ఇప్పటికే, ఈ దుకాణాలను ప్రారంభించడం జరిగింది. ఈ రోజు, 2021 మార్చి,  7వ తేదీన, మనం, దేశంలో, 7500వ కేంద్రాన్ని ప్రారంభించుకున్నాము.  2024 సంవత్సరం నాటికి ఈ దుకాణాల సంఖ్యను 10,000 కు పెంచడానికి మేము కట్టుబడి ఉన్నాము.” అని తెలియజేశారు. 

ప్రజలపై జన్ ఔషధీ కేంద్రాల ప్రభావాన్నీ, చాలా మందికి ఆదాయ వనరుగా దాని పాత్రను డాక్టర్ హర్ష వర్ధన్ ప్రశంసిస్తూ,  “ప్రతీ నెలా సుమారు ఒక కోటి నుండి కోటీ 25 లక్షల మంది ప్రజలు జాన్ ఔషధీ కేంద్రాలనుండి మందులు కొనుగోలుచేస్తున్నారు. ‘ప్రధాన మంత్రి గారి దుకాణం’ అనీ 'ప్రధానమంత్రి గారి మందులు' అని ప్రజలు ఈ కేంద్రాలను వ్యవహరించడం ద్వారా,  ఈ కేంద్రాలకు లభించిన ప్రజాదరణను మనం నిర్ణయించవచ్చు. సరసమైన ధరలకు, నాణ్యమైన జనరిక్ మందులను అందించడంతో పాటు, ఈ పథకం దేశంలోని విద్యావంతులైన నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి వనరుగా కూడా నిరూపించబడింది. ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధీ కేంద్రాలు (పి.ఎమ్.‌బి.జె.కే.) లలో, పంపిణీదారులు, నాణ్యతా పరీక్షా ప్రయోగశాలలు వంటి లాజిస్టిక్స్ భాగస్వాములతో కలిసి మొత్తం, 15 వేల మందికి పైగా వ్యక్తులు ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు.  వీటిలో వెయ్యి కంటే ఎక్కువ కేంద్రాలను మహిళా పారిశ్రామికవేత్తలు / ఫార్మసిస్ట్‌లు నిర్వహిస్తున్నారన్న విషయం నిజంగా  ప్రశంసనీయం.” అని వివరించారు. 

ఈ సంవత్సరంలో పి.ఎమ్.‌బి.జె.పి. ని బలోపేతం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను కేంద్ర మంత్రి పునరుద్ఘాటిస్తూ,  కొత్త సంవత్సరంలో రెండు కార్యక్రమాలను చేపట్టినట్లు, చెప్పారు.  ఇందులో - మొదటి కార్యక్రమం - ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా చేయడానికి కొత్త ప్రోత్సాహక ప్రణాళికను ప్రవేశపెట్టడం.  ఈ ప్రణాళిక ప్రకారం, ఈ కేంద్రాల యజమానులకు ప్రస్తుతం అందిస్తున్న 2.50 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని 5.00 లక్షల రూపాయల వరకు, గరిష్టంగా నెలకు 15,000 రూపాయలు పెంచారు.  దీనితో పాటు, మహిళలు, ఎస్.టి; ఎస్.సి. లతో పాటు, ఆకాంక్ష జిల్లాలు లేదా ఈశాన్య రాష్ట్రాల్లో దుకాణాలు ప్రారంభించిన పారిశ్రామికవేత్తలకు, కంప్యూటర్ మరియు ఫర్నిచర్ కోసం రెండు లక్షల రూపాయలను, ఒక సారి ప్రోత్సాహకంగా చెల్లించాలని ఆమోదించడం జరిగింది.   ఇందులో - రెండవ కార్యక్రమం కింద -  ఈ కేంద్రాల ప్రయోజనాన్ని విస్తరించడం కోసం మరో 75 ఆయుష్ ఔషధాలను పి.ఎమ్.‌బి.జె.పి. ఉత్పత్తుల జాబితాలో చేర్చడం జరిగింది. 

కోవిడ్-19 మహమ్మారి సమయంలో పి.ఎమ్.బి.జే.కె. లు నిర్వహించిన పాత్రను, డాక్టర్ హర్ష వర్ధన్ ప్రత్యేకంగా వివరించి, ప్రశంసించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, “కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో,  పి.ఎమ్.బి.జే.కె. లు దేశానికి అత్యవసర సేవలను అందించాయి. అన్ని పి.ఎమ్.బి.జే.కె. కేంద్రాలు తమ కార్యకలాపాలను క్రమం తప్పకుండా నివహించడం ద్వారా, ఔషధాలు పౌరులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నాయి.  దేశవ్యాప్తంగా లాక్-డౌన్ అమలులో ఉన్న సమయంలో ఈ దుకాణాల్లో మందుల అమ్మకాలు పెరిగాయి.” అని చెప్పారు. 

మధు మేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి ఇతర తీవ్రమైన వ్యాధుల కోసం 50,000 కంటే ఎక్కువ ఎ.బి-హెచ్.‌డబ్ల్యు.సి. కేంద్రాల ద్వారా, ప్రజలకు స్కానింగ్ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు,  24,000 కంటే ఎక్కువ ప్రయివేటు ఆసుపత్రుల్లో, పి.ఎమ్-జె.ఏ.వై. కార్డు చూపించడం ద్వారా వారికి, ఉచిత ఆరోగ్య సంరక్షణను అందించడం; జల్ జీవన్ మిషన్ ద్వారా త్రాగునీటిని అందించడంతో పాటు, నీటి వలన కలిగే వ్యాధులను నివారించడం;  ఉజ్వల పథకం ద్వారా మహిళలకు గ్యాస్ సిలిండర్లను అందించడంతో పాటు, వారిలో ఊపిరితిత్తుల వ్యాధులను నివారించడం వంటి చర్యలతో పాటు - ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రభుత్వం నిబద్ధతతో చేపట్టిన అనేక చర్యల్లో, ఇది కేవలం ఒక ఇటుక మాత్రమే అని అభివర్ణిస్తూ, డాక్టర్ హర్ష వర్ధన్ తన ప్రసంగాన్ని ముగించారు. మహమ్మారిగా మారే అవకాశం ఉన్న కొత్త వ్యాధులను సమూలంగా నివారించడంలో పాటు, ఆరోగ్య సంరక్షణ యొక్క అన్ని స్థాయిలలో చికిత్స చేయడానికి అధునాతన ఆసుపత్రి సామర్ద్యాన్ని పెంపొందించడంతో పాటు, దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లోనూ, ఎన్.ఐ.వి. వంటి సంస్థల ఏర్పాటును, కొత్త బడ్జెట్ నిబంధనలు, సాకారం చేయనున్నాయని, కేంద్ర మంత్రి ఈ సందర్భంగా వివరించారు.

 

*****



(Release ID: 1703125) Visitor Counter : 115